మారిన మజిలీ - హైమాశ్రీనివాస్.

marina majilee

" ఓరోరీ! రామారావ్ ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకెణ్ణాళ్ళకు కనిపించావురా! ఆ రింగుల క్రాఫేదీ! కోర మీసమేదీ! చర్మపు నిగారింపేదీ! ఇలా అయ్యావేమోయ్ ? ఛ్చో ఛ్చో ఛ్చో ఛ్చో ఛ్చో . టీ.వీ చూడవా? యాడ్స్ తెలీదా? ఎన్ని రకాల లేపనాలూ, నూనెలూ, ఇంకా ఎన్నెన్నో చెప్తునారు చూడట్లేదా! పొడుగు పెరిగేందుకు మందూ, లావు వచ్చేందుకు మందూ..ఇంకా "

" అంటూ రామారావును ఊపేస్తూ వాక్ ప్రవాహం సాగిస్తున్న వామన రావును ఆపి "నీ ధోరణి మాత్రం మారలేదోయ్! అదే ధోరణి. అదే వాగుడూ, అదే రూపూ.! నీ రూపం మాత్రం మారలేదుటోయ్ ఆ నల్లని జుట్టేదీ? ఆ గుబురు మీసమేదీ? ఆ మెరిసే కంటి చూపేదీ? ఈ సోడా బుడ్డి కళ్ళాద్దాలేంటో? ఈ బాన పొట్టేంటో! వయస్సు ప్రభావమోయ్ వయస్సు ప్రభావం? నీకైనా నాకైనా !" అన్నాడు రామారావు..
"అద్సరే ఇంతకీ ఎక్కడ ఉంటం? నీవెక్కడున్నా సరే ! ఇంద.. నా ఫోన్ నెంబర్ రాసుకో “ " ఎక్కడ వ్రాసుకోను? పెన్నూ లేదు, పేపరూ లేదు. ఊరికే అలా నడుచుకుంటూ మార్నింగ్ వాక్ కు వచ్చాను."

"నడుచుకుంటూ కాక మార్నింగ్ వాక్ కు ఎలా వస్తారోయ్! ఎగురుకుంటునా? ఐనా అలా ఎగిరే వయస్సా ఏంట్రా మనదీ !? మరేం కంగారు లేదు గానీ నే చెప్పింది విను. నవ గ్రహాలను చుట్టి, అరిషడ్ వర్గాలు వదలి, త్రిమూర్తులను దర్శించి, ద్వి విధాత్మలను గుర్తించి, పంచభూతాలను స్మరించి, పూర్ణతత్వాన్ని గ్రహించి, త్రిశాంతులు వచించి , చతుర్వేదాల పేర్లూ తలంచి, అష్ట పుష్పా లతో పూజించి, ముమ్మారు ప్రదక్షిణ గావిస్తే నా ఫోన్ కలుస్తుందిరా!" " ప్రదక్షణాలూ, సుదక్షణలు నాకు పడవని నీకు తెల్సు కదా! ఒరే వామన రావ్! నీ చాదస్తం లేశ మాత్రం కూడా తగ్గలేదురా! నీ ఫొన్ నెంబర్ గుర్తుండదు గానీ పోనీ మీ ఇంటికి దారి చెప్పు " "ఓ అదెంతో సులువురా! అదో ఆ కనిపిస్తున్న చౌరస్తా బస్టాప్ నుండీ ఎడం వైపు వెళితే కల్యాణ మంటపం వస్తుంది. దానికి ఎదురుగా విడాకులిప్పించడం లో సిధ్ధ హస్తుడని పేరు గాంచిన వకీలు వంకర మూతి వాటేశ్వర్రావు గారి ఇల్లు దాటితే, ఒక పెద్ద మూడు గిలకల బావి వస్తుంది.

దాని పక్క నుంచీ తిన్నగా వెళితే ఒక చిన్న పిల్లల హాస్పెటల్ వస్తుంది. దాని పక్క నుంచీ వెళితే కోర్టు వస్తుంది. దాని కుడి వైపు నుంచీ వెళితే ఒక వృధ్ధాశ్రమం, దాని ముందు నుంచీ తిన్నగా వెళితే ...." అని అంటున్న వామన రావును ఆపి, రామారావు " వెధవా! వయసైంది కానీ బుధ్ధి మాత్రం మారలేదురా! ఇదిట్రా నీ ఇంటికి దారి చెప్పే వైనం? " అంటూ ఉగ్రుడయ్యాడు. " నీ బీ.పీ . పెంచుకోకు నాయనా! మరో తేలికైన చిరునామా చెప్తాను సరా! తిన్నగా కళ్ళు మూసుకుని ఇదే మైన్ రోడ్డు మీద మధ్యగా నడుచుకుంటూ రా! నిన్ను జనాలు తెచ్చి మా అల్లుడి కార్పొరేట్ హాస్పెటల్లో వేస్తారు , ఇక్కడికి దగ్గరగా ఉండేది అదొక్కటేలే. అప్పుడు మా అల్లుడ్ని అడిగితే నాకు కబురు చేయగానే మేడ దిగి వస్తాను." అని వామన రావు అనగానే, "తూ వెధవాయ్! పెళ్ళికి వచ్చి చావు మంత్రాలు చదివినట్లు చిర కాల మిత్రుడినీ, వాడి కుటుంబాన్నీ కలవాలనుకుంటే ఇదిరా చిరునామా చెప్పే విధానం . చూస్తాన్రా చూస్తా!" అంటూ కోపంగా పక్కకు తిరిగాడు రామారావు. కోపము నుబ్బును గర్వము – నా పోవక యునికియును దురభిమానము ని - ర్వ్యా పారత్వము ననునివి-- అంటున్న వామన రావు ను ఆపి " ఒరే ! వామనా! నీ పద్య పఠనం మాత్రం మాన లేదన్నమాట! ఇంకా ఎన్ని పద్యాలు నేర్చావురా!" అంటూ మిత్రుని వైపు తిరిగాడు రామా రావు. "ఇంతకూ నీకెంత మంది సంతానం ? ఎక్కడ ఉంటున్నారూ! చెప్పావు కాదురా!? " అని అడిగాడు. “ఈగల్ జాతీయ పక్షిగా ఉన్న దేశంలో ఒకడూ, కంగారూ జాతీయ మృగంగా ఉన్నదేశంలో ఒకడూ ఉన్నారురా! నేను మాత్రం నా నెమలి దేశాన్ని వదలి రానని ఇక్కడే స్వయం విష్ణువు వద్ద ఉంటున్నానురా!

" ఏదీ నేరుగా చెప్పి చావవుగా ! ఇంతకూ మా చెల్లాయ్ ఎలా ఉందీ?"

"బాగానే ఉండే ఉంటుందిరా! నీ చెల్లాయికేంరా హాయిగా వాళ్ళ పుట్టింటి కెళ్ళీ ఉంటున్నాది."

"ఎంట్రా నీవు చెప్పేదీ! నిన్ను వదిలేసి పుట్టింటికెళ్ళిందా? ఎవరున్నార్రా ఇంకా ఆ పల్లెటూర్లో? ఆమె తల్లి దండ్రులు కాలం చేసారని విన్నానే!"

" ఏం, చేస్తే మీ చెల్లాయ్ హాయిగా వాళ్ళమ్మ ఒళ్ళో విశ్రాతి తీసుకోను వెళ్ళి పోయింది, నా మానానికి నన్నొదిలేసి. " గద్గద స్వరంతో అంటున్న వామన రావు చూసి, రామారావు " ఓరినీ! ఇదీనీ ఇలాగుట్రా చెప్పడం? సారీరా! ఐ యాం రియల్లీ సారీ!” అంటూ భుజం తట్టాడు.
“ఉత్తిత్తీ సారీ లేనా? కాస్త కాఫీ పోయించేదమన్నా ఉందా! పద నేనే పోయిస్తా ఆ కెఫే హౌస్ కెళదాం" అంటూ దారితీశాడు వామనరావ్.
" నీకిక్కడ కాలం ఎలా గడుస్తున్నదిరా!" నడుస్తూనే అడిగాడు రామారావు .

" ఏముందిరా! ప్రొద్దుటే నుదుట కన్నున్న వాడ్ని చూస్తాను. ఆ తర్వాత లంకా దహనం చేసిన వాడ్ని పదకొండు చుట్లు చుడతాను. ఆ తర్వాత క్రియా శక్తిని దర్శించి , అన్నపూర్ణా తల్లి దయ కోసం ఇల్లు చేరతాను. ఆ తర్వాత ఏడు కట్ల వాహనం ఎక్కాల్సిన దాన్ని కాస్త సేపు పర్యంకం మీద పెట్టి, 32 తెల్ల మెట్ల గుహలో తేనీరు పోసి, ఊరు పొమ్మంటున్న వారి వద్ద కెళ్ళి యుధ్ధ భూమిలో సద్భోధ పఠించి, ఇచ్ఛా ప్రసంగాము గావించి, ఇదో ఇలా జామాత గృహం చేరుతాను."

" అబ్బా నీతో వచ్చిన తంటానే ఇది మొదటి నుంచీ , ఏదీ సవ్యంగా చెప్పి... '

"చావను. చస్తే మా ఆవిడదగ్గర కెళ్తే చక్కగా చక్ర పొంగలీ, చక్కెర అరిసెలూ, హోళీగలూ, లడ్డూలూ చేసి పెట్టును. అదేప్పటికో గానీ నీ సంగతి చెప్పవేం? "

"నా సంగతేముందీ ! నీవు తెలుగు పంతులుగా రిటైరైతే నేను గణిత మాస్టారిగా రిటైరై రెండు రెండ్లు నాలుగు చేస్తే, నాలుగు రెండ్లు ఎనిమిదయ్యాయి, మొదటి రెండు లోంచీ ఒకటి మైనెస్సైతే ఆ ప్రధాన సంఖ్య అప్రధానంగా మారి పోయి ఏ సంఖ్యలతో చెలిమి పెట్టుకోక ఏ సరి సంఖ్య చెంతా చేరక ఏకో నారాయణో హరిః అని ఊర్లు పట్టుకు ఉధ్ధరిస్తున్నది. ఆ ప్రధాన సంఖ్య కు మరో ప్రధాన సంఖ్య లేనిదే ఈ ఎనిమిది సంఖ్య లేదు. ఐనా ఈ ప్రధాన సంఖ్య కిప్పుడు గుర్తింపూ గౌరవమూ ఏమీ లేవు. ఏం చేస్తాం చెప్పూ , అందుకే ఇక్కడ కాడు రమ్మంటున్న వాళ్ళాంతా చేరే చోట ఇంత చోటు కోసం వెతుక్కుంటూ వచ్చాన్రా!, నీవేమన్నా అక్కడ కాస్తంత జాగా నా కోసం వెతికి పెడతావా?"అన్న రామారావును ఆశ్చర్యంగా చూస్తూ " ఓరినీ! నీవూ కోడ్ ల్యాం గ్వేజిలో మాట్లాడ్డం ఎప్పటినుంచి మొదలెట్టావురా! రామూ!" "ఎన్నో అడుగులేస్తే వారు వీరవుతారంటారుగా, మరి నీతో ఈ 1800 సెకండ్లు గడిపానాయే ప్రస్తుతానికి అంత మాత్రం మారనా ఏంట్రా రామూ!" " ఒరే ఎన్నాళ్ళాకెన్నాళ్ళకు ఈ పిలుపు విన్నాన్రా! పదరా ఇద్దరం అక్కడే మన చివరి మజిలీ గడుపుదాం కలిసి మెలసీ "అంటూ రామారావును ఆలింగనం చేసుకున్నాడు వామన రావు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు