కథంటే.. - జీడిగుంట నరసింహ మూర్తి.

kathante

అమ్మా మీ సందేహం ఏమిటో మా గురువు గారి దగ్గర విన్నవించుకోండి “ అంటూ నారాయణ అసిస్టెంట్ సుందరం ఆ రోజు అక్కడికి వచ్చిన వారి హాజరు పట్టీ లోంచి ముందు వరసలో కూర్చుని ఉన్న ఆండాళ్ళమ్మ గారనే ఆవిడను లోపల గదిలోకి వెళ్ళమని పిలిచాడు.ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి. వెన్నులో సన్నటి జలదరింపు ప్రారంభమయ్యి మొహం చెమటతో ముద్దయ్యింది. ఆ వెంటనే ముఖం అరుణ వర్ణం దాల్చింది.

“పది సంవత్యరాల నుండి కథలు వ్రాస్తున్నాను. ఇప్పటివరకు ఒక్క కథ కూడా ప్రచురణకు నోచుకోలేదు. నా జీవిత కాలంలో నా పేరు అచ్చులో చూసుకోవడం జరిగే పనేనా అని సందేహం నన్ను చంపుకు తింటోంది “ “ అంది ఆమె విచారాన్నంతా ముఖానికి పులుముకుని. “అదేమిటమ్మా ప్రింటులో ఒక్కసారి కూడా మీ పేరు చూసుకోలేదా ? మీ పెళ్లి శుభలేఖలో ఆ బాగ్యం మీకు కలిగి ఉండాలే ? అన్నాడు నారాయణ విలక్షణమైన నవ్వు నవ్వుతూ.“ ఏదో లెండి శాస్త్రం చెప్పినట్టు నాకంత భాగ్యం కూడాను.

మా ఇంట్లో వాళ్ళ కిష్టం లేని పెళ్లి ఎవరితోనో ముక్కూ మొహం తెలియని వ్యక్తితో చేసుకున్నాని ఇంట్లో అందరూ ప్రతిఘటించడంతో మొహం చెల్లక శుభలేఖలు కూడా అచ్చు వేయించుకోలేదు. ” అంటూ తన్నుకు వస్తున్న ఏడుపును బలవంతంగా ఆపుకుంటూ చెప్పింది ఆండాళ్ళమ్మ ఘోరమైన పొరపాటే ధో తన జీవితంలో జరిగిపోయిందన్నట్టుగా మొహం పెట్టి.“ అయ్యో అలా విచారించకండమ్మా ఇప్పుడేం కొంప ములిగి పోయింది ? రచనలకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. ఏదో రాసామంటే రాసాం అన్నట్లుగా ఉంటే అవి కాలక్షేపానికి పనికొస్తాయేమో తప్ప సమాజానికి ఒక దశా దిశా నిర్ధేశించ లేవు. అయినా మీకు కథలు వ్రాయాలనే ఆసక్తి బాగా కనపడుతోంది కాబట్టి మీ సమస్యను పరిష్కారం చెయ్యడానికి ప్రయత్నం చేస్తాను.

కథలు పత్రికలలో రావడమే పరమావధి కాదు. డబ్బు పెట్టి ఎంతమంది తాము వ్రాసిన వాటిని అచ్చు వేయించుకోవడం లేదూ ? ఏదీ మీ అముద్రితాలు ఒకసారి చూపించండి మీ కధలు ఎందుకు వెలుగులోకి రావడం లేదో చెప్పేస్తాను “ అన్నాడు నారాయణ.నారాయణ కొండంత భరోసా ఇవ్వడంతో ఆండాళ్ళమ్మ గుండెలు తేలిక పడ్డట్టయి హాయిగా ఊపిరి తీసుకుంది.
కొద్ది క్షణాల తర్వాత వణుకుతున్న చేతులతో పెద్ద దొంతర లోంచి ఒక కధను బయటకు తీసి నారాయణకు ఇచ్చింది. ఆమె పరిస్తితి చిలక జోతిష్యం చెప్పేవాడి దగ్గర ఏమిచెపుతాడో అని ఎదురుచూసే వాడిలా ఉంది.. అతను ఆమె ముఖం వైపు ఒక్కసారి పరిశీలనగా చూసి ఆ కధను అటూ ఇటూ తిప్పి వేదాంతిలా సన్నటి నవ్వు నవ్వాడు. ఆ వెంటనే ఒక నిట్టూర్పు విడిచి కొద్దిసేపు రెండు కళ్ళ మీద అరిచెయ్యి ఆనించి దీర్ఘంగా శ్వాస విడిచి తనలో తను నవ్వుకుంటూ ఆమె చేతిలోంచి చనువుగా ఇంకో కధను కూడా తీసుకుని పైన్నుండి కిందకు ఒకసారి చూసి “ అర్ధమైందమ్మా మీ కథలు ఎందుకు తిరిగి వస్తున్నాయో. ముఖ్యంగా మీరు కామాలు, ఫుల్ స్టాప్ లు , ప్రశ్నార్ధకాలు చూసుకోవడంలేదు.

కథ మొదలు పెట్టినప్పుడు ‘నేను “ అంటూ ఏక వచన ప్రయోగం చేస్తూ పది లైన్ల తర్వాత ఆ పాత్రకు పేరు తగిలిస్తున్నారు.. కొన్ని లైన్లు పెద్ద పెద్ద అక్షరాలూ, ఇంకొన్ని చీమల్లా భూతద్దంతో చూసినా అర్ధం కాని విధంగా మీ దస్తూరి అయోమయంలో పడేస్తోంది.. ఇలాంటి రక రకాల విన్యాసాలతో ఎడిటర్లను గందర గోళంలోకి నెట్టేస్తూ వస్తున్నారు.. ఇక పోతే కథ వ్రాయాలనే ఆవేశం తప్ప ఎలా ముగించాలో తెలియని ఇబ్బంది కర పరిస్తితిని మీరు ఎదురుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయినా ఇబ్బంది పడవలసిన పని లేదు. మీ సమస్యలన్నిటికీ సమాధానాలు నేను స్వయంగా రచించిన “వర్ధమాన రచియతలూ - సలహాలు “ పుస్తకంలో లభిస్తాయి. దీని ధర, తర్వాత నా ఫీజు బయట మా కౌంటర్ లో కట్టేయండి. మీకంతా శుభం కలగాలని ఆశిస్తున్నాను “ .... అంటూ నారాయణ చెప్పుతుండగానే ఆయన కాళ్ళకు నమస్కారం చేసి వొళ్ళంతా సంతోషంతో పులకించి పోతూ బయటకు వచ్చింది భవిష్యత్తులో పెద్ద రచయిత్రి కాబోతున్నానన్న ఆనందంతో. .లోపల నారాయణ ఆ వచ్చిన భాధితులకు ఏమి చెపుతున్నాడో బయట కూర్చున్న వారికి అర్ధమయ్యే అవకాశం లేదు. అయినా వాళ్ళంతా చెవులు రిక్కరించుకుని వినటానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఈ లోపు నారాయణ అసిస్టంట్ సుందరం గోడనానుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయిన ఒక వ్యక్తిని కదిపి “ అయ్యా మీ సమస్య ఏమిటో గురువు గారికి చెప్పి తగిన సలహాలు తీసుకోండి “ అన్నాడు హాజరు పట్టీలో టిక్ చేసుకుంటూ. “ఏమీ లేదు గురువు గారూ, నేనిప్పటికీ సుమారు అరవై డబ్బై కథలు వ్రాసుంటాను. నా ఖర్మ కాకపోతే ఒక్క కధంటే ఒక్కటి పడితే వొట్టు. రానూ రానూ ఈ ఎడిటర్ల మీద నమ్మకం పోతోందనుకొండి . వాళ్ళ కెలాంటి కథలు కావాలో ఏమేమి రికమండేషన్లు కావాలో అర్ధం అయ్యి చావడం లేదు “ అన్నాడు ఆ వ్యక్తి విముఖతతో కూడిన బోల్డంత వైరాగ్యం కనపరుస్తూ.“అయ్యా ముందుగా అరవై, డబ్బై అముద్రితాలకు కర్త, భర్త అయిన మీకు నా అభినందనలు. మీ ఆత్మ విశ్వాసానికి నా జోహార్లు.. అయితే మీ వోపికకు, మొక్కోవోని మీ అకుంటిత దీక్షకు ఏ ఎడిటరైనా కరుణించి మీకు వాళ్ళ పత్రికల్లో స్తానం కలిపించక పోవడానికి గల కారణం ఎప్పుడైనా వెతికారా ? ఎంత మటుకు ఎడిటర్ల మీద తోసేయ్యడమేనా? కనీసం మీ రచనలు మీ బంధువులకు గాని, మీ స్నేహితులకు గాని చూపించారా ? అసలు మీరు వ్రాస్తున్న కథలు కనీసం మీకు నచ్చుతున్నాయా ? కొన్ని రచనలకు శాశ్వత విలువలు వుంటాయి.

మీరు వన్ వే ట్రాఫిక్ లాగా రాసుకుంటూ మీ ఫీలింగ్స్ ను ఎదుటివారి మీద రుద్దాలనే ప్రయత్నం చేసారే తప్ప ఇంత పెద్ద సంఖ్యలో కథలు తిరిగి రావడానికి కారణం మీరెప్పుడూ ఆలోచించినట్టు లేదు. మీ కథల్లో తలా, తోకా లేకుండా కేవలం మీ అభిప్రాయాలకే విలువనిచ్చుకుంటూ ఏ మాత్రం హేతుబద్దత లేకుండా వ్రాసుకు పోతున్నట్టు కనిపిస్తోంది. కథలు మారుతున్న విలువలక్లు అద్దం పట్టేలా ఉండాలి. భాషలో, శైలిలో, శిల్పంలో కొత్తదనానికి ప్రాధాన్యత నివ్వాలి. ముందు ఇతరుల కథలు బాగా చదవండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. అవన్నీ ఒక పాత డైరీలో వ్రాసుకోండి. ఏదో మిడిమిడి జ్ఞానంతో వ్రాసే కథలు ఏ పత్రిక వాళ్ళను కదిలించవు. అయినా కూడా మీరు విచారించాల్సిన పనిలేదు. కథలు వ్రాయడానికి కావలసిన కనీస సూత్రాలు అనే ఈ పుస్తకం పొందు పరచి వున్నాయి. ఇందులోని విషయాలను అనుసరిస్తే మీ కథలు ఒక్కొక్కటొక్కటి గా పత్రికల వారిని ఆకర్షించి అవి వెలుగులోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. దీని ధర కేవలం ఒక్క వంద రూపాయలే అయినా దీనికి కొన్ని వందల రెట్లు ప్రయోజనం మీకు కలుగుతుందని నేను గంటాపధంగా చెప్పగలను.” అంటూ తను వ్రాసిన పుస్తకాన్ని అతని చేతిలో పెట్టాడు. .

నారాయణ చెప్తున్నంత సేపు అతను ఉలుకూ పలుకూ లేకుండా కొయ్యబారి పోయాడు. నారాయణ మాటలు అతన్ని నిరాశ పరిచినా తర్వాత కథలు రాయడానికి కావలసిన ఎన్నో విషయాలు చెప్పాక అప్పటివరకు అతనిలో ఆవరించిన నిరాశ, నిస్పృహలు చేత్తో తీసేసి నట్లుగా అనిపించి నారాయణకు కృతజ్ఞతలు చెప్పుకుని బయట కౌంటర్లో పుస్తకం ధర, నారాయణ ఫీజు కట్టి బయట పడ్డాడు... సుందరం అక్కడే ఒక మూలకు గోడకు ఆనుకుని కూర్చుని నిలువెల్లా విచార వదనంతో ఉన్న ఒకావిడను ఆవిడ నెంబర్ ప్రకారం లోపలికి పిలిచాడు . ఆమె పెదవులు భూకంపం వచ్చినట్టు వణికి పోతున్నాయి. నోట్లో మాట బయటకు రావడం లేదు. కొద్దిసేపు తర్వాత ఎలాగో తమాయించుకుని గొంతు సవరించుకుని ఒక రకంగా నేనూ వాళ్ళ బాపతే. నేనే కథ రాసినా అవి అంతకు ముందే ఎవరో రాసేసినవని తెలిసి నిరాశకు గురవుతున్నాను. ఇలా ఎందుకు జరుగుతోందంటారు ?” అంటూ అమాయకంగా అడిగింది.“అర్ధమైనదమ్మా మీరెక్కడో చదివిన కథలే మీ మనస్సు నిండా నింపుకుని అవే తిరగ వ్రాస్తున్నారని నా కనిపిస్తోంది.

మంచి అవగాహనాశక్తి, ఊహా శక్తి, ఏదైనా విషయాన్ని కూలంకషంగా, విమర్శనాత్మకంగా పరిశీలించడం, వీలైతే నలుగురితో చర్చించడం లాంటివి కథలు వ్రాసే వాళ్లకు బాగా ఉపయోగ పడతాయి. కాస్తంత వాస్తవానికి కొంత వూహ జోడైతే అది సహజ సిద్దంగా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన విషయాలకు, విజయాలకు ఆలోచనలే ముఖ్యం. రచయితకూ పాఠకుడికి మధ్య మంచి అవగాహన ఉండాలంటే మనం వ్రాసేది వాళ్ళలో చైతన్యం కలిగించేదిలా ఉండాలి. ఈ రోజు ఇక్కడికొచ్చిన వారందరికీ ఒక సలహా ఇవ్వదల్చుకున్నాను. దొరికిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకునే వాడే తెలివైన వాడు. మన ఇంట్లో ఒక కూర కాని, పులుసు కాని, పచ్చడి కాని ఏ మాత్రం రుచిగా కుదరక నోట్లో పెట్టుకోవడానికి వీలు కానప్పుడు వాటినెలా రిపేర్ చేసి అంటే కొన్ని అదనపు దినుసులు చేర్చి రుచికరంగా ఎలా మార్చుకుంటున్నామో తిరిగి వస్తున్న కథలను కూడా వాటిలో లోపించిన విషయాలను భర్తీ చెయ్యడం ద్వారా తిరిగి వాటిని ఆమోద యోగ్యంగా చేసుకో గలగడం ఒక కళ. ఇందుకు ప్రయత్నం చేసి సఫలీ కృతులు కండి “ అంటూ ఆ రోజుకు ముగించాడు నారాయణ.

ఇంతకీ ఈ నారాయణ ఎవరు ? ఇతనెందుకు కధకులకు సలహాలు ఇస్తున్నాడు ? వాళ్ళందరూ ఇతగాడిని ఎందుకు ఆశ్రయిస్తున్నారు ?” అనే అనుమానం అందరినీ వేధించుకు తిన్తోందా ? ఏమీ లేదండి. నారాయణ పూర్వాశ్రమంలో ఒక మాంచి రచియత కాకపోయినా మామూలు రచయిత. రానూ రానూ కాల్పానిక కథకులకు, ఇంగ్లీష్ నావల్స్ నుండి వస్తున్న కాపీ కథలకు ఇతర భాషలనుండి వస్తున్న అనువాద కధలకు పత్రికా ప్రపంచంలో పెద్ద పీట వేస్తూండే సరికి నారాయణ కథలకు గ్రహణం పట్టి పాఠకులకు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. సరిగ్గా అప్పుడే అతనిలో ఆలోచన మెదిలింది. . తనకున్న పరిమిత జ్ఞానంతో తనూ కొన్ని గుర్తింపు ఉన్న కథలు వ్రాసి ఉండటంతో ఆ అనుభవాన్ని పురస్కరించుకుని తమ రచనలు వెలుగులోకి రాకపోవడానికి గల కారణమేమిటో తెలియక సతమతమవుతూ నిరుత్సాహంతో , నిర్వేదంతో , నిస్పృహతో కాలక్షేపం చేస్తున్న రచియతలు కాని రచయితలకు అంత వరకు ఎవరకూ స్పురించని ఎవరికీ తట్టని ఒక మార్గాన్ని సూచించే దిశగా ఒక వర్క్స్ షాప్ పెట్టి ఊహించని విధంగా వందల సంఖ్యలో రచనా భాదితులకు ఒక ప్లాట్ ఫారం ఏర్పాటు చేసి విజయవంతంగా దూసుకు పోతున్నాడు మాజీ రచయిత నారాయణ

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు