ఆరవ తరగతి చదువుతున్న గోపికి తొందరగా నిద్ర లేవడం తెలీదు. అమ్మ వచ్చి నిద్ర లేపితేనే బలవంతంగా మంచం దిగుతాడు. “ఇంకొక్క అరగంట పడుకుంటానమ్మా!” అని ముసుగేస్తాడు తప్ప లేవడు. గోపిని నిద్ర లేపేసి వంట గదిలోకి వెళ్లి ఆమె పనిలో పడిపోతే మరో గంట వరకూ మంచం దిగడు గోపి.
అంత బద్ధకస్తుడైన గోపి ఆ రోజు మాత్రం పెందరాడే లేచి తల స్నానం చేసాడు. కారణం ఆ రోజు గోపి పుట్టిన రోజు. కొత్త బట్టలు వేసుకుని అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకున్నాడు. నాన్న చేత మంచి బహుమతులు కొనిపించుకోవడానికి అలా చేస్తాడు గోపి.
అంతే కాకుండా సాయంత్రం జరగబోయే పుట్టినరోజు వేడుకకు ఇరుగు పొరుగు వాళ్ళని , వీధిలోని పిల్లలని, బడిలో చదివే స్నేహితులని పిలుస్తాడు. తమకి తోచిన బహుమతులు ఇస్తుంటారు స్నేహితులు. పెద్దల దీవెనలు అందుకోవడంతో బాటు వాళ్ళిచ్చే బహుమతులు తీసుకోవడం గోపికి ఇష్టం. తనకి రాబోయే బహుమతుల గురించి కలలు కంటూ ముందు రోజు రాత్రి నిద్రపోయాడు గోపి. అనుకున్నట్టే పుట్టినరోజు వేడుక ఉల్లాసంగా జరిగింది. వచ్చిన అతిథులకు అమ్మానాన్నలు మిఠాయిలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక బహుమతి ఇచ్చి వెళ్ళారు. అతిథులు వెళ్ళిన తరువాత బహుమతులు తెరుస్తూ ఎవరెవరు ఏయే బహుమతి ఇచ్చారో కాగితం మీద రాసుకున్నాడు గోపి. రిమోట్ సాయంతో ఎగిరే విమానం బొమ్మ, చార్జింగ్ చేస్తే కూత పెడుతూ పరుగెత్తే బొమ్మ రైలు, ఫోటో ఫ్రేము, వినాయకుడి బొమ్మ, కిడ్డీ బ్యాంకు , ప్లాస్టిక్ మంత్రం దండం, నల్లటి తుపాకి బొమ్మ ... అలా చాలా బహుమతులే వచ్చాయి. ఒక్కొక్కటే చూస్తూ చాలా పొంగిపోయాడు గోపి.
ఇంకా తెరవాల్సిన బహుమతి ఒకటి ఉంది. దానిని తెరచి చూసేసరికి నీరసం వచ్చింది గోపికి. కారణం అది ఒక పుస్తకం. పొరుగింట్లో ఉండే సత్యం తాతయ్య దానిని బహుమతిగా ఇచ్చాడు.
“తాతయ్యకేం తెలీదు. పుట్టినరోజు బహుమతిగా పుస్తకం ఎవరినా ఇస్తారా?ఆట వస్తువు ఇస్తే సొమ్మేం పోయింది” అనుకుంటూ పుస్తకాన్ని బలంగా విసిరాడు.
అప్పుడే గదిలోకి వస్తున్న గోపి నాన్న కాళ్ళ ముందర పడింది ఆ పుస్తకం. దాన్ని చేతిలోకి తీసుకుని “పుస్తకాన్ని ఎందుకు విసిరావు?” అని అడిగాడు నాన్న.
“ఇవ్వడానికి బహుమతులే లేనట్టు పుస్తకమిచ్చారు సత్యం తాతయ్య” అన్నాడు గోపి అలక మొహం పెట్టి.
“తప్పేముందిరా? పుట్టినరోజుకి ఆట వస్తువులే ఇవ్వాలనేం లేదు కదా” సర్ది చెప్పాడు నాన్న.
“ఇంట్లో చదివేసిన దాన్ని మనకు ఇచ్చేసి ఉంటాడు” అన్నాడు గోపి చులకనగా.
“అలా మాట్లాడడం తప్పు. నీ వయసు పిల్లలు క్లాసు పుస్తకాలే కాకుండా వినోదం, విజ్ఞానం పెంచే పుస్తకాలు కూడా చదవాలని, ఉపాధ్యాయుడయిన సత్యం తాతయ్యకు బాగా తెలుసు. అందుకే బహుమతి ఇచ్చాడు” అన్నాడు గోపి నాన్న.
“లేదు నాన్నా! దాని ధర చూసాను. ముప్పయి రూపాయిలే. అందుకే ఇచ్చాడు” అన్నాడు గోపి పుస్తకం మీద ధర చూపిస్తూ.
“పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలు తెలిసి ఇచ్చాడు తప్ప ధర తక్కువని కాదు. మంచి పుస్తకం చదివితే కలిగే ఆనందం ముందర బొమ్మలాటలో వచ్చే ఆనందం నిలబడదు. మనం ఎప్పుడూ పుస్తకం విలువను దాని అట్ట మీదున్న ఖరీదు చూసి లెక్క కట్టకూడదు. అది చదవడం వల్ల కలిగే జ్ఞానంతో పోల్చుకుని ఖరీదు కట్టాలి” అన్నాడు గోపి నాన్న.
‘అవునా? నేను సత్యం తాతయ్యను తప్పుగా అనుకున్నాను. ఇప్పుడే ఆ పుస్తకం చదువుతాను’ అంటూ తండ్రి చేతి లోని పుస్తకాన్ని ప్రేమగా అందుకుని అట్ట మీదున్న పేరు చదివాడు గోపి.
“పిల్లల కోసం సులభ శైలిలో నీతి కథలు” అని రాసి ఉంది. అది మొదలు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు గోపి. మంచి అలవాటు వైపు కొడుకుని మళ్లించిన సత్యం తాతయ్యకు కృతజ్ఞతలు చెప్పాడు గోపి నాన్న.