గతసంచికలో ఏం జరిగిందంటే..http://www.gotelugu.com/issue154/3947/telugu-stories/jeevanasamaram/
వారిది ఎంతో సాంప్రదాయ కుటుంబం. వారు ఇంటికి పెట్టుకున్న పేరే ' అద్వైతాలయం', ఆ శ్యామ శర్మగారి సతీ మణి పేరు ఉభయ భారతి. నిజంగానే ఆమెకు అటు సంస్కృతంలోనూ, ఇటు తెలుగులోనూ అపార ఙ్ఞాన సంపద ఉన్నట్లు ఆమె ముఖ వర్చస్సే చెప్పక చెపుతుంది, ఇహ వారి కుమార్తె పేరు సహన, కుమారులు సోహం, ఓంకార్, అంతా అద్వైత మయం. కుటుంబ మంతా సంస్కృత విద్వాంసులే. పసి పిల్లాడిని పలకరించినా భజ గోవిందం శ్లోకాలూ, నమకం, చమకం చకచకా చెప్పేస్తున్నారు. ఊర్లో వారికున్న గౌరవం ఇంతింతనరానిది. అంతా వారి పేరు వింటేనే మనుషులు కనిపించక పోయినా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అలాంటి ఇంటి పిల్లను మనింటి కోడల్ని చేసుకోడం మనకే గౌరవ ప్రదం. నీ సమ్మతే ఆలస్యం, వారికీ మన ఉమ్మడి కుటుంబం, మన కుటుంబ సభ్యుల ప్రేమ అప్యాయతలూ, ఒళ్ళు దాచుకోకుండా ఆడ మగ అంతా ఇటు ఇంటికీ అటు గ్రామానికీ చేస్తున్న మేలు చూసి చాలా సంతోషించారు. ఉభయులకూ అన్నీ నచ్చాయి, నీవు పిల్లను చూసి ’ఊ‘ అంటే ఇహ పెళ్ళి ఖాయం చేస్తాం." వివరంగా చెప్పాడు తండ్రి . ఆ మాటలు వినగానే నా గుండెలో రాయి పడినట్లయింది.
" సుందరం! మనం ఈ రోజు మధ్యాహ్న భోజనాలు కాగానే వారి ఊరికి వెళుతున్నాం ,నీవూ, నేనూ మీ అమ్మా, అత్తా, పెద్ద బాబాయ్ ! నీవూ చూచేస్తే తర్వాత మనం ముహూర్తం గురించీ మాట్లాడుకుందాం . సరా!" అన్నారు నాన్నగారు.
ఏమీ చెప్ప లేక నేను" మరీ మరీ! .." అని నానుస్తుండగా " అంతా పెద్ద వాళ్ళం కదా అన్న గారూ ! సుందరానికి తోడుగా మన చిన్నాడు సుదర్శన్ ను కూడా తీసుకెళదాం , మన రెండు గిత్తల బండిలో అందరం పడతాంలే అన్నయ్యా! " అని , " ఒరే సుదర్శన్ ను పిలవండిరా! " అని అనగానే ఐదు క్షణాల్లో మూడో బాబాయ్ కొడుకు సుదర్శన్ వచ్చి వాలాడు, వాడొక్కడే నాలా పెళ్ళికి ఉన్నాడు మా ఇంట. సుదర్శన్ కూడా అందగాడు ఎస్ ఎస్ ఎల్సీ వరకూ చదివి తండ్రికి సాయం చేస్తూనే మా ఇంట నడుస్తున్న చేనేత వస్త్రాలయం లో పని చేస్తున్నాడు.
నేను కుడితిలో పడ్డ ఎలుకలా ఏమీ చెప్పలేక గుంజాటనలో ఉండగానే, మధ్యాహ్న భోజనం పూర్తై అంతా తయారైనారు. రెండు గిత్తల బండి వచ్చి వాకిలి ముందు ఆగింది. లోపలంతా మెత్తని పరుపుల మీద తెల్లని దుప్పటి కప్పి ఉంది." రా నాయనా సుందరం! రాహు కాలం, దుర్ముహూర్తం రాక ముందే వారింట అడుగు పెట్టాలి. " అని తల్లి పిలవగా మారు మాట్లాడ లేక బండెక్కాను. దారి పొడవునా ఆ ఇంటి వారి మర్యాదలూ, వారి నిరాడంబరత గురించీ, సుందరం ఉద్యోగం, జీతం, అక్కడి పరిస్థితుల గురించీ మాట్లాడుతుండగానే వారి ఊరు చేరటం, వారింటి ముందు బండి ఆగటం జరిగి పోయాయి. బండి ఇంటి ముందు ఆగగానే ఒక పెద్దాయన పాండిత్యంతో ముఖం వెలిగి పోతుండగా భుజమ్మీద కండువాతో చేతులు జోడిస్తూ వచ్చి, బండి దిగను ఒక కుర్చీ పీట వేయించాడు. ఆయనే శ్యామ శర్మ ఐఉంటాడు అనుకున్నాను.ఈ లోగా పెద్దంచు చేనేత చీరలో పమిట చెంగు భుజం చుట్టూ కప్పుకుని, పచ్చగా పసుపుతో ఉన్న ముఖంపై పెద్ద కానీ అంత ఎర్రని కుంకుమ బొట్టుతో సాక్షాత్ పార్వతీ దేవిలా ఉన్న ఆమె బయటికి వచ్చి, బండి దిగను ఆడ వారికి సాయంగా చేయి అందించింది. బండి దిగి ఆ ఇంటి పరిసరాలు ఒక్క మారు చూచిన నా మనస్సు ఉద్వేగంతో నిండి పోయింది. ఆఇంటి వాతావరణం నాలో నూతనోత్సాహాన్ని కలిగించగా ఆసక్తిగా అందరితో కల్సి లోనికి నడిచాను.
అందరికీ కాళ్ళూ చేతులూ కడుక్కోను ఒక పది పన్నేండేళ్ళ పిల్లవాడు నీరు అందించగా, మరో పిల్లడు చేతులు తుడుచు కోను కండువా అందించాడు. అంతా పాద ప్రక్షాళన చేసుకున్నాక, పెద్ద లోగిట్లోకి వెళ్ళి కొయ్య కుర్చీల్లో కూర్చున్నాం. స్త్రీల కోసం కొత్త తుంగ చాపలు పరిచి ఉన్నై.అంతా కూర్చున్నాక నాతో పాటుగా సుదర్శన్నూ పరి చయ చేశారు పెద్దలు. ముందుగా కమ్మని, చిక్కని నిమ్మ మజ్జిగ అందరికీ అందించారు ఆ మగ పిల్లలిద్దరూనూ. ఆడవారికి ఆ మహిళ అందించింది ఆదరంగా. తాము ఇంటి నుండీ తెచ్చిన పండ్లు, పూల బుట్ట బండి తోలు కొచ్చిన చలమయ్య చేత తెప్పించి అక్కడ ఉంచింది సుందరం మేనత్త.
ఆ తర్వాత " అమ్మాయిని చూస్తారా!" అని అడిగారు శ్యామల శర్మ గారు. నాన్న గారు తల ఊచగానే "ఉభయ భారతీ ! సహన ని తీసుకురా!" అన్నారు.
నాతో పాటు సుదర్శన్ కూడా ఉద్వేగంగా ఎదురు చూట్టం నేను గమనించక పోలేదు. ఒక మయూరం పురి విప్పినట్లు, హంస నడకతో గుప్పుమనే మొగలి రేకుల సువాసన విరజిమ్మగా, నవ యవ్వన సుందరాంగి, పచ్చని పట్టు పరికిణీ, లేత ఆకు పచ్చ ఓణీ ధరించి, ముదురాకు పచ్చ జాకెట్లో మోకాళ్ళు దిగిన జడ చివర జడ కుప్పెలు నడుం క్రిందుగా వ్రేలాడుతుండగా, నేల తల్లికెక్కడ నొప్పెడుతుందో అని అతి మెల్లగా నడుస్తూ వచ్చి చాప మీద స్త్రీల పక్కన కూర్చుంది తల్లితో కల్సి. చంద్ర బింబాన్ని తలదన్నే కాంతి నిండిన ప్రసన్నవదనం క్రిందికి దించుకుని కూర్చున్నా ఆ ముఖం లోని ప్రశాంతత , నిశ్చలత పసిమి ఛాయలో ఉన్న ఆమె ముఖ కమలాన్ని చూసి అంతా తృప్తి పడ్డారు. నా మనస్సు ఎందుకో తెలీని ఒకలాంటి భావనతో, నా స్వంత చెల్లాయిని మొదటి సారిగా చూసిన భావనతో నా మనస్సు నిండి పోయింది. "ఏమైనా అడుగుతారా !" అన్న గృహస్తు మాటలకు అంతా నా వైపు చూశారు. నేను తండ్రి వైపు’ ఏమీ లేదని’ తల ఊచి చెప్పాక , "బాబూ! ఈమె మాఅమ్మాయి సహన! బయటి బడుల కెళ్ళలేదు కానీ ఇంట్లోనే అన్నీనేర్చుకుంది. వీణ మీద స్వర బధ్ధంగా కీర్తనలు వాయిస్తుంది. వీళ్ళిద్దరూ మా కుమారులు సోహం, ఓంకార్," అనగానే వారిద్దరూ చేతులు జోడించి నమస్కరించడం అందరికీ ముచ్చటేసింది.
నా మనస్సు పరిపరి విధాల పోతున్నది, మింగ లేక కక్క లేక నానా అవస్త పడ సాగాను.' అలాంటి వారిని మోసం చేయటం, బాధించడం చాలా ద్రోహంగా భావించాను. మనస్సులో మాట చెప్పేద్దామా అని కూడా అనుకున్నాను కానీ మా బాస్ మోహనరావు మాట కూడా మన్నించల్సి ఉండటంతో నా నోటికి తాళం పడినట్లైంది. ఆయన వచ్చే వరకూ నోరెత్తవద్దని చెప్పాడు.' కనుక మూగ వానిలా తల వంచుకు కూర్చున్నాను.
" మరింక మేం కదులుతాం, చీకటి పడేలోగా గ్రామం చేరాలి కదా! మేము వెళ్ళాక మా తమ్ముడితో ఏ విషయం కబురంపుతాం." అని లేచాడు నాన్నగారు.
" ఒక్క క్షణం వదిన గారూ !" అంటూ ఉభయ భారతి లోనికెళ్ళి పసుపు కుంకుమ లున్న పళ్ళెం తెచ్చి మహిళ లిద్దరికీ బొట్టు పెట్టింది. సహన వారిద్దరి కాళ్ళకూ పసుపు రాచింది. పండ్లూ, పూలూ ఆడ వారిద్దరికీ ఇచ్చాక , సహన ఎవ్వరూ చెప్పకుండానే వారిద్దరి పాదాలకూ వంగి నమస్క రించి అందరి వైపూ ఓ చూపు చూసి లోని కెళ్ళింది. ఆ చూపు తన కేసే అనుకున్న నా గుండెలో వాడి, వేడి శూలం దిగింది.
అంతా బయటికి వచ్చి బండెక్కేప్పుడు ముందుగా వచ్చిన సుదర్శన్ తో " ఏరా ! ఆ అమ్మాయి బావుందా!" అనడిగాను.
"ఓరీ ఆప్రశ్ననేను నిన్నుఅడగాలను కుంటున్నానురా! నీవు నన్ను అడుగుతున్నావు?" ఆశ్చర్యంగా అంటున్న సుదర్శన్ తో " ఒకవేళ నీవు నా స్థానంలో ఉంటే ఏమంటావురా! " అన్నాను. "అనేందుకేముంది ఇప్పుడు ఇలా చెప్పడం తప్పు కానీ నీవు అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. ఈమెను వద్దనే వాడు వెధవాయి అవుతాడు రా సుందరం," అని నాలుక్కరుచుకున్నాడు సుదర్శన్ , చుట్టూ చూస్తూ ఎవ్వరూ విన లేదు కదానే భయంతో.
పెద్దలు బయటికి వచ్చేలోగా సంభాషణ అంతా గుస గుసగా జరిగినందున, మేమిద్దరం తేలిగ్గా ఊపిరి పీల్చుకుని బండెక్కాం.
తిరుగు ప్రయాణంలో మా నాయన గారు నన్నుచూస్తూ అడిగారు. "ఏరా సుందరం! అమ్మాయిఎలా ఉంది? నీకు నచ్చిందా! సమ్మతమేనా?" అని ఆయన అలా అడుగుతుంటే ఎమీ చెప్పలేక తటపటాయించాను. "పాపం ఎలా చెప్తాడులే అన్నయ్యా! సిగ్గు కదూ!ఐనా ఆ అమ్మాయికేం కన్నువంకరా, కాలు వంకరా? వద్దన్న వాడు మూర్ఖుడో, మానసిక వికలాంగుడో ఐవుండాల్సిందే! " అంది అత్త.
" ఏరా సుందరం! మాట్లాడు, అంతా నీ సమాధానం కోసం కాచుక్కూచున్నాం. వారూ పెద్ద మనుషులు. అసలు అక్కడే చెప్తావనుకున్నాం, పసి వాడివి బిడియ పడతావని, ఎక్కువ బలవంత పెట్టలేదులే!" అన్నాడు బాబాయ్." ఏం సుందరం అంతా అడుగు తుంటే మాట్లాడవు! నీవు నోరు తెరిచి చెప్తే కదా నీ మనస్సులో భావన తెలిసేది?" అంది చివరగా తల్లి.
" పాపం పట్నం వాడు కదా! మరి కాస్తంత సమయం కావాలేమో! ఏరా! సుందరన్నయ్యా!?" అని మాట్లాడి తెల్సో తెలీకో గట్టెంక్కించాడు సుదర్శన్ తాత్కాలికంగా.
"ఏం పిల్లలో ఏమో అన్నయ్యా! మగ పిల్లలు ఆడ పిల్లల కన్నాసిగ్గుల మొగ్గలై పోతున్నారు. చూడూ ఆ రోజు మన చిన్నన్న పిల్లడు హరి గోపాల్ కూడా అంతే, చివరకు ఈ సుదర్శనే వాడ్ని మాట్లాడించి వాడి మనస్సు తెల్సుకుని మనకు చెప్పాకే కదా! సంబంధం ఖాయం చేసి వివాహం జరిపించాం. ఇదీ వీడికే అప్పగిస్తే సరి. ఏరా సుదర్శన్! సుందరన్నయ్య మనస్సు తెలుసుకుని రేపటి కంతా చెప్పేయాలి." అంటూ ఆర్డర్చేసింది మేనత్త.
మరునాడు ఉదయం నేను ఆరు బయట వేప చెట్టు క్రింద మంచంపై పడుకుని, మా బాస్ కోసం ఎదురు చూడసాగాను. మధ్యాహ్నం వేళకు మోహన రావు, ఆయన మామ గారితో కల్సి వచ్చి బండి దిగాడు.
నేను ముందుగా వారిని చూసినా " సుదర్శన్ ! ఎవరో వచ్చినట్లున్నారు చూడూ!" అంటూ పిలిచాను. సుదర్శన్ వచ్చి బండి దిగుతున్న వారిని " తమరు ఎవరి కోసమండీ! " అని అడిగాడు. నా పోలికలతో ఉన్న సుదర్శన్ ను ఆశ్చర్యంగా చూస్తూ " బాబూ! ఇది కరణం గారి ఇల్లేనా?" అని అడిగాడు.
"ఔనండీ! రండి లోపలికి. మా పెద నాన్న గారు లోపల ఉన్నారు." అంటూ వారిని ఆహ్వానించాడు. ఒక పక్క గా నేను చెట్టు క్రింద ఉండటాన వారికి కనిపించ లేదు. వారు పందిరి క్రిందకు రాగానే సుదర్శన్ కాళ్ళూ చేతులూ కడుక్కోను నీరందించాడు. వారు పందిట్లోని కొయ్య కూర్చీల్లో కూర్చోగానే, అక్కడే ఉన్న కుండలోని నీరు త్రాగేందుకు అందించాక, లోపలికి వెళ్ళి, " అమ్మా! పెద్దమ్మా! పెద నాన్న గారి కోసం ఎవరో వచ్చారు." అని చెప్పి తాను నా వద్దకు వచ్చాడు..
" సుందరన్నయ్యా! ఎవరో పెద నాయన గారి కోసం వచ్చినట్లున్నారు." అని చెప్పాడు.
లోపలి సంభాషణ ఆ గదికి పక్కనే ఉన్న కిటికీ నుంచీ మా చెవుల పడుతుండగా, నా గుండె గడ గడలాడసాగింది. సుదర్శన్ " సుందరన్నా! నీకు మరో సంబంధం వచ్చినట్లుంది. అందుకేనా నీ గుండె దడదడలాడుతున్నది. నీకీ సంబంధం ఖాయం చేయర్లేరా! నిన్నటి అమ్మాయి తప్పి పోతుందని భయపడకు. నేనున్నాగా నీకు, ఆపద్భాధవుడిలా ఆదుకుంటాలే. వీరి అమ్మాయి ఎలా ఉన్నా సరే నీ కోసం నేను చేసేసుకుని పెద నాయనగారి గౌరవం కాపాడతాను. " అంటూ తెలీకుండానే మాటిచ్చేశాడు సుదర్శన్. నేను లోలోన 'అపశకునాలు పలక్కురా నాయనా! నాకు ఈ అమ్మాయి, నీకు నిన్నటి అమ్మాయీ నూ..' అనుకున్నాను మనస్సులో .
" సుదర్శన్ తమ్ముడూ నీవే ఎలాగైనా ఈగండం గట్టెంక్కించాలిరా! నిన్నటి అమ్మాయీ నీకు నచ్చింది కదరా !"
" తప్పురా! వదిన వరసయ్యే అమ్మాయిని అలా మాట్లాడకు." అన్నాడు సుదర్శన్ చెంపలు వాయించుకుంటూ.
" సరి సరి. కానీ ఈ అమ్మాయినే నేను ఇష్ట పడితే నీవు నిన్నటి అమ్మాయిని చేసుకోను తయారేనా!" అన్నాను.
" అదెలా సుందరన్నయ్యా! నిన్నటి అమ్మాయిని నీ కోసం చూశారు. వారూ నిన్నే పెళ్ళి కొడుగ్గా భావించారు.."
" సుదర్శన్ ! పరిస్థితులు ఎలా మారినా నాకు నీసహాయం కావాలిరా! మాటివ్వు ." అని చేయి చాచి మాట తీసుకు న్నాను. లోపల మాటలు కొంచెం కొంచెంగా వినిపిస్తుండగా చెవులు రిక్కించి విన సాగాను, కాస్త సేపయ్యాక తండ్రి నుంచీ పిలుపు రాగానే నేను చేతుకు కట్టుకుని లోనికి వెళ్ళాను, దడ దడలాడే గుండెలతో. అప్పుడే ఆయన్ని చూస్తున్నట్లుగా " అయ్యో! మీరా సార్! కులాసానా? ఎప్పుడొచ్చా రు?" అని పలకరించాను.
" వీరిని నీవెరుగుదువా ?" తండ్రి ప్రశ్నకు " ఈయన మా ఆఫీస్ మేనేజర్ గారు. వీరి ఫ్యాక్టరీలోనే నేను పని చేసేది, " అని చెప్పాను తల పక్కకు త్రిప్పి .
అంతా అర్ధమైనట్లు తల ఊచి "ఓహో అలాగా ! వీరి అమ్మాయిని నీకిచ్చి వివాహం చేయాలని అడగను వచ్చారు. నీకు వీరమ్మాయి తెల్సా?" గంభీరంగా తండ్రి అడిగిన దానికి గతుక్కుమన్నాను, ఆయనంత నేరుగా అలా అడుగుతాడని ఊహించ లేదు. లేకపోతే మోహన రావును పలకరించక పోను. ఏమీ చెప్ప లేక మౌనం వహించాను.
" అయ్యా! మీరు మాతో వచ్చి మామనవరాలు సుందరిని చూసి, మీ అభిప్రాయం చెప్తే బావుంటుంది." అ న్నాడు మా బాస్ మామ గారు." అవసరం లేదయ్యా! మా వాడు చూసి ఇష్ట పడ్డాక మేం చూడాల్సిన పని లేదు. మీ కెప్పుడు కుదిరితే అప్పుడే వివాహ ముహూర్తం నిశ్చయించండి, మేమూ వచ్చి నాలుగు అక్షింతలు వేస్తాము." అని లేచి, " ఒరే ! కృష్ణా వీరికి మీ ఇంట భోజనాదికాలు ఏర్పాటు చెయ్యి, పాపం చాలా దూరం ప్రయాణించి వచ్చారు, వీరిని మీ ఇంట్లోకి తీసుకెళ్ళు, అలాగే సుదర్శన్ ను నా వద్దకు పంపు, నేను కచేరీ గదిలోఉంటాను. "అని "వెళ్ళి స్నానాదికాలు ముగించి భుజించండి బాబూ! " అని చెప్పారు నాన్నగారు. ఆయన తన గది లోకి వెళ్ళాక తెల్లబోయి చూస్తున్న మోహన రావు గారిని, వారి మామ గారిని వెంట పెట్టుకుని వెళ్ళాడు కృష్ణ బాబాయ్ తన ఇంట్లోకి.
లోలోపల నేను గజగజా వణుకుతూ ఏం జరుగుతుందోని మౌనంగా ఎదురు చూడ సాగాను. పెద నాయన గదిలోకి వెళ్ళిన సుదర్శన్ ఐదు క్షణాల్లో వచ్చి, నన్ను తీసుకుని వేప చెట్టు నీడలోకి వచ్చాడు.
" ఒరే సుందరం! కొంప మునిగిందిరా! పెదనాయనగారు నన్నుపిలిచి ' ఒరే సుదర్శన్ ‘నిన్నటి పిల్లను చూశావు గా, ఆమెను నీవు చేసుకుని మన పరువు నిలపాలిరా! లేక పోతే నేను తలెత్తుకు తిరగ లేను.' అన్నార్రా! ఇప్పుడు నేనేం చేయాల్ర్రా!" అన్నాడు గాభరాగా.
" నీవు నాకు మాటిచ్చావు గుర్తుందా! నాయన గారు చెప్పిందానికి అంగీకరించి నా ప్రాణమూ, నాయన గారి పరువూ నిలుపు, బంగారం లాంటి భార్యా మణిని వరించు" అన్నాను భారం తీరిన హృదయంతో.
" అంతేనంటావా! సుందరన్నా! నేను ఆమెను ఆ భావనతో చూడనే లేదు." అని సుదర్శన్ అనగా,
' ఆశొక్కింతయు గలదు , ధైర్యమా పూర్తిగ పోయె ,
ప్రాణంబులున్ దడదడమనగ గుండెలయతప్పె మూగనైతి,
నీవేతప్ప ఇతరసాయం బెరుగ, హెల్పీయన్ నీవే తగుదువు
రారాముందుకు సుదర్శనా ! బాబయ్య కొడుకా! ఓ బాల నేస్తమా!-- అంటూ డ్రామా స్టైల్ లో మోకాళ్ళపై కూర్చున్నాను చేతులు జోడించి. సుదర్శన్ పకపకా నవ్వి," నీవు మద్రాసీవైనా నీ హాస్యం మాత్రం పోలేదురా అన్నాయ్! “
" సరే కానీ నిన్ననే నిన్నుఅడిగాను ఆమెపై నీ ఉద్దేశ్యం ఏంటని గుర్తుందిగా, ఒరే ఇవి చేతులు కావు కాళ్ళను కో " అని సుదర్శన్ రెండు చేతులూ పట్టుకున్న నాతో ,
"ఏరా! అన్నా! నేను చేతులతో నడిచి కాళ్ళతో అన్నం తినే వాడిలా కనిపిస్తున్నానా మీ మద్రాసీలకు?" అన్నాడు సుదర్శన్.
ఆ సాయం కాలానికి మోహనరావు, ఆయన మామ గారూ కృష్ణ తో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ రోజే తన మూడో తమ్ముడి కొడుకు సుదర్శన్ తో, సహన వివాహం నిశ్చ యించుకునే విధంగా కబురు పంపారు నాన్న గారు, శ్యామ శాస్త్రికి..
ఆ రాత్రి అంతా భోజనాలయ్యాక ఆరు బయట చేరాం. మా బాబాయిలకూ, అత్తలకూ అందరి ఇళ్ళూ ఒకే లాగా వరుసగా ఈ కాలపు రో హౌసెస్ లాగా కట్టించారు మా నాయన గారు, మాది విడి విడి వంటల్లాగా ఉండే ఉమ్మడి కుటుంబం. మా ఇంట ఏ నిర్ణయమైనా కానీ అంతా అలా ఆరు బయట చేరి నాన్నగారు చెప్పేమాటలు విని తమ అభిప్రాయాలు ఆయన అడిగినపుడు మాత్రమే చెప్పడం వాడుక. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకునేది. అంతా మౌనంగా ఉన్నారు. నాన్న మనస్సు తెలీకుండా ఎవ్వరూ ఏమాటా అనక పోడం ఆ ఇంటి సాంప్రదాయం.
" ఐతే నీవు మీ బాస్ మోహనరావు కుమార్తెను వివాహమాడ దలచే వారిని ఇక్కడికి పంపావన్నమాట"అన్నారు నాన్న గారు.
"అది కాదు నాయన గారూ!.." అని ఏదో చెప్ప బోతున్న నాతో, "ఆగరా! నీ మనస్సు వేరే చోట ఉన్నపుడు నాయన గారికి కానీ నాకు కానీ చెప్ప వలసింది. అనవసరంగా పై వారి ముందు నాయన గారి పరువేమై పోనూ? మంచి పిల్లవాడు కనుక సుదర్శన్ ఆ ఇంటి పిల్లను చేసుకుందుకు అంగీకరించాడు, లేక పోతే పరాయింటి పిల్లను అలా రెండు మార్లు వెళ్ళి చూడటం ఎంత పరువు తక్కున! వారి మర్యాదేమై పోనూ? " అంది గంభీరం గా అమ్మ.
"ఒరే! ఇక్కడ నిన్నెవ్వరూ బలవంతం చేసి నీ మనస్సుకు విరుధ్ధంగా చేసే వారు లేరని నీకూ తెల్సు. ఒక్కగా నొక్క మగ బిడ్డవు నీ సంతోషమే అమ్మా నాయనా కోరుకునేది, అలాంటి వారిని ఇరకాటంలో పెట్టేశావురా సుందరా!" మందలింపుగా అంది మేనత్త.
" వీడు పెళ్ళయ్యాక మాత్రం మమ్మల్ని చూస్తాడనే నమ్మకం నాకు పోతున్నది , వీడి వాలకం చూస్తుంటే .. మద్రాసుకు పంపడం వండై కూర్చున్నట్లుంది" అంది కొంత బాధగానే అమ్మ.
" రాజీ! అపుతావా! ఎవరి ముఖాన ఆ బ్రహ్మ దేవుడు ఎలా రాసి పెట్టి ఉంటే అదే జరుగు తుంది కానీ ఎవ్వరూ ఎవ్వరి జాతకమూ మార్చలేరు. అంతా సుఖంగా ఉండాలని మాత్రమే మనం కోరుకుందాం." అన్నారు నాయన గారు గంభీరంగా.
" సరి సరి, మరి నీవు వివాహం అయ్యేవరకూ ఉండి వెళతావా! మళ్ళీ వస్తావా! సుందర్ !" అడిగారు బాబాయిలు.
ఇంతలో శ్యామశాస్త్రి నుండీ కబురందించను వచ్చాడు ఆయన బావమరిది .
ఆ సమాచార సారాంశం అందరి మనస్సులకూ స్వాంతన చేకూర్చింది. "అయ్యా! మా బావయ్య గారు తమ కుమార్తె ఈ ఇంటి కోడలు కావాలని వాంఛిస్తున్నారు. పైగా మరో విషయం అది దైవ చిత్రమే కావచ్చు, మా సహన మీరు నిశ్చ యించిన సుదర్శనే పెళ్ళి కుమారుడనుకుందిట ! ఒకే ఒక్క మారు నమస్కరిస్తున్న సమయంలో మాత్రమే ఆమె తలెత్తి చూసినపుడు సుదర్శన్ తన వైపు చూడటం తో అతడే పెళ్ళి కుమారు డనుకుందిట. మాకేమీ అభ్యంతరం లేదు, మీరు ముహూర్తాలు నిశ్చయించుకోను ఎప్పుడు వచ్చేదీ కబురంపమన్నారు." అని చెప్పగానే అంతా నిశ్చింతగా గుండెల నిండా గాలి పీల్చుకున్నారు. కానున్న కార్యం గంధర్వులే తీర్చారనటం ఇదేనేమో అనుకున్నారంతా మనస్సుల్లో.
ఆ తర్వాత నా వివాహం సుందరితోనూ, సుదర్శన్ వివాహం సహనతోనూ ఒకే ముహూర్తానికి మా ఇంటనే జరిగి పోయాయి. సహన ఎదురైతే ఆ తర్వాత నా మనస్సులో ఒక ముల్లు దిగినట్లు ఉండేది. ఆమె తన స్వంత అత్తా మామలనే కాక పెద్దలనందరినీ మా నాయన గారినీ, అమ్మ గారినీ సైతం ఎంతో ఆదరంగా గౌరవించి సేవలు చేసేది స్వంత కోడలిలా. మా అమ్మగారు వారి నాయన గారి వద్ద ఆయుర్వేదం వైద్యం బాగ నేర్చుకుని చుట్టు పక్కల గ్రామాల్లో అందర్కి వైద్య సేవలు అందించే వారు.అమ్మ గారి వద్ద సహన వైద్యం సైతం నేర్చుకుని మా అమ్మ గారికి వైద్య సేవల్లో సాయం గానూ ఉండేది.
కొత్త మోజులో కొంతకాలం నాకేమీ తెలీలేదు కానీ ఆ తర్వాత క్రమేపీ సుందరి మనస్సూ, ఆమె ప్రవర్తనా అర్ధం కాజొచ్చింది, నేను తెలీకుండానే పెద్ద ఊబిలో పడ్డానని తెల్సే సరికే నడుం లోతుకు కూరుకు పోయాననని, ఇక ములిగి పోడం తప్ప బయట పడ లేనని అర్ధమైంది. నా పెళ్ళి సుందరితో జరగ్గానే నా జీవితంలో సుందరం నశించగా, నా పేరు లోని సుందర్ ను కూడా నేను తుడిచేసుకున్నాను. నా వివాహం తర్వాత నా పేరు కేవలం ఏ.ఆర్. అయ్యర్ గా మారి పోయింది.
ఒక్క మారైనా మా యింట అడుగు పెట్టిన పాపాన పోలేదు నా భార్య. పెళ్ళైన మూడు నిద్దర్లతోనే ఆమె అత్తింటి కాపురం ముగిసింది. అత్త మామలకు ఒక్క రోజు సేవలు చేయటం మాట అటుంచి, వారిని "అత్తయ్య గారూ, మామయ్యగారూ ! అని పిలిచింది కూడా లేదు నాభార్య. ఎప్పుడు ఊరెళ్ళి అందర్నీ చూసి వద్దామని పిలిచినా’ అది పల్లె టూరు అంటుంది, తాను పెద్ద సిటీలో పుట్టి పెరిగినట్లు. అక్కడ చాలా మంది జనం, నాకు ఎవ్వరితోఎలా మాట్లాడాలో తెలీదు, నేనెప్పుడూ అంతమందిలో ఉండలేదు, నాకు భయం’ అంటుంది..ఆ తర్వాత చూలింత, బాలింత, ప్రయాణం చేయను పసి బిడ్డలు, నా ఆరోగ్యం బావులేదు,’ ఇలా ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒక సాకు చెప్తుండేది. నాకు విసుగై పోయి పిలవడం మానేశాను, తీరినపుడు ఎప్పుడైనా నేను వెళ్ళినా వచ్చాక ఒకే గోల. నేను తనకే స్వంతమని భావించి ఎవ్వర్నీ నా దరి దాపులకు రాకుండా చేసింది. దానికి సుందరి తల్లి మా అత్తగారు వత్తాసు పలగ్గా, తండ్రి మాట చెవిని పెట్టక నన్ను నా తల్లి దండ్రులకు ద్రోహిగా సమాజం ముందు నిలిపింది. ఇతరులు నాతో మాట్లాడితే నేను తనకు దూరమవుతానని భ్రమ పడింది. పైగా ఒక్కర్తే కుమార్తె కావటాన అతి గారాబం వల్ల ఇతరులను అర్ధం చేసుకోడం, ఇతరుల మనస్సు తెల్సుకోడం అస్సలు తెలీవు ఆమెకు. ఎంత కాలమైనా అన్నిట్లో ఇతరులే తాను చెప్పినట్లు వినాలనే మూర్ఖపు పట్టుదల అధికం. నా వారితో చేరితే రాక పోకలు సాగిస్తే వారికి నా జీతమంతా ఇచ్చే స్తాననీ, అమ్మా నాయన గార్లను నా వద్దకు తెచ్చుకుంటాననీ, వారికి ఆమె సేవలు చేయ వలసి వస్తుందనీ ఆమె భీతి. నలుగురు ఆడ బిడ్డలు రాక పోకలు సాగిస్తే తన ఇల్లు గుల్లవుతుందని, వారి కంతా వండి వార్చ వలసి వస్తుందని ఆమె భయం. వారంతా తన ఇంట తిష్ట వేస్తారనీ వాళ్ళ పిల్లల చదువులూ అన్నీ తనపై పడతాయనీ భీతి. ఇవన్నీ మనస్సులో ఉంచుకుని నన్ను నా విధుల నుండీ దూరం చేసింది, ఒక్కగానొక్క కొడుకునైన నన్ను మా అమ్మా నాయన గార్లకు తల కొరివి పెట్టే కనీస ధర్మం కూడా దక్క కుండా చేసింది. అంత మందిలో పుట్టిన నన్ను ఏకాకిని చేసింది. మనస్సులో మాట చెప్పుకునే వారు లేక అందరూ గుర్తు వచ్చి మగవాడి నైనా రాత్రులు ఒక్కొ సారి ఏడుస్తూ గడిపాను. ఇతరులెవరైనా ఆమెను క్షమించరు. మా అమ్మ నా నుండీ వివాహ సమయంలో తీసుకున్న మాటైనా కనీసం దక్కించాలని నేను ఆమె ఆడించినట్లల్లా ఆడాను. అది నా బలహీనతగా గుర్తించి నన్ను తన కొంగున కట్టు కుని, గుప్పిట్లో బంధించింది. మా అమ్మగారు నా భార్య మనస్తత్వాన్ని వివాహ సమయం లోనే గుర్తించారు.
" నాయనా సుందరం! నీవు పరాయమ్మ కన్నబిడ్డను స్వీకరిస్తున్నావు , నీ జీవిత భాగస్వామిగా ఆమె ఎంత తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను బాధించకు. ఇది నా ఆఙ్ఞ." అనే ఆమె కిచ్చిన మాట కోసం ఈమె నింత కాలం ఎన్ని ఘోరాలు చేసినా ఓర్పు వహిస్తూనే వస్తున్నాను.
నా అప్ప చెల్లుళ్ళూ , బాబాయిలూ అంతా నాకు దూరం కాగా, వృధ్ధాప్యంలో వారి బాగోగులు చూసే అవకాశమే నాకు కలక్కుండా చేసింది. ఉద్యోగం వదలి మా స్వంత ఊరికి వెళదామంటే అలా జరిగితే తాను ఉరేసుకుని చచ్చి పోతానని బెదిరించింది. మా అమ్మా నాన్న గారూ నాకు వ్రాసిన ఉత్తరాలన్నీ చింపేసి నాకు అందకుండా చేసింది. మా అమ్మా నాన్న గార్ల మరణం సమాచారాన్ని సైతం దాచేసింది" అంటూ కళ్ళ నీరు కండువాతో వత్తు కుంటున్న నన్ను చూసి బాధ పడ్డారు నా గ్రాండ్ చిల్డ్రన్, శైలేష్ , సుమ.
" తాత గారూ! బాధ పడకండి . ' విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది ఎవ్వరూ ఏమీ మార్చలేరని' మీ అమ్మా నాయన గారూ చెప్పిన మాట సత్యం కదా తాత గారూ!. కొందరి జీవితాలు వివాహంతొ మంచి మలుపు తిరుగుతాయంటారు, మరి కొందరి జీవితాలు అనుకోని విధంగా ఇరుకు దారుల వెంట, ముళ్ళ బాటల వెంట సగిపోతుంటాయిట "అంటున్న సుమని చూస్తూ " ఔను తల్లీ! నీవన్నది నిజం. నాది నీవు చెప్పిన రెండో దారి." అన్నాను బాధగా. "సరే పదండి తాత గారూ! ఈ రోజు మనం అలా షికారుగా వెళ్ళి ఐస్క్రీం తినొద్దాం బామ్మ ఇంటికి వచ్చేలోగా "అంటూ నా చేతులు పట్టుకుని నడిపించారు వారు.