గున్నేశ్వర్రావు - గుత్తొంకాయ్ కూర - మీనాక్షి శ్రీనివాస్

gunnesvararao - guttonkaaya koora

"ఏమండీ.. ఏమండోయ్, ఆ కాకినాడ సంబంధం వాళ్ళు ఎప్పుడొస్తారో, ఏమన్నా ఫోన్ చేశారా? కనీసం ఈ సంబంధం చెప్పిన ఆ సిద్ధాంతి గారికైనా ఓసారి ఫోన్ చెయ్యలేక పోయారా? ఎంతైనా 'ఆడపిల్ల వాళ్ళం' మనమే వెంటపడాలి!" అంది అరుంధతి కూర తరుగుతూ.

పక్కనే కూర్చుని పేపర్ తిరగేస్తున్న రామారావు "ఊ..ఊ అలాగే...అలాగే "పాతికేళ్ళుగా అలవాటయిన ధొరణిలో అన్నాడు. పాపం ఆవిడ ఏం చెప్పినా ఆయన చెవి దాకా వెడితేనా?

ఏమిటి, నా తలకాయ్ 'అలాగే.. అలాగే' మంచి సంబంధం మనం ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎవరో ఒకరు తన్నుకెళ్ళిపోతారు, అప్పుడు తీరుబడిగా ఇంక పేపర్ చదువుకోవడమే."

"అబ్బబ్బ ఏమిటోయ్ నీ నస, ఇప్పుడు రోజులన్నీ మారాయి అమ్మాయిని కన్నవాళ్ళు దర్జాగా కాలి మీద కాలు వేసుకు కూర్చుంటే, మీ పిల్లని మాకివ్వండి బాబోయ్ అంటూ వాళ్ళే వెంట పడుతారు"

"తధాస్తు, ఎంత ధీమా అండి రామారావు గారూ, నిజం చెప్పారు సుమ్మీ, ఇదిగో ఇంచుమించుగా అలాంటిదే. ఇదిగో మీ కాబోయే వియ్య్యపురాలు మీ అమ్మాయికి పంపిన పరీక్షాపత్రం, జవాబులతో సహా. మీ అమ్మాయేమో ఆల్రెడీ వాళ్ళందరికీ ఎలాగూ నచ్చేసింది, ఈ పెళ్ళి చూపులూ గట్రా ఏదో.. పేరుకే. ఆ మోహనరావు గారింటి పెళ్ళిలో వాళ్ళు మీ అమ్మాయిని చూడటం, ఇష్టపడి కావాలని మీకు కబురు పెట్టడం, అబ్బాయికి కూడా ఫోటోలో పిల్ల నచ్చినట్లే, అయితే ఓకే చెప్పడానికే చిన్న చిక్కుంది, చూసారూ ఆ పిల్లాడికేమో 'గుత్తొంకాయ్' కూరంటే పంచప్రాణలూనట.. ఎంత మంచి మంచి సంబంధాలూ ఇదిగో వెధవది .. ఈ కూర దగ్గరే చెడిపోతున్నాయట. అందుకే పాపం ఆ మహా ఇల్లాలు.. అదే ఆ పెళ్ళి కొడుకు తల్లిగారు జానకమ్మ గారు ఇదిగో ఈ ప్రశ్నాపత్రం.. జవాబులతో సహా పంపారు. అమ్మాయి ఇవి యధాతధంగా బట్టి పట్టి చెప్పేస్తే ఈ సంబంధం కుదిరినట్లే.."ఏకబిగిని చెప్పేసి అలుపు తీర్చుకున్నాడు. అప్పుడే వచ్చిన సిద్ధాంతి గారు.

"ఏమిటి.. పెళ్ళి చూపుల్లో ప్రశ్నాపత్రమా.. ఇదేదో విడ్డూరంగా వుంది..ఏది?" అందుకోబోయింది అరుంధతి.

"ఆహా.. అది నీకు కాదు నాకు" అల్లరిగా లాక్కుంది జాహ్నవి వాళ్ళ ఒక్కగానొక్కకూతురు పెళ్ళికూతురు.

"ఏమిటదీ? బొత్తిగా సిగ్గులేకుండా" అరుంధతి కసిరింది కూతురిని. "ఇదిగో చదువుతున్నా వినండి..." జాహ్నవి అల్లరి మొదలుపెట్టింది తల్లిని పట్టించుకోకుండా.

ప్ర : మీకు వంకాయ కూరంటే ఇష్టమా? నాకు ప్రాణం. రోజు అది లేనిదే ముద్ద దిగదు".

జ : అవునా .... నాక్కూడా.

ప్ర : గుత్తొంకాయ .... కూర ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు? వాటిని తయారు చెయ్యడం లో వాడే దినుసులు?
"నాన్నోయ్ నాదో డొట్, ఇంతకీ ఇది పెళ్ళాం పోస్టా లేకపోతే స్టార్ హోటల్ లో చెఫ్ పోస్టా?" కిలకిలలాడింది జాహ్నవి.

"చత్.. నోర్ ముయ్యి . పాపం ఆ పిల్లాడికి ఆ కూరంటే ఇష్టం కాబోలు" కూతుర్ని కసురుకుంది తల్లి.
"ఎంత ఇష్టం వున్నా ఇదేమిటి" కస్సుమన్నాడు రామారావు.

"ఏం మర్చిపోయారా? మీరడగలేదూ? మన పెళ్ళి చూపుల్లో 'కొబ్బరి - మునక్కాయ్ పిండి మిరియం' వచ్చా? ఇంగువ పోపుతో ఘుమఘుమలాడే చారు వచ్చా? అని" గుర్తు చేసింది అరుంధతి.

"నువ్వంటే చదువు సంధ్యా లేని మొద్దువి.. కనీసం రుచిగా వండిపెట్టడం అయినా వచ్చో రాదో అని అడిగా... కానీ ఇదేమిటీ? నా కూతురు ఇంజనీరింగ్ చదివింది, నెల తిరిగే సరికల్లా ముప్పై వేలు సంపాదిస్తోంది, దాన్ని పట్టుకు వంకాయ కూర వచ్చా? బీరకాయ పచ్చడి వచ్చా? అని అడుగుతాడా? చాల్చాల్లే, దీని తాత లాంటి సంబంధం .. ఇది కాకపోతే ఇంకోటి." ఇంతెత్తున ఎగిరాడు రామారావు.

"నువ్వుండవయ్యా.. ఎక్కడ దొరికావో? బంగారం లాంటి సంబంధం , పిల్లాడు బుద్ధిమంతుడు, ఐ.టి.ఐ ఖరగపూ
ర్ లో ఏదో పెద్ద చదువు.."

"అయ్యో .. శాస్త్రి గారు ఐ టి ఐ కాదు ఐ ఐ టి. పాపం పూర్ ఖరగ్ పూర్, మీరు దాన్ని కాస్తా.." పగలబడి నవ్వింది, జాహ్నవి.

"ఏమిటా విరగబాటు .. మగరాయుడిలా ఆ నవ్వేమిటి? కాస్త వప్పు... వందనం నేర్చుకో" కసిరింది తల్లి.

"పోనీలేమ్మా.. అననీ.. చిన్నప్పటి నుంచీ ఎత్తుకు పెంచిన వాడినీ.. నన్ను కాక ఇంకెవరిని ఆట పట్టిస్తుంది? పెద్ద చదువూ, ఆరంకెల జీతం, అన్నింటి కంటె కావాలని కోరి వచ్చారు.. చాలా మంచి సంబంధం... బాధ్యతలు, బాదరబందీలు లేవు, ఒక్కగానొక్క కొడుకు, ఇదిగో ఫోటో, వాళ్ళు పిల్లనీ చూసారు, కానీ .. పిల్ల వాళ్ళ పిల్లాడిని చూడాలిగా, ఇదిగో.. మీరు ఒకసారి చూసి ఓకే అనుకుని ఫోన్ చేస్తే వాళ్ళు నాలుగు రోజుల్లో పిల్లని చూసుకుందుకు వస్తామన్నారు. ఒకళ్ళనొకళ్ళు నచ్చడమే ప్రధానం కానీ కట్న కానుకలూ, పెట్టు పోతలూ అంత ముఖ్యం కాదు అన్నారు. ఏమే పిల్లా ... ఎలా వున్నాడు? రాజులా లేడూ?"

"ఏమో.. మీరు చెప్పినదంతా విన్నాకా నాకు 'గుత్తొంకాయా లా కనబడుతున్నాడు. "మళ్ళీ కిలకిల లాడింది, జాహ్నవి. "పేరు .. ఓల్డ్ నేం , టేస్ట్ .. ఓల్డ్ టేస్ట్, లుక్స్ ఓకే .. కానీ సీరియస్లీ అమ్మా.. ఇలాంటి తిండిపోతుని , దట్ టూ.. అన్ని రుచులు తెలిసిన వాడికి పాపం అస్సలు వంట రాని నన్ను మోసం చేసి పెళ్ళి చేసి పెళ్ళి చెయ్యడం అవసరమా?"

"ఆ..ఆ.. నోర్ముయ్యి. ఏదో కాస్త తిండి పుష్టి వుంటే మాత్రం , నోటికి ఎంత మాట వస్తే అంతా అనేయ్యడమే? చాల్లే ఊరుకో, పాపం నీ మీద ప్రేమతో , ఎలాగైనా నువ్వు తన కోడలు అవ్వాలని ఆవిడ ముందు జాగ్రత్తగా అడిగేవన్నీ నీకు చెబితే .. నీకు నవ్వులాటగా వుందా? వెళ్ళు లోపలికి వెళ్ళి అదేదో పూర్తిగా చదువు." కోప్పడింది తల్లి కూతురిని.

**

"అబ్బయ్, పెళ్ళి కూతురు ఎలా వుంది?" వరుసకి బాబాయ్ అయిన కోటేశ్వర రావు పెళ్ళికొడుకు గున్నేశ్వరరావుని అడిగాడు.

"నవ నవలాడే లేత "మువ్వొంకాయ్" లా వుంది బాబాయ్" తల్లి తండ్రి గుండెల్లో శతగ్ని పేల్చనే పేల్చాడు పెళ్ళికొడుకు. పెళ్ళికూతురు జాహ్బవి ఉలిక్కిపడి తలెత్తింది.. కాబోయే అత్తామామా కంగారుగా చూసారు.

"భేష్.. అంటే నీకు అమ్మాయి బాగా నచ్చిందన్నమాట.." విషయం తేల్చేసాడు నవ్వుతూ. "అన్నమాటా.. తమ్ముడి మాటా కాదు వున్నమాటే, వాడి ముఖం చూస్తే తెలియటంలా? బావగారూ మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది.. మాదంతా స్పీడ్ అండ్ సింపుల్ వ్యవహారం... మీకూ మా సంబంధం నచ్చితే "ఓకే " అని టైపు చేసి "ముహూర్తం" అని స్పేస్ ఇచ్చి డేట్ కొట్టి ఈ నంబర్ కి ఎస్.ఎం .ఎస్ ఇవ్వండి.. వచ్చి వాలిపోతాం. " పెళ్ళున నవ్వాడు పెళ్ళికొడుకు తండ్రి నిత్యానందం , ఇంకా అయోమయంగా చూస్తున్న ఆడపెళ్ళివారితో..

"మా వాళ్ళదంతా కొంచెం హాస్యం పాలు ఎక్కువ లెండి, మరి మేం వెళ్ళి వస్తాం, మీరొకసారి మా ఇంటికి వస్తే ముహూర్తాలు , గట్రా మాటాడుకుందాము" అమ్మాయికి బొట్టు పెట్టి వెంట తెచ్చిన పూలూ, పళ్ళు, చీర, పసుపు, కుంకుమ ఇచ్చింది జానకమ్మ.

అమ్మమ్మ మాటలు గుర్తొచ్చి.. అవి అందుకుని పక్కనే వున్న టీపాయ్ మీద పెట్టి , వంగి దండం పెట్టుంది జాహ్నవి.

ముగింపు వచ్చేవారం ..

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ