రెండో పుస్తకం - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

rendo pustakam


విజయవాడలోని ఒక కల్యాణ మంటపం.

అచ్యుతరావు అన్న కొడుకు పెళ్లి.

తమ్ముడిగా అన్నయ్యకి అన్ని కార్యక్రమాల్లో చేదోడువాదోడుగా ఉండి కార్యం గట్టెక్కించాడు. పందిట్లో మంగళసూత్రధారణ పూర్తవడంతో మానసికంగా, శారీరకంగా కాస్త రిలాక్స్ అయ్యి టెంట్ లో ఫ్యాన్ దగ్గరగా ఉన్న కుర్చీలో రిలాక్స్డ్ గా కూర్చున్నాడు అచ్యుతరావు.
అన్నదమ్ములిద్దరివీ మధ్యతరగతి జీవితాలే. కష్ట సుఖాల్లో కష్టాలపాల్లెక్కువే అనుభవిస్తూ సంసారబాధ్యతను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

"నమస్కారం అచ్యుతరావుగారూ" తనకు దగ్గరగా వచ్చి కుర్చీలో కూర్చుంటూన్న స్నేహితుడు శ్రీధర్ పలకరింపుకి సన్నటి నవ్వుతో సమాధానం ఇచ్చాడు.

"మీ అమ్మాయి గాయత్రికి ఎప్పుడు పెళ్లి చేసి మా అందరికీ ఇలా పప్పన్నం పెడతారు?"అన్నాడు.

ఆ మాటవిని అప్పటిదాకా కాస్త రిలాక్సైన ఆయన మనసును మళ్లీ విషాదవీచిక ఆవరించింది.

అచ్యుతరావుకి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి దుర్గకు కాలూ చెయ్యీ కూడదీసుకుని అయినంతలో బాగానే పెళ్లి చేశాడు. కాని అల్లుడు ఉత్త నాసిరకమని పెళ్లయిన కొత్తల్లోనే తేలిపోయింది. అమ్మాయిని చక్కగా చూసుకోకపోగా, గొంతెమ్మ కోర్కెలతో అచ్యుతరావుని తెగ ఇబ్బందిపెడుతుంటాడు. ఇదిలా ఉండగా గాయత్రికి సంబంధాలు వస్తున్నా కట్న కానుకల దగ్గరో, అందం చదువులాంటీ ఇతరత్రా విషయాల్లోనో బెడిసికొడుతున్నాయి.

గాయత్రి నిజంగా గాయత్రీదేవే! ఛామనఛాయ అయినా కళగల ముఖంతో ఆకట్టుకుంటుంది. ఇంటిపనిలో నేర్పు, మంచి ఓర్పు ఉన్న పిల్ల. ఆ ఒక్క పిల్లనీ యోగ్యుడైన అయ్య చేతిలో పెడితే ఇహ తను కాస్త కుదుటపడొచ్చన్నది అచ్యుతరావు ఆలోచన.

"ఏవండీ అచ్యుతరావుగారూ ఎలా ఉన్నారు? అసలు చాలాకాలం నుంచీ మిమ్మల్ని కలుద్దామని ప్రయత్నిస్తున్నాను. హమ్మయ్య, ఇలా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. అసలు విషయం ఏంటంటే, మనమ్మాయి గాయత్రికి ఒక సంబంధం చూశాను. అబ్బాయి అందగాడు, మృదుస్వభావి, నెలకు లక్షవరకూ సంపాదన.."కాస్త ఆగి అప్పుడే అటుగా మంచినీళ్లు ఇస్తూ ఎవరో రావడంతో గ్లాసందుకుని నీళ్లు తాగసాగాడు పూర్ణానందం.

‘ఇప్పటిదాకా ఎన్ని సంబంధాలు చూడలేదు. మొదట్లో బాగానే ఎంటరవుతారు, తర్వాతే రెడ్ సిగ్నల్ చూపిస్తారు. తన కూతురికీ, తనకూ మానసిక క్షోభ. అయినా ఇన్ని సుగుణాలు ఉన్న అబ్బాయికి మా అమ్మాయి, ఇంటి పరిస్థితులూ ఏం నచ్చుతాయి. వృధాప్రయాస..అంతే’ అచ్యుతరావు మనసులో ఆలోచనల సుడిగుండాలు.

"అన్నట్టు..ఎంతవరకూ వచ్చాం..అబ్బాయిగురించి చెబుతున్నాకదూ..అబ్బాయి శ్రీకాంత్ నాకూ చాలాకాలంగా తెలుసు. మంచి నడవడిక. పెద్దలంటే, వినయం, విధేయత, గౌరవం..కానైతే.." అని కాసేపాగి "అబ్బాయి రెండోపెళ్లివాడు. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. పాపం ఆమెని బ్రతికించుకుందామని చాలా తాపత్రయ పడ్డాడు. కాని ప్చ్..విధి సహకరించలేదు. అతనికి పిల్లలేం లేరు. మీరు ఆలోచించుకుని ‘ఊ’ అంటే..మిగతా ఏర్పాట్లు నేను చేస్తాను"అన్నాడు.

‘అనుకున్నాను..ఏదో ఒక లోపం లేకపోతే చక్కటి సంబంధం తన దాకా ఎలా వస్తుంది?’ మనసులో అనుకుని "ఇంట్లో చర్చించి నేను ఏ విషయం చెబుతాను"అన్నాడు.

"పిల్లాడు రెండో పెళ్లివాడన్నమాటేగానీ చాలా చాలా మంచివాడు. నేను గ్యారంటీ ఇస్తాను..అతనితో అమ్మాయి కాపరం సలక్షణంగా ఉంటుంది"అని వెళ్లిపోయాడు.

*****

అచ్యుతరావు ఇంట్లో పూర్ణానందం చెప్పిన విషయం చెప్పాడు.

ఇప్పుడు గాయత్రి మనసులో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి ‘తన పెళ్లికోసం పాపం తండ్రి ఎంతో తల్లడిల్లిపోతున్నాడు. అక్కకి మొదటి పెళ్లివాడేవచ్చాడు. కానీ ఏం లాభం? దాని ముఖంలో పెళ్లిరోజున చిరునవ్వు చూడ్డమే! సదా బాధావీచికే! నిజానికి అమ్మాయికి పెళ్లంటే లాట్రియే. తేడా వచ్చిందంటే జీవితం కోల్పోయినట్టే! తనకిప్పుడు రెండో పెళ్లి సంబంధం వచ్చింది. సెకెండ్ హాండ్! అతనెలాంటివాడో. పూర్ణానందంగారు మంచివాడని చెప్పాడంటున్నాడు తండ్రి. ఎవరైనా అలాగే చెబుతారు. లేకపోతే సంబంధాలు ఎలా కుదుర్తాయి. మోసాలు ఎలా జరుగుతాయి? ఆయన చెప్పింది నిజమే అనుకుందాం, కానీ రెండో పెళ్ళివాడే! అనుబంధాలూ, అనుభూతులు మొదటామెతో పంచుకుని ఆ జ్ఞాపకాలతో తనకు దగ్గరవ్వగలడా? ఒకవేళ అయితే..ఏమో..చెప్పలేం? కట్న, కానుకలు ఆశించని అతనితో తన పెళ్లి జరిగితే తండ్రికి కాస్త మానసిక విశ్రాంతి కలుగుతుంది. ఏదేమైనా తను ఛాన్స్ తీసుకోవాలి. తప్పదు’ అనుకుని నాన్నా అతనితో పెళ్లి నాకిష్టమే! పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేయించండి"అంది.

కూతురి నిర్ణయం వెనకాల తన అశక్తతే కారణమని తెలిసినా ఏం చేయలేక "అలాగేనమ్మా.."అని అక్కడ్నుంచి భారంగా కదిలాడు.

*****

పెళ్లిచూపులు, పెళ్లి పర్వాలు పూర్తయ్యాక మొదటిరాత్రి-

రకరకాలపూలతో అలంకరించబడి, వాటి సువాసనతో, అగరువత్తుల సుగంధ ధూపంతో, పాలూ పళ్లతో ప్రత్యేకంగా అలంకరించిన ఆ గది ఇద్దరి మనసులనూ మత్తెక్కిస్తూ యవ్వన సంకెళ్లను ఒక్కొక్కటిగా విడిపిస్తోంది.

శ్రీకాంత్ ఆమెని దగ్గరకు తీసుకుని-

"గాయత్రీ నువ్వు నా జీవితంలోకి రావడంతో రెండో పుస్తకం తెరుచుకుంది. దాన్ని మనం అందమైన అనుభూతులతో నింపెయ్యాలి. మొదటిది అనూషతో కూడిన పుస్తకం, మనసా వాచా దాన్ని మూసేశాను. మనిషికి జీవితం దేవుడిచ్చిన వరం. దాన్ని పరిపూర్ణంగా అనుభూతించాలి. అంతేకాని వేదనతో అంతం చేసుకోకూడదు. అనూషకు ఏ లోటూ చెయ్యలేదు. బతికించుకోవాలనీ ఎంతో ప్రయత్నించాను. కానీ విధి నెదిరించలేకపోయాను. అది అక్కడితో సరి. ఇప్పుడు నువ్వే నా జీవితం. నన్ను పెళ్లి చేసుకోమని ఎవ్వరూ ఫోర్స్ చెయ్యలేదు. నాకు నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పానుగా ఒక్కసారి లభించే ఈ జీవితాన్ని అందంగా అనుభవించాలని. ఇహ మనసులో నా గురించి లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. అన్నట్టు మాటలతో ఈ రాత్రిని వృధాచెయ్యకూడదు..ఇద్దరం కలిసి మదనాశ్వంపై స్వారీ చేస్తు స్వర్గ ప్రవేశం చేద్దాం"అని చిలిపిగా నవ్వి మరింత దగ్గరగా వచ్చి గాఢాలింగనం చేసుకున్న శ్రీకాంత్ ను చూసి ‘హమ్మయ్యా..మంచి స్టార్టింగే..’అని మనసులో అనుకుని సిగ్గుల మొగ్గ అయింది.

ఆ మొగ్గను తమకంతో తడిమి తడిమి రేకలన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా విచ్చుకుని సంపూర్ణ వికసిత పుష్పమయ్యేలా చేశాడు. ఆపై పరిపూర్ణ వికసిత పుష్పంపై తుమ్మెదలా వాలి మకరందాన్ని గ్రోలడం ప్రారంభించాడు. అలా పునః పునః ఆనందానుభూతినందుకున్నాక ‘సెకండ్ హాండ్ కాదు.. నా మొగుడు మానసికంగా ఫస్ట్ హాండే’ అనుకుంది తృప్తిగా శ్రీకాంత్ గుండెలపై మత్తుగా తల ఆనుస్తూ.

*****

మరుసటిరోజు నుంచి ఆ ఇంట్లో సుఖసంతోషాల పర్వం మొదలై కూతురి ముఖంలో అనిర్వచనీయమైన ఆనందాన్ని గమనించిన అచ్యుతరావు మనసులో మురిసిపోయాడు. శ్రీకాంత్ కేవలం అల్లుడిగానే కాకుండా అచ్యుతరావుకు కొడుకులేని లోటు తీర్చాడు. తోడల్లుడిని తన మాటలతో, చేతలతో కట్టడి చేశాడు. శ్రీకాంత్ ను అల్లుడిగా కుదిర్చిన పూర్ణానందంకు పట్టుబట్టలు పెట్టాలని మనసులో స్థిరంగా అనుకున్నాడు అచ్యుతరావు.

***

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి