మళ్ళీ ఆ మంచిరోజులొస్తాయా నాన్న - నూజిళ్ళ శ్రీనివాస్

mallee aa manchirojulostaayaa naanna



“మీ పాత గుమాస్తా ఉద్యోగమే బాగుండేది, కాస్త ఖాళీ దొరికేది. ఏ ముహూర్తాన ఈ టీచింగు లైన్లోకి వచ్చారో, పనిరోజులకి, సెలవు రోజులకి తేడాయే ఉండడం లేదు...”- అంటూ శ్రీమతి అనే నిష్ఠూరపు మాటలు గుర్తు చేసుకుంటూనే సైకిల్ స్టేండ్ వేసేసి మెట్లెక్కి ఇంట్లోకి వచ్చాను. పొద్దున్న అర్జెంటు పని మీద కాలేజీకి వెళ్లి, మళ్ళా ఇప్పుడే రావడం. చీకటి పడినా, గదులన్నీ నిప్పుల వాన కురిపిస్తున్నాయి. మేడ మీద పైవాటా అవ్వడం, ఎ.సి.లు వగైరా లేకపోవడం తో వేసవి కాలమంతా మాకు నిప్పులతో సహవాసమే.

బాత్రూం లో కాళ్ళు కడుక్కొని వచ్చి, బట్టలు మార్చుకుంటూ.... “నాని గాడు డ్రాయింగ్ క్లాసు నుంచి ఇంకా రాలేదా?అని అడిగా...నేను ఏ టైముకి వచ్చినా... “నాన్నా..” అంటూ కాళ్ళకు చుట్టేసుకొనే నాని హాల్లో కనబడకపోవడంతో.

“అసలు వెళితే కదా.?” ముక్తసరిగా శ్రీమతి సమాధానం..ఆవిడ తీసుకొచ్చిన మంచినీళ్ళు తాగుతూ, “అదేంటి? మరెక్కడికెళ్ళాడు?” అన్నా.

“ఎక్కడికీ వెళ్ళలేదు. లోపల మంచంమీద పడుకున్నాడు...” ఆవిడ గొంతులో కూడా ఏదో తేడా.

“అప్పుడే?” – నిజానికి అది చిన్నపిల్లలు అందరూ పడుకునే టైమే అయినా, మావాడి సంగతి వేరవడంతో నాకు ఆశ్చర్యం వేసింది. సాయంత్రం స్కూలు నుంచి రాగానే, హోం వర్కు చేసుకున్న తరువాత 6 నుంచి 8 వరకు తనకు ఇష్టమైన డ్రాయింగ్ క్లాసుకు వెళ్లి వచ్చి, కాసేపు కార్టూను నెట్ వర్కు చూసి, నన్ను కథ చెప్పమని, చెబుతూ... చెబుతూ... నేను నిద్రపోయాక, వాళ్ళమ్మ దగ్గరకు పోయి “అమ్మా, నాన్న నిద్రపోయారు, నువ్వు కథ చెప్పవా?” అని ఆవిడ వెంటపడి, విసిగించి, పనులన్నీ అయ్యాక కథ చెప్పించుకొని, ఎం.ఎస్.రామారావు గారి హనుమాన్ చాలీసా వింటూ గాని పడుకోడు.

***

గదిలోకి వచ్చిన నాకు మంచం మీద బోర్లా పడుకున్న నాని అటూ, ఇటూ కదులుతూ కనిపించాడు. అంటే నిద్ర పోలేదన్నమాట.
“నాన్నా? ఇంకా పడుకోలేదా?” ఉహూ. ఉలుకూ, పలుకూ లేదు.

“అన్నం తిన్నావా?”..సమాధానం లేదు. దగ్గరకు వెళ్ళేటప్పటికి వెక్కి, వెక్కి ఏడుస్తున్నాడు. “ఏమైంది నాన్నా?” అంటూ మొహం తిప్పబోతే, బలవంతంగా మొహాన్ని తలగడలో దాచేసుకున్నాడు. అంతకంతకూ వాడి ఏడుపు స్థాయి పెరుగుతోంది. ఓహో, సాయంత్రం నేను వచ్చేటప్పటికే ఎదో అయిందన్నమాట – అలసిపోయి ఇంటికి వచ్చేటప్పటికి (ఇంటి)వాతావరణం చికాకుగా ఉంటే భరించలేని బాధ. ఇంతలో వంటింట్లో నుండి కంచాలు, గిన్నెలు సర్దుతున్న శబ్దాలు గట్టిగా వినిపిస్తున్నాయి. బాధొచ్చినా, కోపమొచ్చినా నా శ్రీమతి శాబ్దికంగానే మాట్లాడుతుంది. ఆ సింబాలిజానికి బాగానే అలవాటు పడ్డ నేను, ఇక “ఏమయింది...?” అని ఆవిడను ప్రశ్నించే ధైర్యం చేయలేదు. నాని గాడి నుంచి విషయం రాబట్టడమే సులువు.

అనునయంగా వాడి నడ్డిమీద నిమురుతూ, “ఏమైంది నాన్నా? నాకు చెప్పచ్చు కదా? అమ్మ ఏమైనా అందా? స్కూల్లో ఏమైనా గొడవ జరిగిందా?” అంటూ వాడి మొహం ఇటు తిప్పితే, జలజలా రాలుతున్న కన్నీళ్లు, బుగ్గల నిండా కన్నీటి చారలు, మొహమంతా కందిపోయి ఉంది. ఎప్పటినుండి ఏడుస్తున్నాడో ఏమో, తలగడ మొత్తం తడిసిపోయింది.

పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందనిపించి, వాడి తలను నా ఒళ్లోకి తీసుకున్నాను. “ఉహూ...” అంటూ గించుకుంటున్నాడు- “ఏమక్కరలేదు, నువ్వెళ్ళిపో, నేనేం చెప్పను, నా కెవరూ ఫ్రెండ్సు లేరు, నన్ను ఆడుకోనివ్వరు. అమ్మ నా బెస్టు ఫ్రెండు కానే కాదు...”అంటూ పొంతన లేకుండా మాట్లాడుతూనే ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు అంతకంతకూ పెరిగి ఆయాసంగా మారడంతో భయం వేసి శ్రీమతిని గట్టిగా పిల్చాను. “ఏమోయ్, ఒక్కసారి ఇలారా, వీడికి ఆయాసం వచ్చేస్తోంది అని”. వాడికి ఆయాసం వస్తే, ఇక ఊపిరి ఆడనంతగా ఎగశ్వాస వచ్చి, చాలా ఇబ్బంది పడిపోతాడు. గదిలోకి వచ్చిన శ్రీమతి కూడా వాడి గుండెలపై చేయి వేసి, ఆయాసం తగ్గించే ప్రయత్నం చేస్తోంది, అయితే, వాడి ఏడుపు, ఆయాసం అంతకంతకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

ఇంక ఆగలేక అడిగాను, “అసలేమైంది? మీ ఇద్దరికీ మధ్య?” అని.

“ఏముంటుంది? మామూలే...ఎండలు ఎలా ఉన్నాయో చూసారా? మధ్యాహ్నం వస్తూనే కిందకు వెళ్లిపోయి ఆడేస్తానంటాడు... వద్దన్నానని గొడవ...ఇక అది మొదలు, ఒక పాలు తాగడం లేదు, ఒక స్నాక్స్ తినడం లేదు – వాడు చెప్పినట్టే మనం వినాలంటాడు...”, అంటూ ఇంకా ఎదో చెప్పబోతోంది – నాని గుండెలపై నిమురుతూనే.

మధ్యలో వాడు అందుకొని, “ఏం కాదు...పోనీ పాలుతాగాక, స్నాక్స్ తిన్నాకనే వెళతానన్నాను...అయినా వద్దన్నావు కదా?” అంటూ వాళ్ళ అమ్మ మాటలకు అడ్డు వచ్చాడు.

”ఎప్పుడు? మధ్యాహ్నం 3.30 కి, పైగా క్రికెట్టు ఆడతాట్ట, ఆ పెద్ద పిల్లలతో కలిసి...స్కూలులో ఆటో వచ్చేవరకు ఎండల్లో ఆడేసి వచ్చింది చాలక ఇంకా ఇంటికొచ్చేక కూడా అవే ఆటలు మళ్ళా...”

“అవే ఆటలు ఏం కాదు ...వేరేవి...” లాజిక్ తీసాడు నాని. ఇంకా... “పెద్ద వాళ్ళతో ఆడితే నీకెందుకు ఆ ఆటలు? అంటావు, చిన్నపిల్లలతో అయితే నువ్వేమైనా చంటి పిల్లాడివా? అంటావు. నువ్వైనా నాతో ఆడమంటే పనుంది అంటావు, పోనీ నాన్న ఆడతారా అంటే, ఎప్పుడూ లేటుగా రావడం, వచ్చినా కంప్యూటర్ ముందు కూచోడం. ఇంక నేను ఎప్పుడు ఆడుకోవాలి? ఎవరితో ఆడుకోవాలి?” – అంత ఆక్రోశం లోనూ నాని లాజిక్ మిస్ కావటం లేదు, పైగా విషయం తిరిగి తిరిగి నా వైపే వస్తోంది.

“మరి ఎండలు చూడు నాన్నా...చాలా ఎక్కువగా ఉన్నాయి కదా? పొద్దున్న నువ్వే చూసావు కదా పేపర్లో వార్తలు, బస్సులో ఉన్న ప్రయాణికులే వడదెబ్బకు చనిపోతున్నారు. డాక్టర్సు కూడా చిన్న పిల్లలని ఎండలోకి అస్సలు పంపద్దంటున్నారు. అమ్మ కంగారు పడడంలో అర్ధం ఉంది కదా...?” అంటూ అనునయించబోయాను. వాడికి ఆయాసం తగ్గడంతో, శ్రీమతి – భోజనాల ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది.

“నిజమే – నాన్నా... కాని, శీతాకాలం అయితే, చలిగాలి – బయటకు వెళ్ళద్దు అంటుంది, వర్షాకాలం అయితే, జ్వరం వస్తుంది, బాడి, బందగా ఉంది, బయటకు వెళ్ళద్దు అంటుంది, ఇంక సమ్మర్ లో – ఎండలు, వడదెబ్బ...పోనీ హైదరాబాద్ బావ దగ్గరకు వెళదాం అంటే, “ఇంకా స్కూల్ హాలిడేస్ ఇవ్వలేదు కదా...”, అంటుంది. ఇంక నేను ఎక్కడ ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి? ఎవరితో ఆడుకోవాలి? ...... ఇంట్లో నాతో ఆడటానికి ఇంకో మెంబర్ అయినా కావాలి...” ఆయాసం తగ్గి, నానిగాడి మాటల్లో ఆవేశం పెరుగుతోంది.
నిజమే, పదిమంది పిల్లల మధ్య పుట్టిన నాకు, నానిగాడి ఒంటరితనం ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది. సింగిల్ చైల్డ్ ప్రోబ్లం బాగా అనుభవం లోకి వస్తోంది. ఇంకా ఊరుకుంటే, వాడు మరింత సమాధానం చెప్పలేని ప్రశ్నల్లోకి వెళతాడు అనిపించి, “ఫోనీలే నాన్నా... అమ్మ ఏదో పనిలో ఉండి, విసుక్కుని ఉంటుంది. మనమిద్దరం ఆడుకుందాం. రేపట్నించి తొందరగా వచ్చేస్తా కదా...భోజనం చేసేద్దాం నడు..” అన్నాను.
కొంచెం మెత్తబడ్డా, “...అయితే, నాకు భోజనం చేసేక కథ చెప్పాలి..” అన్నాడు.

“ఓస్ అంతే కదా...తప్పనిసరిగా చెబుతాను” అన్నా..”ఉహూ.. కథ కాదు, కథ చెబుతుంటే నీకు నిద్ర వచ్చేస్తుంది, కనక నీ చిన్ననాటి విషయాలు చెప్పాలి...” అన్నాడు.

నిజమే, అబద్దాలతో అల్లేసే కథ కన్నా, వాస్తవం మరింత ఆసక్తిగా ఉంటుందని, ఉరుకులు, పరుగులు పెట్టే ప్రస్తుతం కన్నా గతం అందంగా ఉంటుందని, నిద్రబుచ్చడం కోసం అమ్మ చెప్పే కథల కన్నా కూడా నిద్రపోతూ, నాన్న చెప్పే కబుర్లే బాగుంటాయని మా నానిగాడికి బాగా తెలుసు.

***

మొత్తానికి భోజనం కానిచ్చి, మేడమీద పక్క వేసి, నానిగాడి పక్కన పడుకున్నా...”ఇంక మొదలుపెడదామా... నా చిన్ననాటి కబుర్లు? అంటూ..”

“కాని నువ్వు నిద్రపోకూడదు మరి...” నానిగాడి ముందస్తు హెచ్చరిక.

“సరే...మా చిన్నప్పుడు ఎండాకాలం రోజంతా భలేగా ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా..?” అంటూ ప్రారంభించాను.

“మరి, మామ్మ గారు, తాత గారు ఏమనేవారు కాదా?” “ఉహూ...వేసవి సెలవులు అంటేనే ఆడుకోడానికి అన్నట్లు ఉండేది, అయితే... దాంతో పాటు ఇంకా చాలా పనులు చేసేవాళ్ళం అనుకో...”. ఇంక ప్రశ్నలన్నీ కళ్ళతోటే, అన్నట్టు మౌనంగా వింటున్నాడు నాని.

“పొద్దున్న లేస్తూనే – స్నానం చేసేసి, తరవాణి అన్నంలో ఆవకాయ నంచుకుని తినేసి, నేను నా స్నేహితుడు సుబ్బారావు ఇంటికి పోయేవాడిని.” --- “తరవాణి అంటే?” – అనే సందేహం వాడికి వచ్చినా, తరవాత ఏం చేసేవాళ్ళం అనే దానిపైనే ఆసక్తి ఎక్కువగా ఉండడంతో ఇక ప్రశ్న వేయలేదు. “అక్కడనుంచి వాడి సైకిలు మీద ఎక్కి, ఊరి చివర ఉన్న రెడ్డిబాబుగారి పెంకుల మిల్లు దగ్గరకు పోయేవాళ్ళం. అక్కడ మరికొంత మంది స్నేహితులు కలిసేవారు. మిల్లు లోపల చల్లగా ఉండేది. కిరోసిన్ వాసన వస్తున్న మట్టి పెంకులు తయారి చూడడం భలేగా ఉండేది. పాడైపోయిన పచ్చి పెంకుల మట్టి ముద్దలు ముందేసుకొని బొమ్మలు చేసేవాళ్ళం. ఆకలేస్తే, రెడ్డిబాబుగారి మిల్లు వెనక తోటలో జామచెట్లు ఎక్కడం, కాయలు కోసుకొని, ఉప్పు, కారం లో నంచుకొని తినడం”---వింటున్న నానిగాడికి నోరూరుతోంది అన్న సంగతి తెలుస్తోంది.

“బాగా ఆకలి వేసేక, మధ్యాహ్నానికి ఇళ్ళకి చేరేవాళ్ళం. కటకటాల వాకిట్లో తాతగారు వ్యాసపీఠం మీద ఏదైనా పుస్తకం పెట్టుకుని శ్రద్ధగా చదువుకుంటుంటేనో, ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతుంటేనో పరవాలేదు, పిల్లిలా జాగ్రత్తగా లోపలికి వచ్చేసి, బుద్ధిగా గదిలో కూచునేవాడిని. లేదంటే కొంచెం ఇబ్బంది...మరి కాసేపటికి, మా అన్నయ్యలు, అదే – నీ పెద నాన్నలు, కూడా వాళ్ళ స్నేహితులతో తిరిగి, తిరిగి, ఎండలో చెమటలు కక్కుకుంటూ వచ్చేవారు”.

“ఏం బాబు, ఇల్లు ఇప్పటికి గుర్తుకొచ్చిందా? ఏం ఏకంగా రాత్రి పడుకోడానికి రాలేకపోయారా?” అంటూ మా అమ్మ – అంటే మీ మామ్మ గారు వంటింట్లోంచి వచ్చి అనేంతవరకు తాత గారు ఏమనేవారు కాదు. అప్పుడు కూడా, “ఏమర్రా, ఎండల్లో పడి ఎక్కడ తిరుగుతున్నారు? భగవద్గీత శ్లోకాలు వచ్చేసేయా?” అనేవారు.

“హమ్మో...” అప్పుడు గుర్తుకొచ్చేది – ముందు రోజు తాతగారు మమ్మల్నందరినీ కూర్చోపెట్టి నేర్పిన “భక్తియోగం శ్లోకాలు”. ఇంతలో మా పాట్లు చూసి, మా అక్క, చెల్లెళ్ళు – అదే నీ అత్తలు నవ్వేవారు – బాగా అయిందా? అన్నట్లుగా. వాళ్ళు ఆ పాటికి, శ్లోకాలు చదివి అప్పగించడం అయిపోయిందన్న మాట. మా అమ్మ – అన్నంతో పాటు పెట్టే తిట్లు కూడా కడుపునిండా నింపేసుకొని, భగవద్గీత పుస్తకాలు ముందేసుకుని కూచునేవాళ్ళం.

“ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ: అథ శ్రీమద్భగవద్గీతా, భక్తియోగ: .......”ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే.......” అంటూ ముందుకూ వెనక్కూ ఊగుతూ, మాలో మేము గొణుక్కుంటూ ఉంటే, “పెద్దగా వినబడేట్లు చదవండి”....అంటూ మీ పెద్ద అత్త హుకుం జారీ చేసేది. పెట్టినా, తిట్టినా అమ్మ తరవాత అక్కే కదా... అందుకొని ఏమీ చేసేది లేక – పెద్దగా చదువుతూ ఉండేవాళ్ళం... ఈలోపులో ఊళ్ళో వాళ్ళో, పొరుగూరు వాళ్ళో మామిడి కాయలో, మామిడి పళ్ళో పంపేవారు అభిమానంగా. అంతే, శ్లోకాలు పక్కన పెట్టి, మామ్మగారి పక్కన చేరి, “ఏమైనా సాయం చేయాలా?” అని అడిగేవాళ్ళం – విషయం అర్ధమైన మామ్మగారు, అందరికీ తలో మామిడి పండు ఇచ్చి, “తినేసి మళ్ళా కూచుని శ్లోకాలు చదవండి, నాన్నగారు తిడతారు...” అనేవారు.

“ఆ చెరుకురసాల మామిడి పళ్ళు ఆస్వాదిస్తూ మేము తినడం, అదే, జుర్ర్రడం పూర్తి చేసేటప్పటికి, ఎండ కాస్త తగ్గేది, సిమెంటు చేసిన విశాలమైన వరండాలో మధ్యాహ్నం ఎండబెట్టిన ఎండుమిర్చి, కందిపప్పు, మినప్పప్పు లాంటివన్నీ సాయంత్రం అయ్యాక, అందరం కలిసి జాగ్రత్తగా డబ్బాల్లోకి ఎత్తేసేవాళ్ళం. మరి ఎండుమిర్చి ఎండబెడితే మళ్ళా మండుతుంది కదా... అందుకని, నూతిలోంచి బక్కెట్లు, బక్కెట్లు నీళ్ళు తోడి, వరండాలో పోసి, చీపురు తో శుభ్రంగా గచ్చు అంతా కడిగేసేవాళ్ళం. అక్కడే, శుభ్రంగా స్నానాలు కూడా చేసేస్తూ, గచ్చు పైనుంచి, కింద వరకు జారుతుండే వాళ్ళం ...జలకాలాటలలో అని పాటలు పాడుకుంటూ...” – వింటున్న నాని గాడి కళ్ళల్లో ఉత్సుకతతో పాటు, ఒకింత ఈర్ష్య కూడా కనబడింది.

“మామిడి కాయలు వచ్చినప్పుడు అయితే, మాగాయి, తొక్కుడు పచ్చడి, రకరకాల ఆవకాయల కోసం, ఆల్చిప్పలతో చెక్కులు తీయడం లాంటివి మేం చేసేవాళ్ళం. మరకత్తిపీట తో ఆవకాయ ముక్కలు కోయడం తాతగారు చేసేవారు. ఇంక ఆ వారం, పది రోజులు మామ్మగారు కారం కొట్టడం, ఆవ కొట్టడం, గానుగ నూనె తెచ్చి, జాడీల్లో ఆవకాయలు పెట్టడం – ఈ పనులతో బిజీనే బిజీ...ఒకోసారి, ఈ పనులన్నీ చుట్టుపక్కల వాళ్ళంతా కలిపి చేసుకొనేవారు....”

“మరి అమ్మ ఎప్పుడూ ఆవకాయ పెట్టదేం...?” అని అడుగుతూనే, “అయినా ఇప్పుడు రెడీమేడ్ ఊరగాయలు దొరికేస్తున్నాయి కదా....ఆ అవసరం లేదులే” అన్నాడు నాని. “అవును ..అయితే, ఇప్పుడు ఆ సందడీ లేదు...రుచీ లేదు..” అన్నా... అమ్మ చేసిన ఊరగాయ రుచి గుర్తుకొచ్చి నోరూరుతుంటే.

“ఒకోసారి, సాయంత్రం చల్లబడ్డాక, ఇంటివెనుక తోట పని – అక్కడ తాతగారు గునపంతో, పారతో, కొడవలితో శుభ్రం చేస్తుంటే, నేను, మీ పెదనాన్నలు, అత్తలు – అంతా సాయం చేసేవాళ్ళం. అరటి చెట్లకు, కొబ్బరి చెట్లకు బోదెలు చేయడం, టమాటా, వంగ, పచ్చిమిర్చి మొక్కలకు – నీళ్ళు పోయడం కోసం సన్నని పాదులు తీయడం, నూతి నుంచి నీళ్ళు తూముల్లో పోసి, అక్కడినుంచి మళ్ళా, బొబ్బాసి గొట్టాలతో సన్నటి కుళాయిల్లా చేసి, మొక్కలకు నీళ్ళు పెట్టడం....” చెబుతుంటే, నానిగాడి మొఖంలో ఈసారి ఈర్ష్య స్పష్టంగా కనబడుతోంది. “అవన్నీ నాకు ఇప్పుడెందుకు లేవు?” అన్న ప్రశ్న మౌనంగా సంధిస్తున్నట్టు అనిపించింది.

“తోటపని లేకపోతే, మళ్ళా పిల్లుల్లా బయటకు జారుకుని, ఇంటికి దగ్గరగా ఉన్న నూకాలమ్మ గుడికి చేరేవాళ్ళం. ఆ గుడి చుట్టుపక్కల అప్పటికే పంటలు నూర్చేసిన పొలాలు ఉండేవి. తాటాకులతో చక్రాలను తయారు చేసుకుని, డానికి పొడవైన ముళ్ళు గుచ్చి, కింద మొనలు తేరిన గడ్డి దుబ్బులు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా, పరుగులు పెట్టే వాళ్ళం..ఆ తాటాకు చక్రం తిరుగుతుంటే భలే సరదాగా ఉండేది. ఒక్కో సారి గాలిపటాలు న్యూసు పేపరుతో తయారు చేసుకొని, దారం కట్టి ఎగరేసుకునే వాళ్ళం...ఇంకా తాటి ముంజలతో బళ్ళు, పాత సైకిలు చక్రాలతో పరుగులు....అక్కడ ఎవరైనా తాటి ముంజలో, కాల్చిన తేగలో ఇస్తే తినెయ్యడం...మళ్ళా ఆడుకోడం. మా గ్యాంగు లో ఆ సందులో ఉండే లెక్చరర్ గారి పిల్లలు, ప్రెసిడెంటు గారి మనవలు, అప్పుడప్పుడూ మా క్లాసుమేట్లు, మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ పిల్లలు, ఆ పక్క సందులో వాళ్ళు – ఓహ్ సుమారు 25-30 మంది ఉండేవారు”.

“హమ్మో అంత మందే...” అంటూ నాని నోరు వెళ్ళబెట్టాడు.

“ఆటలను బట్టి, ఆడా, మగా, విడివిడిగా గాని, కలిసి గాని ఆడేవాళ్ళం. ఆటలు పూర్తయి చీకటి పడి, మళ్ళా ఇల్లు చేరేటప్పటికి మామ్మగారు అన్నాలు రెడీ చేసేసేవారు. తొందరగా కానిచ్చి, మళ్ళా వీధుల్లోకి పరుగే పరుగు.

“అదేంటి? మరి కార్టూన్ నెట్ వర్కు చూసేవారు కాదా?” – నానిగాడు ఆశ్చర్యంగా అడిగాడు.

“ఉహూ....అప్పుడు అవి లేవు, అయినా మా ఇంట్లో అసలు టి.వి. నే లేదు..” అన్నాను.

“ఊ ...రాత్రి బయటకెళ్ళి ఏం చేసేవారు?” అన్నాడు.

“నిద్రపొమ్మని ఇళ్ళనుంచి పిలుపులు వచ్చే వరకు మళ్ళా ఆటలే ఆటలు...వీధి దీపాల వెలుగుల్లోనే ఏడు పెంకుల ఆట, దొంగా పోలీసు, ఆడపిల్లలైతే, కాళ్ళా గజ్జ కంకాలమ్మ...ఇల్లా ఆటలే ఆటలు....వీధంతా సందడే సందడి...” అని చెప్పి, “ఇంక పడుకుందామా?” అన్నాను.

“అదేంటి? అన్ని సమ్మర్ హాలిడేస్ అయితే, ఇన్ని విశేషాలేనా? ఇంకా చెప్పాలి...” అన్నాడు నాని.

“హమ్మదొంగా ....అన్ని రోజుల గురించి చెప్పాలా?” అంటూనే, “సరే...చెబుతాలే..విను” అన్నాను.

ఇంతలో “మీరు మీ పురాణానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టకపోతే, వాడు అలా చెప్పమంటూనే ఉంటాడు...” అంటూ శ్రీమతి సూచన లాంటి మెత్తని హెచ్చరిక జారీ చేసింది.

“ఏమీ పర్వాలేదు..రేపు స్కూలు సెలవే కదా... లేటుగా లేచినా పర్వాలేదు....నువ్వు చెప్పు నాన్నా...” నానిగాడి ఆజ్ఞ.

“ఒకోరోజు... మా స్నేహితులం అంతా ఊరికి దూరంగా ఉన్న మా స్నేహితుడు కిట్టూ పొలానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ సీమ చింత కాయలు, ముంజెలు, తేగలు తినడం...అక్కడకు వచ్చే లేళ్ళను, దుప్పులను దూరం నుంచే చూడడం చూసేవాళ్ళం”. వింటున్న నానికి వింతగా అనిపించింది. నేను కల్పించి చెబుతున్నానేమో అనుకోని, “అదేంటి? లేళ్ళు, దుప్పులూనా? అవి జూలోను, అడవి లోను కదా ఉంటాయి?” అంటూ అనుమానం వ్యక్తం చేసాడు.

“లేదు నాన్నా... అప్పుడు అవి మా ఊరికి దగ్గరలో కూడా కనిపించేవి. ఇప్పుడు మొత్తం ఊర్లు పెరిగిపోవడం, ఇళ్ళు ఎక్కువ అయిపోవడంతో కనబడడం లేదు.” అన్నాను. “ఇంకా... అక్కడ పొలం నుంచి మా స్నేహితుల ఇళ్ళకు వెళ్లి, చక్కగా స్వీట్లు, టిఫిన్లు తినడం, చల్లటి మజ్జిగ తాగడం..”గురువుగారి అబ్బాయి గారు” అని మా ఫ్రెండు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే మా ఫ్రెండ్సు ముందు కొంచెం దర్జా వెలగబెట్టడం... భలేగా ఉండేదిలే...”. నాని గాడు మరింత దగ్గరగా జరిగి, నా మీద చేతులు వేసి, వింటున్నాడు.

“ఉగాది తరువాత నూకాలమ్మ తీర్థం వచ్చేది. పది రోజుల పాటు సంబరాలు జరిగేవి. ఆ పది రోజులూ ఇంక ఇంటి పట్టున ఉండే వాళ్ళం కాదు. గుడి దగ్గర టేపు రికార్డులో సినిమా పాటలు వస్తుంటే, డేన్సులు చేసుకుంటూ, ఆటలు ఆడుకుంటూ సందడే సందడి...కొబ్బరికాయ ముక్కలు, అరటిపళ్ళు, వడపప్పులు, పానకాలు, అంతటితో ఆగకుండా తీర్ధం లో అమ్మే జీళ్ళు, తవుడు ఉండలు ఆరగిస్తూ ఆడుకోవడమే.....రాత్రి అయితే గుడి పక్కన ఖాళీ అయిన పొలాల్లో సినిమాలు, నాటకాలు వేసేవాళ్ళు”.

“ఏంటీ వీధుల్లో సినిమాలా?” నానిగాడికి ఆశ్చర్యం.

“అవును నాన్నా, అప్పుడు 16 ఎం.ఎం. అని చిన్న తెరమీద సినిమాలు వేసేవాళ్ళు....దొరబాబు, సోగ్గాడు, మాయదారి మల్లిగాడు, రైతుబిడ్డ, బావామరదళ్ళు, దసరాబుల్లోడు, కాంభోజరాజు కథ, లవకుశ, మాయాబజార్, ఖైదీ.......” ఇలా చెబుతుంటే..ఎప్పుడూ వినని సినిమా పేర్లు వింటున్న నానిగాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు.

“మరి, ఎక్కడ కూర్చొనే వాళ్ళు?”

“అక్కడే.., పొలాల్లోనే, కాకపోతే, మేం ముందుగానే వెళ్లి, చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలు కొన్ని పీకి, కొంచెం గడ్డితో కలిపి, వత్తుగా పరుపులా చేసుకొని, వాటిమీద గోనె సంచులు వేసుకొని,...ఓహ్...ఇలా పడుక్కుని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన జంతికలో, చేగోడీలో తింటూ సినిమా చూస్తుంటే...” అంటుంటే, నానిగాడు ఉడుక్కోడం మొఖంలో స్పష్టంగా కనబడుతోంది. “అలా... ఒక్కోసారి సినిమా చూస్తూనే నిద్రపోయే వాళ్ళం..సినిమా అయిపోయాక ఎవరైనా లేపేవారు, లేదంటే తాతగారు వచ్చి తీసుకెళ్ళే వారు....” వింటున్న నానిగాడికి కొద్దిగా ఆవలింతలు వస్తున్నాయి.

“ఇంక పడుకుందామా?” అన్నాను.

“ఉహూ...ఇంకా చెప్పాల్సిందే...” – అన్నాడు ఆవలింతలను బలవంతంగా ఆపుకుంటూ. వింటున్న నాని కోసమే కాక, చిన్ననాటి తీపి గుర్తులు నెమరు వేసుకోవడం నాకూ చాలా ఆనందంగా ఉండడంతో, కొనసాగించడానికే నిశ్చయించాను.

“ఇక శ్రీరామ నవమికి ఊర్లో అన్ని పేటల్లో ఉండే రామ కోవెలలన్నీ ముస్తాబు చేసేవారు – సీతారాముల కల్యాణానికి. అంతేకాదు, చిన్నపిల్లలమైనా, గురువుగారి పిల్లలంటూ, మాకు కూడా, పెద్ద వాళ్ళతో పాటుగా విసనకర్రలు, మామిడి పళ్ళు, రూపాయో, రెండు రూపాయలో – తళతళలాడే నోట్లు – సంభావనగా అందించేవారు..” నానిగాడి పెదాలపై నవ్వు. అయితే, ఎప్పుడూ లేనిది, మరిన్ని ఆవలింతలు వస్తున్నాయి వాడికి.

“నాన్నా, ఇంక పడుకుందామా? “ అన్నా.

“అంటే....సమ్మర్ విశేషాలు అయిపోయాయా? మరి సమ్మర్ హాలిడేస్ కి మీరు ఎక్కడికీ వెళ్ళేవారు కాదా?” అన్నాడు.

“ఓహో ఇంకా ఆ విశేషాలు కూడా చెప్పాలా?” అంటూ... “నీకు తెలుసు కదా, మాది పెద్ద ఫేమిలీ, అలాగే పెద్ద ఇల్లు కూడా. అందుకని, చుట్టాలంతా మా యింటికే వచ్చేవాళ్ళు. వస్తే ఎక్కువరోజులే ఉండేవారు. మా అమ్మమ్మ గారిది కూడా అదే ఊరు కావడంతో మా మావయ్యల పిల్లలు, పిన్నుల పిల్లలు అందరూ అక్కడికే – ఇంక చూసుకో సందడే సందడి. మధ్యాహ్నం ఐసు ఫ్రూట్లు, చంద్రం కిళ్ళీ కొట్టు లో నిమ్మసోడాలు, సాయంత్రం స్నానాలు అయ్యాక, విష్ణాలయంలో దర్శనాలు .... అక్కడికి వెళ్ళేది దేవుడి కోసం కాదు – ఆచార్యులు గారు పెట్టే వడల ప్రసాదం కోసం....” అంటుంటే....నాని గాడి పెదాల మీద మళ్ళా నవ్వు కనబడుతోంది, అయితే రెప్పలు మూతపడుతూ క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు...” ఎందుకో చాలా రోజుల తరువాత జ్ఞాపకాల తీయని బాధ మూలంగా నాకు నిద్ర రాలేదు.

నానిగాడు మాత్రం “మళ్ళీ ఆ మంచి రోజులొస్తాయా నాన్నా...?” అంటూ పలవరిస్తూనే ఉన్నాడు రాత్రంతా.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి