వృత్తి. - హైమాశ్రీనివాస్

vrutti

" తాతగారూ! ఈ రోజు మా స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. మేమంతా మా క్లాస్ టీచర్లకు పండ్లు, పూలు ఇచ్చి నమస్కరించాం , తెల్సా?. "అంటూ గర్వంగా చెప్పింది సింధు.

" ఓహో అలాగా ! మరి అది ఎందుకు జరిపారో మీకు తెల్సా?" నవ్వుతూ అడిగారు తాత .

" మరి మాకు రోజూ పాఠాలు, గణితం అన్నీ చెప్తారుగా ? అందుకోసమే !" అంది సింధు

" కాదు – కాదు- తాతా! దీనికేమీ తెలీదు. ఫ్రండ్ షిప్ డే, ప్రేమికుల రోజు, మొన్న జరిగిన వాటర్ పొదుపు దినం, లాఫింగ్డే, వృధ్ధుల దినోత్సవం -- ఇలా చాలా జరుపు కున్నట్లే ఉపాధ్యాయుల రోజూ జరుపుకుంటాం." ధీమాగా అన్నాడు అరుణ్. "నీకు మహా తెల్సులేవోయ్! ఎంచక్కా నేనూ టీచర్లవుతా! అంతా నాకు పూలూ అవీ తెచ్చిస్తారు." అంది చిట్టి. ఇంతలో పక్కింటి పవన్, నయన్ ఇంకా కొందరు పిల్ల లూ వచ్చారు. అంతా కల్సి తాత గారి వద్ద కూర్చుని కధలు చెప్పించుకుని , ఆట లాడుకుంటారు ప్రతిరోజూ. సింధు మాటలు విని
" ఏంటీ ! టీచర్ వవుతావా? ఎప్పుడూ అదే క్లాస్ పై క్లాస్ కెళ్ళే దెప్పుడూ? మా అన్న చదివినప్పుడూ మా క్లాస్టీచర్ అదే క్లాసుట, నేను చదివేప్పుడూ అదే క్లాస్ . ఛీ షేం కాదూ ! " అంది అనూ. "కాదు కానీ మా పక్కింటి ప్రవీణ్ అంకుల్ లా కలెక్టరైతే బోలెడన్ని స్వీట్లూ, అవీ ఇవీ అబ్బో ఎన్నొస్తాయో!. ప్రవీణ్ అంకుల్ కొడుకు మా క్లాసే! వాడికున్నన్ని ఆట బొమ్మలు ఎవ్వరికీ లేవు. నేను ఎంచక్కా కలెక్టర్నవుతా. " " నేను మా బాబాయ్ లా లాయర్ నవుతా, బోలెడంత డబ్బు, గడగడా మాట్లాడి అందరినీ బెదర గొట్టొచ్చు.. ఎన్ని అబధ్ధాలు చెప్పినా ఫరవా లేదు. ఎవ్వరూ ఏమీ అనరుట! " " నేను మా ఎదురింటి అంకుల్ లా డాక్టర్ నవుతా. డాక్టరైతే అంతా నమస్కారాలు చేస్తూ ఉంటారు. “ " ఛా ! అందరి కాళూ చేతులూ, మూతులూ పట్టుకోవాలి, అసెయ్యంగా ! మా మావయ్యలా ఇంజనీర్ నవు తా. ఎంచక్కా కార్లో బుర్రునెళ్ళిపోవచ్చు, కంప్యూటర్లో కావల్సినంత సేపు ఎన్నోగేంస్ ఆడుకోవచ్చు."

" నేను మా అమ్మలా ఎంచక్కా అమ్మనై పోతాను, కమ్మగా పాటలు పాడుతూ ఎన్నెన్నో స్వీట్సూ అవీ వండి పెడుతూ హాయిగా ఇంట్లో నే ఉండ వచ్చు." అని ఒకరూ అంటూ పిల్లలంతా వారికి తోచినమాటలు గడగడా చెప్పసాగారు.

ఇంతలో గేటు తెరుచుకుని కొందరు లోపలికి రాసాగారు. ముందుగా చూసిన చిట్టి " తాతా! ఎవరో బోల్డ్ బోల్డ్ అంకుల్స్ ఎవరి కోసమో వస్తున్నారు" అని అనౌన్స్ చేసేసింది.

" బహుశా సింధూ నాన్నగారి కోసం ఐఉంటుంది." అంటూన్నతాతగారి మాటలు పూర్తి కాక ముందే వారంతా వాలు కుర్చీలో కూర్చునున్న తాత దగ్గరకు వచ్చి , వంగి ఆయన పాదాలకు నమస్కరించి, మెడలో పూల మాలలు వేసి, పండ్లు, స్వీట్లూ ఇచ్చి చుట్టూ మోకాళ్ళ మీద కూర్చుని ఫోటోలు తీసుకున్నారు. "మాస్టారూ ! మీరిక్కడున్నారని నిన్ననే తెలిసింది. మేమంతా మిమ్మల్ని చూడాలని వచ్చాం. బావున్నారా ! మాస్టారూ! మీరు చెప్పిన చదువు, మీరు నేర్పిన మానవతా విలువల వల్లే ఈ రోజు మేమంతా ఏ వృత్తి లో ఉన్నా నిజాయతీగా , మానవ సేవా దృక్పధం తో , వృత్తి ధర్మాలు పాటిస్తున్నాం, నేను కలెక్టర్ని, వీడు లాయర్, వాడు డాక్టర్ , ఈతనేమో ఇంజనీర్, వీడేమో ప్రొఫెసర్, ఇహ వాడు .." అంటూ వారిని వారు పరిచయం చేసుకుని ఆతర్వాత " మేం ఎవరమైనా మీరేమా సార్, మాకు చిన్నతనంలో మంచి నేర్పిన దేవుడు." అంటూ అంతా మరో మారు నమస్కరించారు. అదంతా చూస్తున్న సింధూ మాత్రం తాను తప్పక టీచరే కావాలని నిర్ణయించుకుంది మనస్సులో.

నీతి- వృత్తులన్నింటిలోకీ పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. సమాజానికి చక్కని సంస్కారమున్న మానవులను అందించే వృత్తి అది.


.


మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి