అచ్యుతపురంలో అప్పడు అనే వాడుండేవాడు. వాడి అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో నానమ్మే వాడిని పెంచి పెద్దచేసింది. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగడం వల్ల చదువబ్బలేదు. ‘వాడు ప్రయోజకుడు కాలేదు, రేపు తను పోతే వాడి బతుకేమవుతుందో’ అని తెగ బాధ పడిపోతుండేది ఆ నానమ్మ.
పొద్దుట లేచి కడుపుకింత తిని ఊరంతా బలాదూర్ గా తిరిగేవాడు. అలా తిరుగుతుంటే వాడో వెర్రి బాగులవాడని ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు.
ఒకసారి ఊరికి దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వెనక వాడు కూర్చుని రాళ్లతో ఆడుకుంటుంటే, నలుగురు దొంగలు తాము దొంగిలించిన సొత్తుని పంచుకోవాలని అక్కడికి వచ్చి, అప్పడ్ని చూసి, వాడో తెలివి తక్కువ వాడవడం వల్ల తమకి అపకారం లేదని, ధనం పంచుకుని, నగలు ఎక్కడ అమ్మి సొమ్ముచేసుకుని పంచుకోవాలో చర్చించుకుని వెళ్లిపోయారు.
ఆ తర్వాత అప్పడు ఊళ్లోకి వెళ్లబోతుంటే, రక్షక భటులు కనిపించారు. వాడికి ఎక్కడన్నాతప్పు జరిగితే రక్షక భటులకి చెప్పాలని నానమ్మ ఒకసారి చెప్పి ఉండడంతో వాడు రక్షక భటుల్ని కలిసి తాను చూసిందీ, విన్నది చెప్పేశాడు. మొదట వాళ్లు నమ్మలేదు. అప్పడు పదే పదే అదే విషయం చెప్పడంతో వాళ్లు ఆ నగల దుకాణాల దగ్గరకి వెంఠనే వెళ్లి ఆ దొంగల్ని పట్టుకున్నారు.
తర్వాత విషయం తెలుసుకున్న రక్షణాధికారి, అప్పడి నానమ్మ దగ్గరకి వెళ్లి విషయం చెప్పి వాడి వల్ల ఎంతో కాలంగా తప్పించుకుని తిరుగుతున్న గజ దొంగలు పట్టు పడ్డారని, అప్పడు అలాగే వెర్రిబాగుల వాడిలా ఊళ్లో తిరుగుతూ తమకి నేరగాళ్ల గురించి రహస్యంగా తెలియజేస్తే మంచి జీతం ఇస్తామని చెప్పాడు.
వాడి జీవితం గాడిన పడినందుకు ఎంతో ఆనందించింది నానమ్మ.