నీవేలే నా ప్రాణం - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

neevele naa praanam

నా స్నేహితుడి గృహప్రవేశ ఫంక్షన్ లో ఆ అమ్మాయిని చూసింది మొదలు మనసులో ఏదో తెలియని మధురమైన భావన.

చిలకాకు పచ్చ పరికిణీ ఓణీలో చిలకలా వుంది. అందమైన కర్లీ హెయిర్ జడకి లొంగనందేమో? బుద్ధిగా వుండమని క్లిప్ పెట్టింది. ఆ ముఖమూ.. కళ్లూ.. ముక్కూ.. పెదాలు..అంగాంగాలు బ్రహ్మ దేవుడు మరింత ఓవర్ టైం చేసి తీర్చి దిద్దినట్టున్నాడు. ఇంత అందమైన పిల్లని ఇంకా ఎవరూ తమ సొంతం చేసుకోనందుకు ఆ ఊరి కుర్రాళ్ళ మీద కోపం వచ్చింది..మళ్ళీ అంతలోనే ‘అలా కాక పోవడమే మంచిదైంది..లేకపోతే నాకు దక్కేది కాదుగా?’ అనుకున్నాను.

ఆమెనే చూడాలని..ఆమెతో మాట్లాడాలని..ఆమె సమక్షంలోనే వుండాలని..ఏవిటో కోరిక. అప్పటి దాకా ఆ ఫంక్షన్ లో యాక్టివ్ పార్ట్ తీసుకుని అన్నీ నేనై ఏలోటూ రాకుండా చూసుకుని నా స్నేహితుడి ఫుల్ మార్కులు కొట్టేసి..భవిష్యత్తులో నా పెళ్ళికి వాడిని మంచి ‘పనివాడి’గా విశ్వ రూపం చూపించి, రుణం తీసుకోమని చెబుదామనుకున్న నేను, ఇప్పుడు ‘ఆమెని ఎలా ఆకర్షించాలా?’ అన్న విషయంలో మనసులో మల్ల గుల్లాలు పడుతున్నాను. ఆమె వాడికేమవుతుందో తెలీదు కాని అంతా తానై..అంతటా కలయ దిరుగుతూ పాదరసానికి..నీటిలో చేపపిల్లకి పర్యాయపదమై పనులు చక్కబెడుతోంది.

‘ఆమెనెలాగైనా దొరక బుచ్చుకోవాలి’ అనుకుని నేనూ మళ్ళీ యాక్టివ్ పార్ట్ తీసుకుని హడావుడి మొదలెట్టాను.

"ఏమండీ.."

నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నది ఆ కూజితం కోసమే"ఏంటండి?"అన్నాను.

"వంట వాళ్ళ దగ్గరుండి, వంట త్వరగా పూర్తయ్యేట్టు మీరు చూసుకోండి..నేను ఇక్కడి పూజకి కావలసిన ఏర్పాట్లలో వుంటా! ఇద్దరం ఒకే చోట వుండే బదులు అది బెటర్ కదా"అంది.

"నిజమేనండోయ్!"అని వంట వాళ్ళ దగ్గర కెళ్ళాను.

భోజనాల పర్వం పూర్తయ్యాక "థాంక్సండీ..మీరు అక్కడుండడం వల్ల వంటలు త్వరగా పూర్తయ్యాయి.. పైగా మీరు దగ్గరుండడం వల్ల వాళ్ళు చక్కగా వంటలు చేశారు. గృహ ప్రవేశానికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా, టైముకి భోజనాలు చేశారు."అంది మెచ్చుకోలు ముఖంలో ప్రతిఫలింపచేస్తూ.

నేను ఆమె పరిచయంలో తొందరగానే మొదటి మెట్టెక్కాను. నా సంతోషం వర్ణణాతీతం.

"ఏమండీ..మీరు చాలా..చాలా అందంగా వున్నారు..మీ హెల్పింగ్ నేచర్ నాకు చాలా నచ్చింది. నాకన్నీ ముఖం మీదే చెప్పడం అలవాటు."మాట్లాడాల్సిన నాలుగు మాటలూ ధైర్యంగా హడావుడిగా మాట్లాడేశాను.

ఆమె నా వంకోసారి ఆశ్చర్యంగా చూసి..ఆపై సిగ్గుతో.."మనం సాయంత్రం ఏడు గంటలకి..బీచ్ దగ్గర కలుసుకుందాం"అని లోపలికి పరిగెత్తింది. నాకూ ఆశ్చర్యంగా అనిపించింది. నేనూ తనకి పిచ్చి పిచ్చిగా నచ్చేసి వుంటాను..అందుకే నన్ను ప్రత్యేకంగా కలవాలనుకుంటోంది"అనుకుని ఆనందంగా ‘సాయంకాలం ఎప్పుడవుతుందా?’ అని ఎదురు చూడసాగాను.

***

పౌర్ణమి కావడం మూలాన బీచ్ చాలా అందంగా వుంది. చల్లటి గాలి శరీరానికి ఆహ్లాదం కలిగిస్తోంది.

నేను వచ్చిన అర గంటకి తనూ వచ్చింది. పొద్దున్న అందంగా వుంది కానీ ఇప్పుడు నా కోసం ప్రత్యేకంగా తయారయి రావడం వల్ల అప్సరసలా వుంది.

"రండి..రండి..ఏవన్నా తినడానికి తెమ్మంటారా?"ఫార్మాలిటీ కోసం అడిగాను.

"వొద్దండీ..మీతో జస్ట్ నాలుగు మాటలు మాట్లాడదామని వచ్చాను. ఒక్క సారి నన్ను గట్టిగా కౌగలించుకోండి"అంది. నా ఆశ్చర్యం అంబరాన్నితాకింది. మనసు ఆనంద తాండవం చేస్తోంది. అయినా తొందర పడకూడదని ‘నిజమా..లేక జోక్ చేస్తోందా?’ అని ఆమె వంక చూశాను.

ఆమె కళ్ళు మూసుకుని నుంచునుంది. అంటే ఆమె సీరియస్సే!

నేను ఆమె దగ్గరకి వెళ్ళి..గట్టిగా పెనవేసుకున్నాను. మొట్ట మొదటి సారి నచ్చిన స్త్రీ వెచ్చని కౌగిలింత..రెండు శరీరాల్లో మదన విద్యుత్తు శర వేగంగా ప్రవహించడం అనుభవంలోకొస్తోంది. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తియ్యని ముద్దుని ఆమె లేలేత పెదవులపై ముద్రించాను. ఆమె లోని తొట్రు పాటు..శరీరంలోని ప్రకంపనలు అది ఆమెకీ ప్రధమానుభూతే అని స్పష్ట పరుస్తోంది. నా చేతులు ముఖం పై నుండి జాకెట్ లోవున్న పూర్ణ కుంభాల వైపు శరవేగంగా పరుగులు పెట్టాయి. సరిగ్గా అప్పుడు తను వేగంగా నానుండి విడివడి "సారీ.."మనం కాస్త అలా కూర్చుని మాట్లాడుకుందాం..ప్లీజ్" అంది.

నాలోని ఉద్రేకం చల్లబడి..వాస్తవం లో కొచ్చాను.."సారీ" అని ఇసకలో కూలబడ్డాను.

ఆమె నాకు కొద్ది దూరంలో కూర్చుని.."మా నాన్న మామూలు స్కూల్ టీచర్. మా జీవితాలు వడ్డించిన విస్తరిలాంటివికావు. పోయిన నెల నన్ను పెళ్ళిచూపుల్లో చూసుకోవడానికి మీ వాళ్ళు వచ్చారు. మీరు పనుండి రాలేక పోయారు. కానీ మీ వాళ్ళు ఏం చెబితే అది మీకిష్టమే అన్నార్ట. మీ అమ్మా నాన్నలకి, కాబోయే కోడలిగా నేనెంతో నచ్చాను..కానీ మీ అత్తయ్య మా నాన్న ఇచ్చుకోలేనంత కట్నం అడిగింది. మీ అమ్మ నాన్నలు కట్నం కోసం నాలాంటి మంచి పిల్లను కాదనుకోవడం భావ్యం కాదన్నారు, కానీ ఆమె ససేమిరా వినలేదు. నేను ఎన్నో పెళ్ళి చూపుల్లో కూర్చున్నాను..కానీ నా అందాన్ని కట్న కానుకలు డామినేట్ చేయ లేక పోయాయి. నాకూ కొన్ని కోరికలుంటాయి. మీ ఫోటో అప్పటికే చూసి వుండడం చేత.. నాకు మనసా..వాచా నచ్చిన వ్యక్తయ్యారు. మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కి అన్నయ్య. ఆయన కట్టుకున్న ఇంటి గృహప్రవేశ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు..వాళ్ళింట్లో ఆయనతో పాటు కాలేజ్ గ్రూప్ ఫోటోలో మిమ్మల్ని చూశాను. నాకు ప్రాణం లేచొచ్చింది. ఎందుకో మనది జన్మ జన్మల బంధమనిపించింది. అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. నేను ఆయన్ని మీ గురించి అడిగాను. మీరు ఆయనకి ప్రాణ స్నేహితుడని తెలిసింది. ఆయనతో నా పెళ్ళి చూపుల విషయం చెప్పి..మిమ్మల్ని కలవాలనుందని చెప్పాను. ఆయన నా విషయం మీతో మాట్లాడతానన్నాడు. నేనే వద్దన్నాను. మిమ్మల్ని గృహ ప్రవేశానికి వచ్చేలా చేస్తే చాలన్నాను. మీరు తప్పక వస్తారని చెప్పాడు. నా అందం..పని తనం చూస్తే.. కట్నం డబ్బు కోసం నన్ను కాదన లేరన్న మంచి తనం మీదని నా నమ్మకం నాది. నా నమ్మకం వమ్ము కాలేదు. మీతో ఇక్కడ ఎందుకు ఎడ్వాన్స్ అయ్యానంటే నాకు మీరంటే ప్రాణం..ఈ ప్రథమ గాఢ పరిష్వంగం మనిద్దరినీ ఖచ్చితంగా కలిపి తీరుతుంది."అంది ఒకింత బాధని మాటల్లో వ్యక్త పరుస్తూ. నేను ఆమెకి దగ్గరగా జరిగి "నేనిదే మాటిస్తున్నాను..నిన్ను పెళ్ళిచేసుకుని..సొంతం చేసుకోని నా మగ జన్మ వృధా! మా అమ్మానాన్నలు త్వరలో మంచి వార్తతో మీ ఇంటికొస్తారు. మంచి ముహూర్తం పెట్టించి సిద్ధంగా వుండమను మామయ్య గారిని" అన్నాను.

***

పౌర్ణమి.

ఏకాంతంగా వున్న ఆరు బయట వాళ్ళిద్దరి సమాగమానికి ఏర్పాట్లు జరిగాయి.

"ఇలా బయట.. నాకు సిగ్గుగా వుంది బాబూ.."అంది.

"అబ్బో ఇలా ఆరు బయటే నాకు శాంపిల్ ఇచ్చి కట్టి పడేశావు. అదీ గాక మన మొదటి ఒప్పందం చంద్రుని సమక్షం లోనే జరిగింది..ఆయనకీ కృతజ్ఞతలు చెప్పినట్లుంటుందనీ..అంతే కాక నేనా రోజు ఇక్కడి దాకా వచ్చి ఆగి పోయాను..అది పూర్తి చెయ్యాలి కదా" అని పూర్ణ కుంభాల మీద చెయ్యేసాడు.

ఆమె సిగ్గుల మొగ్గ..అత్తి పత్తి అయి ముడుచుకు పోయింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు