రాజారావు, రమణి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ముగ్గురికీ పెళ్లిల్లైపోయాయి. చక్కగా సెటిలై పోయారు కూడా.
రాజారావు గారు రిటైరయి పోయారు. చేసింది ప్రైవేటు ఉద్యోగం కావడంతో పెన్షన్ లేక పోయినా ముందు చూపుతో ప్రణాళికా బద్ధంగా పొదుపు, మదుపు చేస్తూ వచ్చారు గనక హాయిగా చీకూ చింతా లేని వృద్ధాప్య దశకు చేరుకున్నారు. భార్య ఆయనకు నిజంగా అర్ధాంగి. అనుకూలవతి. వాళ్లిద్దరూ అంత వయసున్నట్టు కనిపించక పోవడం..
పిల్లలు కొంచెం ఘనం గానే షష్టి పూర్తి జరిపి తమ తల్లి దండ్రులు తమను ఎంత బాగా పెంచి, పెద్ద చేసిందీ..ఆహుతులైన చుట్టాలు, సన్నిహితులు, స్నేహితుల మధ్య తలచుకుని వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకున్నారు.
ఆ షష్టి పూర్తి అయిన ఆరు నెలలకు రాజా రావు పిల్లల్ని సకుటుంబ సపరివారంగా రమ్మని మెయిల్ చేశాడు.
తండ్రి అంత హఠాత్తుగా తమను ఎందుకు రమ్మన్నారో తెలీక ఆశ్చర్య పోయినా, వచ్చేశారు.
అందరితో నాల్రోజులు ఆహ్లాదంగా గడిపాక, రాజారావు ఓ సాయంత్రం ఇంటి డాబా పైన అందర్ని సమావేశ పరచి-
"నాకు తెలుసు మీరందరూ ‘నేనెందుకు రమ్మన్నానో’ అని ఆశ్చర్య పోతున్నారని. మనిషి పుట్టి, పెరిగి, చదువు పూర్తయ్యే వరకు బాధ్యతల బరువు అంతగా తెలియదు..కాని ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వాళ్ల పెంపకం ఇవన్నీ రాను రాను బాధ్యతల బరువును పెంచడమే కాదు, మనిషిని యాంత్రికం చేస్తుంది. అనుభూతుల్లేని మర మనిషిని చేస్తుంది. వృద్ధాప్య దశ మరీ దారుణం. ఒక పక్క వ్యాధులు, మరో పక్క వృద్ధాప్యం, ఇంకో పక్క ఆర్థిక లేమి వల్ల అయిన వాళ్ల నిరాదరణ కుంగ దీస్తుంది. అయితే ఇవన్నీ నేను కుర్ర తనంలోనే విజువలైజ్ చేసుకోవడం వల్ల సరైన ప్రణాళికలతో ఈనాడు ఆర్థికంగా బలంగా ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నాను. మళ్లీ జన్మ ఉంటుందో, ఉండదో, ప్రతి మనిషికీ తన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించే హక్కు ఉంది. చాలా మంది తమ పిల్లలకు రెక్కలొచ్చాక కూడా తామే కష్ట పడుతూ, మనవలూ, మనవరాళ్ల పాలన పోషణలో తల మునకలవుతుంటారు. అంటే, మళ్లీ యాంత్రికతకు చేరువవుతారన్నమాట. అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను-" అని కాస్తాగి,
"మిమ్మల్ని మీ మీ జీవితాల్లో సెటిల్ అయ్యేలా చేశాము. మీకు ఇవ్వాల్సినవన్నీ వీలునామాలో రాశాను. ఇహ మేము మీ నుంచి ఐసోలేట్ అవుతాము. భగవంతుడు మాకు ఇచ్చిన జీవితాన్ని ఫల వంతం చేసుకుంటాము. రేపటి నుంచీ మా ఇద్దర్కీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కొంత కాలం తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మా అంతట మేము హోం ఫర్ ది ఏజ్డ్ లో చేరి పోతాం... మీ అందరూ అభినందనల గ్న్ సిగ్నలివ్వండి. మాదైన జీవితం మమ్మల్ని గడపనివ్వండి. సరేనా?"అన్నాడు.
అందరి మనసులు కాసేపు బరువెక్కాయి..కాని అంతలోనే చప్పట్లతో అభినందనలు తెలిపారు.
****
రమణీ "కాఫీ..కాఫీ ఏదోయ్"
"తెస్తున్నానుండండీ.."అని క్షణాల్లో కాఫీ కప్పుతో భర్త ముందు ప్రత్యక్షమయింది.
"చూడు రమణీ, నిజంగా మనం అనుభవించ బోయేది కొత్త జీవితం. మనం ఎలా కావాలనుకుంటున్నామో అలాంటి జీవితం. అప్పుడు మనం అనుభవించింది ఆదరా బాదరా జీవితం. ఎవరో తరుముకు వస్తున్నట్టు ఉండే దాంట్లో మాధుర్యం ఉండదు. ఇదే అసలైంది. ఏ బాదర బందీ లేనిది."అని కన్ను గీటాడు.
ఆవిడ కాఫీ కప్పు ఆయన చేతికిచ్చింది. ఆయన కొద్దిగా తాగి "అరే, చక్కెరెయ్యడం మర్చి పోయావు"అన్నాడు. ఆవిడ అమాయకంగా "చక్కెర ఎప్పట్లానే వేశానే" అంది.
"నువ్వు చక్కెర ఎప్పట్లానే వేశావు..కాని నేనే ఎప్పట్లా కాకుండా, నిన్ను ముద్దెట్టుకు తాగాను.. అందువల్ల చేదుగా ఉంది. నువ్విప్పుడు ఎంత చక్కెర వేసినా, కాఫీ తియ్యగా ఉండదు..పోనీ ఓ పని చేద్దాం..కాఫీ బదులు ముద్దులతో అధరామృతం తాగేద్దాం ఇద్దరం. ఏవంటావు?"అన్నాడు నవ్వుతూ.
ఆ తర్వాత కంప్యూటర్ ముందు నుంచీ మధ్యాహ్న భోజనానికి లేస్తూ-"రమణీ, దిల్లీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. రేపు రాత్రి పున్నమి వెన్నెల్లో మనిద్దరం తాజ్ సోయగం చూడ బోతున్నాము. ప్రేమికులకు అదో మథురానుభూతిట. సో అది మనం చవి చూడ బోతున్నాం. బట్టలు సర్దుకుందాం పద.."అని తొందర బెట్టాడు.
*****
"చూడు రమణీ..ఆకాశం వెన్నెల గుమ్మరిస్తుంటే తాజ్ అందం చూడు..అసలు అది ముంతాజ్ సమాధి అనుకుంటారా? చూసే చూపు, మనసులోని భావన గొప్ప ప్రణయానుభూతికి లోను చెయ్యడం లేదూ..అసలు ఏవేవో మధురోహలు మనసును చిలికేస్తున్నాయి. కదూ.."అని రమణిని దగ్గరకు తీసుకుని బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. రమణికి ఆ వయసులో కూడా శరీరం వెచ్చనై..హృదయంలో వలపు ఉప్పొంగుతోంది. ఆ ప్రదేశమే అంత వయసు వెనక్కు మళ్లుతుంది.
ఆ రాత్రి అక్కడి రెస్టారెంట్ లో భోంచేసి, దిల్లీలో ముందే బుక్ చేసుకున్న హోటల్ రూమ్ కు వెళ్లారు. కొత్త జంటలకు హనీమూన్ స్పెషల్ ప్యాకెజ్ అందించే ప్రత్యేక హోటల్ అది.
వాళ్ల రూమ్ కూడా మరీ ఆడంబరంగా కాకపోయినా కమ్మని సువాసనతో ఆహ్లాదానుభూతిని అందజేసేట్టుగా డెకరేట్ చేసి ఉంది. లోపలికి అడుగుపెట్టంగానే ఆ వయసులో కూడా వాళ్ల మనసుల్లో చిలిపి ఊహలు చిందులు వేయసాగాయి. టేబుల్ మీద ఒక పక్కగా ‘కొత్త దంపతులకు స్వాగతం, మీకు మా ఆతీథ్యం నచ్చితే, మీ పిల్లలకు కూడా పెళ్లిలయ్యాక హనీమూన్ కు ఇక్కడికే పంపగలరు..మధురానుభూతిని మంచి డిస్కౌంట్ తో అందిస్తాం. మనోహరమైన రాత్రిని అనుభవించండి’అని ఇగ్లీష్ లో రాసి ఉంది. మేనేజ్ మెంట్ చమత్కారానికి ఇద్దరికీ నవ్వువచ్చింది.
"ఆ వార్డ్ రోబ్ లో నాకు పంచె, నీకు తెల్ల చీర ఉన్నాయి. స్నానం చేసి బట్టలు కట్టుకుంటే, హోటల్ వాళ్లు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కు ఫ్రీ ట్రీట్ ఏర్పాటు చేస్తారట! పద..క్విక్" అన్నాడు.
ఇద్దరూ ప్రిపేరై రిసెప్షన్ కు ఇన్ ఫాం చేసిన పావు గంటకు చక్కటి భోజనం తెచ్చి వడ్డించి, తిన్నాక పసందైన పాన్ ఇద్దరి చేతుల్లో పెట్టి ’ స్వీట్ డ్రీమ్స్’ చెప్పి వెళ్లి పోయారు.
గదిలో డిమ్ లైట్, మంద్రంగా సంగీతం వినిపిస్తోంది. ఆ వయసులోనూ ఇద్దరిలో కోర్కెలు రెక్కలు విరుచుకుంటున్నాయి. ఆ వివసత్వంలో ఎవరు ఎవరిని మొదలు చేరారో కాని, ముద్దులు, కౌగిలింతలు, మధురానుభూతులు అన్నీ ఒక్కటొక్కటిగా సొంతం చేసుకున్నారు.
*****
"ఏవోయ్, రాత్రి అనుభవం ఎలా ఉంది"అడిగాడు రాజారావ్.
"నాకు మరో జన్మలా ఉంది. ఈ జన్మకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టమైతే ఇది నిజంగా మరో జన్మ"అందావిడ ఆనంద బాష్పాలు కళ్లలో నిండగా..
"పిచ్చీ..ఇదేం చూశావు..మన జవ సత్వాలుడుగిపోయేలోగా మనం స్వర్గపుటంచులు చూస్తాం. ఆ తర్వాత ఆధ్యాత్మిక యాత్రలూ చేద్దాం. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన సంతృప్తితో తనువు చాలిస్తాం. ఇవాళ రాత్రి ఊటీ బయలు దేరుతున్నాం. రేపు రాత్రి అక్కడి హోటల్ గదిలో..మనిద్దరం"
"అబ్బా..సిగ్గేస్తోందండీ"అంటున్న ఆవిడను గట్టిగా పెనవేసుకున్నాడు.
***