పెంచిన ప్రేమ - సీతారామరాజు ఇందుకూరి

penchina prema telugu story

హలో, అమ్మా, అమ్మా, నేను ఫోన్లో అరుస్తూనే ఉన్నాను. అమ్మ మాట, సరిగ్గా వినబడటం లేదు. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. బస్ లో అందరూ నన్ను అదోలా చూస్తున్నారు.

అమ్మ పొద్దుట్నుంచి ఇది 3వ ఫోన్.

పొద్దున్న 10గంటలకి:

ఆఫీసు లో మీటింగ్ ఉన్నప్పుడు కాల్ చేసింది. ఏంటమ్మా అని అడిగాను, ఒకసారి ఊరికి వస్తావా నాన్నా అంది.

ఏ అమ్మ, అన్నాను.

నాన్న పరిస్థితి ఏమీ బాగాలేదు అంది.

నాకు ఏమీ అర్ధం కాలేదు, ఏమయ్యింది అన్నాను ఖంగారుగా,

ఏమీ లేదురా, తుఫానుకి చేనంతా పడిపోయిందిగా బెంగపెట్టుకున్నాడు, అంది. కొంచెం జ్వరంగా వుంది అంది.

సరే అమ్మ నేను సాయంత్రం బయల్దేరతాను అని చెప్పాను.

మధ్యాహ్నం రెండు గంటలు.

కేంటీన్ లో భోజనం చేస్తున్నాను.

అమ్మా చెప్పు, వద్దులే నాన్నా నువ్వు బయల్దేరకు అంది.

ఏమైంది అమ్మా అన్నాను నేను.

నువ్వొచ్చి మాత్రం ఏం చేస్తావు, ఈ బురదలో, మీ నాన్న కూడా తిట్టారు, వాడికెందుకు చెప్పావు అని అంది.

పర్వాలేదులే, ఇపుడే ఆఫీసులో చెప్పాను, రెండు రోజులు రానని, నాక్కూడా ఇంటికి రావాలనుంది, అన్నాను.

అయితే నీ ఇష్టం, అంది.

ఇప్పుడు ఊరు వెళ్ళే బస్ లో ఉండగా, మళ్ళీ ఫోన్ చేసింది, బహుశా బయల్దేరానో, లేదో, అని కనుక్కోవడానికి అయ్యుంటుంది.

పొద్దున్నే ఊళ్ళో దిగేప్పటికి, కొంచెం తుపర పడుతుంది.

నాన్న బస్టాండ్ లో గొడుగు పట్టుకుని నుంచుని ఉన్నారు.

అయ్యో మీరెందుకు వచ్చారు, నేను వచ్చేసేవాడిని కదా అన్నాను.

ఏమీ మాట్లాడలేదు, గొడుగు పట్టారు. ఆయనింతే ఏమీ మాట్లాడరు.

మా ఊరి గురించి నాకు బాగా తెలుసు, వానపడితే ఎలా ఉంటుందో, జాగ్రత్తగా చెప్పులు బ్యాగ్ లో కుక్కి, ఫ్యాంటు పైకి లాక్కుని నడుస్తున్నాను.

ఊళ్ళో తెలిసిన మొహాలు అన్ని పలకరిస్తున్నాయి.

ఇంటికెళ్ళి, నేను స్నానం చేసి వచ్చేప్పటికి, అమ్మ వేడిగా ఉప్మా తయారుచేసి పెట్టింది.

పొలం ఎలా ఉంది నాన్నా అని అడిగాను, మునిగిపోయిందని తెలిసినా.

బాగానే ఉంది, కావాలంటే వెళ్లి ఈత కొట్టుకుంటూ తిరుగు పొలం అంతా అన్నారు.

ఆయన మాటలు అలాగే ఉంటాయి.

రోజు రోజుకీ, వాతావరణాలు మారిపోతున్నాయి కదా, ఇంక వ్యవసాయాలు కష్టమే అన్నాను.

మనుషులు మారిపోతున్నారు, దానికి వాతావరణం జవాబు ఇది అన్నారాయన.

నీకో విషయం చెప్పనా, అన్నారు.

చెప్పండి, అని ఎదురుగా కూర్చున్నాను.

ఈ సంవత్సరం కాలవలు వస్తాయో లేదో అనుకుంటూనే, అందరూ పంటలు వేసారు, దురదృష్టం, కాలువలు వచ్చాయి. పొలాల్లో పనిచేయట్లేదు గాని, అదేంటో విచిత్రం, మనూళ్ళో ఒకళ్ళిద్దరు మీద బాగానే పనిచేశాయి, పురుగుల మందులు. చచ్చారు సన్నాసులు.

మొన్నా మధ్య M. L. A గారు వచ్చినప్పుడు చెప్పారు, అదేదో వరి పండించే దేశంలో మొత్తం మునిగిపోయిందంట. కాబట్టి ఈ సంవత్సరం మనకు రెట్లు బాగానే వస్తాయి, అన్నారు. అందరూ ఆనందించారు. బహుశా ఆ దేశంలో రైతులు తప్ప. ఆశలు ఎక్కువ ఆవిరి అయ్యిపోవడం వల్లో ఏమో, ఇక్కడ కూడా వానలు బాగానే పడ్డాయి. ఎంతగా అంటే, మొత్తం మునిగి పోయేంతగా, అని చెప్పి ఆపారు.

పోన్లేండి నాన్నా, మీరు కూడా పొలం ఎవరో ఒకరికి కౌలికి ఇచ్చేసి, నాతో వచ్చేయండి అన్నాను. నేను పొలం వెళ్తున్నాను, అన్నారాయన.

ఇంకేం ఉంది, మొత్తం మునిగిపోయాక, అన్నాను నేను.

కొన ఊపిరితో ఎవరైనా ఉంటే చూస్తా ఊరుకోలేం కదా, ఇదీ అంతే, నీళ్ళు ఏమన్నా తగ్గాయేమో చూసొస్తా, అన్నాను.

ఆగండి, నేనూ వస్తానని, ఆయన వెనకాలే బయల్దేరాను.

ఇంటికి ఒకళ్ళు చొప్పున, పొలం వెళ్ళే వరకు, ఎవరో ఒకళ్ళు పలకరిస్తూనే ఉన్నారు.

పొలం దగ్గరికి వచ్చాము. నిజంగానే ఈత కొట్టుకోవచ్చు.

నీళ్ళు ఏమైనా తగ్గాయా, అని అడిగాను.

లేదు అన్నారాయన.

ఆ నీళ్ళల్లోనే రెండు మూడు గట్లు తవ్వారు. ఆయన పిచ్చిగానీ, పక్కపొలాల్లో నీళ్ళు ఉన్నప్పుడు, మా పొలంలో నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి. నేను గట్టు మీద నుంచుని ఉన్నాను. పొలం అంతా తిరిగి, నాదగ్గరకి వచ్చి నుంచున్నారు.

నిన్ను చిన్నప్పుడు జీవితంలో ఒక్కసారే చూసాను. కానీ ఈ చేనుని మాత్రం సంవత్సరానికి రెండు సార్లు పెంచుతాను. నా కళ్ళ ముందు నేను చల్లిన విత్తనాలికి, నేల పురుడు పోసుకోవడం, అది పెరిగి పెద్దదవడం. నువ్వంటా ఉంటావు చూడు, నాతో వచ్చేయండి నాన్నా అని ప్రేమగా, అలాగే అది కూడా అభిమానంతో పంట ఇచ్చేసి చచ్చిపోతుంది. కానీ దాన్ని కోసేసాం అన్న బాధ, నాకు రాదు, ఎందుకంటే నేను మనిషిని, అది నా పిల్లల్ని పెంచుకోవడానికి ఉపయోగపడే అవసరం, అన్నారు.

ఇంతలో మాదగ్గరికి ఒక నలుగురైదగురు చేరారు.

ఎవరండి ఈయన అని అడిగారు.

వీళ్ళని ఇంతకుముందు ఎప్పుడు ఊళ్ళో చూసిన జ్ఞాపకం లేదు. కానీ మా ఊళ్ళో, నన్ను ఎవరు అని అడుగుతా ఉంటే చిరాగ్గా అనిపించింది.

మా అబ్బాయి, అని చెప్పారు నాన్నా.

వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను ఎవరు అనిఅడుగుతున్నారు. వీళ్ళెవరు నాన్న, అన్నాను.

వీళ్ళది శ్రీకాకుళం దగ్గరంట, ఆళ్ళ ఊళ్ళో ఏదో కంపెనీ పెడతామని, పొలాల్ని ప్రభుత్వం వాళ్ళు, తీసేసుకుంటే, తుఫాను గాలిలో ఎగిరిన ఆకు, ఎక్కడో పడ్డట్టు. వీళ్ళు ఇక్కడ పడ్డారు. పనులు చేసుకుంటా బతుకుతున్నారు, అన్నారు.

గవర్నమెంట్ డబ్బులు బాగానే ఇచ్చుంటుందిగా, అన్నాను.

ఆ బాగానే ఇస్తుంది. 4లక్షల పొలానికి, లక్ష రూపాయలు. ఆ పొలం కోసం చేసిన అప్పులుకి సరిపోతాయి ఆ డబ్బులు. రైతు కాస్తా, కూలీగా మారిపోయాడు, వాళ్ళ దెబ్బకి.

పోన్లేండి, అన్నాను.

కానీ పంటకి పనికిరాని భూమిని కంపెనీలకి ఇస్తే ఫర్వాలేదుగానీ, ఇలా పంట భూములని అభివృద్ధి పేరుతో తగలేస్తే, రేపు మీ పిల్లలు తినడానికి గింజలు దొరకవు భూమ్మీద. అన్నారాయన.

ఆ రోజంతా, ఊళ్ళో చుట్టాలింటికి వెళ్ళడం. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళడంతో సరిపోయింది.

సాయంత్రం వెళ్ళిపోతున్నావా, పొద్దున్న ఇంటి ముందు కూర్చుని టీ తాగుతూ ఉంటే, అడిగింది అమ్మ.

మరి వెళ్ళక ఈ బురదలో వాణ్ణేమి చెయ్యమంటావ్, అన్నారు నాన్న.

నేను వెళ్ళడం సంగతి పక్కన పెట్టండి. నేను ఈరోజు అంతో ఇంతో చదువుకున్నానన్నా, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నానన్నా, మీరు, ఆ పోలమే కారణం. కానీ ఇంక, ముందు ముందు ఎరువులు దొరకడం కష్టం, వానలు ఎప్పుడు పడతాయో తెలవదు. ఇంక వ్యవసాయాలు మానేసి నాదగ్గరికి వచ్చేయండి అన్నాను.

అమ్మ ఏమీ మాట్లాడలేదు.

శ్రీకాకుళం వాళ్ళు మన ఊరొచ్చినట్టు, నువ్వు వేరే ఊరెళ్ళావు. రేపు ఇంకా మంచి అవకాసం వస్తే, ఇంకో దేశం వెళ్తావు. తరువాత అందరం ఇంకో లోకానికి పోతాము. వ్యవసాయం చేస్తా వుంటే వున్న ఆనందం, బహుశా ఆ సిటీలో మాకు ఉండదు. అన్నారాయన.

వాళ్ళకి అక్కడే ఆనందం ఉన్నప్పుడు, నేను వాళ్ళకి జాగ్రత్తలు కూడా చెప్పాల్సిన అవసరం లేదనిపించింది.

సాయంత్రం బయల్దేరి వచ్చేసాను.

పొద్దున్నే రూంకి వెళ్ళే ముందు, పేపర్ కొన్నాను. తుఫానులో మునిగిపోయిన పొలాలకి గవర్నమెంటు నష్టపరిహారం ఇచ్చింది. ఎకరానికి ఎనిమిది వేలు. నాకు నవ్వాగలేదు, మా నాన్న ఖర్చుపెట్టింది 25వేలు పైనే, ఎకరానికి. ఈ గవర్నమెంటు ఇచ్చే ఎనిమిది వేలలో, మా నాన్నకి వచ్చేదెంతో దేవుడికే తెలియాలి.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు