చెత్త వ్యసనం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు.

chettavyasanam

పూర్వం పావనపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పావనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా మంచి వాడు. ప్రజలకు ఇబ్బందులు తెలియకుండా పరిపాలించే వాడు. తీరిక సమయాల్లో ప్రధానోద్యోగులతోను, పండితులతోను సారస్వత చర్చ, లోకాభిరామాయణం సాగిస్తూ ఉండేవాడు రాజు పావనుడు.

ఒకసారి పావనుడు అలాంటి సమావేశాన్నే జరుపుతూ “వ్యసనాలు హానికరాలని పెద్దలు చెప్పటం విన్నాను. అయితే వ్యసనాలన్నింటిలో ఏ వ్యసనం ఎక్కువ నష్టం కలిగిస్తుoదో చెప్పండి” అంటూ ఆ సమావేశంలో పాల్గొన్న వారిని అడిగాడు.

సమావేశం జరిగినప్పుడు ఉన్న ప్రముఖుల్లో సేనాధిపతి ముందుగా తన అభిప్రాయం చెబుతానన్నాడు. మహారాజు సరేననడంతో అతడిలా చెప్పాడు.”ప్రభూ! జగమెరిగిన సత్యానికి మనం చర్చ చేయాల్సిన అవసరమే లేదు. కురుక్షేత్ర సంగ్రామానికి, అక్షౌహిణీల మారణ హోమానికి ధర్మరాజు జూద వ్యసనమే కదా కారణం. కనుక అన్ని వ్యసనాల్లోనూ జూదమే అత్యంత హానికరమైనది”.

అతడికి ప్రక్కనే ఉన్న వృద్ధుడు పరమేశ్వరయ్య ‘అవును ప్రభూ! మన సేనాధిపతి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మన రాజ్యంలో ఎందఱో జూదరులు జూదంలో పందెం ఒడ్డడం కోసమై తమ భార్యల పుస్తెల తాళ్ళు తెంపుకుపోవడం నేను చూసాను. జూదంలో గెలిచిన వాళ్ళు ఇంకా గెలుస్తామన్న ఆశతో ఆడుతుంటారు. ఓడిన వాళ్ళు ఈసారైనా గెలవక పోతామా అని ఆడుతుంటారు. జూదం వ్యసనంలో మునిగి ఆహారం, నిద్ర మరచి పోతుంటారు. అలాంటి భయంకర వ్యసనం జూదం. మనుషుల ఆరోగ్యాలు పాడు చేసే పాడు వ్యసనం“ అని చెప్పాడు.

ఈసారి కోశాధికారి తన అభిప్రాయo చెప్పాడు. ”మహారాజా ! అటు బిల్వమంగలుడ్నీ , ఇటు భవానీ శంకరుడ్నీ – ఇంకా సుబ్బిశెట్టినీ , అనేకానేక మహానుభావుల్నీ సర్వనాశనం చేసింది వేశ్యా ప్రియత్వం! ఎందఱో మానవతుల గలగలలాడే గాజుల్ని గంగపాలు చేసిందీ – పతివ్రతల కన్నీటి గాధలకు అలవాలమైందీ వేశ్యా సంపర్కం. కనుక వేశ్యా లోలత్వం అధికాధికం హానికరం...” అంటూ ఆవేశపడ్డాడు.

అంతవరకూ వారు చెప్పింది విన్న పండితుడు కంకాళ భట్టు తన అభిప్రాయం ఇలా చెప్పాడు. “ ఆడంబరాలకు పోయి అతిగా ఖర్చు చేస్తూ అప్పులు వాడకం, వాటికి వడ్డీలు చెల్లించడంతోనే జీవితాలు గడిపేస్తున్న వారిని అనేక మందిని చూసాను. అలాంటి వాళ్ళు తమ సంపాదన మొత్తాన్ని వడ్డీలు చెల్లించడానికే వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ ఆడంబరాలను అదుపు చేసుకోవడం లేదు. పాత అప్పులు తీర్చడం కోసం మరో కొత్త అప్పు చేయడం, పాత అప్పులకీ, కొత్త అప్పులకీ వడ్డీలు కట్టలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అప్పు చేయడం అనే వ్యసనం అతి భయంకరమైనది” అన్నాడు.

తరువాత ఆస్థాన పండితుడు రమణ శర్మ లేచి నిలబడి “ప్రభూ! అన్ని వ్యసనాలూ ఒక ఎత్తు. మధుపానం ఒక్కటీ ఒక ఎత్తు. మిగతా అన్ని వ్యసనాల వల్ల ఎంతటి హాని ఏర్పడుతుందో ఒక్క మధుపాన వ్యసనం వల్లనే అంత హాని ఏర్పడగలదు. వ్యసన రాణిగా పేరుగన్న మధుపానాన్ని నిషేదిస్తే తప్ప ఏ రాజ్యమూ ప్రగతిని సాధించలేదు” అంటూ సలహా చెప్పాడు.

మిగతా అందరూ ఆస్థాన పండితుడితో వాదులాడి, వ్యసన రాణి ఘనతను నిరూపించమని సవాల్ చేసారు.

అందుకు రమణ శర్మ కాసేపు ఆలోచించి ఎలాంటి విధంగా నిరూపణ చేయవచ్చో మనసులోనే ఆలోచన చేసి వారితో సరేనన్నాడు. తన మాటలు నిరూపణ చేయడం కోసం వారందరూ ఏమి చేయాలో వివరంగా చెప్పాడు.

రమణ శర్మ మాట ప్రకారమే మిగిలిన వారు వేషాలు మార్చుకుని ఆనాటి రాత్రి ఆయనతో అనుసరించి ఒక విద్యావంతుడూ , తెలివైన వాడూ అయిన ఒక యువకుడి ఇంటికి వెళ్ళారు.

కొంతసేపు పిచ్చాపాటీ మాటల తరువాత మారువేషంలో ఉన్న సేనాధిపతి ఆ యువకుడ్ని జూదం ఆడటానికి రమ్మని ప్రోత్సహించాడు. అందుకా యువకుడు ససేమిరా అంగీకరించలేదు.

ఆ తరువాత కోశాధికారి ప్రయత్నం చేసాడు. రాజనర్తకి విలాసినీ దేవి అందచందాల్ని వంపు సొంపుల్నీ వర్ణించి , ఆమె నాట్య ప్రదర్శనకు వెళ్లి వద్దాం అంటూ ఆహ్వానించాడు. అందుకు కూడా ఆ యువకుడు లొంగి రాలేదు.

తరువాత వంతు పండితుడు కంకాళ భట్టుది అయింది. ఆయన తన ప్రయత్నం మొదలు పెట్టాడు. అంగడిలో విలువైన వస్తువులు వచ్చాయనీ, అలాంటివి కొని ఇంటిని బహు అందంగా అలంకరించుకోవచ్చనీ, అలాంటి వస్తువులు కొనేందుకు సరిపడా పైకం లేకపోయినా తనకు తెలిసిన వారి నుండి అప్పు ఇప్పించగలననీ, నచ్చచెప్పాడు. దానికి కూడా యువకుడు అంగీకరించలేదు. తనకు ఆడంబరాలన్నా , అప్పులన్నా పరమ చిరాకు అని చెప్పాడు.

చివరికి ఆస్థాన పండితుడు రమణ శర్మ తన మాటలు నిరూపణ చేసే సమయం వచ్చింది. యువకుడిని మాటలలో పెట్టి మరిపించి మధువును సేవింప చేసాడు.

ఇంకేముంది? ఆ యువకుడు మత్తెక్కి పోయి ఒళ్ళు మరచి వివేకాన్ని కోల్పోయాడు. జూద గృహానికి వెళ్లాలనీ , విలాసినీ వినోదాన్నీ అనుభవించాలనీ , తన ఇంటిని ఆడంబరంగా మలచాలనీ , అందుకు అవసరమైన పైకం అప్పు కావాలనీ పలవరిస్తూ పులకించి పోసాగాడు.

గుమ్మం బయటే వేచి ఉండి లోపల జరుగుతున్న సన్నివేశాలను చూస్తున్న మహారాజు వద్దకు వెళ్లి లోపలకు పిలిచాడు ఆస్థాన పండితుడు రమణ శర్మ.

“చూసారుగా ప్రభూ! మధుపానానికి ముందుగా మనుషులు ఎంత మంచివారుగా ఉన్నా – తర్వాత వివేకాన్ని కోల్పోయి ఎంతటి భ్రష్టులుగా మారిపోతారో చూసారుగా! అందుకే మధుపానం వ్యసన రాణిగా సార్ధక నామ ధేయాన్ని పొందింది. మిగతా వ్యసనాలు చెలికత్తెల్లా చుట్టి వుంటాయి” అని చెప్పాడు ఆస్థాన పండితుడు.

మహారాజు అవునన్నట్టు తలాడించాడు. మిగతా వారు కూడా ఆస్థాన పండితుడి మాటలను అంగీకరించారు. పావనుడు మధుపానాన్ని నిషేదిస్తూ చట్టం చేసాడు.

మరిన్ని కథలు

Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్
Jeevinchu
జీవించు
- B.Rajyalakshmi