శ్రీనివాస్..ద సోల్జర్ - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

srinivas the soldier

సోల్జర్ శీనివాస్! తన భర్త.

దేశంకోసం అనుక్షణం తపిస్తూ, దేశరక్షణలో సరిహద్దు వెంబడి పహారా కాస్తూ శత్రు సైనికుల చొరబాటును నిరోధించే్ పులి.

తన పెళ్లై ఏడాదయింది. శీనివాస్ సెలవు మీద వచ్చి హడావుడిగా తనను చుసి, మూడుముళ్లేసి సొంతం చేసుకుని, మూడు రాత్రుల మధురిమను తన గుండెల్లో ప్యాక్ చేసి మళ్లీ వస్తానని చెప్పి డ్యూటీలో జాయినైపోయాడు.

అప్పటినుంచీ పున్నమిరాత్రి, విచ్చిన పువ్వులు, మంచి గంధం లాంటివన్నీ శ్రీనివాస్ గాఢ పరిష్వంగం గుర్తుచేసి, మనసును పిచ్చెకిస్తుండేవి. స్నానిస్తున్నప్పుడు, బట్టలు కట్టుకుంటున్నప్పుడు శరీరంలోని అణువణువూ అతను కేంద్రీకరింపజేసిన స్పర్శానుభూతులు గిలిగింతలు పెడుతూండేవి. ఏం చేయగలం? దేశాన్ని కాపాడ్డం అతని విధి. తనకు, అతనికోసం విరహోత్కంఠితలా ఎదురుచూసే శిక్ష విధించింది విధి.

రేపు తెల్లారితే ఉగాది.

ఎండలు మండిపోతున్నా, చెట్లు లేచివుళ్ల దుస్తులేసుకుని, విరిసిన పుష్పాలతో గాలి తెమ్మెరలపై సయ్యాటలాడుతున్నాయి.

మామిడి చెట్లకున్నపిందెలు చెట్లకి కొత్తందాన్ని సంతరింపజేశాయి. వేప చెట్లు తెల్లటి పూతతో వెలుగులో కూడా వెన్నెల ముసుగేసుకున్నట్టున్నాయి. కోకిల కమ్మని కూజితాల భావగీతాలు అందరి మనసుల్నీ మైమరపిస్తున్నాయి. కొత్త సంవత్సరపు మొట్టమొదటి పండగ, అంతేకాకుండా నా పెళ్లై సంవత్సరం కూడా కాలేదు అంచేత మా ఇంటికి కూడా నాన్న పేయింట్లేయించి తోరణాలు కట్టించాడు.

"పెళ్లయిన తర్వాత మీ జంటకి వచ్చిన మొదటి ఉగాది పండగ, అల్లుడుగారు సెలవు దొరకలేదన్నాడు కాని ఎలాగైనా వీలు చూసుకుని వస్తే ఎంతబావుండేది?"అన్నాడు మైథిలీ తండ్రి భూషణ్ రావుగారు.

"ఆ(..నేను ముందే చెప్పాను మిలట్రీలో పనిచేసే అతనికి మనం పిల్లనివ్వొద్దని. విన్నారు కాదు. తండ్రీ కూతుళ్లిద్దరూ వంత పాడుకుని నా నోరు మూయించి మరీ ఒప్పుకున్నారు. చిలకా గోరింకల్లా అలా అలా తిరుగుతూ అచ్చటా ముచ్చటా తీర్చుకోడానికి అతనికి ఓ సెలవు దొరకదు. అమ్మాయిని కాపురానికీ తీసుకెళ్లలేడు. ఒకవేళ ముందు ముందు తీసుకెళ్లినా ఏ ఊళ్లో అమ్మాయి ఏం కష్టపడుతోందో అని నా మనసంతా ఒకటే బెంబేలెత్తిపోతుంటుంది. ఇంకా పెళ్ళయి సంవత్సరమైనా కాలేదు, ఇంతకు ముందు పండగల్లానే, అల్లుడు గారు ఈసారీ రాలేకపోయారు." కూతురి పట్ల మమకారాన్నీమాటల్లో బాధగా వ్యక్తం చేసింది సోమిదేవమ్మ.

మైథిలి కంటి కొలనుల్లో ఒక బాష్పం అసంకల్పితంగా చోటుచేసుకుంది.

*****

తెల్లవారు ఝామున నాలుగు గంటలు!

ఇంటి తలుపు టక టక చప్పుడయింది.

పాలేరు పాండురంగడు ఎవరా? అనుకుంటూ తలుపు తెరచి..‘అయ్యగారూ అల్లుడు గారొచ్చేరండోయ్’ అని గట్టిగా అరిచాడు. ఆ ఇంటికి పూర్తిగా తెల్లారిపోయింది.

ఆరడుగుల ఆజానుబాహుడు, అరవింద దలాయతాక్షుడు, అందగాడు శ్రీనివాస్ తన సూట్‍కేస్ తో లోపలికి అడుగెట్టి "హైద్రాబాదు ఆఫీసులో ఒక కాన్ఫిడెన్సియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి రెండురోజులు వెళ్లమంటే..నేను పండగ కోసం అతికష్టం మీద మరో రెండురోజులు తీసుకుని ఇక్కడికి వచ్చాను"అన్నాడు.

"రావయ్యా..రా..పండక్కి రావేమోనని ఎంతో భయపడిపోయాం. అమ్మాయయితే మీకోసం ఒళ్లంతా కళ్లుచేసుకుని కలలు కంటోంది. తనని అలా చూస్తుంటే మాకెంత బాధ కలిగేదో! మొత్తానికి మీరొచ్చారు మాకదే సంతోషం. మా ఇంటికి ఉగాది వచ్చేసింది. అమ్మాయ్! అల్లుడుగారికి కాళ్లు కడుక్కోడానికి చెంబుతో నీళ్లిచ్చి మీ గదిలోకి తీసుకెళ్లు..ప్రయణ బడలిక పోయేదాకా రెస్ట్ తీసుకుంటారు"అన్నాడు.

మైథిలీ సిగ్గుల మొగ్గై, తనువూ మనసూ పురి విప్పిన నెమలి అవుతుంటే భర్త వంక వాలు చూపులు చూస్తూ చెంబుతో నీళ్లు, తుడుచుకోడానికి టవల్ ఇచ్చింది.

ముఖం కాళ్లూ చేతులూ కడుక్కున్న శ్రీనివాస్ భార్య వెంట తమ గదిలోకి వెళ్ళాడు. అప్పటి దాకా చిన్నగా భార్యను అనుసరించిన శ్రీనివాస్ గదిలోనికెళ్లంగానే గొళ్ళెం వేసి మైథిలీని గట్టిగా ఆలింగనం చేసుకుని అనువణువును ముద్దులతో ముంచెత్తసాగాడు. అసలే బలాఢ్యుడు, ఆపై మిలట్రీలో కండపుష్టి పెంచుకున్నవాడు. పరిపూర్ణ మగాడు. మన్మధుడు అతన్ని పూర్తిగా ఆవహించాడు. అతని ప్రేరేపణకు ఆమె మొగ్గ దశ నుంచీ క్రమ క్రమంగా విరిసిన పువ్వవుతూ సంపూర్ణంగా సహకరించసాగింది. అనుభూతులు..మధురానుభూతులై..మనసు మూలల్లో మల్లెల పేటికల్లో కమ్మటి స్మృతుల్లా పేరుకుపోతున్నాయి.

చాలాకాలం తర్వాత చెలియలికట్ట దాటిన యవ్వనోద్రేకం, క్షణం వృధాకానివ్వడం లేదు..అలా మూడు నాలుగు సార్లు మన్మధసామ్రాజ్యాన్ని ఏలిన తర్వాత ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇద్దరికీ మెలకువ వచ్చింది. ఊళ్లలోని ఇళ్లలో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు కాబట్టి, హడావుడిగా బట్టలు సవరించుకుని తలుపు తీసుకుని బయటకు తుర్రుమంది మైథిలీ. ఆ వెనకే తలొంచుకుని బయటకొచ్చాడు శ్రీనివాస్.

అందరూ గుంభనగా వాళ్లిద్దరివంకా చూసి చిన్నగా నవ్వుకున్నారు.

తలంట్లూ, కొత్తబట్టల పర్వాలయ్యాక దగ్గర్లోని శ్రీ వేణుగోపాల స్వామి గుడికి వెళ్లి అర్చన చేయించుకుని అక్కడి ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుని ఇంటికొచ్చారు. ఇంట్లో తయారు చేసిన ఉగాది పచ్చడిలో కాస్తంత బెల్లం ఎక్కువేసి "అల్లుడుగారూ, మీరు హఠాత్తుగా వచ్చి మాకు పండగ మధురానుభూతిని ఘనంగా పంచారు. సంవత్సరమంతా ఇలాగే మధురంగా ఉండాలని ఉగాది పచ్చడిలో కాస్త తీపెక్కువేశాను"అంది సోమిదేవమ్మ.

సాయంత్రం గుడికెళ్లి పంచాంగ శ్రవణం విన్నారు. అందరి రాశిఫలితాల్లో ఆదాయం, ఆనందపుపాళ్లెక్కువే ఉన్నాయి. సంతోషం మిన్నంటింది.

ఆరాత్రి మళ్లీ ఆగది వాళ్లిద్దరి సమాగమానికీ సిద్ధమైంది. అలుపెరుగని అనుభూతుల పోరులో ఇద్దరూ స్వర్గపుటంచులు చూశారు.

రెండురోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. మరో కొద్దిసేపట్లో శ్రీనివాస్ హైద్రాబాదుకి బయల్దేరుతాడు.

అందరూ అతనికి వీడ్కోలు పలకడనికి సిద్ధమవుతున్నారు. అందరి మనసులూ ఉదాసీనంగా ఉన్నాయి. మైథిలీదైతే చెప్పనక్కర్లేదు..ప్రాణమే విడిపోతున్నంత బాధ ముఖంలో ద్యోతకమవుతోంది.

"అల్లుడుగారూ..మీరసలు వచ్చినట్టే లేదు. పండగ సంబరన్ని మీతో తెచ్చి మళ్లీ తీసుకుపోతున్నట్టు ఉంది, మళ్లీ ఎప్పటికొస్తారో "అన్నారు మామ, అత్తగార్లు.

"ఈ ఉగాది తర్వాత మరో పండగొస్తోంది. రెండునెలల్లో నాకు కశ్మీర్ నుంచి హైద్రాబాదుకు ట్రాన్స్ఫర్ ఉంది. అక్కడే మా కొత్తకాపురం. ఈ ఊరు నుంచి జస్ట్ సిక్స్ అవర్స్ జర్నీ..అందరూ హాప్పీయేగా, అసలు ఈ విషయం సస్పెన్స్ గా ఉంచుదామనుకున్నాను.. కానీ మీ అందరి బాధ ముఖ్యంగా నా స్వీట్ హార్ట్ మైథిలీ వేదన చూసి చెప్పెయ్యాలనిపించింది. సో..మళ్ళీ త్వరలోనే మనందరం కలుస్తాం..ఒకే.."అని కారెక్కేశాడు.

అందరూ ముఖాలూ ఆనంద జ్యోతులయ్యాయి..చేతులూపుతూ వీడ్కోలు చెప్పారు. మైథిలీ మాత్రం చిరుసిగ్గుతో, కళ్లతో ఏదో స్వీట్ నథింగ్స్ చెప్పింది అది కారు రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూసి అర్ధం చేసుకున్నాడు సోల్జర్ శ్రీనివాస్.

*****

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ