నిఖిల్ ఇంట్లో మాయమై వీధిలో తేలాడు.
నడుం వయ్యారంగా తిప్పుతూ కాళ్ళకు నృత్య భంగిమలు అప్పగించాడు. కుడి చేతిలో వున్న చిన్న చేసంచిని విష్ణు చక్రంలా తిప్పాసాగాడు. తేప, తేపకు తన షర్టు ముందు జేబులోకి తొంగి చూస్తూ అందులో మిసమిసలాడే ఏబది రూపాయల నోటును గుండెలకు హత్తుకుంటున్నాడు. ఇది సాధారణ విషయమే అయినప్పటికీ ఈరోజు తాను కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. అందుకే అతనిలో అంత ఉత్సాహం..
నాలుగు చక్రాల బండిపై జామకాయలు కనబడగానే నిఖిల్ కాళ్ళకు బ్రేకులు పడ్డాయి.. వెదక పోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు..
“కిలో ఎంత?..’’ అడిగాడు బండి ఆసామిని.
“అరవై రూపాయలు’’ అన్నాడు.
“నలబైకిస్తావా..?’’
“లేదు బాబు.. నాకు గిట్టుబాటు కాదు.. చివరికి ఎబైకిస్తా..’’
నిఖిల్ అలోచనలో పడ్డాడు తన ప్రయోగం గుర్తుకు వచ్చింది. కిలో నలబై అయితే బాగుండును..
మరో చోట కనుక్కుందామని గెంతులు వేస్తూ బయలుదేరాడు.
మరో బండి అబ్బాయి జామకాయలు నలబైకిస్తానన్నాడు.
నిఖిల్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. మరోచోట అడిగితే యింకా తగ్గ వచ్చు అనుకుంటుంటే.. ఒక రైతు రోడ్డుపై కూర్చొని జామకాయలు అమ్ముతూవుండటం నిఖిల్ కంట పడింది.
రైతు వద్దకు వెళ్ళాడు.
“తా.. తా.. జామకాయలు కిలో ఎంత..”
‘ముప్పై రూపాయలు బాబూ..”
నిఖిల్ మనసులో నవ్వుకోసాగాడు. తానూ అనుకున్నట్లే జరుగుతోంది.. తన ప్రయోగం ఫలిస్తోంది.
పట్టుమని పదేండ్లు లేని నిఖిల్ అలా అశల పందిరిలా బేరాలాడుతూ రావటం గమనించిన రైతుకు ముచ్చటేసింది.
“బాబూ మాతోట్లోకి వెళ్ళావంటే మానాన్న జానయ్య నీవన్న రేటుకిస్తాడు’’ అన్నాడు. నిఖిల్ ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ రోజు తన అదృష్టం పండింది అనుకున్నాడు.
ఒకే వస్తువు నాలుగు చోట్ల తిరిగితే నాలుగు రకాల ధరలు.. తాతయ్య తన తోటలోకి రమ్మంటున్నాడు. వెళ్తే ఎంచక్కా యింకా తక్కువధరకే కొనుక్కోవచ్చు. అని మనసులో ఉవ్విళ్ళూరగానే
“సరే తాతయ్యా..’’ అంటూ ఎగిరి గంతు వేసాడు.
తోటకు దారి తెలుసుకున్నాడు.. అక్కడికి అది మరో కిలోమీటరు దూరం. హుషారుగా చేసంచి గాలిలో ఊపుకుంటూ పరుగు తీసాడు నిఖిల్.
తోట లోకి అడుగు పెట్టగానే ఆశ్చర్య పోయాడు. తోట లోని జామ చెట్లను.. వాటికి విరగ కాసిన జామ కాయలను చూసి నిఖిల్ తబ్బిబ్బయ్యాడు.
“జానయ్య తాతా.. ఈ చెట్లన్నీ నీవేనా.. ’’ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అక్కడున్న పండు ముదుసలిని చూస్తూ ..
“అవును మనుమడా.. నా కొడుకు ఫోన్ చేసి చెప్పాడు నువ్వు వస్తున్నావని.. చెట్టెక్కి నీకు కావాల్సిన జామ పండ్లన్నీ కోసుకో..’’ అన్నాడు జానయ్య.
“ఎన్ని డబ్బులివ్వాలి.. నావద్ద ఎక్కువ లేవు..’’ అన్నాడు నిఖిల్ బుంగ మూతి బెడ్తూ..
“డబ్బులు ఏమీ వద్దు.. నన్ను తాతా అని ప్రేమతో పిలిచావు... అది చాలు’’ అంటుంటే జానయ్య కళ్ళు చెమ్మగిల్లాయి తన మనుమని అకాల మరణం జ్ఞప్తికి వచ్చి.
నిఖిల్ ఆనందం హద్దులు దాటింది.. తనను తాను మర్చిపోయాడు. అమితోత్సాహంతో చెట్టెక్కాడు. కాయలు కోసుకుంటూ తన చేసంచిని నింపకో సాగాడు. పెద్ద సంచిని తేస్తే బాగుండేదని విచారించాడు. బుర్ర వేగంగా పనిచేస్తోంది.. వెంటనే తన షర్టు విప్పి అందులో జామపండ్లు నింప సాగాడు. ఒక చేత్తో సంచి.. షర్టు.. మరోచేత్తో పండ్లు కోస్తూ నోటికి సైతం పని అప్పగించడంతో పట్టు తప్పింది.. దభాల్న కింద పడిపోయాడు.
“తాతా ..’’ అంటూ గావు కేక పెట్టాడు. నిఖిల్ నోట్లో నలిగిన సగం జామ పండు బయట పడింది.
***
కాలు విరిగి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు నిఖిల్..
ఇదంతా.. నా నిర్వాకమే..” అన్నాడు నిరంజన్ రావు. నిఖిల్ తల్లి ఆశ్చర్య పోయింది కడ కొంగుతో కన్నీళ్ళు తుడ్చుకుంటూ..
“ ఒక రోజు నేను నిఖిల్ ను తీసుకుని ప్రూట్ మార్కెట్ కు వెళ్లాను. ఒకే రకమైన పండ్లు ఒక్కోచోట ఒక్కో ధర వుండటం.. తక్కువ వున్న చోట కొనుక్కోవాలని సలహా యిచ్చానే గాని వాటి నాణ్యత గురించి నేను వివరించ లేదు. వాడు ఈ రోజు చేసిన ప్రయోగం ఇదే. వాడు బజారుకు వెళ్తూ తక్కువ ధరలో జామ పండ్లు కొనుక్కొని మిగిలిన డబ్బులతో చాక్లెట్ కొనుక్కుంటా నాన్నా అన్నాడు నాతో. తీరా జామ తోటను చూసే సరికి వానిలో అత్యాశ కల్గింది. మనిషికి ఆశ సహజమే కాని అత్యాశ వుండకూడదు.. అత్యాశ అనర్థానికి మూలం.’’ అంటుంటే నిఖిల్ కన్నీరు యిక ముందు అత్యాశకు వెళ్ళమని చెబుతున్నాయి.