పాపం ఆత్మారాముడు..! - జి.ఎస్.లక్ష్మి

papam atmaramudu telugu story

"భలే మంచిరోజూ... పసందైన రోజూ..." అని ఆనందంగా పాడుకుంటూ ఆదివారం తీరుబడిగా నిద్ర లేచాడు చందు. ఆలస్యంగా లేవడానికి కారణం ఆరోజు ఆఫీసుకి సెలవవడం వల్లకాదు... నిన్న సాయంత్రం ఇందూ చేసుకొచ్చిన పని అతన్ని రాత్రంతా నిద్ర పోనివ్వలేదు.

ఎన్నడూ లేనిది నిన్న సాయంత్రం చంద్రం భార్య ఇంధుమతి పని కట్టుకుని రైతుబజార్ కి వెళ్ళి రెండు పెద్ద సంచీలనిండా కూరలు కొనుక్కొచ్చింది. ధరలు చుక్కల నంటుతున్న ఈ రోజుల్లో ఏ కూర కూడా పావు కిలో కన్నా ఎక్కువ కొనని ఇందు యేకంగా రెండు సంచీలనిండా కిలోలక్కిలోలు కూరలు కొనితేవడం చూసి సంబరపడిపోయాడతను. సహజంగా భోజనప్రియుడవటం చేత వరసగా నాలుగురోజులు షడ్రసోపేతమైన విందుభోజనానికి మానసికంగా సిధ్ధపడిపోయాడు.

ఇంధుమతి చెయ్యి సాక్షాత్తూ అన్నపూర్ణ హస్తమే. కూరలో ఆవ పెట్టిందంటే ఆ ఘుమ ఘుమ ఇల్లంతా సందడి చేస్తుంది. దప్పళంలో ఇంగువపోపు వేసిందంటే అందులోని ఆవాల చిటపటలు మూడు వీధులు వినిపిస్తాయి. మరింక నూనెలో ముక్క వేస్తేనా... నా సామిరంగా... చుయ్యి చుయ్యి మంటున్న ఆశబ్దానికే నోట్లో నీళ్ళూరిపోతాయి.

యేంటో ఈ మధ్య శుభ్రంగా భోంచేసి యెన్నేళ్ళయిందో అనుకుంటూ పడుకుంటే రాత్రంతా కలలలో కమ్మటి గుత్తివంకాయలు, ఆవపెట్టి, వడియాలు వేసిన పనసపొట్టు కూర, నోరూరించే మామిడికాయ పప్పూ, ఘుమఘుమలాడిపోతున్న ముక్కల పులుసూ వరసగా వస్తూనే వున్నాయి.

ఉదయాన్నే టీపాయ్ మీదకి కాళ్ళు జాపుకుని కూర్చుని, కాఫీ తాగుతూ రాత్రి వచ్చిన కలలని నెమరేసుకుంటున్న చందూకి,

"ఆటో వచ్చిందా?" అని ఇందూ పనిపిల్లని అడగడం వినిపించింది.

యేమిటా అని చూస్తే పనిపిల్ల ఆ రెండు పెద్ద కూరగాయల సంచీలూ మోసుకెళ్ళి ఆటోలో పెట్టేసివచ్చింది.

తెల్లబోయి చూస్తున్న అతనితో "నేను వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. ఈ పూటకి బైట యెక్కడైనా భోంచేసెయ్యండి.." అంది ఇందూ పర్సులో డబ్బూ, సెల్ ఫోనూ వున్నాయో లేవో చూసుకుంటూ.

"ఆ సంచులు మనవి కాదా..?" తన ప్రాణం వాటిల్లో వెళ్ళిపోతున్నంత బాధతో అడిగేడు చందూ.

"మనవే. రమా వాళ్ళింటి దగ్గరి కమ్యూనిటీహాల్ కి వెడుతున్నాను."

“అక్కడేదైనా ఫంక్షన్ పెట్టుకున్నారా?"

ఫ్రెండ్సందరూ కలిసి వండేసుకుని, తినేస్తారేమో అన్న దుగ్ధతో అడిగేడు. వారి చేతిలో విద్యేకదా...

"కాదు. ఇవాళ అక్కడ వెజిటబుల్ కార్వింగ్ లో పోటీ వుంది. ఎవరి కూరలు వాళ్ళే తెచ్చుకోవాలి. అన్నట్టు బైట కెడుతున్నప్పుడు తలుపులన్నీ జాగ్రత్తగా వెయ్యండేం..." అంటూ ఆటో యెక్కి వెళ్ళిపోయింది.

యేవిటీ... వెజిటబుల్ కార్వింగా? అంటే అవన్నీ తినడానికి కాదా... ఒట్టినే అలంకరణకేనా...

సాయంత్రం ఇందూ చేటంత మొహంతో, చేతిలో ఫస్ట్ ప్రైజ్ తో, అలసిపోయినా మెరుస్తున్న కళ్ళతో, ఖాళీ అయిన రెండు పెద్ద సంచులతో వచ్చింది ఇంటికి. ఎంతో సంబరంగా ఆ ప్రైజ్ ని చందూ చేతిలో పెట్టి, గర్వంగా చూసింది.

పాపం చందూ ప్రైజ్ ని చూసి సంతోషించాలో... ఖాళీ అయిన రెండు పెద్ద సంచుల్నీ చూసి దుఃఖపడాలో తెలీక అలా నిలబడిపోయాడు.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ