వదిన.. ది గ్రేట్.. - జి.ఎస్.లక్ష్మి..

vadina the great

“అబ్బ.. ఎంతబాగుందీ దప్పళం.. ఎన్నాళ్ళయిందీ ఇలా జుర్రుకుంటూ దప్పళం తినీ..” అంటూ వేళ్ళు నాక్కుంటూ ఆ ఫంక్షన్‍లో పులుసూ అన్నం తింటున్న అన్నయ్యని కొత్తగా కళ్ళప్పగించి చూసాను. అన్నయ్య ఇంకా ఆ మైకం నుంచి తేరుకున్నట్టు లేదు.. “మా అమ్మ సరిగ్గా ఇలాగే చేస్తుంది. దప్పళం కలిపామంటే ఆ రుచికి మరి నాలుగు వాయిలు కలపకుండా వుండలేం..” అంటూ కళ్ళు అరమోడ్చి తాదాత్మ్యం చెందడం మొదలెట్టాడు.

నాకు గుండాగినంత పనైంది. భయపడుతూ వదిన వైపు చూసాను. అన్నయ్య పలికే ప్రతి అక్షరం వదిన చాలా శ్రధ్ధగా వింటోంది. ఆరోజు మా బంధువుల ఇంట్లో బారసాల అంటే మా పెద్దమ్మ కొడుకు, కోడలు అయిన అన్నయ్య, వదినలతో కలిసి వెళ్ళాను. ఆ బంధువుల ఇంట్లో పెద్దవాళ్ళు పట్టుపట్టి ఈ కాలంలోలాగా ఫ్రైడ్‍రైసులు, రోటీలు కాకుండా రాజమండ్రీ నుంచి వంటవాళ్లని హైద్రాబాదు రప్పించి, ఆవపెట్టిన పనసపొట్టుకూరతో సహా అన్నీ సాంప్రదాయకమైన వంటలు దగ్గరుండి మరీ చేయించారు. ఈ సంగతి వాళ్ళు బారసాల మహోత్సవానికి పిలిచిన వాళ్లందరికీ ముందుగానే చెప్పడంతో భోజన ప్రియుడైన మా అన్నయ్య ఆరోజు ఆఫీసుకి శెలవు కూడా పెట్టి మరీ ఫంక్షన్‍కి వచ్చాడు. అక్కడికీ బయల్దేరేముందు అన్నయ్యకి కాస్త హింట్ ఇచ్చాను కూడా.. “అన్నయ్యా, అక్కడ భోజనం బాగుంటే బాగుందను కానీ అంతకుమించి ఎక్కువ పొగడొద్దూ” అని. ఎంతైనా నాకన్న పెద్దవాడాయె.. అంతకన్న చెప్పలేకపోయాను.

అబ్బే.. అన్నయ్య వింటేనా..ఏదో ఓ పూట భోజనానికి వెళ్ళినంతలో ఆ వంటని అంత పొగిడెయ్యాలా..అందులోనూ మా అన్నయ్య లాంటి వాళ్ళు ఉత్తి పొగడడంతో ఆపెయ్యకుండా ఇంట్లో అసలు భార్య కేమీ చేతకాదన్నట్టూ, ఎప్పుడో వాళ్ళ అమ్మ చేసిన వంటే అమృత ప్రాయమన్నట్టు మాట్లాడేస్తారు. పెళ్ళై పదిహేనేళ్ళైనా మా వదిన మా పెద్దమ్మలా వండలేదని అస్తమానం అంటూనే వుంటాడన్నయ్య. అక్కడికీ ఎన్నోసార్లు చెప్పాను నేను మా అన్నయ్యకి..

”అన్నయ్యా, పెద్దమ్మ చేతి వంట వేరు, వదిన చేతి వంట వేరు. పెద్దమ్మ చేసినట్టు కొన్ని వదిన ఎలా చెయ్యలేదో అలాగే వదిన చేసేవి కొన్ని పెద్దమ్మ చెయ్యలేదు కూడా. మరీ వదిన్ని అంత తీసిపడెయ్యకు.. రోజూ నీకు వండి పెట్టాల్సింది వదినే. అమెని ఏమైనా అన్నావంటే నీకు కంచంలోకి ముద్ద రాదు..” అని ఎంత స్పష్టంగానో చెప్పాను. అబ్బే బుర్ర కెక్కితేనా! అయినా అసలీ మగవాళ్లందరూ ఆమాత్రం ఎందుకు గ్రహించరో. ఎంత వన్‍వే ట్రాఫిక్ అయితే మటుకు నేను ఒకవైపు నుంచి సైగ చేస్తున్నా కూడా గమనించకుండా అలా పరవశించిపోయి వాగెయ్యడమే..

“అబ్బ.. ఎప్పుడో మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్ప పెళ్ళయాక ఇలాంటి దప్పళం తినలేదు. ఏవిటో.. మా ఆవిడ పొద్దున్న లేస్తే అలా వంటల ప్రోగ్రాములు చూస్తూనే వుంటుంది. ఏవో కొత్త కొత్తవి చేస్తూనే వుంటుంది. ఒఖ్ఖటి నోట్లో పెట్టుకునేలా వుండదనుకోండి. బాబూ, ఏదీ ఇంకో గరిట వడ్డించు.. బెల్లం బహు తూకంగా పడింది చూసేవా చెల్లాయ్..” నన్ను కూడా కలిపేసేడు.. బాబోయ్.. వదిన.. భయం భయంగా వదినవైపు చూసాను. వదిన మటుకు ఏమాత్రం చలించకుండా అపర శాంతమూర్తిలా అన్నం తింటోంది. నాకు అర్ధమైపోయింది.. ఇంటికెళ్ళేక అన్నయ్యకి నాల్రోజులు పస్తే అని నిర్ధారించేసుకున్నాను.

“అయినా ఈ కాలంలో వాళ్ళకి ఈ దప్పళాలూ గట్రా పెట్టడం ఎలా తెలుస్తాయండీ.. ఎంతసేపూ సాంబారులూ, మైసూరురసాలూ అంటారు కానీ అవి ఈ దప్పళం దరిదాపులకైనా వస్తాయంటారా?” పక్కనున్న మరో పెద్దాయనతో అంటున్నాడన్నయ్య. నిజంగానే మా పెద్దమ్మ దప్పళం చాలా బాగా చేస్తుంది. ఆవిడ చేసినప్పుడు మెచ్చుకుంటూ తినడం వేరు. అంతమాత్రాన పక్కన మూడుపూటలా వేడివేడిగా వండిపెడుతున్న వదినని అలా తీసిపడెయ్యాలా?

వెనక్కి వస్తుంటే కూడా దారంతా అన్నయ్య దప్పళం రుచిని అలా తల్చుకుంటూనే వున్నాడు. పెద్దమ్మ దప్పళాన్ని పదిసార్లు గుర్తు చేసుకోవడంతోపాటు, వదిన వంటకి మరిన్ని వంకలు పెట్టి వేళాకోళాలు చేస్తూనే వున్నాడు. ఇంకిలా నోరు చచ్చిపోయి తను వుండలేననీ, వదినని ఓ నాల్రోజులు తన తల్లి దగ్గరికి పంపించి ఆ వంటలెలా చెయ్యాలో నేర్పిస్తే కాని లాభం లేదని తేల్చేసాడు. “చెల్లాయ్, రేపే పంపిస్తానే వదిన్ని అమ్మ దగ్గరికి. నీకు కూడా ఏమైనా ఇష్టమైన వంటలుంటే చెప్పెయ్యి. నేర్చుకొచ్చేస్తుంది.” అన్నయ్య అన్నాడు నాతో. భయం భయం గా వదినని చూసాను. కాని వదిన మటుకు నోరిప్పి ఒక్క ముక్క మాట్లాడలేదు. అది నాకు ఇంకా భయం వేసింది. మా ఇల్లు రాగానే తల వంచుకుని దిగి ఇంట్లోకి వచ్చేసాను.

ఆ రాత్రంతా నాకు కంటి మీద కునుకు పడితే ఒట్టు. పాపం వదిన. తనకి అన్నయ్యంటే ఎంతిష్టం! కష్టపడి అన్నయ్య కిష్టమైనవన్నీ ఎన్ని నేర్చుకుందీ! ఇలా అందరిముందూ అన్నయ్య వదినని తీసిపడెయ్యడం ఏం బాగుందీ! అన్నయ్య మాటలకి వదిన మనసు ఎంత కష్టపెట్టుకుని వుంటుందీ! పైగా రేపు పెద్దమ్మ దగ్గరికి పంపుతాట్ట కూడానూ అవన్నీ నేర్చుకుందుకు. పెద్దమ్మకి ఫోన్ చెసి చెప్పాలి వదిన ఎంత మంచిదో! అయినా అసలీ మగవాళ్లకి పెళ్ళాలనలా తీసిపడేసే హక్కు ఎవడిచ్చాడో? ఇంకెవడు! ఆ దేవుడే అయ్యుంటాడు. ఆయనా మగవాడే కదా!

అలాగ ఒకదాని కొకటి పొసగని ఆలోచనలతో రాత్రంతా గడిపి ఉదయమవగానే ఏమయితే అయిందని వదినకి ఫోన్ చెయ్యడానికి నిర్ణయించేసుకున్నాను. పాపం, అన్నయ్య మాటలకి ఎంత బాధపడుతోందో… ఎంత చిన్న మొహం చెసుకుని పెద్దమ్మ దగ్గరికి వెడుతోందో.. నేనైనా కాస్త ఓదార్పుగా మాట్లాడకపోతే అత్తవారింట్లో వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేనని బాధపడదూ పాపం.. అందుకే ఆగలేక పొద్దున్నే ఇంకా ఏడు కాకుండానే వదినకి ఫోన్ చేసాను. వదిన ఫోన్ ఎత్తగానే “ గుడ్ మార్నింగ్ వదినా..” అంటూ ధైర్యం కూడగట్టుకుంటూ విష్ చేసాను.

“ఏంటి స్వర్ణా, ఇంత పొద్దున్నే.. అంతా బాగున్నారు కదా..” అంది మా వదిన. వదిన గొంతు మామూలుగానే వుందే.. అన్నయ్య మీద కోపం ఏమీ ఉన్నట్ట్లు లేదే అనుకుంటూ, “వదినా, నీకు తెల్సుగా.. మా అన్నయ్య సంగతి. వాడి మాటలు పట్టించుకోకు. ఏదో వాగేస్తుంటాడు..” అన్నాను కాస్త ఓదార్పుగా.

“ఏంటి పొద్దున్నే మీ అన్నయ్యకి తాళం వేస్తున్నావు?” అంది వదిన. అంటే ఇంకా కోపం పోలేదన్న మాట.

“అబ్బే ఏం లేదు వదినా.. అన్నయ్య నోసారి పిలు. గట్టిగా అడుగుతాను. అలా నలుగురిముందూ నిన్ను తీసిపడేయ్యొచ్చా అని గట్టిగా అడుగుతాను..” నా సపోర్టు వదినకే అన్నట్టు చెప్పాను.

“మీ అన్నయ్య లేరుగా. మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళారు నిన్నర్రాత్రి. చేరినట్టు ఇందాకే కాల్ చేసి చెప్పారు.” అంది వదిన. నాకు గుండె గుభేలుమంది. “ఎందుకు వదినా? పెద్దమ్మ, పెదనాన్న బాగున్నారు కదా? ఏం ప్రాబ్లెమ్ లేదు కదా?” ఖంగారుగా అడిగాను.
“వాళ్ళు బానే వున్నారు. మీ అన్నయ్యే ఈ శనాదివారాల్లో ఆ పనసపొట్టు ఆవపెట్టిన కూర, దప్పళం లాంటివన్నీ నేర్చుకొస్తానని వెళ్ళారు. “
నాకు అర్ధంకాలేదు. “అన్నయ్య వెళ్ళడమేవిటీ? నిన్ను పంపుతానన్నాడు కదా వాటికోసం?”

నా ప్రశ్న విని, నా అజ్ఞానానికి చింతిస్తూ అప్పుడు వదిన నాకు గీతాసారాన్ని బోధించింది..

“చూడు స్వర్ణా, మీ అన్నయ్య నన్ను పంపడం, అవన్నీ నేను మీ పెద్దమ్మ దగ్గర అదే మా అత్తగారి దగ్గర శ్రధ్ధగా నేర్చుకురావడం జరిగిందనుకో. అప్పుడయినా నేను సరిగ్గా అలాగే చేసినా అది సరిగ్గా మా అత్తగారు చేసినట్లే వస్తుందన్న గారంటీ యేముంది? ఒకవేళ వచ్చినా మీ అన్నయ్యకి నచ్చుతుందన్న నమ్మకమేంటీ? ఆ మనిషికి వాళ్లమ్మ చేసినట్టు ఇంకెవరూ చెయ్యలేరని గొప్ప నమ్మకం. మీ అన్నయ్యకే కాదు..చాలామంది మగవాళ్ళంతే..వాళ్లమ్మ చేసినట్టు ఇంకెవరూ చెయ్యలేరని ఖచ్చితంగా చెప్తారు. ఇన్ని తెలిసున్నప్పుడు నేను పనికట్టుకుని వెళ్ళి ఆ దప్పళాలూ గట్రా నేర్చుకుంటే మటుకు యేంలాభం చెప్పు? అందుకే అదేదో మీ అన్నయ్యే నేర్చుకుని వచ్చేస్తే అదెలా వచ్చినా మనకింక బాధుండదు. మనం నేర్చుకోలేదన్న మాటే వుంటుంది తప్పితే నేర్చుకుని చేస్తే చేసినప్పుడల్లా మా అమ్మ చేసినట్టులేదనే మాటే మనకొస్తుంది. అందుకనే ఈ శనాదివారాలు అక్కడే వుండి, కావల్సినవి నేర్చుకుని రమ్మని నిన్న రాత్రే మీ అన్నయ్యని బస్సెక్కించేసేను.”

తెల్లబోయిన నేను నా చేతిలోంచి జారిపోతున్న ఫోన్ కిందపడకుండా పట్టుకుందుకు చాలా కష్టపడవలసొచ్చింది. గట్టిగా పట్టుకున్న ఫోన్లో “వదినా, నువ్వు నిజంగా గ్రేట్“ అనబోయి, మళ్ళీ పెద్దమ్మ దగ్గర ఏదైనా నేర్చుకురమ్మని నన్నుకూడా బస్సెక్కించేస్తుందేమోనని భయపడి, బలవంతంగా ఆపుకున్నాను. ఎంతైనా వదిన గ్రేట్ అంటూ మనసులో మటుకు అనుకోకుండా వుండలేకపోయాను .

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు