నష్టం లో లాభం - ..

nashtamlo labham

విఘ్నేశ్వరుడి గుడి దాటి మా ఇంటి సందు లోకి కారు తిరుగు తుండగా ' సెల్' రింగ్ అయింది. మా ఆవిడ సుందరి ఫోను. " ఎక్కడున్నారు? మీ పెద్దన్నయ్య గారు రెండు మాట్లు ఫోన్ చేసారు. కృష్ణ నెంబర్ కి చేయమన్నారు" అని కట్ చేసింది. పెద్దన్నయ్య రిటైరయింతరువాత విజయవాడ లోనే సెటిల్ అయినా కొంత కాలం కొడుకు కృష్ణ దగ్గర అస్సాం లోనూ, ఇంకొంతకాలం కూతురు సంధ్య తో మదురై లోనూ గడుపు తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా 'అమ్మని నాదగ్గర వదిలి వెళుతూ ఉంటాడు. మిగతా ఇద్దరు అన్నయ్యలు ఉన్నా అమ్మ ఎప్పుడూ పెద్దన్నయ్య దగ్గర కాని , నా దగ్గర కాని ఉండడం అలవాటు. . లోపలి కి వెళ్లి చేయచ్చులే అనుకుని కుమార్ కి మర్నాడు ఎప్పుడు రావాలో చెప్పి లోపలికి నడిచాను.

ఫోన్ చేయగానే పెద్దన్నయ్య " ఏమిలేదురా తాత గారి ఊరు వెళ్లి చిన్నమామయ్యని కలవాలి. అమ్మ భూమి మీద వచ్చే శిస్తు తీసుకు రావాలి. నీకు తెలుసుగా ఏడాదికి ఒక మాటైనా మనం రావాలనుకుంటాడు. శిస్తు వేరే విధంగా పంపడం అతనికి ఇష్టం ఉండదు. వచ్చే బుధవారం ప్రతి ఏడాది చేసే కామేశ్వరి వ్రతం చేస్తున్నాడు. ఆ వేళకి వెడితే బాగుంటుంది" అని పెట్టేసాడు

మా తాత గారి ఊరు కృష్ణా జిల్లా లో దివి సీమ లో ఓ పల్లెటూరు. మాది పగో జిల్లా భీమవరం దగ్గర వీరవాసరం మాకు దగ్గర యూనివెర్సిటీ అయిన ఆంద్ర యూనివెర్సిటీ అప్పట్లో గుంటూరు లో ఉన్నప్పుడు నాన్నగారు పిజి అక్కడ చేసారు. మా పెద్ద మామయ్యా ఆయన అక్కడ క్లాస్ మేట్స్ .వాళ్ళ స్నేహాన్ని బంధుత్వం గా మార్చాలని పెద్దమావయ్య పూనుకోవడం వల్ల, మా అమ్మని నాన్నగారు చేసుకోవడం జరిగింది. పెద్దమావయ్య వాళ్ళు నలుగురు. మిగతా ముగ్గురు బయట ఉద్యోగాలికి వెళ్ళిపోతే చిన్న మావయ్య మాత్రం అక్కడే ఉండి భూములు చూసుకుంటున్నాడు. కొబ్బరి తోటలు, ఊడుపు చేలు చాలానే ఉన్నాయ్. నాలుంగు వందల గడప ఉన్న ఊళ్ళో మూడు నాలుగు పెద్ద కుటుంబాల్లో తాత గారిది ఒకటి. తాత గారు అమ్మకి ప్రత్యేకంగా కొంత పొలం ఇచ్చారు. దాని శిస్తు చాల శ్రద్ధగా మా మావయ్యలు మా అమ్మకి ఇవ్వటం జరుగుతోంది.మా కుటుంబాల్లో ఓ గట్టి నమ్మకం ఏమిటంటే ఆడపిల్లల సొమ్ము మనకి కలవకూడదు. అలా జరగడం మనకి మంచిదికాదు అని . మా నాన్నగారు అమ్మ భూమి మీద వచ్చే దాన్ని వేరే ఎకౌంటు లో ఉంచి మా అమ్మ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఏర్పాటు చేసారు. మా నాన్నగారు కాలం చేసిన తరువాత కూడా ఆ పధ్ధతి లో ఏమి మార్పు లేదు. మా అక్కలు ముగ్గురికోసం, మా కోసం ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ ఉంటుంది. కొడుకుల కంటే కూతుళ్ళు ఎక్కువ మా అమ్మకి అని పెద్దన్నయ్య . అప్పుడప్పుడు అనేవాడు. కూతురు సంధ్య పుట్టినతరువాత అలా అనడం మానేసాడు. ఆయనకీ కొడుకు మీద కంటే కూతురు మీద అభిమానం ఎక్కువ అని మా పెద్ద వదిన అంటూ ఉంటుంది.నువ్వు అలా అనుకుంటావు కాని ఇద్దరి మీద ప్రేమలూ అలా పోల్చేవి కావు అనేది అమ్మ

నాకు పదిహేను ఏళ్ళు వచ్చేదాకా మాతాతగారి ఊరు తరచూ వెళ్ళేవాళ్ళం. ఆ తరవాత తగ్గి పోయింది. ఆఖరి సారి వెళ్లి పదిహేను

ఏళ్లయింది. ఇప్పుడు పెద్దన్నయ్య వెళ్ళ మన్నట్టే అప్పుడు నాన్నగారు పంపితే వెళ్ళడం జరిగింది. జ్ఞానం వచ్చినతరువాత చిన్న మావయ్యని దగ్గరగా పర్సీలించింది అప్పుడే.

చిన్న మావయ్యది అదో రకం వ్యక్తిత్వం. మా అమ్మమ్మ అనారోగ్యం కారణంగా చాలా కాలం వాళ్ళ తాత గారింటి దగ్గర పెరిగాడు. వాళ్ళ తాతగారు నిత్యాగ్నిహోత్రి, మడి ఆచారాలు అవీ ఎక్కువ. వాటి ప్రభావం వల్లో, గ్రామం లోనే ఉండిపోవడం వల్లో కాని, రెగ్యులర్ గా సంధ్యా వందనం, సాయంత్రం పూజ అన్నీ పట్టుపంచ కట్టుకుని శ్రద్ధ గా చేయడం చూసాను.ఇవేమీ ఫరవాలేదు. కాని కొన్ని మిగతా విషయాల్లో ఆయన ప్రవర్తన కొంచెం ఆశ్చర్య పరిచేదే.

నేను వెళ్ళిన మర్నాడు ప్రొద్దుట వాళ్ళ వీధి అరుగుమీద కూర్చుని పేపర్ చదువుతున్నాను. మావయ్య కొడుకు రామం , కూతురు బృంద ఇంటి ముందు పందిట్లో ఆడుకుంటున్నారు. ఇంతలో ఎవరో పొలం నుంచి కాబోలు వచ్చి పందిట్లో రాట దగ్గర నుంచున్నాడు. నాన్నా! నారయ్య వచ్చాడు అంటూ బృంద లోపలి కి పరిగెత్తింది. మావయ్య పూజ పూర్తిచేసుకుని పట్టు పంచ తోటే అరుగు మీదకి వచ్చి నుంచుని అతని తోటి మాట్లాడ్డం మొదలెట్టాడు. ఓ అర గంట దాక మాట్లాడుతూ నే ఉన్నారు. ఈ మధ్యలో వచ్చినతనికి, కాఫీ , టిఫిను ఇచ్చారు. పందిట్లో ఓ మూల పైన ఉంచిన ప్లేటు , గ్లాసు తీసుకుని తినడం తాగడం అయ్యినతరువాత బృంద నీళ్ళు ఎత్తి పోస్తే కడిగి మళ్లీ పైన పెట్టేసాడు. వెళ్ళబోతూ అతను మొలలోంచి కొంత డబ్బు తీసి అరుగు మీద పెట్టాడు. 'దింపు డబ్బండి' అన్నాడు అక్కడ పెట్టి వెనక్కి జరిగి. మావయ్య డబ్బు మీద కొద్దిగా నీళ్ళు జల్లి లోపలికి తీసుకెళ్ళాడు . ఏమిటి ఈ చాదస్తం అనుకున్నాను. ఇంతలో అత్తయ్య బృందని పిలిచి మావయ్యకి తువ్వాలు ఇమ్మని అరిచింది. అత్తయ్య నాకు రెండోమాటు కాఫీ ఇవ్వడానికి వచ్చినప్పుడు అడిగాను " అదేమిటి స్నానం చేసే కదా పూజ చేసాడు. మళ్ళీ స్నానం ఏమిటి? "

"నారయ్య తో ఎప్పుడు మాట్లాడినా ఇదే వరస. వాడు పట్టించు కోడు కాని వాడి కొడుకులు చదువు కుంటున్నారు. వాళ్ళు వచ్చినా ఇదే వరస. మళ్ళీ వాళ్ళ చదువులన్ని ఈయనే చెప్పిస్తారు. వాళ్ళు అంత పట్టించుకోరు" .అంది అత్తయ్య కొంత వివరణ ఇస్తూ.
మావయ్య స్నానం చేసి వచ్చి అరుగు మీదకి వచ్చి నాతొ కబుర్లు మొదలు పెట్టాడు. బృంద, రామం మళ్లీ వచ్చి పందిట్లో ఆడడం మొదలు పెట్టారు. ఇంతలో పీచు మిట్టాయి అమ్ముతూ ఒకడు వచ్చి పిల్లలిని చూసి ఆగాడు. పిల్లలు ఇద్దరూ కూడా తండ్రి దగ్గరకి పరుగేట్టుకి వచ్చారు కొనమని. "అది మంచిది కాదు " నేను టౌన్ వెళ్ళినప్పుడు తెస్తాను పోయి ఆడుకోండి" అన్నాడు మావయ్య . రామం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాని బృంద మాత్రం వెళ్ళలేదు . మొండి గా సతాయించడం మొదలెట్టింది. కాసేపు చూసి ఒక్కటేసి లోపలి కి పొమ్మన్నాడు. పోనీ కొనచ్చు కదా అని నాకు నాలుక దాకా వచ్చి ఆగాను . బృంద లోపలి కి వెళ్ళకుండా క్రింద పడి దోల్లడం మొదలు పెట్టింది. అత్తయ్య వచ్చి దాన్ని లోపలి కి తీసుకు వెళ్ళింది. దీనికి పంతం ఎక్కువేనే అన్నాను నవ్వుతూ. " అవునురా వాడిలా కాదు దీనికి పంతం ఎక్కువే. సద్దుకు కు పోయే మొగుడు రాక పోతే కష్టమే" అన్నాడు నవ్వుతూ.

రాత్రి భోజాల దగ్గర సీను వేరు. తండ్రి వొళ్లోకి చేరి అయన పెడుతోంటే కావలిసిన వన్నీతింది . అది అడిగిందేదో వడ్డించలేదని అత్తయ్యను కూడా కసిరేడు మావయ్య.

మర్నాడు మావయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని వచ్చేసాను . ఆ తరవాత మళ్ళి ఇప్పుడే వెల్ల వలసి రావడం

మర్నాడు ఆఫీసు కి వెళ్ళగానే మా ఎండి తో చెప్పాను వెళ్ళవలసిన ప్రయాణం గురించి. లీవ్ గురించి . లీవ్ ఎందుకు? ఎలాగా అక్కడిదాకా వెళుతున్నారు కాబట్టి, బందర్ సుబ డివిజన్ ఆఫీస్ లో డిప్యుటి ఇంజినీరు , అసిస్టెంట్ ఇంజనీరుని లెంపక్కాయ్ కొట్టాడట. అక్కడ గొడవగా ఉంది. ఈఈ ఫోన్ చేసాడు. అది ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అన్నాడు . కారు లో వెడుతున్నానని తెలిసి ఇంటర్నల్ ఆడిట్ రాఘవ కూడా నాతో బయలుదేరాడు. మర్నాడు ప్రొద్దుటే బ్రేక్ ఫాస్ట్ చేసి బయలుదేరాం. రాఘవ తో కబుర్లలో ఉండగా మూర్తి ఫోన్ చేసాడు. మూర్తి మా ఆఫీసు లో గ వర్నమేంట్ నుంచి వచ్చే సబ్సిడీ వ్యవహారాలూ చూసే సెక్షన్ కి ఇంచార్జ్ . రైతులకి మేము చేసే సేవలకి గాను ప్రతి ఏడాది ప్రభుత్వం మాకు బడ్జెట్ ద్వారా కొంత సబ్సిడీ రిలీజ్ చేస్తుంది. ముందుగానే అంచనాలు చూపించి మేము బడ్జెట్ ఫిక్స్ చేయించుకోవాలి. లేకపోతే ఏడాదంతా కష్టం అవుతుంది.

" సార్ మన బడ్జెట్ లో పది కోట్లు కట్ చేస్తున్నారు. ఫైనాన్సు మినిస్ట్రీ నుంచి మన మినిస్ట్రీ కి వచ్చిన సమాచార మేమంటే స్టూడెంట్స్ ఫీజు బడ్జెట్ వల్ల మనదాంట్లో కోతట" అంటూ బాంబ్ పేల్చాడు. అదేమిటయ్యా. అలా చేస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది.నువ్వు మేనజ్ చేసి తగ్గ కుండా చూడు అని ఫోను పెట్టి దాని ప్రభావం ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచన లో పడ్డాను . ఓ అరగంట తరువాత మళ్ళీ చేసాడు. " ఏమయ్యా ఏమయింది ? అన్నాను ఆత్రుత గా. " చాలా కష్టం మీద ఒప్పించి పది కోట్లు కాకుండా రెండు కోట్లు మాత్రమే కట్ చేసేలా కన్విన్స్ చేసాను సార్ " అన్నాడు." ఓ! వేరి గుడ్ చాల బాగా మేనేజ్ చేసావ్" అని కట్ చేసాను.

ఎవరు నుంచి సార్ ఫోను? మూర్తి నుంచా ? అన్నాడు రాఘవ . అవును అతనే. నాకు మంచి సపోర్ట్. "గవర్నమెంట్ తో బాగా మానేజ్ చేసుకోస్తాడు. ప్రతి ఏడాది చూస్తున్నాను" అన్నాను మూర్తి ని మెచ్చుకుంటూ'

మీకో రహస్యం చెబుతాను సార్. మీ తోనే ఉంచుకోండి అన్నాడు నవ్వుతూ రాఘవ. "ఏమిటి?" అన్నాను కుతూహలంగా

" మూర్తి చాలా సిన్సియర్, హార్డ్ వర్కర్ సార్. కాని మీ దగ్గర మెప్పు కోసం చిన్న ట్రిక్ చేస్తాడు. మీరు 'నష్టం లో లాభం' టెక్నిక్ గురించి విన్నారా? " అన్నాడు నవ్వుతూ. " అదేమిటి ఎప్పుడూ వినలేదే? " అన్నాను

వినండి మీకు చాలా ఉపయోగపడుతుంది అని మొదలు పెట్టాడు " ఓ ఊళ్ళో ఓ పిసినారి షాహుకారు ఉన్నాడు. వాడి దగ్గర పనిచేయడం ఎవరికయినా కష్టమే. అతను ఓ మాటు తన దగ్గర పని చేసే రత్తయ్య ని బండి ఎడ్లు తీసుకుని ప్రక్క ఊళ్ళో మార్కెట్ నుంఛి మూడు సిమెంట్ బస్తాలు తీసుకు రమ్మన్నాడు. ఎడ్లు కొత్త గా ఎక్కువ డబ్బు ఇచ్చి కొన్నాడెమో చాలా జాగర్తలు చెప్పి పంపించాడు. రత్తయ్య పోరుగూల్లో సిమెంట్ కొని తిరుగుముఖం పట్టాడు. ప్రక్క ఊరికి వెళ్ళడం కాని రావడం కాని ఓ కాలవ ప్రక్కన ఉన్న రోడ్ మీదుగా ప్రయాణం చేయాలి. వీడు తిరిగి వస్తోంటే ఎదురుగా బస్సు రావడంతో ఎడ్లు కంగారు పడి కాలవ ప్రక్కగా లాగడంతో బండి ప్రక్కకి పడి ఎడ్లు కూలబడి సిమెంట్ బస్తాలు నీటిలో పడిపోయాయి. రత్తయ్య షావుకారు ఏమంటాడో అని ఎదుపుముఖం తోనే అతి కష్టం మీద ఎడ్లని ముందు విప్పి లేచిన్తరువాత మల్లీ బండికి కట్టాడు. అక్కడ చేరిన జనం లో ఒకతను వీన్ని చూసి ఎందుకంత . కంగారు పడుతున్నావు సిమెం టే కదా పోత అన్నాడు. " మా షావుకారు చంపుతాడు సార్ మూడు సిమెంట్ బస్తాలు ఖరీదు వసూలు చేయడం కాకుండా, పని లో ఉంచుతాడో లేదో నమ్మకం లేదు" అన్నాడు ఏడుపు ముఖం తో . మీ షావుకారికి 'నష్టం లో లాభం' చూపించు. వసూలు చేయడం అటుంచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఇంటికి చేరగానే ముందు మీ షావుకారు తో " అయ్యా బండి ఎడ్లు సిమెంట్ తో సహా కాలవలో పడ్డాయి " అని చెప్పి కొంచెం ఆగు. ఆ తర్వాత మీ షావుకారు కంగారు పడడం అవగానే ' బండిని ఎద్దులకి ఏమి అవకుండా బయట పడ్డం సార్ , సిమెంట్ మాత్రం పోయింది అని చెప్పు." అని సలహా ఇచ్చాడు. రత్తయ్య షావుకారు దగ్గర కి వెళ్ళగానే అలాగే మొదట చెప్పగానే షావుకారు గయ్యి మని లేచి, కొత్త ఎద్దులు బోల్డు డబ్బు పెట్టికోన్నాము కొంప ముంచావు కదరా అని అరవడం మొదలు పెట్టాడు. మనవాడు ఇచ్చిన సలహా ప్రకారం. లేదు బాబయ్య అంటూ రెండో భాగం చెప్పాడు. అది వినగానే షావు కారు తేరుకుని నవ్వు ముఖంతో పోనీలే సిమెంట్ పోతే పోయింది బండి ఎడ్లు బాగున్నాయి కదా " అని సంతోష పడ్డాడు. రాఘవ ఇది ముగించ గానే నాకు ఫ్లాష్ అయ్యింది

" అమ్మ మూర్తి! బండి ఎడ్లు బదులు పదికోట్లు పెట్టావా నాయనా !. అసలు వాళ్ళు తగ్గించింది రెండు కోట్లే అన్నమాట" అనుకున్నా.
రాఘవ నవ్వుతూ " మీరు గమనించి ఉండరు కాని ప్రతి ఏడు ఇది మామూలే సార్. మేం చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాం" మీకు తెలియనట్టే ఉండండి సార్ . గవర్నమెంట్లో పని వాడు తప్ప ఎవరూ అంత బాగా చేసుకు రాలేరు" అన్నాడు "అలాగే" అన్నాను 'ఇదేదో బాగుందే అనుకుంటూ".

బందర్ లో రాఘవ ని ఆఫీసు లో వదిలి, తిరిగి వచ్చేటప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తానని 'ఈఈ' కి చెప్పమని, కుమార్ ని తాత గారు ఊరు పొమ్మన్నాను . చిన్న మావయ్య ఇంటికి చేరే టప్పటికి సాయంత్రం ఏడయింది . మావయ్య అత్తయ్య అరుగు మీదే ఉన్నారు. ఏమిటి ఇద్దరూ అరుగు మీదున్నారు? అన్నాను. లోపలి కి వస్తూ.ఏమీ లేదయ్యా 'బృంద ఇంకా కాకేజీ నుంచి రాలేదు . ఇవాళ రామం వెళ్ళలేదు ఈబాటికి వచ్చేసేయాలి. స్కూటర్ తీసుకు వెళ్ళింది . అందుకు కొంచెం కంగారు."

" దానికి స్కూటర్ వద్దు, బస్సు లో వెడితే చాలంటే . తల్లీ కూతుళ్ళు స్కూటర్ కొనేదాకా నిద్దరోలేదు. " అన్నాడు మావయ్య రోడ్డు కేసి చూస్తూ.

"నన్నంటారేం మీరే దానికి గారం ఎక్కువ పెట్టారు " అంది లోపలి కి వెళుతూ.. నేను మావయ్యని కబుర్లలో పెట్టాను కొంచెం టెన్షన్ తగ్గిద్దామని. ఇంతలో రామం, బృందా ఇద్దరూ స్కూటర్ మీద వచ్చారు. " టి " జంక్షన్ దగ్గర ఫ్రెండ్స్ తో హస్కేస్తోంటే తీసుకు వచ్చాను" అన్నాడు రామం ఇద్దరూ బాగా పెద్దయ్యారు. ఇద్దరూ కూడా, కార్పోరేట్ విద్యల ధర్మమా అని దగ్గర లోనే ఇంజినీరింగ్ చేస్తున్నారు. ఇంటి నుంచే వెళ్లి రావడం చాలా కన్వీనిఎంట్ గా ఉందన్నాడు మావయ్య . మర్నాడు వాళ్ళ వ్రతం అంతా చూసి ఆ మర్నాడు మావయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని బయలు దేరాను. అక్కడున్నంత సేపూ రామం నన్ను'చిన్నబావ' అంటూ నన్నువదల లేదు. బాగా దగ్గరయ్యాడు
బందరులో పని ముగించుకుని నేను హెడ్ క్వార్టర్స్ వచ్చేసాను. ఎం డి ని కలిసి బందర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చి. సబ్సిడీ బడ్జెట్ గురించి కూడా చెప్పాను. పదికోట్లు కట్ పెట్టారని . ఆయన వర్రీ అవడం మొదలెట్టగానే " ఎలాగో మానేజ్ చేసి రెండు కోట్లు మాత్రం కట్ అయ్యేఅలా చూసామన్నాను. మూర్తి ని తలుచుకుని . రెండు కోట్లయితే ఫరవా లేదు లెండి, బాగా మానేజ్ చేసారు అన్నాడు మెచ్చుకుంటూ. టూర్ రిపోర్ట్ వేరే పంపుతానని చెప్పి వచ్చేసాను

రెండు సంవత్సరాలు ఢిల్లీ లో డెపుటేషన్ మీద పని చేసి మళ్ళీ డ్యుటీ లో చేరడానికి హైదాబాద్ నిన్ననే వచ్చాను . సుందరి, పిల్లలు రెండు నెలలు ముందే వచ్చేశారు . రాగానే ఎండి కి ఫోన్ చేసి మర్నాడు చేరుతున్నాను అని చెప్పాను. " వేరి గుడ్ జాయినింగ్ టైం తరవాత వాడుకున్డువు గాని రేపే వచ్చెయ్యి. చేరగానే నువ్వు అర్జెంట్ గా 'ఎస్ఈ' ని తీసుకుని ని రెండు రోజులు కడప వెళ్లి రావాలి. అక్కడ ఈ మధ్యనే కట్టిన అఫ్ఫీస్ బిల్డింగ్ బాగా క్రాక్స్ ఇచ్చిందట.స్టాఫ్ వర్రీ అవుతున్నారు. రిపోర్ట్ కావాలి " అన్నాడు నాకు ఛాయిస్ ఏమీ ఇవ్వకుండా. "సరే సార్ అన్నాను" సుందరి రియాక్షన్ ఆలోచించుకుంటూ. " నిన్నే కదా వచ్చారు . మళ్ళీ అప్పుడే రెండు రోజులు క్యాంపు ఏమిటి?" అంటుంది.

కాఫీ అందిస్తుండగా అన్నాను " రేపు చేరగానే ఓ వారం రోజులు కడప, కర్నూలు క్యాంపు వేసాడు మా ఎండి అన్నాను. రియాక్షన్ కి ప్రిపేర్ అవుతూ.

" నిన్నే కదా వచ్చారు . మళ్ళీ అప్పుడే వారం రోజులు క్యాంపు ఏమిటి?" అంది అప్ సెట్ అయి.

"నేను అదే చెప్పి "చచ్చి రెండు రోజులకి ఒప్పించాను అన్నాను " మూర్తి ని తలుచుకుంటూ.

"రెండురోజులయితే పరవా లేదు లెండి" అంది కాస్త మూడ్ మార్చుకుని. ఇంతలో ఫోన్ రింగ్ అయితే సుందరిని ఎత్త మన్నాను. ఆవిడ ఫోను ఎత్త్హి " ఊ చెప్పు "అంటూ బెడ్ రూం లోకి వెల్లింది . అలా వెళ్లిందంటే వాళ్ల అక్క రాజ్యం గారు కాని, మా చిన్న అక్క లావణ్య కాని అయ్యుండాలి. అంటే ముఫై నుంచి నలభై నిమిషాలు ఇన్కమింగ్ కాల్స్ బంద్.

ఇంచుమించు గంట తర్వాత వచ్చింది. ఏమిటి విశేషం అంతసేపు ? అన్నాను. ఏదో ఉందని ముఖ కవళికలు చెబుతున్నాయి.
'' మీచిన్న మావయ్యగారి బృంద ఎవరో ఇతర మతం కుర్రాడిని పెళ్లి చేసుకుందట.

"అయ్యో! అదేమిటి? అన్నాను ? నిజం గా షాకింగ్ న్యూసే ! చిన్న మావయ్య తట్టుకోగలడా అనిపించింది. లాస్ట్ టైం వాళ్ళ ఊరు వెళ్ళిన తరువాత మధ్యలో ఓమాటు చిన్న అన్నయ్య కొడుకు పెళ్లి లో అందరూ కలిసాము. అప్పుడు తెలిసింది -బృంద, చెన్నై లోనూ, రామం కోచిన్ లోనూ పని చేస్తున్నారని. ఇద్దరూ సాఫ్ట్ వేర్ కంపనీ లలో పనిచేస్తున్నారని తెలిసింది సుందరి చెప్పిన వివరాలు బట్టి లేటెస్ట్ ఏమిటంటే :-

"నాలుగు నెలల క్రితం ఎవరో కుర్రాడిని ఇంటికి తీసుకు వచ్చి, ఆఫీసు లో కోలీగు అని పరిచయం చేసిందిట . ఎ జాతో ఏమిటో అని అరుగు మీద కుర్చీ బల్లా వేసి భోజనం పెట్టారట. వీళ్ళకి అనుమానం వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మీ మావయ్య గుళ్ళోకి తీసుకు వెళ్లి ఒట్టు కూడా వేయించు కున్నారుట చెప్పకుండా ఏమీ చేయవద్దని . తరవాత మీ అత్తయ్యకి చెప్పిందిట ఫోన్లో ఫలానా మతస్తుడని ' . ఉద్యోగం మానిపించి తీసుకువచ్చేద్దామనుకుంటూ ఉంటె టే ఓ నాలుగు రోజులు ఫోన్లో దొరక లేదట. మీ మావయ్యగారు చెన్నై వెళ దామనుకుంటుంటే మీ అత్తయ్య కి ఫోన్ చేసి. పెళ్లి చేసుకున్నాం, క్షేమం గానే ఉన్నాను వెతక వద్దని చెప్పిందిట. కుర్రాడి మతం తెలియగానే మీ మావయ్య గారు కళ్ళు తిరిగి పడి పోయి రెండు రోజులు మంచం లో ఉన్నారుట. రామం వచ్చి మీ మిగతా మావయ్యలకి చెప్పి పోలీసు సహాయం తో వెనక్కి తీసుకు వచ్చేద్దామని ప్రయత్నిస్తున్నారట."

ఆ తరవాత,సుందరి, మా చిన్నక్క లావణ్య ఫోన్లో తరుచు ఇదే డిస్కషన్. ఇన్ కమింగ్ కాల్స్ కష్టమయి పోయాయి. ఓ మాటు మా చిన్నక్కయ్య కొడుకు అమెరికా నుంచి నా సెల్ కి చేసాడు. " ఏమిటి మావ్వయ్యా మా లాండ్ లైన్ మీ ల్యాండ్ లైను ఎప్పుడూ బిజీ గా ఉంటున్నాయి? అని. నేను సంగతి చెప్పాను. " ఓహ్! అదా రెండు ఆకలి గా ఉన్న సింహాలికి జింక దొరికిందన్న మాట " అని జోక్ చేసాడు

నాకు నిజంగా చిన్న మావయ్య మీద జాలేసింది. ఎలా తట్టుకో గలడు ఈ షాక్ అని. అంత ఆచారంగా ఉండేవాడు, కూతురి జీవితాన్ని మాంసం తినే ఇతర మతం వ్యక్తి తో ఊహించు కుంటూ నరకం అనుభవిస్తూ ఉండచ్చు. నాకే ఊహించుకుంటే చాలా బాధ గా ఉంది. ఆయనకీ ఎలా ఉందొ ? . ఎందుకంత తొందర పని చేసింది బృంద? పర్యవసానాలు ఊహించిందా?

పది రోజుల తరువాత రామం తో మాట్లాడితే వాడు ఇంకొన్ని విషయాలు చెప్పాడు. ఆ కుర్రాడు , బృంద కంపెనీ కిఓ ప్రాజెక్ట్ పని మీద ఏడాది కింద వచ్చాట్ట , అప్పటి నుంచీ వీళ్ళకి స్నేహం , మూడు నెలల క్రిందే ఇద్దరికీ ఒకే కంపనీ లో జాబ్ వచ్చింది , ఇక్కడ రిసైన్ చేసి కొత్త కంపనీ లో చేరడానికి నిర్ణయించుకుని , మధ్యలో పెళ్లి చేసుకున్నారు. .రిజిస్త్రార్ ఆఫీసు లో పెళ్లి అయినతరువాత ఇద్దరూ ఎక్కడికి వెళ్ళారో ఫ్రెండ్స్ కి తెలియదు. బహుసా కేరళ లో అతని ఊరికి వెళ్లినట్టు సమాచారం. ఎక్కడున్నారో చెప్పకుండా అప్పుడప్పుడు బృంద మాత్రం అత్తయ్యకి ఫోన్ చేసి బాగానే ఉన్నానని చెప్పి ఫోను పెట్టేస్తోందట.

ఓ నెల తరవాత సుందరి ద్వారా తెలిసిన విషయాలేమంటే, వాళ్ళిద్దరూ చెన్నై వచ్చి జాబ్ లో చేరడం, ఆఫీసు కి దగ్గరగానే ఫ్లాట్ తీసు కోవడం, రామం చెన్నై బ్రాంచి కి బదలీ చేయించుకుని దగ్గర లోనే ఫ్లాట్ తీసుకోవడం వగైరా. నార్త్ లో ఇటువంటి పెళ్ళిళ్ళకి కొందరు పేరెంట్స్ కన్నవాళ్ళన్న విషయం కూడా చూడకుండా దయా దాక్షిణ్యాలు లేకుండా చంపుకోవడాలు రోజూ పెపెర్లో చూస్తున్నా, దక్షిణా ది లో అలాంటి రియాక్షన్ తక్కువ. మావయ్య మాత్రం ఇంకా దానిని వెనక్కి తెచ్చేయాలని చూస్తున్నాట్ట. సాధ్యమయే పనేనా అనుకున్నా.

రెండు నెలల తరువాత రామం ఆఫీసు పని మీద హైదరాబాద్ వచ్చి కలిసాడు బృందా వాళ్ళూ బాగానే ఉన్నా, మావయ్య తిప్పుకో లేక పోతున్నాట్ట. రాత్రుళ్ళు నిద్ర ఉండటం లేదట. సడ్డెన్ గా రాత్రి లేచి తల గోడక్కోట్టుకోడం వంటి చేష్టలు చేస్తున్నాట్ట. కాస్త రిలీఫ్ ఉంటుందని తీర్థాలు తిప్పినా లాభం లేకపాయింది. బాగా నీరసించి పోయాట్ట. "ఇలాగే ఉంటే నాన్న ఏమయి పోతాడో అని భయం గా ఉంది బావా " అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నాకూ అలాగే అయ్యింది.

"వాళ్ళు హాపీ గానే ఉన్నారు కదా!. మీ నాన్న ఊళ్ళో వాళ్ళగురించి, బంధువుల గురించి ఎక్కువ అల్లోచిస్తున్నాడనుకుంటా" అన్నాను

ఇంతలో మూర్తి తలుపు కొట్టి లోపలి వచ్చి " సార ఓ ఫైల్ డిస్కస్ చేయాలి" అని రామాన్ని చూసి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు

మూర్తి ని చూడగానే నాకు. సడెన్ గా ఓ ఆలోచన వచ్చింది. "ఒరేయి నేనో సలహా ఇస్తాను ఆ ప్రకారం చెయ్యి. వర్క్ అవుట్ అవ్వచ్చని నా నమ్మకం. చూద్దాం. అవక పోయినా మనకి నష్టం ఏమీ లేదు" అని ఏంచేయాలో వివరం గా చెప్పి పంపించేస్సాను.

పదిహేను రోహులు తరువాత నేను ఓ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోపేపర్ చదువు కుంటూ ఉండగా , ఫోను రావడం ఫోన్ తీసుకుని సుందరి బెడ్ రూము లోకి వెళ్ళడం చూసాను. మళ్ళీ పేపర్ లో పడి ఆ విషయం మరిచాను. ఓ అర గంట తరువాత సుందరి వచ్చి పేపర్ లాక్కుని, "మీ రామం ఎం చేసాడో విన్నారా ?" అంది "ఎమయింది" అన్నట్టు చూసాను?

ఓ రోజు సడెన్ గా మీ మావయ్య గారికి ఫోన్ చేశాట్ట. బృందా వాళ్ళూ ఉంటున్న అపార్ట్మెంట్ బ్లాక్ లో ఓ ఫ్రెండ్ రామానికి ఫోన్ చేసి " మీ చెల్లెలు అపార్ట్మెంట్ దగ్గర చాలా జనం మూగారు. ఏమిటని ఎవరినో అడిగితే, ఆ ఫ్లాట్ లో అమ్మాయి ఆత్మహత్య చేస్కుందని చెప్పారు. నాకు వెళ్ళడం భయంగా ఉంది నువ్వు త్వరగా రా " అని ఫోన్ చేశాట్ట. వీడు అక్కడికి వెళ్లేముందు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి సంగతి చెప్పి వెంట్టనే వచ్చేయ్యమన్నాట్ట. వీళ్ళు లబో దిబో మని కారు లో బయలు దేరిన అరగంటకి మళ్ళీ ఫోన్ చేసి , కంగారు పడకండి ఆ అమ్మాయి బృంద కాదు అన్నాట్ట. అంత క్రితమే రెండు రోజులు ముందు బృంద వాళ్ళు ఫ్లాట్ మారి ఇంకో చోటకి మారారట. కొత్త గా వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదట.ఆ సంగతి రామానికి తెలియక కంగారు పడ్డాట్ట.మీ మావయ్య గారు వార్త రాగానే కారు ఎక్కుతూనే చాలా బాధ పడ్డారట. ఎక్కడో అక్కడ హ్యాపీ గా ఉందని వదిలేయకుండా, ఇన్నాళ్ళూ దాని ముఖం చూడకుండా దాన్నిచాలా బాధ పెట్టాము అని ఒకటే ఏడుపు ట. బృంద . కి ఏమీ కాలేదని తెలిసాకా పూర్తి గా మారి పోయారట. ఎవర్ని కట్టుకుంటే ఏమిటి ? పది కాలాల పాటు చల్లగా ఉంటె అదే చాలు అని అనుకున్నారట. అప్పుడే చెన్నై వెళ్లి బృంద ఉన్న ఇంటికి వెళ్లి కలిసి రెండు రోజులు అక్కడ హాప్పీ గా గడిపి వచ్చారట. రామాన్ని వాళ్ళకి ఏమి కావాలన్నా చూసుకో మన్నారట" ఏక తాటిని మొత్తం చెప్పేసింది.

లక్ష పోటేన్సి మందు పనిచేసిందన్నమాట అనుకున్నా మూర్తి ని మరో మాటు తలుచుకుని.కథ ఇక్కడ ముగించేయ్యచ్చు గానీ, అ తరువాత రెండు నెలలకి జరిగిన చిన్న ఘటన చెప్పి ముగిస్తే బాగుంటుం దనుకుంట. మూడు రోజులు చిత్తూరు ఆఫీసు పని మీద వెళ్లి తిరిగి బయలు దేరదా మనుకుంటుంటే,సుందరి ఫోను చేసింది . తను వాళ్ళ అన్నయ్య వాళ్ళతో తిరుపతి వస్తున్నానని, నేను కూడా అక్కడికి వస్తే నాతో పాటు తిరిగి తనూ వస్తా నని.

నేను తిరుపతి చేరుకునేటప్పటికి రాత్రి ఏడయింది. పద్మావతి టెంపుల్ దగ్గర ఉన్నాము అక్కడికి రమ్మని ఫోన్ చేస్తే తిన్నగా అక్కడికి చేరుకున్నాను .

నేను అక్కడికి చేరుకునేటప్పటికి అందరూ బిక్క మొహాలతో ఉన్నారు. ఏమయిందని కంగారుగ అడిగాను. ఏడుపుకు తక్కువగా, గుళ్ళో దొంగలు ఎక్కువ ఉన్నారని ఎవారో చేబోతే నగలు మూట కట్టి హ్యాండ్ బాగ్ లో పెడితే క్యూ లో రష్ లో బాగ్ కట్ చేసి నగలు కొట్టే శా రట. సుందరికి నగల మీది ఎంత అటాచ్మెంట్ ఉందొ గుర్తుకు వచ్చి చాల వర్రీ అయ్య. ఇంతలోకి నా మొహం లోకి చూసి అదృష్టం బాగుందండి రెండురుమాళ్ళలో కట్టిన వాటిలో ఉంగరాలుమాత్రమే చిన్న రుమాలు మూటే పోయింది మిగతావి పోలేదట అని చెప్పగానే ఊపిరి పీల్చుకున్నాను. సమయానికి మీ అఫీసులో పనిచేసే మూర్తి గారు కనబడి పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చి సహాయం చేసాడని చెప్పగానె, తిరుపతి ప్రయాణానికి మూర్తి శలవు తీసుకోడం గుర్తుకు వచ్చింది. వెంటనే ఇంకోటి కూడా ఫ్లాష్ అయ్యిన్ది. ఎలా పోయాయని చెప్పాలో వాడే సలహా ఇచ్చి ఉంటాడని. అమ్మ మూర్తి ! ఇంట్లో ఇంక అది ప్లే చెయ్యడానికి వీలు లేకుండా చేసావు కదయ్యా అనుకున్న్నా

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు