అత్తంటే - ప్రశాంతి

attante..

సిస్టెం లో తలదూర్చి సీరియస్ గా పనిచేసుకుంటున్న నాకు, ఎదురుగా టేబుల్ మీదున్న ఫోన్ బీప్ సౌండ్ తో ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చినట్టయ్యింది...రిసీవర్ ఎత్తి పట్టుకుని, " హలో " అన్నాను...అవతలి వైపు నుంచి రిసెప్షనిస్టు...." మేడం..మీ హజ్బండ్ లైన్లో ఉన్నారు..." అంటూ ఫోన్ ఆదిత్యకిచ్చింది...చాలా సాఫ్ట్ వేర్ కంపనీల్లోలాగే మా ఆఫీసులో కూడా మొబైల్ ఫోన్లు లోపలికి అలో చెయ్యరు....ఏదైనా అర్జెంట్ ఉంటే ఆఫీసుకి చేయాల్సిందే. ఇప్పుడింత అర్జెంటుగా చెయ్యాల్సిన అవసరమేంటాని ఆశ్చర్యపోయాను..." హలో...స్వాతీ....ఈరోజు వీలైతే పర్మిషన్ పెట్టి కాస్త పెందరాళే ఇంటికి చేరుకోగలవా..? అమ్మా-నాన్నా హైదరాబాద్ నుండి వచ్చారు...పక్క ఫ్లాట్ లో రిలాక్సయ్యారు టెన్షనేం లేదుగానీ...ఎంతసేపని వాళ్ళింట్లో ఉంటారు...??నాకేమో ఆఫీసులో కదలలేని సిచ్యుయేషన్ ఉంది..." అన్నారు ఆదిత్య. " అవునా...సరేనండీ....ఇప్పుడేగా లంచ్ హవర్ అయిపోయిందీ...హాఫ్ డే లీవ్ పెట్టేసి వెళ్తాలెండి " అని చెప్పి ఫోను పెట్టేసాను..మా పెళ్ళయి ఆర్నెల్లయింది..నాకు ప్రెగ్నన్సీ కంఫర్మ్ అని గుడ్ న్యూస్ తెలియగానే మా అమ్మా-నాన్నా వచ్చి వెళ్ళారు. హైద్రాబాద్ లో పనులూ అవీ చూసుకుని మా మామగారూ, అత్తగారూ ఈరోజే వచ్చారు. ఇద్దరమూ ఉద్యోగస్తులమే కావటంతో ఇంటి కీ చెరొకరి దగ్గర మాత్రమే ఉంటుంది..ఎవరైనా ఇంటికొస్తే రిసీవ్ చేసుకోవడానికి ఎవరో ఒకరం ఉండాల్సిందే....లీవ్ పెట్టేసి ఆటోలో ఇంటికి బయల్దేరాను...

**************************

నేను వచ్చిన అలికిడి వింటూనే పక్కఫ్లాట్ లో కూర్చుని మాట్లాడుతున్న అత్తయ్యగారూ, మామయ్య గారూ బయటికి వచ్చారు..వాళ్ళను చూడగానే బాగున్నారా అత్తయ్యగారూ..అంటూ ఇద్దరి కాళ్ళకూ నమస్కరించాను...." ఏమ్మా ఎలా వున్నావు.." ఆప్యాయంగా పలకరించారు మామయ్య గారు... "ఆరోగ్యం ఎలా వుందమ్మా..." అత్తయ్య కళ్ళల్లో ప్రేమ, చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయైనా కించిత్ గర్వం లేదన్న మెచ్చుకోలు స్పష్టంగా కనిపించి..చాలా సంతోషం కలిగింది నాకు....

డోర్ లాక్ తీసాను...లోపలికెళ్ళి రిఫ్రెష్ అయి వాళ్ళ భోజనాలకు గబగబా వంటపని మొదలెట్టాను....

************

"ఏంటమ్మా.....ఇంతలోనే ఇన్ని ఐటంస్ రెడీ చేసేసావా....." డైనింగ్ టేబుల్ మీద నీట్ గా పెట్టి ఉంచిన డిషెస్ అన్నీ చూస్త్తూ అన్నారు మా అత్తగారు..

సంతోషంగా, ఒకింత గర్వంగా అనిపించింది ఆ ప్రశంసకి...." అవునత్తయ్యా "అన్నాను చిరునవ్వుతో...అవీ ఇవీ మాట్లాడుకుంటూ భోజనాలు కానిచ్చేశాము..

*************************

మా అత్తగారూ మామగారూ వచ్చి అప్పుడే నాలుగు రోజులు గడచిపోయాయి...

ఎవరిమటుకు వాళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోతే వాళ్ళను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు లేక బోర్ ఫీలవుతారని పదిరోజులు లీవ్ పెట్టేశాను. ఆదిత్య కంటిన్యూగా లీవ్ పెట్టకపోయినా అప్పుడప్పుడూ పర్మిషన్లు తీసుకుని త్వరగా వచ్చి అందర్నీ బయటికి తీస్కెళుతున్నారు...

ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఇంటిని సరిగా చూసుకోలేరనీ...ఈతరం అమ్మాయిలకి తమ చదువూ-కెరీర్ కంటే మరేదీ ముఖ్యం కాదన్న ఫీలింగ్ బహుశ అంతకుముందు ఉండేదేమో మా అత్తగారికి ఆ అభిప్రాయం కాస్తా నా దినచర్యనూ, ఇంటిని ఒంటిచేత్తో సరిద్దుకోవడమూ వాళ్ళకి అన్నీ అమర్చడమూ చూసింతర్వాత తొలగిపోయిందనిపిస్తోంది...

************

కిటికీ పక్కన బాల్కనీలో నిలబడి వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతుకుతున్న నాకు బెడ్ రూం లోంచి అత్తయ్యా-మామయ్య గార్లు మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి...

" ఏమండీ...మనమిక త్వరగా బయల్దేరి హైద్రాబాద్ వెళ్ళిపోదామండీ..." అంటున్నారు అత్తగారు...

" అదేమిటి...? కొన్నిరోజులు ఉండి వెళ్దామనుకున్నాం కదా..అప్పుడే తొందరేమొచ్చిందీ...?" అడిగారు మామగారు...అత్తయ్యగారేం చెబుతారో అని నాకూ కుతూహలంగా ఉంది...నావల్లేమైనా పొరపాటు జరిగిందా..? మర్యాదలో లోటేమైనా కలిగించానా....అని ఒక్క క్షణం గుండె దడదడలాడింది కూడా..

కానీ అత్తగారు చెప్పిన సమాధానం విన్న తర్వాత కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను..." అది కాదండీ...కొత్తగా పెళ్ళయిన జంట....నీళ్ళోసుకున్న కోడలు పిల్లకు నా చేతనైనదేదో చేసిపెడదామనుకుని వచ్చానా...తీరా ఇక్కడి వచ్చాక మనమే కూర్చుని తన చేత చేయించుకోవడానికొచ్చినట్లయింది...ఒక్క పనీ నన్ను ముట్టుకోనివ్వడం లేదు...నేనెంత ఉదయాన్నే లేచి ఏదైనా చేద్దామనుకొంటే తను అంతకంటే ముందే లేచి అన్ని పనులూ చేసుకుంటోంది..."

అది నిజమే...అయినా ఎంతమంది అత్తలు తమ కోడళ్ళ గురించి ఇలా పాజిటివ్ గా మాట్లాడతారు...అని అనుకుని పొంగిపోయాను..

మర్నాటినుండీ మా అత్తగారి ప్రవర్తనలో విచిత్రంగా ఏదో మార్పు కనిపించింది....ముభావంగా ఉండడం...ఏదడిగినా " నీ ఇష్టమమ్మా....అలాగే చెయ్యి...సరే..." అనడం గమనించాను. ఎంత ఆలోచించినా కారణమేమిటో అంతు చిక్కలేదు నాకు....

*******************

అదే ఆలోచిస్తూ పరధ్యాన్నంగా ఉన్న నన్ను మావారు " ఏమిటి రామయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటికి పైకప్పు దేనిటొ వేద్దామనా" అని నవ్వుతూ అడిగారు..." లేదు సోమయ్యా అత్తగారి మనసులో ఏముందో తెలుసుకోవడామనీ..." నేను అన్నాను జవాబుగా...ఇందులో ఆలోచించడానికేముందీ? అమ్మనే అడిగితే సరిపోతుంది కదా" అన్నారు మావారు...కామెడీగా స్టార్ట్ అయినా మామధ్య ఈ విషయం సీరియస్ గానే చర్చకు దారి తీసింది...చివరగా..." పోనీ మీకైనా తెలిస్తే చెప్పండీ అత్తయ్య గారు ఎందుకలా ఉంటున్నారు? నావల్లేమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాను...." గద్గద స్వరంతో అడిగాను ఆదిత్యని. ఏడుపొక్కటే తక్కువ నాకు...అలా వుంది...

నేనత సీరియస్ గా అడిగితే ఆయనేమో...చానల్ న్యూస్ రీడర్ లా పోజు పెట్టి...." కోడలికి శ్రమ కలిగిస్తున్ననని బాధ పడుతున్న అత్తగారు ఓ పక్క.....అత్తగారి మనసేమైనా నొప్పించానేమోనని బాధపడుతున్న కోడలు....ఆహా అత్త..ఓహో కోడలు...ఇద్దరిలో ఎవరికి మీరు మార్కులేస్తారు...." అన్నారు... ఆయనంత కామెడీగా దాటేస్తున్నా, నాకెందుకో ఆయనకి విషయమేదో తెలుసని అనిపించింది కానీ అడిగే ఓపిక లేక ఆయన కౌగిట్లో..నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాను....

***********************

కప్పుకున్న దుప్పటి తీస్తే ఒకటే చలి.....కడుపులోంచి చలి తన్నుకొస్తోంది. ఎవరో తలుపు తడుతున్నట్టు వినిపిస్తోంది కానీ లేవడానికి శరీరం స్వాధీనంలో లేదు...ఇంత రాత్రప్పుడు ఎవరబ్బా అనుకుంటుండగానే ఆయనెళ్ళి తలుపు తెరిచారు...అత్తయ్యగారు కాబోలు అడుగుతున్నారు.." ఆదీ...ప్రతిరోజూ ఇంతకన్నా ముందే లేచే కోడలు పిల్ల ఇవాళ లేవలేదేమిట్రా?" అని.. ఓ తెల్లారుతోందా..అయితే నేను రాత్రంతా ఇలాగే వణుకుతూన్నానా...." అనుకున్నాను....బహుశ ఆయన కూడా అత్తయ్య గారికి అదే మాట చెప్పినట్టున్నారు. నొచ్చుకుంటూనే అత్తయ్య లోపలికొచ్చి మంచం మీద కూర్చుని, నా నుదుటి మీద చెయ్యేసి " అయ్యో జ్వరం కాలిపోతోందిగా... అంటూ వెళ్ళి చల్లని నీళ్ళతో ఒళ్ళంతా తుడిచారు...గబగబా వంటింట్లోకి వెళ్ళి ఏవేవో కలిపి వేడివేడి కషాయం పెట్టి తీసుకొచ్చారు....చేదుగా వుంది నేను తాగనని మొరాయిస్తున్నా లాలించి తాగిస్తూంటే అత్తయ్యలో మా అమ్మే కనిపించింది నాకు...కాస్త నెమ్మదించినట్టనిపించి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు...

********************

అమ్మాయ్....స్వాతీ...లేమ్మా లేచి బ్రష్ చేసుకో...జ్వరం పూర్తిగా తగ్గింది....వేడివేడి అన్నం...టమాటా రసం రెడీ చేసాను...తీసుకొస్తాను....తింటే జ్వరం టాబ్లెట్ కూడా ఇస్తాను నా తలమీద చెయ్యేసి లాలనగా అంటున్నారు అత్తగారు.... మెల్లిగా లేచి బ్రష్ చేసుకుని అత్తగారు కలిపి పెట్టిన అన్నం తిని టాబ్లెట్ వేసుకున్నాక రిలీఫ్ గా అనిపించింది...." ఈయన ఆఫీసుకి వెళ్ళిపోయారా అత్తయ్యా... బాక్స్ పెట్టి ఇచ్చారా..? " అనడిగాను...లేదమ్మా...వెళ్ళి సెలవు పెట్టి వచ్చేస్తానన్నాడు.. బహుశ ఈపాటికి రావచ్చు...మీ మావగారు కూడా వాడితోనే కలిసి బయటకెళ్ళారు అని చెప్పారు అత్తయ్య. ఇంతలో నా సెల్ ఫోన్ రింగయ్యింది..చూస్తే ఆయనే....మాట్లాడే ఓపికలేదన్నట్లు మొహం పెట్టేసరికి అత్తయ్యే లిఫ్ట్ చేసి మాట్లాడారు.. లీవ్ పెట్టడం కుదరలేదని చెప్తున్నట్టున్నారు ఆయన..నాకెలా ఉందని అడిగినట్లున్నారు. ఏం పర్లేదు నాయనా...నేను చూసుకుంటాగా...నువ్వేం టెన్షన్ పడకు...జ్వరం కూడా తగ్గింది..కషాయమూ, టాబ్లెట్ అన్నీ పడ్డాయిగా..ఏం భయపడనక్కర్లేదులే... అని చెప్పి పెట్టేసారు. ఇంట్లో జ్వరం టాబ్లెట్లు ఉండగా అత్తయ్య గారు నాకు కషాయమెందుకు కలిపిచ్చారో నాకర్థం కాలేదు...ఏమనుకుంటారో అని భయమనిపించినా అడిగేశాను అదేమాట. పెద్ద కారణమేం లేదమ్మా....ముందుగా మన ఒంట్లోనే తట్టుకునే శక్తి కొంత ఉంటుంది. కానీ కొంత వ్యవధి ఇవ్వాలి. లేదా సహజంగా సాంత్వన కలిగించే లక్షణాలున్న ఇంట్లోని దినుసులతో కాస్త ఉపశమనం కలిగించవచ్చు.... అలా కాక ఏమాత్రం చిన్న చిన్న ప్రాబ్లంస్ వచ్చినా అమాంతం టాబ్లెట్లతో మటుమాయం చేసేసుకోవాలనుకుంటే మాత్రం రోగనిరోధక శక్తిని కోరి నిర్వీర్యం చేసుకున్నట్టే...." కొత్తగా అనిపించింది....ఏదొచ్చినా ఏ కార్పొరేట్ క్లినిక్ కో వెళ్ళడం వాళ్ళిచ్చిన మందులు మింగడమే కానీ ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు...అత్తయ్య గారిలో ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపించారు నాకు...కాలింగ్ బెల్ శబ్దం వినిపించి లేవబోయేసరికి నన్ను వారించి అత్తయ్య గారే వెళ్ళి తలుపు తీసారు... కిరాణా షాపు వాడు సామాన్లు తెచ్చినట్టున్నాడు..మెల్లిగా వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చున్నాను..." ఎంతయింది " అనడిగి కాష్ తెచ్చివ్వబోయాను.. నన్ను ఆగమని అత్తయ్య గారు కిరాణా షాపు అబ్బాయి చేత ఒక్కొక్క వస్తువూ తీసి లెక్క మరోసారి వేయించేసరికి దాదాపు రెండు వేలు తేడా వచ్చింది....ఇలా అయితే ఇంకోషాపు నుంచి తెప్పించుకుంటాము...ఈసారి నుంచి లెక్కలు సరిగ్గా వెయ్యి అని వాడిని మందలించి డబ్బులిప్పించి పంపేసారు అత్తయ్య...ఇలా వాడ్నెప్పుడూ నిలదీసింది లేదు... ఫైనల్ అమౌంట్ ఎంతయిందో అడిగి వాడెంత చెప్తే అంతా ఇచ్చి పంపెయ్యడమే తెలుసు నాకు. ఆశ్చర్యంగా చూస్తున్న నాకు అత్తయ్య గారు ఇలా చెప్పరు...చూడమ్మా...సంపాదించడంతోబాటు సద్వినియోగం చేయడమూ ముఖ్యమే... ఇవాళంటే వస్తోంది కాబట్టి లెక్కలు చూసుకోకుండా ఖర్చులు పెట్టేస్తారు..రేపు నీ డెలీవరీకి లీవ్ పెడతావనుకో..ఆర్నెల్లో..సంవత్సరమో..అప్పుడు ఒక్కడి జీతమేగా వచ్చేదీ....ఇప్పడ్నుంచే అన్నిట్లో కాస్త చెయ్యి వెనక్కి లాగాలమ్మాయ్"...అత్తయ్యగారు చెప్తుంటే ఆవిడలో ఒక గొప్ప ఫైనాన్షియల్ ప్లానర్ కనిపించారు నాకు....నా ప్రశ్నలకు మెల్లిగా సమాధానం లభించినట్లే అనిపించింది....వచ్చినప్పట్నుంచీ ఆవిడను చేతకాని ముసలావిడలా భావించి కూర్చోబెట్టి అన్నీ చేసుకుపోతున్నానే కానీ, ఆవిడ నుంచి ఏ సలహా తీసుకోలేదు... నేర్చుకోవడానికి ప్రయత్నించలేదు..బహుశ అత్తయ్య గారి ఆత్మాభిమానం దెబ్బతినడానికి, ముభావంగా ఉండడానికీ కారణం ఇదేనేమో....సంసారంలో, వ్యవహారంలో ఆవిడ నాకన్నా సీనియర్...ఎంతయినా అత్తయ్య గారినుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది...కాలం మారినా పరిస్థితులు మారినా సంసార-వ్యవహారాలు చక్కబెట్టుకునే లౌక్యం చాకచక్యం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది....ఇవన్నీ ఆవిడ ఎప్పుడో చూసేసిన పరిస్థితులు.....అమాంతంగా అత్తగారు చాలా ఉన్నతంగా కనిపించారు..మా అమ్మలాగా...క్లాసులో టీచరు లాగా...

************************

"ఏమండీ ఏం మాట్లాడరేమిటీ నేను అడిగిందానికి....? "

నిలదీసాను ఆయన్ని....

" ఏం మాట్లాడమంటావు స్వాతీ...అన్నీ నువ్వే గ్రహించావు...నువ్వే సరిదిద్దుకున్నావు.."

అయితే ఆరోజు రాత్రి ఆయనకేదో తెలుసని నా మన్సు గ్రహించిన నిజం ఇదేనేమో...

మళ్ళీ ఆయ్నే అన్నారు..

చూడు స్వాతీ..మా చిన్నప్పట్నుంచీ మా నాన్నకి ఉద్యోగానికి వెళ్ళి రావడం, వచ్చిన జీతం అమ్మ చేతికివ్వడం తప్ప ఏ వ్యవహారాలూ పట్టేవి కావు. అన్నీ అమ్మే చూసుకునేది... ఎవరికేది కావాలో ఆమెకు బాగా తెలుసు....ఒక రకంగా బొమ్మరిల్లు ఫాదర్ లాగా బొమ్మరిల్లు మదర్ అనుకో.......ఏమీ చెయ్యని వాళ్ళకి చెయ్యమంటే నచ్చదు.. కానీ అందరికీ అన్నీ అమర్చిన మా అమ్మ లాంటి వాళ్ళకి నువ్వు ఇల్లు చక్కబెట్టుకుంటుంటే, ముందు సంతోషం కలిగినా తన ఉనికిని ఏమాత్రం గుర్తించకపోవడం బాధే కలిగిస్తుంది....అలాగని అయినదానికీ కానిదానికీ కోడలిని తప్పు పట్టి సాధించే మనస్తత్వం కాదు గనక తనలో తానే బాధపడింది....."

గట్టిగా నిర్ణయించుకున్నాను....ఆవిడను గౌరవించి..ఆవిడనుంచి నేర్చుకుంటూనే...ఆవిడకే ఇబ్బందీ రాకుండా చూసుకోవాలని...అలా నిర్ణయం తీసుకున్నాక నా మనసు తేలయింది...

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు