మేల్కొలుపు.. - జి.ఎస్.లక్ష్మి..

melkolupu

“అంచాత నువ్వు వెంటనే వచ్చెయ్యాలన్న మాట..” అప్పటి కప్పుడే పావు గంటనుంచీ ఫోనులో ఏవేవో నాకర్ధం కాని విషయాలన్నీ మాట్లాడిన నా మేనల్లుడు రఘు చివరగా చెప్పిన ఆ వాక్యం మాత్రం నాకు బాగా అర్ధమైంది.

“ఎలా కుదుర్తుందిరా అలా వెంటనే రమ్మంటే.. ఇక్కడేమైనా ఖాళీగా కూర్చున్నా ననుకుంటున్నావా?” కాస్త గొంతు పెంచాను.

“అబ్బ మావయ్యా.. ఓ నాల్రోజులు నువ్వక్కడ వుండక పోతే నీ ఊరేమీ వెనకబడి పోదు కానీ.. నువ్వు రాక పోతే ఇక్కడ లక్షల లక్షల నష్టం రావడం మాత్రం ఖాయం..”

నాకేం చెయ్యడానికీ తోచ లేదు. ఈ ఎండలకి భూమిలో నీళ్ళు మరీ పాతాళానికి పోయాయి. అందు కోసం ఒక వైపు పెద్ద మనుషులందరినీ కలిపి ఊళ్ళో వున్న ముఖ్యమైన కూడళ్లలో బోరింగులు తవ్వే ప్రణాళిక వేస్తున్నాను. దాని పక్కనే ఇంకుడు గుంతలు యేర్పాట్ల కార్యక్రమం ఒకటుంది. మరో వైపు ఈ యేడు వర్షాలు చాలా కురుస్తాయని అందరూ చెప్తుండడంతో పల్లం లోకున్న వీధులను యెత్తు చేసి కంకర పోయిస్తున్నాను. లేకపోతే ఒక్క వర్షం పడగానే వీధులన్నీ చెరువులై పోతాయి. అది కాక వచ్చే నెల నుంచే ఊళ్ళో వున్న ప్రాథమిక పాఠశాలని మాధ్యమిక పాఠ శాల చెయ్యడం కోసం అధికారులను కలిసే సందర్భాలు వుండనే వున్నాయి. ఇవన్నీ కాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‍ని వీలైనంత తొందరగా నియమించే పని అలాగే వుంది. నా చుట్టూ యిన్ని పనులు పెట్టుకుని ఇప్పుడు రఘు దగ్గరికి వెళ్ళాలంటే మాటలా!
“ఒరేయ్, నేను ఇప్పుడు ఊళ్ళోంచి కదల్లేను కానీ, నీ లాప్‍ టాపో ఏదో పట్టుకుని నువ్వే ఇక్కడి కొచ్చెయ్యి. నీ పనంతా అందులో వుంటుంది కదా.. ఇక్కడి కొచ్చి అందులో వివరాలన్నీ చూపించు. సరేనా!”

నాకు తెలుసు.. నా మేనల్లుడు ఆ లాప్‍ టాప్‍ని, ఐ పాడ్‍ని క్షణం వదల్డు. ఏ వివరాలు కావాలన్నా అందులో తల దూర్చేసి మొత్తం అడిగిన దాని చరిత్రంతా చెప్పేస్తాడు. అందుకే వాడొస్తేనే నయం. ఊళ్ళో నా పనులూ అవుతాయి, వాడు చెప్పదల్చుకున్నదీ తెలుస్తుంది.

“అబ్బా, మావయ్యా..నే చెప్పింది విన లేదా? నేనొక్కడినే కాదు. నా ఫ్రెండ్స్‍తో కలిసి నలుగురం ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేసాం.” ఇంకా వాడి మాట పూర్తి కాకుండానే “అయితే వాళ్ళని కూడా తీసుకుని వచ్చెయ్యి..” అంటూ మరి వాడిని మాట్లాడనివ్వకుండా ఫోన్ కట్ చేసేను. వాడు ఇంతలా నా వెనకాల పడడానికి కారణం వాడి అమ్మ, మా అక్క అయిన వసుంధర. నిన్న రాత్రే అక్క నాకు ఫోన్ చేసి తన ఆతృతనంతా వెళ్ళ కక్కేసింది. ఈ సుపుత్రుడు నిక్షేపంలా చేస్తున్న ఉద్యోగం మానేసి, ఫ్రెండ్స్ తో కలిసి ఏదో బిజినెస్ చేస్తానని గొడవ పెడుతున్నాడుట. అసలదేం బిజినెస్సో, ముందు ముందు ఎలా వుంటుందోనని అక్కకి భయమేసి నాకు ఫోన్ చేసింది. “బావ గారేమన్నారక్కా..” అంటే.. “ఆయన కేం ఏమన్నా అంటారు.. కొడుకు మీద ఎంత ప్రేమంటే వాడు చెప్పిన మాటలు విని రోజుకో లక్ష సంపాదించి ఆయన ఒళ్ళో పోస్తాడన్నట్టు సంబర పడి పోతున్నారు. వాడేవంటున్నాడో నాకేవీ అర్ధం కాటం లేదురా…నువ్వు కల్పించుకో పోతే లాభం లేదు.” అని ఫోన్ పెట్టేసింది. అక్క అలా అడిగాక ఇంక కాదన గలనా..

ఇంతకీ వీడసలేం చెయ్యాలనుకుంటున్నాడూ అని నిన్నటి నుంచి ఆలోచిస్తుంటే ఇలా రఘూయే ఫోన్ చేసేటప్పటికి ఇంక తప్పదని వాడినే రమ్మని చెప్పేసేను. చెప్పినట్టుగానే మర్నాడుదయానికే దిగి పోయేడు రఘు ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఊర్లోకి ఎవరైనా కొత్త మనుషులొస్తే నాకు ఎంతో ఆనందం. ఆ మట్టి వాసన, ఆ పైర గాలి, ఆ పచ్చ దనం. ఆ ఆప్యాయతలు అన్నీ వారికి మరీ మరీ రుచి చూపించి నా ఊరి పేరు చెప్పగానే ఆ వచ్చినవాళ్ల మనసులో ఆనందం గుర్తు వచ్చేలా చెయ్యాలని నా ప్రయత్నం. అందులోనూ ఇప్పుడు వచ్చింది నా ముద్దుల మేనల్లుడయ్యె. అప్పటికి నేను పొద్దున్నే చెయ్య వల్సిన ముఖ్యమైన పనులు ముగించుకుని కూర్చున్నాను. రఘు ఫ్రెండ్స్ ప్రదీప్, శ్రీనివాస్, చంద్రశేఖర్ ముగ్గురూ పల్లెటూళ్ళని చూడడం అదే మొదలనుకుంటాను, చుట్టూ కనిపిస్తున్న అందాలన్నింటినీ కళ్ళు విప్పార్చుకుని మరీ చూస్తున్నారు.

సూర్యోదయం అప్పుడే అయింది. కాని అప్పటికే పల్లె మొత్తం నిద్రలేచి పనిలో పడింది. నాలుగు రోజులై పుట్టిన లేగ దూడ అవ్వాయి తువ్వాయిగా తిరుగుతూ, మధ్య మధ్యలో వాళ్ళమ్మ దగ్గరికి పరుగెడుతూ పెరడంతా గంతులేస్తోంది. ఒక్కొక్క రేకూ విప్పుకుంటున్న పూ బాలలు హరుని పూజకు సిధ్ధమన్నట్టు తలలూపుతున్నాయి. అప్పుడే దిగిన మామిడి పిందెలు కండ పట్టడానికి గాలి మేస్తూ వేలాడుతున్నాయి. మంద్రంగా గాలిలో తేలి వచ్చే మథురమైన సుప్రభాతం వీనుల విందుగా వుంది. కోవెల లోని ధ్వజ స్తంభానికి కట్టిన చిరు మువ్వల ధ్వని వీణా నాదంలా తోస్తోంది. ఆ ఆహ్లాద కరమైన ప్రకృతి సౌందర్యానికి మనసు పరవశించినట్టు తనువులు మరిచి నిలబడి పోయారు వాళ్ళు నలుగురూ..

వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాఫీ, టిఫిన్లకి సంబర పడి పోయారు అందరూ. కాస్త సద్దుకోగానే పని లోకి దిగి పోయాడు నా మేనల్లుడు రఘు.. ఎంతైనా నా మేనల్లుడయ్యె.. నా పోలికలు రాకుండా వుంటాయా అని గర్వ పడుతూ వాడు ఓపెన్ చేసిన లాప్‍ టాప్ విండో వైపు దృష్టి మరల్చాను. వాడూ, వాడితో వచ్చిన ఫ్రెండ్సూ కూడా వాళ్ల ప్రోజెక్ట్ నాకు అర్ధం అయేలా చెప్పడానికి చాలా ఉత్సాహ పడి పోయేరు. ముందుగా రఘు ఓ వెబ్‍ సైట్ ఓపెన్ చేసి, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతిలో పరిసరాల సమ తుల్యతలో వచ్చిన తేడాలని గణాంకాలతో సహా చూపించాడు.

ఓజోన్‍ పొర పల్చ బడి పోవడం వలన ప్రకృతిలో కలుగుతున్న విష పరిణామాలను చూపించాడు. ఇలాగే జరిగితే ఇంకొన్నాళ్లకి ఋతువులలో వాటి వాటి పకృతి స్వభావమైన పరిణామం కనిపించదనీ, పోను పోను ప్రకృతిలో విపరీతంగా పెరిగే ఈ అసమానతల వల్ల మన చుట్టూ వున్న గాలీ, నీరూ యెలా కలుషితమై పోతాయో చూపించాడు. వాడు చూపించిన దాన్ని చూస్తే నేను అనుకున్న దాని కన్నా చాలా తొందరగా మనం పీల్చే గాలీ, తాగే నీరూ కలుషితమై పోతాయనిపించింది. నా మేనల్లుడు, వాడి ఫ్రెండ్సూ లాంటి యువకులు దీనిని గుర్తించి, దానిని నివారించే దిశగా వాళ్ళేదో చెయ్యాలనే ప్రణాళిక వేసుకోవాలనుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. గర్వంగా రఘుని చూస్తూ, “అదంతా నిజమేరా.. మరి దానికి మీరేం చెయ్యాలనుకుంటున్నారు? దీనికీ, మీ బిజినెస్‍కీ ఏం సంబంధం?” నా సందేహం వ్యక్త పరిచాను.
రఘు మరింత ఉత్సాహంతో మళ్ళీ ఇంకో విండో ఓపెన్ చేసి అందులో అంకెలు చూపిస్తూ చెప్ప సాగేడు.

“ఇదిగో చూడు మావయ్యా.. వచ్చే రెండు సంవత్సరాలలో ఈ కాలుష్యం ఇంత ఎక్కువై పోతుంది. ఇప్పటికే మధ్య తరగతి వారు కూడా నీళ్ళు శుభ్రంగా వుండేందుకు ఫిల్టర్ల వాడకం మానేసి, చాలా మంది అక్వా లాంటివి వాడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల మునిసిపాలిటీ నీళ్ళు లేనివాళ్ళు బోర్‍ వాటర్ కి అది పని చేయక, అంత కన్న పవర్‍ ఫుల్‍ ది వాడుతున్నారు. రాబోయే సంవత్సరాలలో ఇంకా ఎక్కువ కాబోయే కల్మషాన్ని దృష్టిలో వుంచుకుని, మనం అంతకన్న పవర్‍ ఫుల్‍ ది, అందరి కన్న ముందే మార్కెట్లోకి ప్రవేశ పెట్టేమనుకో..ఇంక చూస్కో..మనకి ఆర్డర్లే.. ఆర్డర్లు.. అలాగే గాలి కూడా.. ఇప్పటికే కొన్ని కొన్ని సిటీస్‍లో ఆక్సిజన్ క్యూబికల్స్ కట్టి ఆరోగ్య వంతమైన గాలిని గంట కింతని అమ్ముకుంటున్నారు. ఈ ట్రాఫిక్‍లో తిరుగుతూ, వాహన కాలుష్యానికి పాల బడిన వారందరూ వచ్చేరోజుల్లో ఈ ఆక్సిజన్ కొనుక్కోవడం ఎక్కువౌతుంది, ప్రాణం ముఖ్యం కదా.. అందుకని మనం ప్రతి సిటీ లోనూ ఈ ఆక్సిజన్ క్యూబికల్స్ ఏర్పాటు చేస్తే ఇంక మనకి రూపాయిల పంటే అనుకో..” పరవశంగా చెప్పుకు పోతున్న రఘుని నేను దిగ్భ్రాంతితో చూసాను.

ఏవిటి వీడు ఆలోచిస్తున్నది? ఎలకలని పోగొట్టడానికి ఇంటికి నిప్పు పెట్టుకుంటామా..అసలే కలుషితమై పోతున్న గాలీ, నీరు లోంచి శుభ్రమైన వన్నీ లాగేసి, అమ్మేసుకుని, సొమ్ము చేసుకుని, తర్వాత వీళ్ళు ఏ గాలి పీల్చి బ్రతుకుతారు?

నేను శ్రధ్ధగా వింటున్నాననుకున్న రఘు నాకు ఇంకా విడమర్చి చెప్పడం కోసం లాప్‍ టాప్‍లో ఇంకో సైట్ ఓపెన్ చేసాడు.

“ఇదిగో..ఇది చూసేవా మావయ్యా.. ఈ కంపెనీ ఆన్‍లైన్‍లో స్వఛ్ఛమైన ఆక్సిజన్‍ని బాటిల్స్ లో అమ్ముతోంది. వాళ్ళే చెప్తున్నారు. రాకీ మౌంటెన్స్ లో గంటల తర బడి కష్ట పడి పట్టిన స్వఛ్ఛమైన గాలిని, లాబ్‍లో ఒక్కొక్క బాటిల్‍ లోనూ నింపి “ఈ బే” అనే వెబ్‍ సైట్‍లో అమ్మకానికి పెట్టారుట. మొదటి బాటిల్ అమ్ముడవడానికి నెల్లాళ్ళు తీసుకుందిట. అది కూడా కేవలం 99 సెంట్లకే. కాని రెండో బాటిల్ మటుకు 168 డాలర్లకి అమ్ము డయిందిట.

గత మూడు నెలల్లోనూ ఆ కంపెనీ వాళ్ళు 900 ప్రాణ శక్తి వున్న అంటే ఆక్సిజన్ వున్న బాటిల్స్ అమ్మారుట. ముందు ముందు ఈ అమ్మకాలు ఎక్కువ వుతాయనే అంటున్నారు. మావయ్యా..నీకూ తెలుసు.. బిజినెస్ చేసే వాడు కస్టమర్‍కి కావలసినది అందిస్తే ఆ బిజినెస్ మూడు పూవులూ ఆరు కాయలూ అవుతుందని..” గుక్క తిప్పు కోకుండా చెప్తున్న రఘు మాటల్ని నేను స్థాణువునై వింటున్నాను. రాయిలా మారిన నన్ను చూసి రఘు ఫ్రెండ్ శ్రీనివాస్ చొరవ తీసుకుని ఇంకా ఇలా చెప్పేడు.

“మావయ్య గారూ, గాలిని పట్టి అమ్మడవేంటంటూ వినడానికి మీకు ఇది కొత్తగా అనిపించొచ్చు. కానీ ప్రస్తుతం లెక్కల ప్రకారం ఎక్కువ జనాభాగల దేశాలైన చైనా, ఇండియా, దుబాయ్ లలో వాహనాల వల్ల వచ్చే ఈ వాతావరణ కాలుష్యం చాలా ఎక్కువగా వుంది. అందుకని మా అంచనాల ప్రకారం మన ఇండియాలో చాలా తొందరలోనే ఈ ఆక్సిజన్ క్యూబికల్స్‍కీ, ఆక్సిజన్ బాటిల్స్‍కీ డిమాండ్ వుండి తీరుతుంది. ఇంకా మన వాళ్లలో చాలా మందికి ఇలా గాలి పట్టి బిజినెస్ చెయ్యొచ్చనే ఆలోచన రాలేదు. అంత తొందరలో రాదు కూడాను. అందుకే మనదే మొదటి కంపెనీ అయ్యి బోల్డు లాభాలు చేసుకునే ఛాన్సెస్ చాలా వున్నాయి..”

చాలా బాగా చెప్పాడన్నట్లు అందరూ శ్రీనివాస్‍ని అభినందన పూర్వకంగా చూసారు. ప్రదీప్ మరింత చొరవ చేసుకుని నా పక్కకి వచ్చి కూర్చున్నాడు. “ అంకుల్, మీకు తెలీనిదేముంది? బిజినెస్ అంతా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధార పడుంటుంది కదా.. పోను పోనూ గాలీ, నీరూ ఎంత అపురూపమై పోతాయో తెలుస్తోంది కదా..అదే మన బిజినెస్‍కి పెట్టుబడి..”

నా మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలకి అర్ధం తెలీటం లేదు. పుట్టిన ప్రతి జీవికీ సహజంగా అందాల్సిన గాలీ, నీరూ వీళ్ళకి వ్యాపార వస్తువులయ్యాయా? అయ్యో సహజ వనరులన్నీ తగ్గి పోతున్నాయే అని బాధ పడడం మానేసి, శవం మీద డబ్బు లేరుకుంటున్నట్లు ఆ తగ్గి పోయిన వాటి మీద వ్యాపారం చేస్తారా? మార్కెట్లో వున్న వస్తువులని దాచేసి, బ్లాక్‍ మార్కెట్‍లో అమ్ముకునే వాడికీ, వీళ్ళకీ అసలేమైనా తేడా వుందా? పిచ్చి పిచ్చిగా వస్తున్న ఆలోచనలని ఆపుకుంటూ, బలవంతాన గొంతు లోంచి రాబోయిన అరుపును ఆపుకుంటూ, చెయ్యి పైకెత్తి ఇంక వాళ్ళని మాట్లాడ వద్దని ఆపేసాను.

వాళ్ళు నలుగురూ నా ప్రతి స్పందన కోసం ఆసక్తిగా నావైపే చూస్తున్నారు. నా మనసు లోంచి వచ్చిన భావాలు మాటల రూపంలో రాకుండా వుండ డానికి నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకో వలసొచ్చింది. కాసిని మంచి నీళ్ళు తాగి నెమ్మదిగా మొదలు పెట్టాను.

“రఘూ, మీరు అనుకుంటున్నట్టు మనిషికి ముఖ్యంగా కావల్సినవి గాలీ, నీరే. మీరు అన్నట్టు ప్రస్తుతం కలుషితమై పోతున్నవి కూడా అవి రెండే. కానీ మీ లాంటి వాళ్ళు అలాంటి కాలుష్యం జరగ కుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తే బాగుంటుంది కానీ ఇలా ఆలోచించడం ఏమీ బాగు లేదురా..”

నా మాటలకి చంద్రశేఖర్ అడ్డొచ్చేడు. “అంకుల్, ఈ జనాలకి అలా ఎంత చెప్పినా అర్ధం కాదు. మీకు తెలీదా.. మన దేశంలో అవసరమైనన్ని టాయిలెట్‍స్ లేవు కానీ, అవసరానికి మించిన మొబైల్ ఫోన్లున్నాయి. ప్రతి వాడూ ప్రతి వాడి దగ్గరా దోచేసుకోవాలనుకునే ఈ మనుషుల గురించి మేం ఆలోచించడం ఎందుకు? వాళ్ల బలహీనతని కేష్ చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించు కుంటే తప్పేమిటి? “
నేనింక ఆవేశం ఆపుకో లేక పోయాను.

“తప్పేమిటా? రేప్పొద్దున్న ఈ మనుషుల మధ్యే నువ్వూ జీవించాలి కాబట్టి. ఇప్పుడు వందకి కొన్న ఆక్సిజన్‍ బాటిల్‍ ని నువ్వు రెండేళ్ళ తర్వాత వెయ్యికి కొనుక్కుని, అది పెట్టుకుని, నీ రూం లోనే కూర్చో వలసొస్తుంది కాబట్టి. నీ పిల్లలకి పుట్టినప్పట్నుంచే ఆక్సిజన్ పెట్టే అవసరం వస్తుంది కాబట్టి.

ఇప్పటి వరకూ మనం చేసిన తప్పే మీరు వ్యాపారంలో కూడా చేసి డబ్బు సంపాదిస్తామంటున్నారు. సహజంగా వుండే అడవులని కొట్టేసి పర్యావరణాన్ని పాడు చేసాం. సరైన కాలాల్లో వర్షాలు పడక నదులు ఎండి పోతున్నాయి. ప్రకృతిలో సమతుల్యత దెబ్బ తినడం వల్ల అకాల వర్షాలు, సునామీలూ మనల్ని ముంచేస్తున్నాయి. ఒక్క మొక్క నాటం కానీ మన దారికి అడ్డంగా వుందని చెట్లు మటుకు కొట్టేస్తాం. ఇంక మీ పిల్లల సమయం వచ్చే సరికి వాళ్ళు ఇరవై నాలుగ్గంటలూ ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని వుండే పరిస్థితి వస్తుంది. తాగడానికి నీటి చుక్క కోసం వేల రూపాయలు ఖర్చు పెట్ట వలసి వస్తుంది. పుడుతూనే పేరు తెలియని రోగాలతో ఈ భూమ్మీద పుట్టి, పుట్టినప్పట్నించీ మందుల మీదే బతక వలసొస్తుంది. ఇప్పటికే నేను, నాది అంటూ పెరిగి పోయిన స్వార్ధం అప్పుడు ఇంకా వెఱ్ఱి తలలు వేసి ఎదుటి మనిషిని చంపినా తప్పు లేదన్న భావన వస్తుంది. ప్రేమ, స్నేహం, అభిమానాలు, ఆప్యాయతలు, పంచుకోడాలూ, ఆనంద పడడాలు వంటి వన్నీ పదాల లోనే వుంటాయి. కుళ్ళూ, కల్మషం విధ్వంసం మాత్రమే రాజ్య మేలుతాయి. ఇంకా.. “ ఆవేశంగా చెప్పుకు పోతున్న నా గొంతులో దుఃఖం తన్నుకొచ్చి మాట రావడం ఆగి పోయింది.

నేను అంత ఆవేశంగా మాట్లాడడం చూసిన వాళ్ళు నలుగురూ మాట రాక స్థాణువులై పోయారు. భవిష్యత్తు యెలా వుంటుందో అంత పచ్చిగా చెప్పిన నన్ను ఆశ్చర్యంతో చూస్తూండి పోయారు. నన్ను నేను కాస్త అదుపు చేసుకున్నాను. రఘు వైపు చూస్తూ చెప్పాను.. “ఒరే రఘూ, మనం వుండేది మూన్నాళ్ళేరా.. ఈ మూన్నాళ్ళలో డబ్బు సంపాదించు కోవడం తప్పు లేదు కానీ అది ఎదుటి వాడి బలహీనత మీద సంపాదించడం చాలా తప్పురా. ఏదైనా పడ గొట్టడం సులభం కానీ నిర్మించడం చాలా కష్టం. ఇప్పటికే ప్రకృతిలో సమతుల్యత పోయింది. ఇప్పుడైనా మీలాంటి యువకులు జాగ్రత్త పడక పోతే ఇందాకా నేనన్నట్టు మీ పిల్లలు రోజంతా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని తిరిగే పరిస్థితి వస్తుంది. కాస్త ఆలోచించండి. వున్న ఆక్సిజన్‍ని బాటిల్స్ లో పట్టి అమ్ముకునే ఆలోచన కన్నా, నాలుగు చెట్లు పెంచి ఆక్సిజన్‍ని పెంచే ఆలోచన చెయ్యండి. కలుషిత మౌతున్న నీటిని అలా అవకుండా నిరోధించే మార్గం చూడండి. యేడాదిలో వాడు లక్షలు సంపాదించాడు కొన్ని నెలల్లోనే నేను కోట్లు సంపాదిస్తాను అనే ఆలోచన రానివ్వకండి. ఎన్ని కోట్లైనా ఒక్క ఆక్సిజన్ బాటిల్ కొనడానికే కదా.. దానినే పెంచేదెలాగో ఆలోచించండి. మీరంతా యువకులు, చదువుకున్న వాళ్ళు, సాంకేతికత గురించి బాగా తెలిసిన వాళ్ళు. మీ లాంటి వాళ్ళు ఇలాంటి చర్యలు చేపడితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి” గద్గద మౌతున్న నా గొంతులో బాధని గ్రహించిన వాళ్ళు నలుగురూ ఒక్కసారి నా ఎదురుగా కూర్చుండి పోయారు. రఘు నా చేతిని పట్టుకుని ప్రమాణం చేస్తున్నట్టు, “నిజమే మావయ్యా, ఆవేశంలో పడి నీ అంత ముందు చూపుతో ఆలోచించ లేక పోయాం. మా కళ్ళు తెరిపించావు. మా పిల్లల భవిష్యత్తుకి మేమే కదా మంచి బాట వెయ్యాలి. అలాగే మావయ్యా, తప్పకుండా నువ్వు చెప్పిన పధ్ధతి లోనే ఆలోచించి వారికి ప్రాణాధారాలైన గాలీ, నీరూ సమృధ్ధిగా అందేలా ప్రయత్నాలు చేస్తాం. థాంక్స్ మావయ్యా..” అన్నాడు. రఘు పట్టుకున్న చేతి మీద మిగిలిన ముగ్గురూ కూడా చేతులు వేసి అన్నీ కలిపి గట్టిగా పిడికిలి బిగించారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు