పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుండగా పెళ్ళి కొడుకు తండ్రి, పెళ్ళి కూతురి తండ్రిని పక్కకు పిలిపించి " ఏమండీ! ముహూర్తానికి ముందే కట్నం సొమ్ము అందిస్తే తాళి కట్టిస్తాను." అన్నాడు.
"బావ గారూ! ఇవి చేతులు కావు కాళ్ళనుకోండి! రేపు మధ్యాహ్నాని కల్లా సొమ్ము అందజేస్తాను. ఈ రోజు బ్యాంక్ సెలవు. సొమ్ము డ్రా చేయను సమయం లేక పోయింది" అన్నాడు అతడి చేతులు పట్టుకుని.
" ఐతే రేపే తాళి కట్టిస్తా లెండి" అంటూ మంటపం దగ్గర కెళ్ళి "లేరా! వెళ్దాం "అని కొడుకును లేపాడు."బావ గారూ! మా పిల్ల బ్రతుకు నట్టేట ముంచకండి" అంటూ బ్రతిమాలుతున్న పెళ్ళి కూతురు తండ్రిని చూసి నవ్వుతూ
" ఆ విషయం మీరు ముందే ఆలోచించుకోవలసింది." అంటూ బయటికి నడవ బోయాడు. "ఆగండి !బాబూ!"అంటూ షుమారుగా 95 ఐదేళ్ళ ముసలమ్మ మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది ముందుకు.
"బాబూ పెళ్లి కొడకా! రేప్పొద్దున మీ బాబు నీ భార్యతో కాపురం చేయ వద్దంటే మానేస్తావా? సిగ్గు లేదా! మగాడివేనా? పిల్లను చూసి నచ్చాక కట్నం సొమ్ము అందలేదని తాళి కట్టవా? కట్నం తీసుకోడం నేరమని తెలీదా! మీ మాటలన్నీ నా మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశాను, దీన్ని పోలీసులకు పంపనా పెళ్ళికొడకా! ఊచలు లెక్కడతారా, నీవూ నీ అబ్బా? నా మనవడు డి.జీ.పీ."అంది నవ్వుతూ. తల వంచుకుని పెళ్ళి కొడుకు వెళ్ళి పీటల మీద కూర్చుని "మంత్రాలు చదవండి పంతులు గారూ!" అన్నాడు పెళ్ళి నిర్విఘ్నంగా ఐపోయింది. అంతా జానకమ్మను అభినందించారు.
పెళ్ళి కూతురు తండ్రి వచ్చి జానకమ్మ గారి పాదాలంటి నమస్కరించాడు. ఆమె నవ్వుతూ అందర్నీ చూసింది. జానకమ్మ బంధువుల పెళ్ళికి బందర్ వచ్చింది. ఆమె రాక అందరి మనస్సుల్లో సంతోషాన్ని నింపింది. ఆమె వయస్సు 95. ఐనా తన పనులన్నీ తానే చేసుకుంటుంది, ఎవ్వరి ఆసరా లేకుండా నడుస్తుంది. –నవ్వు ముఖంతో నలుగుర్నీ పలకరిస్తుంటుంది. ఎవరికే ఇబ్బందైనా తన దృష్టికి వస్తే అడక్కండానే సాయం చేస్తుంటుంది. పెళ్ళి పూర్తై అంతా కళ్యాణ మంటపం ఖాళీ చేసేసి వెళ్ళి పోయారు. జానకమ్మ బంధువుల ఇంట్లో కూర్చునుంది, పిల్లలంతా ఆమె చుట్టూ చేరి. “జేజమ్మ గారూ ! ఈ రోజు మీరొక అమ్మాయిని కాపాడారు.
ఇంకా ఈ కాలంలోనూ ఇలా జరగడం విచార కరం. మీరు ధైర్యంగా మాట్లాడారు. మీ కాలంలోనూ పెళ్ళిళ్ళు ఇలా జరిగేవా చెప్పరూ ? మాకేం తెలీదు ఆ కాలం పెళ్ళిళ్ల గురించీ ” అంటూ బ్రతిమాలడం మొదలెట్టారు. “ఏంటర్రా! ఆ కాలం పెళ్ళిళ్ళ గురించీ మీకే కాదు మీ అమ్మా నాన్నలకు కూడా తెలీదు. ఐనా మీరు తెలుసుకుని చేసేదేం ఉంది గనుక? ” అంది.
“అలా కాదు జేజమ్మ గారూ! ఫ్లీజ్ చెప్పండి ! ఏదో పాత సినిమాల్లో ఎప్పుడన్నా చూస్తాం , మాకంతా తెల్సుకోవాలని సరదాగ ఉంది “ అంటూ అని అంతా బ్రతి మాల సాగారు. “సరేనర్రా! మీరింత సరదాగా ఉన్నారు గనుక నా పెళ్ళి గురించే చెప్తాను వినండి “అంటూ గొంతు సవరించుకుంది.
జేజమ్మ తన ఙ్ఞాపకాలను 90 ఏళ్ళ ముందుకు ఫ్లాష్ బ్యాక్ చేసుకోగానే అంతా ఎలర్టై ముందుకు వంగి విన సాగారు. “అప్పుడు నాకు ఐదో ఏడు. ఆ రోజు నిద్రపోతున్న నన్ను ... “ చెప్పడం మొదలెట్టింది జేజమ్మ
********************
లలితా! జానూను లేపవే పెళ్ళి వారొచ్చే సమయమవుతోంది.
“సుబ్బరామయ్య కేక వేయడంతో వంట పందిట్లో పనిలో మునిగి వున్న లలితమ్మ వసారాలోకి వచ్చింది." జానూ ! లే! లే ! తలంటు స్నానం చేయాలి. " మంచి నిద్రలో ఉన్న ఐదేళ్ళ జానకిని తట్టి తట్టి లేపింది తల్లి లలితమ్మ. నిద్రలోనే ఉన్న జానకిని భుజానేసుకుని వెళ్ళి పెరట్లోని తడికెల దొడ్లో దింపి చేయి చాచి కచ్చికల పొడి అర చేతులో వేసి“ త్వరగా పళ్ళు తోము వేడి నీళ్ళు తొలుపుకు వస్తాను.
ఏయ్ రంగీ! చిన్నమ్ములు గారికి వేడి నీళ్ళు తొలుపు." అంటూ హడా విడిగా మళ్ళీ వంట శాల లోకెళ్ళి “ ఏమర్రా ! కూరలు తరగడం అవుతున్నదా! "అని కేకేసి తిరిగి పెరట్లో కొచ్చింది లలితమ్మ.
************
ఆ రోజు కరణం సుబ్బ రామయ్య గారి మూడో కూతురు ఐదేళ్ళ జానకి కి, పట్నంలో లాయర్ ఉమా మహేశ్వరయ్య మూడో కొడుకు పదిహేనేళ్ళ సూర్యనారాయణకు పెళ్ళి. ఇల్లంతా మామిడి తోరణాలతో, గుమ్మాలన్నీ పసుపు కుంకుమలతో, వాకిలంతా కొత్త తాటాకు పందిళ్ళతో, గుంజలన్నీ కొబ్బరి ఆకులతో అలంకరించడం వలన కొత్తాకుల కమ్మని వాసన వింత కళను, పరిమళాన్నీ తెచ్చింది పెళ్ళింటికి. ఒక మూల చెక్క కుర్చీ మీద కొత్త తాటాకు విసన కర్రలు బొత్తి పెట్టి వున్నాయి. పందిరి క్రింద పెద్ద కొత్త బానల్లో మంచి తీర్ధం, పక్కనే ఒక చెక్క ముక్కాలి పీట మీద తళ తళా మెరుస్తున్న ఇత్తళి చెంబూ, గ్లాసులూ ఉన్నాయి. చావిట్లో పొడవాటి చెక్క బల్ల మీద తెల్లని కొత్త పంచె పరచి ఉంది.దాని పైన పీటలు వేసి ఉన్నాయి.
" ఏమండీ శాస్త్రులు గారూ ! అన్నీ తయారుగా వున్నయి కదా? అసలే పట్టణ వాసులు, ఏ లోటూ రాకూడదు సుమా !" హెచ్చరించాడు సుబ్బరామయ్య.
ముఖానికి విబూధి రేఖల మధ్య పెద్ద రాగి కానీ అంత [పాత కాలపు రూపాయి కాసంత ] కుఒకుమ, మెడలో రుద్రాక్ష మాల ధరించి మడతల మీదున్న కండువా, మెడ చుట్టూతా నీలం పట్టీ కనిపిస్తుండగా, ఎర్రని కండువా నడుముకు చుట్టుకుని, అపర ఈశ్వరునిలా వున్న శాస్త్రి గారు నవ్వు ముఖంతో "మీరేమీ బెంగ పెట్టుకోకండి సుబ్బ రామయ్య గారూ! ఊరి పొలి మేరల్లోనే వేద పండితుల నుంచా . వారు అక్కడే మంత్రోఛ్ఛారణతో ఎదుర్కుని వస్తారు. మీరూ తయారై వియ్యాల వారిని ఎదురెళ్ళి ఆహ్వానించి తేవాలి , కానివ్వండి." గుర్తు చేశారు శాస్త్రి గారు ..
" అవును సుమా ఈ హడావిడికి ఆ విషయమే మరచాను. ఎద్దు బండ్లు రైల్వే స్టేషన్ కు పంపడం తోనూ, ఇతర ఏర్పాట్లు చూడటంతోనూ సరిపోయె…”అంటూ… " లలితా ! ఒసేవ్ లలితా ! ఎక్కడే? నా కండువా పట్రా ! వియ్యాల వారికి ఎదురెళ్ళాలి." అని అరచి, తడి చేతులతో ఆమె తెచ్చి అందించిన పై మీది కండువా భుజాన వేసుకుని కదిలారు సుబ్బ రామయ్య గారు వెంట పది మంది పెద్దలు శాస్త్రి గారు తోడు రాగా. పెళ్ళి వారంతా ఇల్లు చేరగానే ఆడ మగ అంతా ఎదురెళ్ళి పెళ్ళి కుమారునికీ, ఆయన తండ్రికీ, తల్లికీ, పెద తల్లి తండ్రుల కూ కాళ్ళు కడిగి పూల మాలలు వేసి ఆహ్వానించారు .
తమ ఇంటికి ఎదురుగా వున్న స్నేహితుని ఇంట్లో విడిది ఏర్పరచి, ఏర్పాట్లన్నీ చూశారు." బావ గారూ! మీరంతా పట్టణ వాసులు, మేమేమో పల్లె వాసులం . మర్యాదల్లో ఏవైనా లోపాలు జరిగితే మన్నించ గలరు. మనస్సులో మరోలా భావించక మీరు తెలియ పరిస్తే మేము సరి దిద్దుకుంటాము." అన్నాడు వినయంగా సుబ్బ రామయ్య ." అలాంటి వేమీ ఉండవు. మనం మనం బంధువులమై పోతున్నాం." అన్నాడు
ఆదరంగా వకీలు ఉమా మహేశ్వరయ్య. ఇలా అనడం మీ గొప్ప సంస్కారం, ఎంతైనా ఆడ పెళ్ళి వారం కదా?" అంటున్న సుబ్బ రామయ్యతో " అదంతా ఏమీ వుండదు బావ గారూ! నేను నగరంలో వకీలునైనంత మాత్రాన మీరు మరీ గౌరవించ నక్కర్లేదు, ఇద్దరం సమానమే, మీ కుమార్తె మా ఇంటి కోడలవుతున్నది, మా కుమారుడు మీ ఇంటి అల్లుడు కాబోతున్నాడు అంతే. అందరం ప్రేమ పూరిత వాతావరణంలో పరస్పర గౌరవ భావంతో శుభ కార్యం జరిపిద్దాం. " అంటూ భుజం తట్టాడు ఉమా మహేశ్వరయ్య.
" మరి మీకంతా దంత ధావనం పూర్తైతే కాఫీలకు రండి. అదయ్యాక తలంటు ముహూర్తం. " అంటూ అందరినీ కాఫీలకు ఆహ్వానించాడు, సుబ్బరామయ్య పురోహితుడు. ఇంటి లోపల మగ పెళ్ళి వారి తరఫు స్త్రీలంతా ముఖాలు కడిగి నుదుట సింధూరాలు దిద్దుకుంటుండగా, లలితమ్మ పది మంది ముత్తైదువులతో, మేళాలతో వచ్చి పెద్ద చిన్న అందరికీ కుంకుమ భరిణ తెరచి బొట్టు పెట్టి " వదిన గారూ ! మీరంతా తయారైతే కాఫీలకు రండి. ఆ పైన తలంటు ముహూర్తం దగ్గర పడుతున్నది..
” చిరు నవ్వుతో అందర్నీ ఆహ్వానించింది. మగ పెళ్ళి వారంతా మేళాలు వెంట రాగా ముత్తైదువులు ముందు నడువగా, సుబ్బ రామయ్య దంపతులు దారి చూపగా, విడిది గృహానికి ఎదురుగానే పెళ్ళి వారి ఇల్లు ఉండటాన అంతా ఐదు నిముషాల్లో పెళ్ళి పందిరి క్రిందికి చేరారు. అక్కడ కొయ్య కుర్చీలు, బల్లలు ఒక వైపు మగ పెళ్ళి వారికీ, కొత్త తాటాకు బంతి చాపలు ఆడ వారికీ పరచి ఉండటాన అంతా వరుసల్లో కూర్చున్నారు. ఉమా మహేశ్వరయ్య " చిన్న వారంతా పలహారాలు కానివ్వండి, తలంట్లు అయ్యే వేళకు అలస్యం కావచ్చు." అనగానే సంధ్యా వందనం చేసే వారు కొందరు , పెద్ద వారు, నిత్యాగ్ని హోత్రం వారూ తప్ప మిగిలిన వారంతా వరుసల్లో బంతి చాపలపై కూర్చున్నారు. సుబ్బ రామయ్య తరఫు బంధువులు దూరంగా నిల్చుని చూస్తుండగా, ఉమా మహేశ్వరయ్య" మీరూ వచ్చి కూర్చోండి, పిల్లలూ, పిల్లల తల్లులూ అంతా ఆకలికి ఆగ లేరు. మా ఉపా హారాలు అయ్యేంత వరకూ మీరంతా ఆగక్కర లేదు. ఎవరి ఆకలి వారిది " అని చెప్పగానే, పిల్లలంతా బిల బిల మంటూ ముందుకు రాబోయారు.
" హ్హాహ్హా ఆగండాగండి ! మగ పెళ్ళి వారితో పాటు తినేద్దామనే! ఎంత ఆగడం?! " అంటూ ఓ పెద్దావిడ నోరు నొక్కుకుంటూ, కోప్పడటంతో, అంతా నదికి ఆనకట్ట కడితే నీరు ఆగినట్లు ఠక్కున ఆగి పోయారు. అది చూసిన ఉమా మహేశ్వరయ్య " అదేంటి! అక్కయ్య గారూ! పిల్లల్ని అలా ఆపేశారు? రానివ్వండి, మగ పెళ్ళి వారని వారిని భయ పెట్టేస్తే మమ్మల్ని పులులో సింహాలో అనుకునే ప్రమాదం ఉంది. ఆ పైన మాకేం కావల్సినా ఎవ్వరూ దరికి రారు. పెళ్ళి కుమార్తె సైతం మేమంటే భయ పడవచ్చు. రండర్రా! పిల్లలూ !నేను పిలుస్తున్నాగా, రండి కూర్చోండి-! నేనే వడ్డిస్తాను "అంటూ త్రాగుతున్న కాఫీ గ్లాసు పక్కన పెట్టి పిల్లలను పిలిచి కూర్చో బెట్టి ఉప్మా వడ్డిస్తున్న వంటావిడ వద్ద బకెట్తాను తీసుకుని పిల్లలకు వడ్డించడం మొదలెట్టాడు. అది చూసిన ఆడ పెళ్ళి వారు " హౌరా ! మీ వియ్యంకులెంత నిగర్వులు! పట్టణ వాసులు టెక్కుగా ఉంటారనుకున్నాం. నీ కూతురు మహా అదృష్టవఒతురాలు సుమా లలితా !" అంటూ ముక్కున వేలేసుకున్నారు.
ఓ వైపు ఘనాపాటీలైన వేద పండితుల వేద ఘోష జరుగుతుండగా మరో వైపు మంగళ వాయిద్యాల మధ్య పెళ్ళి కొడుకు సూర్య నారాయణకు తలఒటు కార్యక్రమం మొదలైంది. ఊరు ఊరంతా కదలి వచ్చి నడుం కట్టి ఎవరికి తోచిన వచ్చిన పనులు వారు ఎవ్వరూ చెప్పకుండానే చక చకా చేసుకు పోడం, అంతా కలుపు గోలుగా ఉండి' అక్కా! అత్తా! వదినా! అని ఆడ వారు, ' అన్నా! మామా! బావా! ' అని మగ వారూ పరస్పరం పిలుచుకుంటూ పనుల్లో దిగడం నగర వాసులకు వింతగానే ఉంది.
"ఏరా తమ్ముడూ!’ పెట్టిన వారికి పుట్టుటే సాక్షని‘ పిల్ల నక్కను తొక్కి పుట్టింది. అత్త వారు కన్న వారి కంటే ప్రేమగా చూసుకునేట్లున్నారు. నీకే బెంగా ఉండదింక పిల్ల గురించీ . అంటూ తమ్మునిపై తన కున్న మమ కారాన్ని బయట పెట్టింది అక్క అనసూయమ్మ." ఐనా మన జానూకేమిరా! బంగారు మూట! "అంటూ జానూ అనే జానకి ని బుగ్గలు నొక్కి ముద్దాడిందామె. జానూ వంటి మీద ఉన్న 50 తులాల బంగారాన్ని తనివి తీరా చూస్తూ " ఏం దేవుడో ఏమోరా! నాకొక్క మగ నలుసు నిచ్చి ఉంటే జానూను పరాయింటికి పంపే దాన్నా?!" అంది విచారంగా. సుబ్బ రామయ్య చెల్లి " అక్కా! జానూనా! దాని మెడలో బంగారాన్నా?!" అని నవ్వింది అక్క అనసూయమ్మ మనస్సెరిగినది గనుక. అలా ఆ ఐదేళ్ళ పిల్ల జానకి పెళ్ళి తంతు మొదలైంది.
*****************
భోజనాలు అయ్యాక మగ పెళ్ళి వారంతా విడిదిలో సాయం కాలం దాకా విశ్రాంతి తీసుకుంటుంటే ఆడ పెళ్ళి పెద్దలు సాయం కాలం ఫలహారాలూ, రాత్రి భోజనాల తయారీలో తల మునకలై ఉన్నారు. సాయం కాలం కాగానే విడిదికి కాఫీలూ ఫల హారాలూ పట్టుకెళ్ళిన లలితమ్మ తో…." వదినా! మా వాళ్ళంతా సరదా పడుతున్నారు’ ఎదురు కోల‘ అయ్యాక పిల్లనూ పిల్లాడినీ కూర్చో బెట్టి బంతాట ఆడిద్దాం . తొలి బువ్వానికి చాలా సమయం ఉంది కదా! అదే మేజు వాణీకి రేపు సమయం ఉంటుందో లేదో ఎప్పుడైతేనేం?,పిల్లకూ కొత్త పోతుంది, రేపు ఎటూ పెళ్ళి కొడుకును చేయడం, వర పూజ, గౌరీ పూజ, స్నాతకం ఉంటాయి కదా ! తీరికే ఉండదు. ఈ పూటే ఏ సరదా ఐనా, ఏమంటారు?" అని ఆడిగింది పెళ్ళి కొడుకు తల్లి జయమ్మ.
" దాందేముంది వదిన గారూ! మగ వాళ్ళతోను ఒక మాట చెప్పి అలాగే కానిద్దాం .." అని చెప్పి ఇంటికి వచ్చి భర్తతో చెప్పింది, మగ పెళ్ళి వారి సరదా గురించీ." ఇదేం చిత్రమమ్మా! పెళ్ళి కాకుండానే ! బంతాటలూ ..అవీనీ..విడ్డూరంగా లేదూ! " అక్కడే ఉన్న అనసూయమ్మ అందుకుంది " విడ్డూరమేముంది అక్కా! జానూ వాళ్ళమ్మాయి. . పైగా వారు నగర వాసులు. ఐనా వారేం విపరీతపు కోరిక కోర లేదుగా ! పిల్ల రేపు పెళ్ళి వేళకు అందరినీ చూసి ఝడవకుండా ఉంటుందని వారనే మాటానిజమే !లలితా! ఆ ఏర్పాట్లేవో చూడు. అమ్మాయిని తయారు చెయ్యి. నేను పురోహితుల వార్ని కేకేస్తాను. "అంటూ సుబ్బ రామయ్య కండువా సవరించుకుంటూ వెళ్ళాడు. లలితమ్మ ఇంట్లోకి వెళుతూ " వదినా ! త్వరగా అమ్మాయికి జడ వేసి తయారు చేయాలి, చిన్నొదిన్ను కూడా పిలుస్తారా! ముందు మీరిద్దరూ ముస్తాబై రండి, ఈ లోగా జానూకు నేను ముఖం కడుగుతాను. ”అని అనసూయమ్మను పంపింది.“ఇంతకూ జానూ ఎక్కడ? ’జానూ ! జానూ! " అంటూ జానకిని పిలుస్తూ ఇల్లు, పెరడు, అంతా మూడు మార్లు తిరిగినా ఎక్కడా జానూ జాడ లేదు. లలితమ్మ కు కంగారెక్కువై " ఏమండీ ! ఒక్క మారిలా వస్తారా! మిమ్మల్నే ! " అంటూ మండువాలో పురోహితునితో మాట్లాడుతున్న సుబ్బ రామయ్య ను దగ్గరికి పిలిచి రహస్యంగా " ఏమండీ! జానూ కనిపించడం లేదు " గుడ్ల నీరు కుక్కుకుంటూ మెల్లిగా చెప్పింది.
" ఎక్కడికి వెళుతుంది ?ఎక్కడైనా నిద్ర పోతున్నదేమో చూడు,? పైగా వళ్ళంతా నగలు పెట్టావాయె ! ఆ బరువు మొయ్య లేక ఎక్కడో పడుకుని నిద్రలోకి జారుకుని ఉంటుంది." అన్నాడు సుబ్బ రామయ్య తాపీగా. " లేదండీ ! ఇల్లంతా మూడు మార్లు వెదికాను, ఎక్కడా లేదు.” గొంతు గాద్గదం కాగా అంది లలితమ్మ.." ఐతే ! నగల కోసం ఎవరైనా జానూని ..." అనుమానం కలగ్గానే సుబ్బ రామయ్యకు వళ్ళంతా చెపటలు పట్టాయి."రేయ్ ! దానయ్యా! ఇట్రారా!" అంటూ తన తల మనిషిని కేకేశాడు. అతడు పరుగు పరుగున వచ్చి" చెప్పండి బాబయ్యా! " అంటూ చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఇంతలో సుబ్బ రామయ్య ఏదో గుర్తు రాగా " లలితా! జానూ ఈడు పిల్లలంతా ఆడుతున్నారేమో పెరట్లో గానీ చూశావా?" అని అడిగాడు.
" లేదండీ ! పిల్లలెవ్వరూ కూడా లేరు. వారంతా నిద్ర పోతున్నారో ఏమో " వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది లలితమ్మ . . " చూడు దానయ్యా! పిల్లలఒతా. ఎక్కడో ఆడుతున్నట్లున్నారు. పాలేర్లను నలుగుర్నీ తీసుకెళ్ళి త్వరగా అంతా వెతికి వెంట పెట్టుకురా ! మన జానూ పాప కూడా వాళ్ళతో ఆడను వెళ్ళినట్లుంది, జాగ్రత్త ఎవ్వరికీ తెలీరాదు సుమా!" ఆఙ్ఞాపించినట్లు చెప్పాడు సుబ్బ రామయ్య. లలితమ్మ ఇంటి లోపలికెళ్ళి మరో మారు మూల మూలా పదిహేను గదులూ వెతికింది . దేవుని గదిలో తాను జానూకు నగలు అలంకరించిన చోటే ఆ దంతపు పెట్టెలో అన్ని నగలూ ఉండటం చూసి, నగల కోసం జానూను ఎవ్వరూ అపహరించుకు పోలేదని కాస్త నిమ్మళించింది. బయటికి వచ్చి కాలు కాలిన పిల్లిలా పందిట్లో ఇటూ అటూ తిరుగుతున్న సుబ్బ రామయ్య చెవిన వేసింది
" నగలన్నీ దేవుని గదిలో పెట్టెలోనే ఉన్నాయండీ ! నేనే తీసి పెట్టమని మా చెల్లెలు సుగుణకు చెప్పాను. హడావిడిలో మరిచే పోయాను. పిల్ల ప్రాణానికేం ఆపద లేదు ఇదెక్కడో ఆడుతూనైనా ఉండాలి, లేదా స్నేహితులెవరింటికైనా వెళ్ళైనా ఉండాలి." అని తిరిగి లోపలికెళ్ళింది. దొడ్లూ తోటలూ నాలుగు వైపులా నలుగురూ వెతకను వెళ్ళారు పాలేర్లు. పశువుల మేత వేసే గడ్డి వాముల దొడ్లోని మామిడి చెట్లపై కోతి కొమ్మచ్చులాడుతున్న పిల్లలందర్నీ చూసి, వారిలో పచ్చ పట్టు పరికిణీలో వున్న జానకిని గుర్తు పట్టాడు దానయ్య." అమ్మా! జానూ పాపా! మీ అప్పా అమ్మా నీ కోసం వెతుకుతున్నారు రా పోదాం " అని పిలిచాడు.
జానూ పాప పరికిణీ గోచి పోసి కట్టి మామిడి చెట్టు కొస కొమ్మన కూర్చుని ఉంది. మిగిలిన పిల్లలు ఆడా మగా పది మంది దాకా ఆమెను అందుకోలేక క్రింది కొమ్మల పైనే ఉన్నారు." నేను రాను పో ! కోతి కొమ్మచ్చి ఆడాలి, అందరిని ఓడించాలి " అంటూ ఇంకా పై కొమ్మల పైకి వెళ్తున్నది." జానూ పాపా! మేళాలు వాయించే వేళైందిరా తల్లీ ! నీవు మేళం వినవా? నీకిష్టం కదా ! రా! రామ్మా! నేను భుజాలపై ఎక్కించుకుని తీసుకెళతాగా !" అంటూ బ్రతి మాల గా జాను పాప చక చకా కొమ్మలు దిగి వచ్చింది. జానూకు పెళ్ళి మేళాలంటే ఇష్టమని దానయ్యకు తెల్సు గనుక ఆ మాటే చెప్పాడు తెలివిగా. మిగిలిన పిల్లలంతా కూడా చెట్టు దిగాక జానూను రెండు భుజాలపై ఎక్కించుకోగానే పిల్లలంతా బిల బిలా చెట్లు దిగి దానయ్య వెంట పరుగెత్తారు. పెరటి ద్వారం ద్వారా లోపలికి వచ్చి తగ్గు స్వరం తోనే.
" అమ్మ గారూ !" అంటూ పిలిచాడు దానయ్య. దానయ్య గొంతు వినగానే గబుక్కున పెరట్లోకి పరుగెత్తింది లలితమ్మ. ఆమె చేతుల కు జానూ ను అందించి బయటికెళ్ళి పోయాడు దానయ్య. పిల్లలంతా చావిట్లోకి వెళ్ళి పోయారు . " ఎక్కడికెళ్ళావు జానూ తల్లీ! పెళ్ళి మేళాలు వాయించే సమయమైందిరా! రా! జడ వేసుకుందువు గాని " అని లోపలికి తీసుకెళ్ళింది ఆమె కుమార్తెను. అదే పెళ్ళి కుమార్తెను. అలంకరణ అయ్యాక బంతాట మొదలైంది. ఎదురెదురుగా పెళ్ళి కుమారుడినీ, పెళ్ళి కుమార్తెనూ కూర్చో బెట్టి, మల్లె పూలతో కట్టిన బంతి మాలను పురోహితుడు చెపుతుండగా పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె ఒడిలోకి విసిరాడు,
ఆమె కూడా పురోహితుడు చెప్పాక పెళ్ళి కుమారుని ఒడిలోకి విసిరింది. అలా ఇద్దరూ పూల బంతి ఒకరికొకరు విసురుకుంటూ ఆడుతుండగా, పూల బంతి జానూ ముఖాన పడింది. జానూ కోపంతో పూల బంతి తీసుకుని లేచి మోకాళ్ల మీద కూర్చుని అతి బలంగా పెళ్ళి కుమారుని ముఖం పైకి విసిరింది." అయ్యిందా తిక్క, నా ముఖం పైకే వేస్తావా?" అంది కోపంగా , ఆడ పెళ్ళి వారంతా అంతా ’అయ్యో అయ్యో‘ అంటుండగా " ఏం ఫరవా లేదు, మీరేం కంగారు పడకండి పిల్లనేం అనకండి పసి తనం కదా?" అంటూ సర్ది చెప్పాడు ఉమా మహేశ్వరయ్య.
పెళ్ళి తంతులన్నీ పూర్తై, జానకి నిద్రలో జోగుతూ తల్లి వడిలో వుండగా తాళి కట్టాడు సూర్య నారాయణ.
జానూ పాప పెళ్ళి అలా పూర్తైంది.
*********
ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేక ఫక్కున నవ్వారు పిల్లలంతా,." ఓ మైగాడ్ ! పెళ్ళి కొడుకునే కొట్టారా జేజమ్మ గారూ!" అంటూ. " ఔనర్రా పిల్లలూ ! పూల బంతి తోనేగా ! దెబ్బ తగల్లేదుటలే! నాకు నిజానికి అన్నీ గుర్తు లేవు, మా అత్తయ్య గారూ, మా వారూ అప్పుడప్పుడూ' జానూ పెళ్ళి లీలలు' అని వెక్కిరిస్తూ, చెప్పిన విషయాలకు నాకు గుర్తున్నవి చేర్చి చెప్తున్నానంతే!" అంది బోసి నోరు విప్పి నవ్వుతూనూ జేజమ్మ. " అమ్మో! ఇప్పుడలా కొడితే ఏమవుతుంది జేజమ్మ గారు ! ఇందాక కట్నం సొమ్ము రేపు అందజేస్తామంటేనే లేచెళ్ళి పోబోయారు పెళ్ళి వారు. కాస్తంత పొరబాటు జరిగితేనే కోపంతో కేకలేసే వారు మా రోజుల్లో పెళ్ళిళ్ళలో “అంది ఒక మహిళ.
“ఇప్పుడైతే తిరిగి కొట్టి పెళ్ళి కొడుకు లేచెళ్ళి పోతాడేమో!” అంది దూరంగా కూర్చుని వింటున్న మరో మహిళ. " జేజమ్మ గారూ ! ఏ సినిమా, ఏ సీరియల్ ఇంత ఇంట్రెస్టింగా ఉండదు.
కళ్ళకు కట్టినట్లు మీరు చెపుతుంటే భలేగా ఉంది మీ పెళ్ళి విషయం." అంది ఓ టీనేజర్.. " ఓహో జేజమ్మ గారూ ! మీరు కోతి కొమ్మచ్చులాడే వారా!"అని అడిగాడో తుంటరి గాడు. "మీకు చెట్లెక్కడం కూడా వచ్చా ! మగ పిల్లలే ఎక్కుతారనుకుంటానే ! చెట్టులెక్క గలవా! ఓ నరహరి పుట్టలెక్క గలవా! ' అనే పాత పాట అప్పుడప్పుడూ టీవీల్లో ‘పాడుతా తీయగా’ లో చూస్తుంటాం.." ఆశ్చర్యంగా అంది ఒక చిన్నారి ." అసలు పెళ్ళి కూతురెళ్ళి చెట్లక్కడం ! భలేగా ఉంది. చెట్లెక్కే పిల్లకు పెళ్ళా! " ఆశ్చర్యంగా అందో అమ్మాయి . " ఔనర్రా ! నేను చిన్నప్పుడు చెట్లెక్కడంలో ఫస్టట! పది పన్నెండేళ్ళ వాళ్ళ కంటే వేగంగా ఎక్కేదాన్నిట! మొగ పిల్ల గాళ్ళంతా నా జట్టులోనే చేరను వచ్చే వారుట! అందరి కంటే ముందే నేను పై పై కెక్కి అక్కడి చిఠారు కొమ్మల్లోంచీ లేత రెమ్మలు కోసి తెచ్చే దాన్నిట! నన్నెవ్వరూ అంటు కోనే లేక పోయే వారుట! అంతే కాదర్రా! గోటుం బిళ్ళ ఒక్క మారు కొడితే వెళ్ళి ఎక్కడో పడేది, వెతక లేక విసిగి పోయే వారంతానూ." అంటూ గర్వంగా చెప్పి నవ్వింది జేజమ్మ .
"ఆడ వాళ్ళ ప్రతాపం మీతోనే మొదలై ఉంటుంది ఔనా జేజమ్మ గారూ!" అంటున్న ఒక అమ్మాయితో , "అయ్యో! మీరు మా కోడలు రుద్ర ప్రతాపం వింటే నాకంటే ఎక్కువంటారు సుమా! రుద్ర నా కంటే చాలా హడల గొట్టింది సమాజంలోని దుష్ట పురుషులను, అల్లాగే గయ్యాళి మహిళలనూనూ. సమాజంలోని దుష్ట శక్తుల పై తిరుగు బాటు బావుటా ఎగరేసి అందరినీ హడల గొట్టిందంటే నమ్ముతారా?. ఆమె అన్యాయం అహంకారం మోసం అస్సలు సహించేది కాదు. దరి దాపుల్లో ఎవ్వరు బాధ పడుతున్నట్లు తెలిసినా వెంటనే ఏదో ఒక చర్య చే పట్టేది. అందుకే ఏరి కోరి ఆమెను మా ఇంటి కోడలిని చేసుకున్నాం." గర్వంగా 77 ఏళ్ళ తన కోడలు రుద్ర వైపు చూస్తూ చెప్తున్న జేజమ్మను ఆశ్చర్యంగా చూశారు పిల్లలంతా.
' ఇప్పటికీ కోడలిపై ఈమెకెంత ప్రేమ ! అందరూ అత్తలూ కోడళ్ళూ వీరిలా ఉంటే సమాజంలోని జన మంతా ఎంత హాయిగా ఉంటారో కదా!' అనుకుంది ఒక ముదిత. తన బామ్మ గుర్తొచ్చి పాపం ఆమె నైజానికి జాలి పడింది, ’తన తల్లి ఎంతో సౌమ్యు రాలు గనుక సరి పోతున్నది, లేక పోతే తన ఇల్లు నరకం అయ్యేదేమో!’ అనుకుంది తల్లిపై గౌరవంతో మనస్సు నిండగా ఒక యువతి. ఇంతలో "అందరికీ ఒక హాట్ న్యూస్ ! మన పెళ్ళి కొడుకు చెల్లాయి తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి చేయనన్న వాళ్ళ నాన్నకు తెలీకుండా రిజిస్ట్రార్ మేరేజ్ చేసుకుని ఇల్లు చేరిందిట, వాళ్ళింటి నుంచీ మా అక్కయ్య ఫోన్ చేసింది." అంటూ అనౌన్స్ చేసింది ఒక యువతి.
"బావుందర్రా! అన్నేమో కట్నం అంద జేయడం ఆలస్యమౌతుందని నాయన మాట విని పెళ్ళి పీటల మీంచీ లేవ బోయాడు, చెల్లాయేమో కట్నాలూ, కానుకల ప్రశక్తి లేకుండానే స్వతంత్రంగా కోరిన వాడ్ని చేసేసుకుంది. కాలంలో ఎంత మార్పర్రా! తరాలు మారి పోతున్నాయి అంతరాలూ పెరిగి పోతున్నాయి."అంది జేజమ్మ. ఔనన్నట్లు అంతా తలలూచారు.