గోదావరి నది తీర ప్రాఒతంలో దండకారణ్యం ఉండేది. ఆ అరణ్యంలో అనేక జంతువులు స్వేచ్చగా తిరుగుతూ జీవనం సాగించేవి. ఆ అడవిలోనే ఉంటున్న ఒక ఎలుగు బంటి పేరు పోతి. పోతి స్వభావం చెడ్డది. చిన్న జంతువుల్ని హింసించేది. పనులు చెప్పేది. మాట వినక పోయినా, ఎదురు తిరిగినా సహించేది కాదు.
ఆ అడవికి కొత్తగా వచ్చింది చెవుల పిల్లి చింకీ. పెద్ద మర్రి చెట్టు నీడలో చిన్న నివాసం పెట్టుకుంది. చెట్టు మీదున్న పక్షులతో స్నేహం చేసింది.
ఒక రోజు చింకీ ఆహారం కోసం వెళ్తుండగా కొంత దూరంలో పోతి ఒక మేక పిల్లని ఏడిపించడం కనబడింది. తన ఒళ్లంతా అంటుకున్న బురదను శుభ్రం చేయమని పోతి అడిగితే , మేక పిల్లేమో “మా అమ్మ కోసం వెతుకుతున్నా. మళ్ళీ వచ్చి చెప్పిన పని చేస్తా” అఒది.
తరువాత ఏమి జరుగుబోతోందో అని పొదలో నక్కి చూసింది చింకీ.
మేక పిల్ల మాటలు వినిపించుకో లేదు పోతి. “నేను చెప్పిన పని చెయ్యకపోతే గోళ్ళతో కొట్టి చంపేస్తాను” అని బెదిరించి తన పని చేయించుకుంది పోతి.
మేక పిల్ల వెళ్ళి పోగానే అక్కడే చెట్టు మీదున్న కోతి పిల్లని దగ్గరకు పిలిచి, తన ఒళ్లంతా పేలు పట్టాయని, వాటిని ఏరమని అడిగింది పోతి. “నాకు ఆకలిగా ఉంది. అమ్మ పాలు త్రాగి మళ్ళీ వస్తా” అంది కోతి పిల్ల.
కోతి పిల్ల మాటలు వినకుండానే “నా మాట వినక పోతే మీ అమ్మను చంపేస్తా. పాలు త్రాగడానికి అమ్మ ఉండదు నీకు” అని బెదిరించింది పోతి. కోతి పిల్ల ఏడుస్తూనే పోతి చెప్పినట్టు చేసింది.
పోతి ప్రవర్తన చూసిన చింకీ భయంతో నిలువెల్లా ఒణికి పోయింది. వెనక్కి వెళ్లి పోయి చెట్టు మీదున్న పక్షుల్తో చూసిన విషయం చెప్పింది. చెట్టు మీదున్న పక్షులు “ఆ మాత్రం దానికే అంత భయమా? ఇంకా పెద్ద ఘోరాలు చూసాము” అన్నాయి తేలిగ్గా.
చిలుక మాత్రం ‘పోతి గొప్ప దుర్మార్గుడు. చిన్న జంతువుల్ని ఎప్పుడూ ఏడిపిస్తాడు. ఒక సారి ఒక లేడి పిల్ల తన మాట విన లేదన్న కోపంతో చాలా కాలం పాటు బాధలు పెట్టాడు. పోతితో జాగ్రత్తగా ఉండు. అసలే అడవికి కొత్తగా వచ్చావు. పొరపాటున కూడా పోతితో విరోధఒ పెట్టుకోకు” అంది.
చిలుక మాటలు చింకీ మనసులో బలంగా నాటుకు పోయాయి. ‘పోతికి ఎదురు పడకుండా ఉండడం ఎన్నాళ్ళో వీలు పడదు. పోతికి ఎదురు తిరిగితే వాడేమో బ్రతక నివ్వడు. అలా జరగకుండా ఉండాలంటే పోతితో స్నేహం చేస్తే సరి పోతుంది” అనుకుంది చింకీ. పోతితో స్నేహం చెయ్యాలంటే ఏమి చెయ్యాలో బాగా ఆలోచించింది.
తర్వాత రోజు పొద్దున్నే కొన్ని రకాల దుంపలు, చెరుకు గడలు మూట కట్టుకుని పోతిని కలసింది చింకీ. తాను కనబడితే పారిపోయే వాళ్ళే తప్ప కానుకలతో ఎదురొచ్చే వారిని చూడలేదు పోతి. తన స్నేహం కోరి వచ్చానని చింకీ చెప్పగానే సరే అంది. ప్రతి రోజూ చెరకు గడలు, దుంపలు, తేనె పట్టులు సేకరించి పోతికి ఇచ్చేది చింకీ.
చింకీని ఇబ్బంది పెట్ట లేదు పోతి.
పోతిని కలిసి వెనక్కి రాగానే తమ స్నేహం గురించి పక్షులతో గొప్పగా చెప్పేది చింకీ. పోతితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమే అనేది చిలుక. చిలుక మాటలను తేలికగా కొట్టి పారేసేది చింకీ. “మా స్నేహాన్ని చూసి ఓర్వ లేక అలా అంటోఒది” అనుకునేది చింకీ.
ఒక సారి చింకీకి జ్వరం వచ్చి మూడు రోజులు వరుసగా పోతిని కలవలేదు. చింకీ రావడం మానేసరికి పోతికి గొప్ప కోపం వచ్చింది. చెవుల పిల్లి చెవులు పట్టుకుని గట్టిగా తిట్టాలని కోపంతో బయల్దేరింది పోతి.
పోతి రాకను దూరం నుండే చూసిన చింకీ సంబరపడిఒది. తనని పరామర్శించడానికే వస్తోంది అనుకుంది. తన ఆరోగ్యం బాగా లేని సంగతి చెప్పి, కలవ లేనందుకు క్షమాపణ అడిగింది చింకీ. పోతికి కోపఒ పోయి మామూలుగా మాట్లాడింది.
అంతలో అక్కడ ప్రాకుతున్న చీమల దండు మీద పడింది పోతి దృష్టి. వాటిని చూడగానే పోతికి ఆకలి గుర్తొచ్చింది. చీమల్ని తిని కడుపు నింపుకోవాలని వాటి వెంట పడింది. పోతి నుండి తప్పించు కోవడానికి చీమలు అటూ ఇటూ చెదురుతుంటే వాటి వెనుక పరుగెత్తింది పోతి. పోతి వేసిన చిందులకు చింకీ ఇల్లు నేల మట్టం అయింది.
జ్వరంతో కదల లేని స్థితిలో ఉన్న చింకీకి ఉన్న ఇల్లు కాస్తా కూలి పోయింది. ఎక్కడ తల దాచుకోవాలో తెలియక ఏడుపు మొదలు పెట్టింది చింకీ.
చెట్టు మీద నుండి జరిగింది చూసిన చిలుక ‘చెడ్డ వాళ్లతో విరోధఒ, స్నేహఒ రెండూ మంచివి కావు. బొగ్గుల్ని వేడిగా ఉన్నప్పుడు తాకితే చేతులు కాలతాయి. చల్లగా ఉన్నప్పుడు తాకితే చేయంతా మసి చేస్తాయి. పోతితో స్నేహఒ కూడా అలాంటిదే. పోతి పెట్టే కష్టాలు తప్పుతాయని స్నేహం చేసావు. అయినా నీకు ఇబ్బంది తప్పలేదు” అంది. తన తప్పేమిటో అప్పటికి బోధ పడింది చింకీకి. పశ్చాత్తాప పడింది చింకీ.