చైతన్య దీపికలు - దినవహి సత్యవతి

chaitanya deepikalu

భాగ్యనగరంలో అది “ఆనందవిహార్” అని అత్యంత ధనవంతుల గృహాసముదాయాల ప్రాంగణం . అందులో గృహాలన్నీ కలిపి సుమారు 50 దాకా ఉండవచ్చు. ప్రతి ఇంటి ముందు కారు పెట్టుకునేందుకు , మూడు వైపులా పూల మొక్కలు పెంచుకునేందుకు ఖాళీ స్థలము ఉన్నాయి. విశాలమైన రోడ్లు , పచ్చదనంతో ఎంతో పరిశుభ్రంగా ఉండి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఆ సుందరమైన కాలనీలోకి మూడు సంవత్సరాల క్రితం సావిత్రమ్మ శంకరయ్యగార్లు ఒక ఇల్లు కొనుక్కుని నివాసం ఉండటానికి వచ్చారు . ఆ దంపతులకి ఇరువురు కుమారులు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యి అమెరికాలో స్థిర పడ్డారు. పెద్దకుమారుడికి ఇద్దరు కవల పిల్లలు చైతన్య , దీపిక . పదిసంవత్సరాల వయసున్న ఇద్దరిలోకి చైతన్య 2 నిమిషాలు పెద్దవాడు. రెండవ కుమారునికి ఒక 6 నెలల పాపాయి .

మరి నాలుగు రోజుల్లో శంకరయ్య దంపతుల కుమారులు కుటుంబాలతో సహా తల్లి దండ్రులను చూసి వాళ్ళ దగ్గిర గడిపి వెళదామని భారతదేశం వస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటినుండి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఆనందవిహార్ లోని ఈ ఇంటికి పిల్లలందరూ రావడం ఇదే మొదటిసారి . మనుమడు మనుమరాండ్రతో సమయం గడపాలని పెద్ద వాళ్ళిద్దరి మనసులు ఉవ్విళ్ళూరుతున్నాయి.

ఆనందవిహార్ కాలనీలో ఒక విచిత్రమైన పోటీ జరుగుతుంటుంది . అదేమంటే ఎవరి కారు , గృహ ప్రాంగణమైతే అత్యంత పరిశుభ్రంగా ఉంటాయో వాళ్ళకి ఒక బహుమానం ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు . ఆ విధంగా కాలనీ అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుందనే ఒక ఆలోచనతో ఈ పోటీ ప్రతిపాదించబడింది. శుభ్రమైన ప్రాంగణం ఎవరిదనే విషయాన్ని నిర్ణయించడానికి నిష్పక్షపాతంగా ఉంటుందని బయటనించి న్యాయనిర్ణేతలని పిలుస్తుంటారు. అందువల్ల ఆ బహుమానం తమకే దక్కాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు . అందరూ ఉదయాన్నే లేచి నీళ్ళని డబ్బులాగా వెదజల్లి కార్లు, ప్రాంగణాలు శుభ్రం చేసుకుంటుంటారు . ప్రతి ఇంటికి బోరుబావి ఉండటంతో ఇష్టారాజ్యం భరతుడి పట్టం చందాన నీటి వాడకం జరుగుతూ ఉంటుంది.

శంకరయ్యదంపతుల పిల్లలకి, మనుమలకి ఆనందవిహార్ ఎంతో బాగా నచ్చింది. కాలనీలో జరిగే పోటిగురించి కూడా ఎంతో ఆసక్తిగా విన్నారు. అమెరికాలో ఉంటున్నప్పటికి ఇంట్లో కొడుకు కోడలు తెలుగులోనే సంభాషించుకోవడం వలన శంకరయ్యగారి మనుమలిద్దరికి తెలుగు బాగా మాట్లాడటం వచ్చును. మాతృభాష వచ్చి ఉండాలనే ఉద్దేశ్యంతో శంకరయ్యగారి కోడలు పట్టుబట్టి నేర్పించడంతో మనుమలిద్దరికి తెలుగు వ్రాయడం చదవడం కూడా బాగానే వచ్చును. చైతన్య దీపిక ఎంతో చురుకైన పిల్లలు. భాష తెలిసి ఉండటంతో సహజంగా స్నేహశీలులైన ఇద్దరూ కాలనీలో పిల్లలందరితో త్వరలోనే స్నేహం కట్టేశారు.

మంచి తెలివి తేటలు , గ్రహింపు శక్తి , విచక్షణా జ్ఞానం కలిగి ఉండటమే కాకుండా ప్రపంచ జ్ఞానం కూడా బాగా ఉన్నవాళ్ళు చైతన్య దీపిక. కాలనీలో అన్ని విషయాలూ ఎంతో బాగా నచ్చాయి కానీ ఒక విషయం మాత్రం పిల్లలకు ఆశ్చర్యము బాధ కూడా కలిగించాయి అదేమంటే కాలనీలో నీటి వాడకం పట్ల చూపబడుతున్న అలక్ష్యం దీనికంతటికి కారణం ముఖ్యంగా అందరూ ధన వంతులే కావడం పైగా పోటీలో ఎలాగైనా తామే గెలవాలనే ఉద్దేశ్యంతో మోటార్లు పని చేయనప్పుడు కూడా డబ్బు వెదజల్లి ఎడా -పెడా నీటి ట్యాంకర్లు తెప్పించుకుని మరీ ప్రాంగణాలు కార్లు శుభ్రం చేసేస్తుండటమే అనిపించింది పిల్లలిద్దరికి!!!

ఒకనాడు దీపిక గ్లాసులో మంచినీళ్లు పట్టుకుని సగం త్రాగి వదిలేసింది. అది చూసిన శంకరయ్యగారు “అదేమిటమ్మ దీపికా అలా నీళ్ళు వృధా చేయటం తప్పుకాదా? అవి కూడా త్రాగేసేయి “ అని కోప్పడ్డారు. ఒకసారి అన్నగారి కేసి చూసి దీపిక మిగిలిన నీళ్ళు కూడా త్రాగేసి అక్కడినించి మాట్లాడకుండా వెళ్లిపోయింది.

అంతా చూస్తున్న చైతన్య మాత్రం “ మీరందరూ పోటీల పేరుతో ఎంతో నీరు వృధా చేస్తున్నారు , అది తప్పుకాదా తాతగారు?” అని అడుగుదామని నోటిదాకా వచ్చినా పెద్దవారితో వాదనలెందుకని అప్పటికి మౌనంగా ఉండిపోయాడు.

ఆ రోజు సాయంత్రం పార్కులో పెద్దలందరూ చేరి ఇష్టాగోష్టి చేస్తుండగా “రావుగారింట్లో బోరుబావిలో నీరు రావడం లేదుట” అన్నారు వారిలో ఒకరు.

“అవును నేను కూడా విన్నాను . ఇదే సమస్య రాఘవయ్యగారింట్లో కూడా వచ్చిందట” ఇంకొకరి ఉవాచ.

ప్రక్కనే ఆడుకుంటున్న చైతన్య దీపిక వీరి మాటలు వింటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని “మనం ఊహించిన ఉపద్రవం రానే వచ్చింది” అనుకున్నారు.

“అమ్మయ్య అయితే మనకి పోటీలో ఇద్దరు తగ్గారన్నమాట “ అని ఎవరో అనడం విన్న పిల్లలిద్దరూ అవాక్కయ్యారు. ఇలాంటప్పుడు కూడా వీళ్ళు తమకు పోటిలో ఇద్దరు తగ్గారనే సంతోషిస్తున్నారు తప్ప ముందు పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆలోచనే లేదా? బోరుబావులలో నీరు కూడా ఇంకిపోతే వాడకానికి కూడా నీరు దొరకకుండా అయిపోతుందని ఇంతమంది పెద్దలలో ఒక్కరికీ అనిపించటం లేదా? లేదా ట్యాంకర్లలో తెప్పించుకుని వాడుకుందాములే అనే భరోసాతో ఉన్నారా అందరూ?” అనుకుని ఎంతో బాధపడ్డారు .

‘ఈ పరిస్థితి మారాలి , అందుకు మనమే ఏదైనా చేయాలి ‘ అనుకున్నారు తదనంతరం చైతన్య దీపికలు.

ఆ మర్నాడు శంకరయ్యగారి ఇంట్లో అందరూ రాత్రి భోజనాలయ్యాక హాలులో సమావేశమై కబుర్లు చెప్పుకోసాగారు. మనుమలతో కబుర్లు చెపుదామని వాళ్లకేసి చూసిన శంకరయ్యగారికి మాత్రం చైతన్య దీపిక ఎంతో శ్రద్ధగా టి. వి. చూస్తుండటం గమనించారు.

‘ఏం చూస్తున్నారో పిల్లలు?’ అని ఆయనా అటువైపు చూడగా తెలుగు వార్తలు చూస్తున్నారు ఇద్దరు. సరేలేమ్మని ఆయన చిన్న మనుమరాలితో ఆడుకోవడంలో నిమగ్నమైపోయారు. కానీ వార్తలలో చూపించిన ఒక విషయం మాత్రం పిల్లలిద్దరిని ఎంతో ఆకట్టుకుంది. ‘అవును మనం ఇలా చేస్తే బాగుంటుంది’ అనుకుని మర్నాడు స్నేహితులందరితో సమావేశమై సమాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు..........

ఆ రోజు ఆదివారం కావడంతో పెద్దలందరూ తీరుబడిగా లేచి కాఫీ తాగుతూ ఎవరిళ్ళలో వారు వరండాలో కూర్చుని పేపరు చదువుకుంటున్నారు. ఇంతలో బయట ఏదో కోలాహలం. అది తాముండే వీధిలోనే కావడంతో ‘ఏమిటో’ అని శంకరయ్యగారి కుటుంబసభ్యులందరూ బిల బిల మంటూ బయటకి వచ్చారు.

కాలనీలో పిల్లలందరూ ఒక గుంపుగా ఏర్పడి నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో నినాదాలు వ్రాసి ఉన్న ఒక్కొక్క ప్లాకార్డు (ప్రకటన పత్రిక) ఉంది . పిల్లల నినాదాలేమిటా అని చెవులు రిక్కించి కొంతమంది విందామని ప్రయత్నిస్తుంటే , మరి కొంతమందేమో వాళ్ళ చేతులలోని ప్లాకార్డులలో ఏమి వ్రాసి ఉందా అని పరికించి చూడసాగారు.

“పోటీల పేరుతో విలువైన నీటిని వృధా చేయ వద్దు”

“బోరుబావులను అధికంగా వాడటం వలన నీటి పట్టిక తగ్గిపోయే ప్రమాదం ఉంది”

“ఇంటింటికి ఇంకుడు గుంటలను త్రవ్వి నీటిని వృధా పోనీయక జాగ్రత్త పరుచుకోవాలి”

“ఇంకుడు గుంటల వలన భూమిలో నీటి పట్టిక పెరిగి భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ఉంటుంది”.........ఇలా సాగుతున్నాయి వాళ్ళ నినాదాలు.

పిల్లలు నినాదాలు చేయడంతో పాటుగా ప్రతి ఇంటిలోనూ నీటిని పొదుపుగా వాడే పద్ధతులను తెలియజేసే కరపత్రాలు పంచిపెట్టడం, గేటుకు ‘ఇంకుడు గుంట త్రవ్వండి ‘ అని వ్రాసి ఉన్న ఒక బోర్డును వ్రేలాడదీయడం చేయసాగారు. ఆ పనిలో పిల్లలకి సహాయపడుతూ కాలనీ తోటమాలి , కాపలాదారుడు ఉండటం అందరూ గమనించారు. ఆ గుంపుకి నాయకత్వం వహిస్తూ ఇద్దరు పిల్లలు ముందు నినాదాలు చేస్తూ నడుస్తుంటే మిగిలిన పిల్లలు తిరిగి అదే నినాదం చేస్తూ వెనుకగా వారిని అనుసరిస్తున్నారు .

‘నాయకత్వం వహించిన పిల్లలు ఎవరా?’ అని పరికించి చూసిన శంకరయ్య పార్వతమ్మగార్ల ఆశ్చర్యానికి అంతులేదు !!! వాళ్ళు తమ మనుమడు చైతన్య , మనుమరాలు దీపిక!!

అప్పుడు శంకరయ్యగారికి ఆ రోజు తన మనుమలిద్దరూ వార్తలలో అంత సుదీర్ఘంగా చూసిన విషయమేమిటో తెలియవచ్చింది . నిజానికి నీటిని వృధా చేసే ఈ పోటీలకి శంకరయ్యగారు మొదటినించే వ్యతిరేకి. ఎన్నో సార్లు ఆయన ఈ విషయంమై అందరినీ హెచ్చరించడానికి ప్రయత్నించినా అందరూ పెడచెవిని పెట్టడంతో చెప్పి చెప్పి విసిగిపోయి ఆయన కూడా వదిలివేశారు. అదే విషయాన్ని ఈనాడు తన మనుమలు ఆకళింపు చేసుకుని ఇలా అమలు చేయడం ఆయనకి ఎంతో సంతోషాన్నిచ్చింది. కనీసం ఇప్పటికైనా ఈ కాలనీ వాళ్ళకి జ్ఞానోదయమైతే అంతే చాలుననుకుంటూ మళ్ళీ పెద్దగా నినాదాలు వినరావడంతో ఆలోచనలలోంచి బయట పడ్డారు శంకరయ్యగారు. ప్రత్యేకంగా మనుమలిద్దరి దగ్గరకు “నేను ఎప్పటినించో చెడామనుకుంటున్నది మీరు ఇవాళ చేసి చూపించారర్రా “ అంటూ వాళ్ళని భుజం తట్టి అభినందించారు.

“థ్యాంక్స్ తాతగారు” అని ఆ రోజు ఆయనను అపార్థం చేసుకున్నందుకు మనసులోనే ఆయనకు క్షమార్పణలు చెప్పుకున్నారు వాళ్ళు.

“చిన్న పిల్లలైనా నీటి పొదుపు గురించి ఎంత చక్కటి మాటలు చెప్పారు . పెద్దవాళ్ళకి ఈ విషయమై కనువిప్పు కలుగజేయడానికి ఎంత సున్నితమైన మార్గం ఎన్నుకున్నారు?” అనుకుని వాళ్ళ సూచనలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని పెద్దలందరూ వాగ్దానం చేశారు.

అంతే కాకుండా తక్షణమే పోటీలను రద్దుచేస్తున్నట్లు అందరికీ తెలియజేశారు. కానీ ఆరోగ్యారీత్యా కాలనీ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవడానికై సాధ్యమైనంతవరకు తక్కువ నీటిని వినియోగించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలనే పిల్లల సూచనని అంగీకరిస్తూ ఆ పర్యవేక్షణ బాధ్యత అంతా శంకరయ్యగారికి ఒప్పగించారు.

ఈ పిల్లలు నిజంగా చైతన్య దీపికలే అంటూ కాలనీలో అందరూ ఇంత చక్కటి ఆలోచన చేసిన వాళ్ళని వేనోళ్ళ శ్లాఘించారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు