చెప్పుకోవాలికదా మరీ... - జి.ఎస్.లక్ష్మి

cheppukovali kada mari telugu story

ఇందూ ఈమధ్య మరీ చలాకీగా మారిపోయింది. మామూలుగానే చురుకైంది. ఇవ్వాళ రేపు ఇంతగా మారిపోతున్న చుట్టూ జనాలని చూసి తనకేం తక్కువనుకుంది. ముఖ్యంగా ఇవ్వాల్టి కుర్రజంటలు. ఎప్పుడో... "మొగుడు పెళ్ళాన్ని పేరెట్టి పిలవడమా...!" అని దవడలు నొక్కుకునే రోజులు చూసిన ఇందూ, ఇప్పుడు పెళ్ళాలే మొగుళ్ళని పేరు పెట్టి పిలవడమే కాకుండా ఒకరినొకరు ముద్దుపేర్లు కూడా పెట్టుకుని పిలుచుకోవడం చూసి మురిసిపోయింది.

ఎంచక్కా... ఎంత మంచి రోజులొచ్చాయి... భార్యాభర్తలిద్దరూ ఒకరికోసం ఒకరన్న వారి భావం ఎంతబాగుందీ... అనుకుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈనాటి భార్యాభర్తల్లో ఇందూకి చాలా చాలా నచ్చేసిన విషయం ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం. అది కూడా సర్ ప్రైజ్ అంటూ...

నిజవే కదా.. ఒకప్పుడు "వచ్చే నెల నా పుట్టినరోజండీ... కొత్త చీర కొనుక్కుంటాను..." అని అడిగితే...

"వచ్చే నెల కదా... ఇంకా బోల్డు టైముంది... చూద్దాంలే..." అనడం... తీరా ఆ వచ్చేనెల మర్చిపోవడం… తను ఉడుక్కోవడం... ఇలాంటి అనుభవాలున్న ఇందు ఇప్పటి కుర్రజంటలు ఇద్దరి పుట్టినరోజులూ ఒకరిదొకరు గుర్తు పెట్టుకుని, ఆరోజు సర్ ప్రైజ్ గా వారికి గిఫ్ట్ కొనివ్వడమే కాకుండా ఇద్దరూ బైటకి పోయి ఎంజాయ్ చెయ్యడం చూస్తుంటే... తనెందుకు అలా చెయ్యకూడదూ... అనిపించింది.

అనిపించడవేవిటి... ఆచరించేసింది కూడానూ. వచ్చే వారంలో వస్తున్న భర్త పుట్టినరోజుకి మొట్టమొదటిసారిగా చందూకి తెలీకుండా బజారుకి వెళ్ళి ఒక మంచి షర్ట్ తీసుకుంది. ఎంతో భావజాలంతో వున్న పుట్టిన్రోజు శుభాకాంక్షలు తెలిపే కార్డు వెతికి వెతికి మరీ కొంది.

ఆ రోజు పొద్దున్నే అతనిచేత తలంటు పోయించి, "సర్ప్రైజ్ " ఆంటూ వెలిగిపోతున్న మొహంతో షర్టూ, కార్డూ అతని చేతిలో పెట్టింది.

అలవాటు లేని ఔపోసన అన్నట్టు అదేవిటో అర్ధంకాక తెల్లమొహం వేసుకుని ఇందూ వైపు చూసేడు చందూ.

"ఇవాళ మీ పుట్టిన్రోజండీ. కొత్తషర్ట్ కొన్నాను... వేసుకోండి..." అంది.

ఇందూ మొహంలో ఆనందం చూసిన చందూ మారుమాట్లాడకుండా ఆ చొక్కా తొడుక్కున్నాడు. చొక్కా ఎంత బాగుందో అని మురిసిపోయిన ఇందూ... ఓ థాంక్సు పడెయ్యొచ్చు కదా అని అనుకుంది.

ఇవేవీ అర్ధంకాని చందూ కొత్తచొక్కా తొడుక్కుని, సోఫాలో కూర్చుని, తీరుబడిగా టీవీ చూస్తున్నాడు.

"లేవండి వెడదాం..." అంది ఇందూ అతని దగ్గరకొచ్చి.

"ఎక్కడికి?" ఆశ్చర్యపోయేడతను.

"బైటకి..."

"ఎందుకు..."

"ఎంజాయ్ చెయ్యడానికి.."

"అంటే,,

"అబ్బా, చెప్తాను పదండి..." అంటూ సినిమాకి లాక్కుపోయింది.

ఓ కథంటూ లేకుండా అర్ధంపర్ధంలేని పిచ్చిగెంతులూ, కవాతులూ వున్న ఆ సినిమా చూసేసరికి ఇద్దరికీ తలనొప్పి వచ్చేసింది.

ఇంటికి వస్తూ వస్తూ హోటల్లో భోంచేసేరిద్దరూ. ఇందూ చేతివంట అలవాటైన చందూ ఆ భోజనం అస్సలు తినలేకపోయేడు. ఇందూ అంతే. దొంగాడికి తేలు కుట్టిన పరిస్థితి.

పైకేమీ మాట్లాడకుండా తినేసి, అలసిపోయి ఇల్లు చేరేరిద్దరూ. ఇంటికి రాగానే సినిమా ఖర్చూ, హోటల్ ఖర్చూ ఎంతైందీ చందూ లెక్కలు చూసుకుంటుంటే, ఇందూ ఫోన్ తీసి తన స్నేహితులూ, చుట్టాలకందరికీ ఫోన్లు చేసి, తను చందూ పుట్టిన్రోజుకి యెంత సర్ప్రైజ్ పార్టీ యిచ్చిందో, తామిద్దరూ యెంత బాగా యెంజాయ్ చేసేరో వర్ణించి వర్ణించి చెప్పడం మొదలుపెట్టింది.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ