ఈ వేసవి కాలంలో మీరు వస్తున్నారా?” అని ప్రత్యేకంగా రాజారావును అడగాల్సిన పని లేదు. అతనికి వేసవి కాలంలో కాలేజీకి రెండునెలలు సెలవులుంటాయి. ముందుగానే పకడ్భందిగా ప్రణాళిక వేసుకోవడంతో ఒకరోజు అటో ఇటో విజయవాడ కుటుంబంతో సహా వాలిపోతాడు. ఇది ఇరవై ఏళ్ల నుండి జరుగుతున్న తంతు. ఇంత కాలం ఒక రెండు కుటుంబాలు ఒకే చోట కలుసుకో గలుగుతున్నారంటే వాళ్ళ మధ్య ఎంత అవగాహన ఉండాలి ? వాళ్ళు ఎన్ని సమస్యలను అధికమించి ఉండాలి ?
రాజారావుకి డబ్బుకు కొదవలేదు. లక్షన్నర వరకు జీతం వస్తుంది. చాలా మంది లాగానే అతను కూడా ఏ సమ్మర్ టూరుకో వెళ్ళొచ్చు. లేదా ఇంట్లో జల్సాగా గడిపెయొచ్చు. కాని అతనలా చెయ్యడు. ఎప్పటిలానే తన అన్నగారి కుటుంబం తోనే గడపాలి. అక్కడ వాళ్ళతోనే కలిసి ఆ చుట్టుపక్కల పుణ్య క్సేత్రాలో ,ఇంకా ఏవైనా చూడవలసిన ప్రదేశాలకో వెళ్లి వాళ్ళ సాహచర్యంలో సరదాగా మమైకమై పోవాలి. మొదట్నుంచి అదే పద్ధతి. దీనికి ఎవరూ అడ్డు తగలరు. ఇక డబ్బు ఖర్చు పెట్టటం విషయంలో ఏనాడు తన , పర అనే భేదాలు రాజారావు సృష్టించుకోలేదు. ఈ రోజుల్లో ఇటువంటి వారు ఉండటం ఆక్చర్యమే మరి. . సెలవు రోజుల్లో అయ్యే ఖర్చులో రాజారావు భాగమే ఎక్కువగా ఉంటుంది. అందుకు అన్నగారు సుబ్రహ్మణ్యం ఏమీ మాట్లాడటానికి వీల్లేదు.
ఒకవేళ ఆదవా సుబ్రహ్మణ్యం మొహమాటంతో తమ్ముడిని వారించబోతే “ నువ్వు మాత్రం ఎక్కడినుండి తెచ్చి పోస్తావురా ? మేమేనా డబ్బు వృధాగా సముద్రంలో పోయిట్లేదు కదా ? మన సరదాల కోసమేగా ఖర్చు పెట్టుకుంటున్నది ? మాటికి మాటికి డబ్బు విషయం నా దగ్గర ఎత్తకు . అక్కడ ఇంట్లో ఖర్చు పెట్టుకునేది ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నట్టు అనుకో. కాని అంతకన్నా మన వాళ్ళతో కలిసి ఈ రెండు నెలలు హాయిగా గడప గలుగుతున్నామన్న సంతృప్తి అక్కడే ఒంటరిగా పడుంటే వస్తుందా ? “ అంటూ అన్నగారు మొహం ఇబ్బందిగా పెడుతున్నప్పుడల్లా దానికి అడ్డుకట్ట వేసేవాడు రాజారావు.
తోడి కోడల్లిద్దరూ వంటిట్లో తమ పుట్టింటి కబుర్లూ, పెళ్ళిళ్ళల్లో కలుసుకున్నప్పుడు తము సరదాగా గడిపిన రోజుల గురించి మాట్లాడుకుంటూ చకచకా వంట పని కానిచ్చేసే వారు. వాళ్ళు కలిసున్న ఆ రెండు నెలలలో ఒకరి చీర ఒకరు కట్టుకోవడం , అప్ప్లుడప్పుడు దగ్గరలో ఉన్న సినిమా ధియేటర్కు వెళ్లి సినిమాలు చూసి రావడం వాళ్ళ మధ్య అన్యోన్యతను ఇంకా పెంచేది. ప్రతి సంవత్సరం రాజారావు కుటుంబం వచ్చే సరికి మామిడిపళ్ళ సీజన్ వచ్చేసేది. కొన్నప్పుడల్లా బుట్టలకు బుట్టలు కొనడమే తప్ప డబ్బుకు మొహం చూసుకునే వాళ్ళు కారు. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి తాటి ముంజెలు అమ్మేవాళ్ళు ఇంటిముందు ఎగబడి పోతూ ఉండే వాళ్ళు. ఎఱ్ఱని ఎండలో ఊరంతా తిరిగి అమ్మాలంటే వాళ్లకు చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఒక్క దెబ్బతో మొత్తం బుట్టంతా సుబ్రహ్మణ్యం ఇంటిదగ్గర ఖాళీ అయిపోయేది. ఎక్కడనుండి వచ్చే వాడో కాని షోడాలు అమ్మేవాడు క్రమం తప్పకుండా రోజుకు పది షోడాలుకు తక్కువ కొట్టేవాడు కాడు. అదేమిటో కాని ఆ ఘాటే వేరుగా ఉండేది. వీటన్నిటికీ రాజారావే డబ్బు ఇచ్చే వాడు. అన్నగారు బలవంతంగా ఇవ్వబోతే “ప్లీజ్ నా ఆనందానికి అడ్డు రావద్దు “ అంటూ సున్నితంగా వారించే వాడు.
ఈ సంవత్సరం కూడా అనుకున్న షెడ్యుల్ ప్రకారం రాజారావు కుటుంబం మండు వేసవి కాలం సమీపిస్తూ ఉండగా అన్నగారింటికి వచ్చింది. . అతనికెందుకో ఆ ఇంటికొస్తే తన సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. కొత్తగా స్వేత్చ్యా వాయువులు పీల్చుకుంటున్నట్టుగా అనిపించేది. బంధుత్వాలు పూర్తిగా అడుగంటి పోతున్న ఈ రోజుల్లో ఇంకా ఈ రెండు కుటుంబాలు సంవత్సరానికి ఒక్కసారైనా సరదాగా గడప గలుగుతున్నారంటే చూసే వాళ్లకు ఆక్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంతవరకు ఎందుకు అతని బందువర్గంలోనే “అక్కడ ఏముందని ప్రతి సంవత్సరం వెళ్లి పోతున్నావ్ ?” అంటూ విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువే.
రాజారావుకు హైదరాబాద్లో చుట్టాలు బాగానే ఉన్నా మహా అయితే ఒక గంటకన్నా ఎక్కువ కూర్చునే పరిస్తితి ఎక్కడా ఉండేది కాదు. ఎవరిని చూసినా నీళ్ళు రావడం లేదని, బోర్లు ఎండిపోయాయని, వచ్చిన వాళ్లకు గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేక పోతున్నామని ఒకటే సోత్కర్ష. నిజానికి ఎవరికి వాళ్ళు ఎంతమటుకు వాళ్ళ వాళ్ళ కుటుంబంతోనే గడపాలి అనే తాపత్రయం ఎక్కువగా కనిపించేది. . వేరే ఎవరినీ భరించే పరిస్తితి రోజు రోజుకి తగ్గిపోతోంది. వచ్చిన వాళ్లకు సేవలు చెయ్యాలి అంటెనే ఒక రకంగా ఇబ్బందిగా భావించే వాళ్ళే ఎక్కువ.
మొదట్నుంచి రాజారావుకు అన్నగారైన సుబ్రహ్మణ్యం అంటే బాగా చనువు. దానికి తోడు సుబ్రహ్మణ్యం భార్య కూడా అంతరితో కలిసిపోయే తత్వం. స్వార్ధం ఏ కోశానా కనపడదు. అందరూ తనవారే అనుకునే మనస్తత్వం. చుట్టాలెవరేనా వస్తే అర్ధరాత్రైనా వండిపోస్తుందా మహా ఇల్లాలు.
మేడ మీద పడుకుని అన్నగారితో కబుర్లు చెపుతున్న రాజారావు అన్నగారు నిద్రపోతూన్డటం గమనించి కాసేపు మేడమీద అటూ ఇటూ తిరుగుతూంటే గతం గుర్తుకొచ్చింది.
ఇరవై ఏళ్ల క్రితం సంగతి. సుబ్రహ్మణ్యం ఇంట్లో గ్యాస్ పోయ్యికాని, కుక్కర్లు కాని లేవు. తన వదినగారు బొగ్గుల కుంపట్ల మీద, కట్టెల పొయ్యి మీద ఇంటిల్లి పాదికి రెండేసి కూరలు, పులుసు, పచ్చళ్ళతో చక్రం తిప్పేది. వేసవి కాలం వచ్చిందంటే ఇంటినిండా బంధువుల తాకిడే . ఆవిడను చూస్తూంటే మానవతావాది డొక్కా సీతమ్మ గుర్తుకొచ్చేది రాజారావుకు.
సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి ఎటువంటి పరిస్తితిలోనూ భోజనాలూ పూర్తయి పోయేవి. ఆ వెంటనే ఆరుబయట నీళ్ళు చల్లుకుని రెండు మూడు మడత మంచాలు వేసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసే వాళ్ళు. ఏ సదుపాయాలూ లేని ఆ రోజులకు , అన్ని వసతులు ఉన్న ఇప్పటి పరిస్తితికి ఎందుకింత తేడా ? అప్పట్లో ఇప్పటిలా ఇరుకు మనస్తత్వాలు ఉండేవి కావు. ఎక్కడ చూసినా కరడు కట్టిన స్వార్ధం . నేనూ నా కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరూ అవసరం లేదు అన్న ధోరణి కనపడేది. . మానవ సంబంధాలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఇప్పుడున్నది పూర్తిగా వ్యాపార బంధాలు మాత్రమే. పూర్వం పెదనాన్న, చిన్నాన్న కుటుంబాలంటే ఒక కుటుంబం లోని వ్యక్తులుగా పరిగణింప బడే వాళ్ళు. ఇల్లు ఎవరిదైనా “ మన ఇల్లు” అని సంబోధించే వాళ్ళు. వేసవి కాలంలో అన్నదమ్ముల పిల్లలు ఒక చోట చేరి కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్న తమ్ముడింటికి వెళ్ళాలన్నా, తమ్ముడు అన్న ఇంటికి వెళ్ళాలన్నా ముందుగా అప్పాయింట్మెంట్ తీసుకోవాలి. కనీసం వారం రోజులు ముందుగా ప్రోగ్రాం వేసుకోవాలి. ముఖ్యంగా నగరాలలో పరిస్తితి అలా తగలపడి పోయింది. అప్పటికీ ఇప్పటికీ మారని కుటుంబం తన అన్నగారి కుటుంబం మాత్రమే.
వాతావరణ శాఖ వారు ఈ వేసవి తీవ్రత గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుందని ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు అత్యంత జాగ్రత్తతో మెలగాలని, పిల్లలను ఎటువంటి పరిస్తితిలో ఎండలోకి పంపించవద్దని, వృద్దులు ఇల్లు కదిలి బయటకు రావద్దని హెచ్చరిక చెయ్యడంతో సుబ్రహ్మణ్యం కొన్ని జాగ్రతలు తీసుకోవడానికి సమాయత్తమయ్యాడు. సూర్యుడు యదాప్రకారం చరచరా పైకొచ్చేస్తున్నాడు తన ప్రతాపం చూపడానికి.
మర్నాటి ఉదయం సుబ్రహ్మణ్యం ఎవరితోనో మాట్లాడుతున్నాడు రెండు రోజులకొక వాటర్ టాంకర్ కావాలని. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో అందరూ బయట టాంకర్ల మీదే ఆధార పడే పరిస్తితి వచ్చింది.
ఇక మంచి నీళ్ళు వారం రోజులకొకసారి వస్తే గొప్ప. ప్రతి రోజూ మినరల్ వాటర్ డబ్బాలు ఎవరో తెచ్చి ఇంట్లో పడేస్తున్నారు. రెండు మూడు పెద్ద ఖాళీ తారు డబ్బాల నిండా నీళ్ళు నిలవ చేసాడు సుబ్రహ్మణ్యం.
ఏ వేసవి కాలంలోనైనా ప్రతివాళ్ళు ముఖ్యంగా ఎదుర్కునేది నీటి ఎద్దడి. ఇందుకోసం అతను స్వయంగా ఇంట్లో కొన్ని పద్దతులు పాటించే వాడు. బాత్రూముల్లోను, వంటగదిలోనూ పంపులు లీక్ కాకుండా చూడటం , టాయిలెట్లో ఫ్లష్ నుండి నీళ్ళు ఓవర్ ఫ్లో కాకుండా ప్లంబర్ చేత పకడ్బందీగా మరమ్మత్తు పనులు చేయించడం, వాషింగ్ మెషీన్ వేసేటప్పుడు నీరు ఎక్కువగా తీసుకుని వృధాగా బయటకు పోతూ ఉంటుంది కాబట్టి
ఆ నీళ్ళను మామిడి , అరటి లాంటి పెద్ద చెట్లకు మళ్ళించడం లాంటి పనులు, స్నానం చేసేటప్పుడు బయటకు వృధాగా పోయే నీరును సన్నటి కాలువ కట్టి వేసవి కాలంలో కూరలు దొరకని నేపధ్యంలో తనే స్వయంగా దగ్గరుండి పండిస్తున్న కూరగాయల మొక్కలకు వెళ్ళేటట్టుగా మార్గం చెయ్యడం , ఇక స్కూటర్ లాంటివి కడగాలంటే సాధ్యమయినంత వరకు నీళ్ళు ఉపయోగించ కుండా పాత గుడ్డతో తుడవటం లాంటి పనులు ఒక క్రమపద్దతిలో చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాడు.. ఇక తీవ్రమైన కరెంట్ సమస్య ఉన్నా క్రిందటి సారి రాజారావు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి బజారు వెళ్లి ఇన్వర్టర్ కొనుక్కు వచ్చారు . సంవత్సరానికి ఒకసారి వచ్చే తమ్ముడి కుటుంబానికి ఏ లోటు చెయ్యకూడదని సుబ్రహ్మణ్యం అహర్నిశలు మండు వేసవి కాలాన్ని అధిగమించడానికి ఏవేవో ఉపాయాలు ఆలోచించి వాటిని అమల్లో పెట్టేవాడు. రాజారావు భార్య చాలాసార్లు ఆక్చర్య పోతూ ఉండేది బావగారు ఇంత గడ్డు వేసవి కాలంలో ఎంతో సంయమనం పాటించి ఏ మాత్రం అసౌకర్యం కలిగించకుండా నవ్వుతూ , తుళ్ళుతూ ఎలా ఉండగలుగుతున్నాడా అని. .ప్రతి వ్యక్తి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకోవడానికిగాని సేవలు చెయ్యడానికి గాని ఆంక్షలు విధించుకోరు. . అదే ఇంటికి ఎవరైనా వస్తే లెక్కలు మొదలవుతాయి. ఏదో నష్టంలో కూరుపోతున్నట్టు భావిస్తారు. కాని ఇక్కడ సుబ్రహ్మణ్యం పద్ధతి చాలామంది ఆచరించే విధానానికి , తీరుకు విరుద్దంగా ఉంటుంది.” బ్రతికినంత కాలం ఎవరూ బ్రతకరు. కాని బ్రతికున్నంత వరకు “ నా” అన్నవాళ్ళతో, దగ్గర వాళ్ళతో, మిత్రులతో మంచిగా ఉండాలని” అతని తాపత్రయం. నిజానికి అతని ఆర్ధిక పరిస్తితి అంత గొప్పదేమీ కాదు. కాని దాన్ని అధిగమించడానికి అతని మంచి మనసు ఎంతగానో తోడ్పడుతోంది..
“ఈ సంవత్సరం వచ్చి తప్పు పని చేసామేమో?” అన్నాడు రాజారావు అన్నగారితో ఒక రోజు..
“నువ్వలా పొరపాటున కూడా అలా అనుకోకురా! మీ కోసం ప్రత్యేకంగా మేమేమి చెయ్యడం లేదు. ప్రకృతి ప్రకోపించిన దానికి మనమేం చెయ్యగలం ? ఇరవై ఏళ్లుగా మనం దాదాపు ప్రతి ఏడూ ఈ ఇంట్లో
హాయిగా కాకపోయినా కనీసం మనసులు విప్పి గడుపుతున్నాం. ఇప్పుడేదో ప్రమాదం ముంచుకొచ్చినట్టుగా ఈ సంవత్సరం నేను బ్రేక్ చెయ్యదలుచుకోలేదు. ఇంకో విషయం. నేను ఎవ్వరితోనూ పోల్చుకోను. నా పంధాలో నేను పోతాను. దానికి నువ్వుకూడా ఎంతో సహకరిస్తున్నావు. ప్రకృతి ప్రళయ తాండవం ఆడినా ఎంతో నేర్పుతో మనకు అనుగుణంగా మార్చుకోవడంలోనే మన తెలివితేటలు ఉపయోగ పడతాయి. ఈ విషయంలో నువ్వు నాకు తోడుంటే ఇంతకన్నా గడ్డు పరిస్తితులలోనూ నెగ్గుకు రాగలమన్న ధైర్యం, నమ్మకం నాకుంది. “ అన్నాడు సుబ్రహ్మణ్యం ఎంతో ఆత్మ విశ్వాసం ధ్వనించిన గొంతుతో.....