మానవత్వం - దినవహి సత్యవతి

manavatvam

రష్మి , చూడగానే “బాగానే ఉంది అమ్మాయి “ అనిపించే అందం అంతకు మించిన తెలివితేటలు . లెక్కలు ముఖ్యాంశంగా ఒక సహ- విద్యా కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది రష్మి . రాఘవరావు జానకమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. రాఘవరావుని ఆయన అన్నదమ్ములు వ్యాపారంలో మోసం చేయటంతో ఆర్థిక ఇబ్బందులలో పడిపోయారు. రాఘవరావుకి “మంచి మనిషి” అని నలుగురిలో పేరు ఉంది. ఎందరో మంచి స్నేహితులు. అందులో కొంతమంది ముందుకొచ్చి కొంత ఆర్థిక సహాయం చేయటంతో ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నారు రాఘవరావు. దానిపై వచ్చే ఆదాయంతో రెండు పూటలా తిండికి లోటు లేకుండా గడిచిపోతోంది . జానకమ్మ భర్తకి చేదోడు-వాదోడుగా ఉంటూ పొదుపుగా సంసారం గడుపుకొస్తోంది .

ఇలాంటి పరిస్థితులలో రష్మి కూడా తన ధ్యాసంతా చదువుపైనే ఉంచి మంచిమార్కులు తెచ్చుకుని తద్వారా కాలేజీ నించి లభించే ఉపకారవేతనంతో చదువుసాగిస్తోంది. అంతే కాకుండా శని ఆదివారాల్లో ఇంటిదగ్గర పదిమంది పిల్లలకి పాఠాలు చెప్తూ తల్లిదండ్రులకి ఆర్థికంగా సహాయ పడటానికి ప్రయత్నిస్తోంది .

గత కొద్దిరోజులుగా అప్పుడప్పుడు నడుముదగ్గర ఉండుండీ నొప్పిగా అనిపిస్తూండటంతో చాలాసేపు కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్తూ ఉండటంవల్ల కావచ్చునేమో అనుకుని రష్మి దానిని పెద్దగా పట్టించుకోలేదు.

రష్మి క్లాసులో మొత్తం 35 మంది విద్యార్థులు. అందులో బాగా అల్లరిచేసేవాళ్ళు ముగ్గురు- ఆదిత్య , విజయ్ , ప్రదీప్ . వీళ్ళకి “ ఆకతాయి మూక “ అని పేరు . క్లాసులో ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నంతసేపు ఏవో అప్రస్తుతమైన సందేహాలు అడిగి క్లాసు సవ్యంగా జరగనీయకుండా అడ్డుపడుతుంటారు. వీళ్ళ వల్ల మిగిలిన అందరికీ సమయం ఎంతో వృధా అవుతున్నట్లు అనిపిస్తుంటుంది.

“క్లాసు అయిన తరువాత వస్తే మీ సందేహాలన్నీ తప్పక తీరుస్తాము” అని ఉపాధ్యాయులందరూ ఎన్నిసార్లు చెప్పినా ఈ ముగ్గురు మాత్రం వాళ్ళ ధోరణి విడలేదు. ఆ కారణంగా ఇటు తోటి విద్యార్థులకే కాకుండా అటు ఉపాధ్యాయులకి కూడా ఇబ్బందికరంగా తయారైంది వీళ్ళ ప్రవర్తన.

వీళ్ళ అల్లరి గురించి ప్రధానోపాధ్యాయుని వద్దకి ఎన్నో ఆరోపణలు వెళ్ళాయి . అలా వచ్చిన ప్రతిసారీ ఆయన వాళ్ళ ముగ్గురిని పిలిచి కఠినంగా మందలించటం కూడా జరిగింది. అప్పటికి బుద్ధిగా “ ఇంక అల్లరి చేయం “ అంటూ వాగ్దానం చేసినా తిరిగి షరా మామూలే వాళ్ళ ప్రవర్తన!!!!. వాళ్ళని కాలేజీలోంచి పంపివేయమనే మనవికి మాత్రం “వాళ్ళ ముగ్గురిని కాలేజీ లోంచి తీసివేయాలంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి” అంటూ తన నిస్సహాయత వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయులు.

ఎందుచేతనంటే “ ఒకటి - క్లాసులో సందేహాలు అడగటం తప్పేమీ కాదు , రెండు – ముగ్గురు మంచి తెలివైన వారు ఎప్పుడూ తరగతిలో మొదటి అయిదు ర్యాంకులలోనే ఉంటారు !!!, మూడు – వాళ్ళు చేసే అల్లరి కానీ , చేసే వ్యాఖ్యలు కానీ శ్రుతిమించలేదు ఇప్పటిదాకా. అలాంటప్పుడు ఏ కారణం చేత వాళ్ళని కాలేజీనించి పంపించివేయాలి? “ ఇదీ ప్రధానోపాధ్యాయుని మీమాంశ .

ఏదేమైనప్పటికి “ఎప్పుడూ క్లాసులో గొడవ చేస్తుంటారని, ఏవో వ్యాఖ్యలు చేస్తూ అందరినీ విసిగిస్తూ ఉంటారని “ రష్మికి కూడా వాళ్ళంటే అకారణమైన చిరాకు , కోపం . అందరిపై వ్యాఖ్యలు చేసినట్లే రష్మి పై కూడా అప్పుడప్పుడు వ్యాఖ్యలు విసిరినా ఆమె వాటిని ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.

పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. పాఠ్య ప్రణాళిక పూర్తి కాలేదని ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంతో రోజూ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆలస్యమవుతోంది. కాలేజీ దగ్గరనించి ఇల్లు సుమారు 2 కి.మీ. దూరంలోనే ఉండటంతో రోజూ నడిచే వెళుతుంటుంది ఇంటికి రష్మి .

ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆలస్యంకావటంతో వడివడిగా నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న రష్మి వెనక మాటల అలికిడి వినిపించటంతో ‘ఎవరా’ అని తిరిగి చూస్తే ఆ ముగ్గురు ఆకతాయిలే!! సైకిళ్ళు నడిపించుకుంటూ , పెద్దగా మాట్లాడుకుంటూ ఎందుకో నవ్వుకుంటూ వెనకాలే వస్తున్నారు . ఒక్కసారి ఎందుకో భయం వేసింది రష్మికి . కనుచివరలనించి చుట్టుపక్కలంతా చూసింది. ‘అమ్మయ్య , జనసంచారం బాగానే ఉంది , ఫరవాలేదు . వాళ్లేమైనా నన్ను అల్లరి చేయటానికి ప్రయత్నిస్తే గట్టిగా సహాయం కోసం కేకపెట్టవచ్చు’ అనుకుంది . దాంతో కొంచం ధైర్యం వచ్చినట్లయ్యింది.

కొంచెం సేపటికి అలికిడి ఆగినట్లై మళ్ళీ తిరిగి చూస్తే ఆ ముగ్గురూ పక్కనే ఉన్న బేకరీలో ఏదో తింటూ కనిపించారు. అదే సమయంలో వాళ్ళు కూడా దేనికో నవ్వుకుంటూ యాదృచ్ఛికంగా రష్మి వైపే చూడటం జరిగింది. తడబడి వెంటనే ముఖం తిప్పేసుకుని నడక వేగం పెంచింది.

‘ఈ మధ్య అప్పుడప్పుడు క్రింది పొట్టలో నొప్పిగా అనిపిస్తోంది . ఆ విషయమే అమ్మతో చెపితే వేడి చేసి ఉంటుందని చెప్పి రోజు చల్ల మజ్జిగ త్రాగిస్తోంది నా చేత . కానీ ఈ రోజు మళ్ళీ ఉదయంనించీ ఎందుకో కడుపులో వికారంగా , నెప్పిగా అనిపిస్తోంది’ అని తనలో తానే అనుకుంటూ నడుస్తోంది రష్మి. ఉన్నట్లుండి వికారం ఎక్కువై వాంతి వస్తున్నట్లైంది . ఇంకో రెండడుగులు వేయగానే ఒళ్ళు తూలినట్లయి ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది. ఆ తరువాత ఒక్కసారిగా పొట్ట క్రింది భాగం గట్టిగా పట్టుకుని ‘అమ్మా!’ అంటూ అక్కడే రోడ్డుపై కూలబడిపోయి బాధతో మెలికలు తిరగ సాగింది రష్మి.

రష్మి ఆక్రందన విని చుట్టుపక్కల జనం కూడా ‘ఏమైందో’ అనుకుంటూ గుమిగూడ సాగారు. ఇదంతా వెనక కొట్లోనించి గమనిస్తున్న ఆదిత్య , విజయ్, ప్రదీప్ లు కూడా గబగబా సైకిళ్ళ మీద రష్మి ఉన్న చోటికి వచ్చి ‘రష్మీ ! రష్మీ !’ అంటూ ఆమె ప్రక్కనే కూలబడి ఆదుర్దాగా “ఏమైంది నీకు? ” అంటూ అడిగారు. బాధతో నోటంట మాట రావటమే కష్టంగా ఉన్న రష్మికి ఆదిత్య వాళ్ళు అడిగినదానికి సమాధానం చెప్పేలోగానే స్పృహ తప్పి పోయింది.

అంతే ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆదిత్య పక్కనే వెళుతున్న ఆటోని ఆపి విజయ్ , ప్రదీప్ ల సహాయంతో రష్మిని ఆటోలోకి ఎక్కించి ‘కాలేజీ దగ్గర ఉన్న ఆదర్శ ఆసుపత్రికి పోనియ్’ అని చెప్పాడు డ్రైవరుకి . విజయ్, ప్రదీప్ కూడా గబగబా పక్కనే పడి ఉన్న రష్మి బ్యాగు, సెల్ ఫోన్ తీసుకుని సైకిళ్ళ పై ఆటోని వెంబడిస్తూ ఆస్పత్రికి వెళ్లారు. ఆదర్శ ఆసుపత్రి దగ్గరకి రాగానే ఆటో డ్రైవరు సహాయంతో రష్మిని చేతులలో ఎత్తుకుని “డాక్టర్ , డాక్టర్ “ అంటూ అరుస్తూ లోపలికి పరుగెత్తాడు ఆదిత్య.

డాక్టరుగారు గబగబా వచ్చి “ ఏంజరిగింది? ఎవరీ ఈ అమ్మాయి? “ అంటూ ప్రశ్నిస్తూనే రష్మిని పరీక్ష చేయసాగారు.

“ఈ అమ్మాయి పేరు రష్మి. మేమంతా ఒకే కాలేజీ . ఈమె మా క్లాస్ మేట్. ఇంటికి వెళుతూ ఉన్నట్లుండి రోడ్డు మీదే స్పృహ తప్పి పడిపోయింది ” బదులిచ్చాడు అన్నాడు .

“రష్మి తల్లిదండ్రులకి తెలియచేయండి . ఈ అమ్మాయికి “అపెండిసైటిస్” అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి. లేకపోతే చాలా ప్రమాదం” అన్నారు ఆయన.

అది విని ఆదిత్యతో పాటుగా అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్, ప్రదీప్ లు మ్రాన్పడి పోయారు. విజయ్ వెంటనే “ నేను రష్మి తల్లిదండ్రులకి ఇంతకుముందే ఫోన్ చేసి తెలియ చేశాను డాక్టర్ గారు. వాళ్ళు బయలుదేరి ఇక్కడికి వస్తున్నామని చెప్పారు.” అన్నాడు.

మాటలలోనే వారిరువురూ అక్కడికి వచ్చారు. వస్తూనే “ మా అమ్మాయికి ఏమైంది డాక్టరుగారు? ఆమెని ఆస్పత్రికి ఎవరు తీసుకుని వచ్చారు? ” అంటూ ఆందోళనగా ప్రశ్నించారు.

“ మేమే రష్మిని ఆస్పత్రికి తీసుకు వచ్చాము అంకుల్” అంటూ ఆదిత్య , విజయ్, ప్రదీప్ లు తమని తాము రష్మి క్లాస్ మేట్స్ గా పరిచయం చేసుకున్నారు. డాక్టర్ గారు రాఘవరావు జానకమ్మలకు రష్మి పరిస్థితి వివరించి “ మీ అమ్మాయికి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి. దానికి తగిన ఏర్పాట్లు చూసుకోండి , నేను ఆపరేషన్ కి సిద్ధం చేస్తాను” అని చెప్పి వెళ్లబోతున్నవారల్లా డాక్టరుగారూ అన్న పిలుపుకి తిరిగి చూశారు.

“ఆపరేషన్ కి సుమారుగా ఎంత ఖర్చవుతుంది” అన్న రాఘవరావు ప్రశ్నకి సమాధానం చెప్పి ఆయన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయారు . డాక్టరుగారి సమాధానం విన్న రాఘవరావుగారు రెండుచేతులతో తలపట్టుకుని పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయారు . జానకమ్మగారు గభాలున వెళ్ళి ఆయన ప్రక్కనే ఆసరాగా కూర్చున్నారు.

ఆదిత్య, విజయ్ ప్రదీప్ లు “అంకుల్?” అంటూ గబగబా ఆయన దగ్గరికి వచ్చి “ఏమైంది” అని ఆదుర్దాగా ప్రశ్నించారు. .

సమాధానంగా జానకమ్మగారు కొంచం తటపటాయిస్తూనే వాళ్ళకి తమ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి తెలియజేసి “ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడనించి తేవాలో మాకు తెలియటంలేదు బాబూ! పోనీ ఎవరైనా స్నేహితులని అడుగుదామంటే వారందరికీ ఇప్పటికే ఎంతో రుణపడి ఉన్నాము. ఇంకా వాళ్ళని ఇబ్బందిపెట్టడం మాకు సుతరాము ఇష్టం లేదు. అందుకే ఏంచేయాలో తెలియక అలా దిగులు పడుతున్నారు ఆయన” అంది.

అంతట ప్రదీప్ “ ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మా నాన్నగారితో చెప్పి రష్మి ఆపరేషన్ కి అవసరమైన డబ్బు నేను ఏర్పాటుచేయిస్తాను” అన్నాడు. మొదట సంశయించినా ఇంక వేరే దారిలేకపోవటంతో తమ అంగీకారం తెలియచేసారు రాఘవరావు దంపతులు .

ప్రదీప్ తన డాడీకి ఫోన్ చేసి విషయమంతా వివరించి చెప్పగానే ఆయన వెంటనే ఆపరేషన్ కి అవసరమైన డబ్బు ఏర్పాటు చేశారు. ఆ విషయమే ప్రదీప్ రష్మి తల్లిదండ్రులకి చెప్పి “ఇంక మీరేం దిగులు పడకండి అంకుల్ రష్మికేం కాదు. ఆమె ఆపరేషన్ అయేదాకా మీకు తోడుగా మేము ఇక్కడే ఉంటాము. ఎలాంటి సహాయం కావలసి వచ్చినా చేస్తాము. మీరు ధైర్యంగా ఉండండి” అన్నాడు.

రష్మి ఆపరేషన్ జయప్రదంగా జరిగింది. ఆమెకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఒక పక్క తల్లి తండ్రి , ఇంకో వైపు ఆదిత్య , విజయ్, ప్రదీప్ లు నిలబడి ఉన్నారు.

“హలో రష్మి ! ఇప్పుడెలా ఉంది?” అని పలకరించారు ఆమెను .

‘బాగానే ఉన్నాను’ అన్నట్లుగా తల ఊపి తండ్రివైపు ప్రశ్నార్థకంగా చూసింది.

ఆదిత్య , విజయ్, ప్రదీప్ లు వచ్చేటప్పటికే స్పృహ కోల్పోతూ ఉన్న రష్మికి ఆ తరువాత జరిగిందేమీ తెలియదు. రాఘవరావుగారు కూతురికి, ఆమె స్పృహ తప్పిపోయిన అనంతరం జరిగిన ఉదంతమంతా వివరంగా చెప్పారు. చెప్తున్నంతసేపు తండ్రి కంఠంలో ఆ ముగ్గురి పట్ల అత్యంత అభిమానం తొణికిసలాడటం గమనించిన రష్మి ఒకింత ఆశ్చర్యపడింది.

అదే సమయానికి డాక్టరుగారు కూడా అక్కడికి వచ్చి రష్మితో “నీ స్నేహితులు ముగ్గురు నిన్ను సమయానికి ఆసుపత్రికి తీసుకు రాబట్టి నీకు పెద్ద ప్రమాదం తప్పింది “ అని చెప్తూ వాళ్ళని ఎంతగానో కొనియాడారు. ఆయన కూడా వాళ్ళని అభినందించడం విన్న రష్మి మనసంతా ఆ ముగ్గురి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది.

‘ఎప్పుడు ఆకతాయిగా అల్లరిగా ఉండే వీళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఎంతో మానవత్వం కనబరచి నన్ను కాపాడారు. వీళ్ళని నేను ఎంత అపార్థం చేసుకున్నాను?’ అనుకుని పశ్చాత్తాపంతో కళ్ళు చెమర్చగా , అప్రయత్నంగానే వాళ్ళ ముగ్గురికి చేతులెత్తి నమస్కారం చేసింది.

రష్మి నించి అటువంటి ప్రతిక్రియ వస్తుందని ఊహించని ఆ ముగ్గురూ ఏమనాలో తెలియక ఇబ్బందిగా చూశారు. తదుపరి “రష్మి మేము ఇంక వెళతాము. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఏం సహాయం కావలసి వచ్చినా మాలో ఎవరికైనా ఫోన్ చెయ్యి. వెంటనే వస్తాము“ అంటూ తమ ఫోన్ నంబర్లు ఒక కాగితం పై వ్రాసి ఆమె చేతికి ఇచ్చారు.

“అంకుల్, ఆంటీ వెళ్ళి వస్తాము” అని రష్మి తల్లిదండ్రులకు కూడా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.

మునుపు ఒకసారి ఏదో మాటల సందర్భంలో రష్మి తల్లిదండ్రులతో తన క్లాసులో ముగ్గురు ఆకతాయిలు ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ ముగ్గురూ వీళ్ళేనని ఆ తరువాత కూతురు చెప్తే వారికి నమ్మశక్యం కాలేదు.

‘రష్మి చెప్పినదానిని బట్టి ఈ ముగ్గురిలో ఆకతాయితనం ఉన్నదే నిజమైతే ఇంకోవైపు అంతకు మించిన మానవత్వం కూడా ఉంది’ అనుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడు ఎల్లప్పుడు శుభం చేకూర్చాలని మనఃస్ఫూర్తిగా కోరుకున్నారు ఆమె తల్లిదండ్రులు

మరిన్ని కథలు

Kurchee
కుర్చీ
- జి.ఆర్.భాస్కర బాబు
Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి
Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi