బలహీనత - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

balaheenatha telugu story

జాదవ్ అంటే రౌడీ!

ఆరడుగుల ఆజానుబాహుడు... కండల వీరుడు. తారు డబ్బాలా నల్లగా నిగ నిగ లాడుతూ వాడి గ్యాంగ్ తో తిరుగుతూంటే ఎదురుపడిన వాళ్ళు వాడి హింసకి బలైపోవలసిందే!

మా ఏరియాలోని ఆబాలగోపాలానికి వాడంటే హడల్. వాడిని చూస్తే గుండె జారిపోతుంది.

ఇహ నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. భయపడేవాళ్ళలో నేనూ ఒకడిని.

రేషన్ షాపుదగ్గరైనా... వీధి కుళాయి వద్దయినా 'కాదేది వాడికడ్డం' అన్నట్టుగా వాడి దాష్టీకానికి గురవుతూంటాం!

ఒకరోజు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాను.

నిజానికి ఈ సమయంలో మా వీధిలో ఎవరూ బయటికి వెళ్ళరు. 'చీకట్లో వాడికెక్కడ దొరుకుతామో?' అని. కాని నా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయింది. సిటీకి వెళ్ళకుండా ఉండలేకపోయాను. ఫ్రెండ్స్ ని రమ్మంటే 'రామంటే రామ'న్నారు. నేను తెగించి వెళ్ళి సినిమా చూశాను గాని. మా ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే భయం ప్రారంభమైంది. 'స్వామీ! వెంకటేశ్వరా నేను జాదవ్ గాడి కంట పడకుండా చూడు. నేను శనివారం ఉపవాసం వుండి గుడికొచ్చి కొబ్బరికాయ కొడతాను' అని మనసులో వేల సార్లు మొక్కుకుంటూ నడుస్తున్నాను. చీకటికన్నా... పురుగు పుట్రకన్నా... దెయ్యాలు భూతాల కన్నా వాడి భయం నాకు ఎక్కువైంది. అవును మరి అవి వాటి జోలికెళితేనే మనకి అపకారం తలపెడతాయి. వాడలా కాదే! అన్నిటి కన్నా క్రూరమైన విషతూల్యమైన వాడు. తలుచుకుని ఆలోచిస్తూ నడుస్తున్న నేను తలెత్తి చూసేసరికి కళ్ళు భయంతో విచ్చుకున్నాయి. నోరు పోడారిపోయింది. గుండె కొట్టుకునే వేగం రెట్టింపు అయింది. ఇవాళ్టితో నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. వెంకటేశ్వర స్వామి కూడా ఏమీ చేయలేకపోయాడు. విధినెదిరించడం ఎవరితరం? కొద్ది దూరంలో లైట్ పోల్ కింద జాదవ్ ఒక్కడూ నుంచుని వున్నాడు. నేను అడుగు ముందుకు పడక భూమి మాగ్నెట్ కి అతుక్కుపోయాను. వాడు నా వంక చూసి నా దగ్గరికి రావడం మొదలెట్టాడు. నన్నేం చేస్తాడు? ఉత్త పుణ్యానికి చంపిపారేస్తాడా? చంపితే ఎలా చంపుతాడు? కత్తితోనా? పిస్తోల్ తోనా? లేక ఒక గుద్దు పొట్టలో గుద్దా? వాడి చేతిలో మాత్రం ఏం లేదు. ఏం చెప్పగలం జేబులో వున్నాయేమో? వాడు కాస్త వేగంగా నా వైపు రాసాగాడు. నాకెందుకో కళ్ళు మూసుకోవడం మంచిదనిపించింది. మూసుకున్నాను.

కొద్ది సేపటికి "అన్నా" అన్న వాడి గొంతు కర్కశత్వంలో కాసింత బేలతనం కలసి వినిపించింది.

నేను కళ్ళు విప్పాను.

'ఫ్లీజ్ నన్నేం చేయకు... నీకు పుణ్యముంటుంది...' అని అనబోయేంతలో..." అన్నా! నేను నీ వెనకాలే వస్తాను నన్ను మా ఇంటికాడ దింపుతావా?" అన్నాడు వణుకుతున్న గొంతుతో.

ఆ కొత్త ట్విస్ట్ కి నాకు ఆశ్చర్యం కలిగింది. 'వీడు కాసేపు నాతో ఆడుకుని ఆ తర్వాత ఫినిష్ చేస్తాడేమో' అన్న ఆలోచన రాగానే మళ్ళీ భయం ఆపాదమస్తకం ఆవహించి చెమట్లు పట్టించింది.

"నేను నిన్నేం చేయనన్నా... ఒట్టు... నన్ను కాస్త మా ఇంటి దగ్గర వదులు చాలు." అన్నాడు.

వాడి ముఖం చూస్తే నాకు కాస్త ధైర్యం చెక్కింది! 'సరే పద' అన్నాను.

మేము నడుస్తూంటే "అవునూ! అందర్నీ గడగడలాడించే నువ్వు ఇలా నన్ను ఇంటి దగ్గర దింపమనడమేంటి?" అడిగాను మరికాస్త ధైర్యం కూడదీసుకుని.

కాస్సేపు 'చెప్పాలా వద్దా' అన్నట్టు తటపటాయించాడు. కాని "అన్నా నేను చెప్పేది నీ గుండెల్లో పెట్టుకోవాలె! ఎవ్వరకి చెప్పొద్దు. ఇప్పట్నుంచి నిన్ను మాత్రం నేను ఏమన. నాకు... నాకు కుక్కలంటే చాలా భయం అవి కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు తీసుకోవాల. నాకు దేనితోటి భయం లేదు ఒక్క కుక్కతోటి తప్ప. అందుకే నాతో పాటు మా వోళ్ళని ఏసుకుని తిరుగుతుంట. ఈ రోజు 'పక్క ఊరిలో పని పడిందిరా రండిరా' అంటే ఒక్కడూ రాలేదు. దాంతో భయపడుకుంటూ అక్కడ పోల్ దగ్గర నుంచున్నా. దేవుడు నిన్ను పంపిండు. అన్నా... పొరబాట్న కూడా ఎవరికీ ఈ విషయం చెప్పకు. మాకేమన్నా సదువులా? నౌకరీలా? మందిమీద బ్రతికేటోళ్ళం." అన్నాడు బిక్కచచ్చిపోయి.

ధైర్యం ఇప్పుడు నన్ను నిలువెల్లా ఆవరించింది. గర్వంగా తల పైకెత్తి దర్జాగా నడుస్తున్నాను. వెనక పిల్లిలా వాడు. చాలు నాకీ తృప్తి చాలు.

వాడిని ఇంటిదగ్గర దింపి ముందుకు కదిలాను వాడోసారి చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని "అన్నా చెప్పింది గుర్తుందిగా..." అన్నాడు.

నేను 'సరే' నన్నట్టుగా చిన్నగా నవ్వి మా ఇంటివైపు అడుగులేశాను.

మరుసటి రోజు ఆఫీసు నుండి వస్తూ ఒక జాతి కుక్కని వాడి ముందు నుండే క్రీగంట వాడి భయాన్ని గమనిస్తూ... మనసులో నవ్వుకుంటూ... ఇంటికొస్తున్నాను. వాడి చుట్టూ వున్న రౌడీ మిత్రులకీ వాడు నన్నేం అనకపోవడం మింగుడుపడడం లేదు.

ఇహ నేను కుక్క నెందుకు కొన్నాననా మీ డౌటు. ఏమో వాడి మనసు ఎప్పుడెలా వుంటుందో ఎలా తెలుస్తుంది? పైగా వాడి బలహీనత కూడా నాకు తెలిసిందాయే! అందుకే నా జాగ్రత్తలో నేనున్నా.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు