ఈ హత్య ఎవరు చేసారు? - మోపూరు రామ్ శేషు

ee hathya evaru chesaru telugu story

"వాడు మళ్ళీ నా విషయంలో వేలు పెట్టాడు" విస్కీ బాటిల్ కింద పెడుతూ చెప్పాడు రాకేష్. స్టఫ్ రెడీ చేస్తున్న రాజేష్ "ఎవరూ ఆ ఏకాంబరం గాడేనా" అన్నాడు.

"అవును వాడే. నా ఫ్యాక్టరీ వలన పర్యావరణానికి ముప్పు అట. జనాల్ని వెంటేస్కుని వచ్చి గొడవ చేస్తున్నాడు". కోపంతో చెప్పాడు రాకేష్. "ముప్పుని, నిప్పుని ఎలా ఆర్పాలో ఈ రాజేష్ కి తెలుసు" సిగరెట్ ని ఆర్పేస్తూ అన్నాడు రాజేష్. "అంటే" ప్రశ్నార్ధకంగా చూసాడు. "అంటే ఏమి లేదు. చంపెయ్యడమే" అన్నాడు రాజేష్. "ఇప్పుడు వాడిని చంపేస్తే జనాలు నన్నే అనుమానిస్తారు" చెప్పాడు రాకేష్. మళ్ళీ తనే "వాడు వారం రోజుల్లో నా ఫ్యాక్టరీని మూసెయ్యమని వార్నింగ్ ఇచ్చాడు. జనాల దృష్టిలో వాడు మంచోడు. నేను విలన్ ని. ఇప్పుడు వాడిని చంపేస్తే ఇంకొక కష్టము తెచ్చుకున్నట్లే". చెప్పాడు రాకేష్.

"మంచోళ్ళని దేవుడు ఎక్కువ కాలం బ్రతకనీయడు. తన పేరు ఎక్కడ పోతుందోనని దేవుడికి భయం. నువ్వేమి భయపడొద్దు నాకు తెలిసిన ప్రొఫెషనల్ కిల్లర్ వాసుదేవ్ వున్నాడు. వాడు చంపితే అది హత్యలా వుండదు. చాలా సహజంగా పోయినట్లు వారావరణాన్ని క్రియేట్ చేస్తాడు." చెప్పాడు రాజేష్.

రాజేష్, రాకేష్ లు వాసుదేవ్ వున్న చోటికి వెళ్ళారు. స్మార్ట్ గా ఇన్ షర్ట్ చేస్కుని ఫ్రెంచ్ బియర్డ్ తో చూడగానే ఆకట్టుకునే రూపం వాసుదేవ్ ది. అతనిని చూడగానే రాజేష్ కి మతిపోయింది. ఎందుకంటే హత్యలు చేసేవాడు గళ్ళలుంగీ, చారల బనియన్, ముఖం పై కత్తిగాటు పులిపిరికాయతో వుంటాడని ఊహించుకున్నాడు.

హత్యలు చేసేవాడి దగ్గరికి తీసుకెళతానని చెప్పి ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దగ్గరికి ఎందుకు తీసుకువచ్చావ్? రాకేష్ చెవిలో గుసగుసగా చెప్పాడు రాజేష్...

"నీ డౌటు అర్ధమైంది. చూడడాన్కి సాఫ్ట్ గా వున్న మనిషి చాలా హార్డ్..." అన్నాడు రాకేష్. వీళ్ళిద్దరినీ చూసి వాసుదేవ్ నవ్వుతూ విష్ చేసాడు.

"నేను చంపాల్సిన అతని ఫోటో ఇస్తారా? అడిగాడు వాసుదేవ్." రాజేష్ జేబులో నుండి ఏకాంబరం ఫోటో ఇచ్చాడు. "నా పేరు బయటకు రాకూడదు" చెప్పాడు రాజేష్. "నా పేరు కూడా బయటకు రాదు" నవ్వుతూ చెప్పాడు వాసుదేవ్. హత్యలు చేసేవాళ్ళు ఇలా కులాసాగా నవ్వుతూ మాట్లాడుతారని అస్సలు అనుకోలేదు రాజేష్. వాసుదేవ్ అసిస్టెంటు మళ్ళీ ఇద్దరికీ 'టీ' లు ఇచ్చాడు. "సారీ... నేను మందు తాగను ఎప్పుడన్నా టీ... కాఫీ మాత్రము తీస్కుంటాను" చెప్పాడు వాసుదేవ్.

వాసుదేవ్ తన అసిస్టెంటును పిల్చి "హైద్రాబాద్ పరిధిలో కూలడానికి సిద్దంగా వున్న ఇళ్ళు, హొటల్స్ లిస్టు తెప్పించమన్నాడు."
"చూడండి రాజేష్ గారు వెంటనే వేట కొడవళ్ళతోవేటాడి చంపను. నా స్టైల్ వేరు. ఆయా కాలాల్ని బట్టి సందర్భాలని బట్టి చంపుతుంటా. అడ్వాన్సు లక్ష. పని అయిన తర్వాత లక్ష ఇవ్వండి. కౌంటర్ లో అడ్వాన్సు కట్టెయ్యండి. ఏకాంబరం పోయాడన్న విషయం టీవిల్లో వచ్చిన తర్వాతే మిగతా అమౌంట్ పే చెయ్యండి. ఇంకొక విషయం నాకు వీడిని చంపడానికి ఒన్ ఆర్ టూ మంత్స్ టైం కావాలి" చెప్పాడు. రాజేష్ రాకేష్ లు సరేనన్నారు.

"అన్నా! జి.హెచ్.ఎం.సి లెక్కల ప్రకారం సిటీలో 58 పాత బిల్డింగ్ లు కూలడానికి సిద్ధంగా వున్నాయి. ఇందులో నలభై రెండు, రెండతస్థుల మిద్దెలు. రెండు షాపింగ్ మాల్ లు మిగతా పద్నాలుగు హొటల్స్ వున్నాయి. ఇందులో ఒక నెలలో కూలిపోవడానికి సిద్ధంగా మూడు హొటల్స్ వున్నాయి. అవి సికింద్రాబాద్ లో ఒకటి. పాతబస్తీ లో ఒకటి, చిక్కడపల్లి లో ఒకటి వున్నాయి" చెప్పాడు వాసుదేవ్ అసిస్టెంటు.

"మిస్టర్ రాజేష్ ఏకాంబరం వుండేది ఏ ఏరియాలో" అడిగాడు వాసుదేవ్. "సికింద్రాబాద్" చెప్పాడు రాజేష్.

ఇద్దరూ అడ్వాన్సు కట్టి బయటికొచ్చారు. "వీడు మన విషయం పట్టించుకోకుండా కూలడానికి సిద్దంగా వున్న బిల్డింగు విషయాలు అడుగుతున్నాడు. ఏమైన వీడికి సీరియస్ నెస్ తక్కువ" అన్నాడు రాకేష్. "చూద్దాం. వీడు తన స్టైల్ డిఫరెంట్ అంటున్నాడుగా" చెప్పాడు రాజేష్.

రాకేష్, రాజేష్ మందు పార్టీలో కూర్చుని మందు తాగుతూ టీవి చూస్తున్నారు. "వాడికి అడ్వాన్సు ఇచ్చి నెల అవుతుందా. ఆ ఏకాంబరాన్ని ఎప్పుడు వేసేసి ఫోన్ చేస్తాడా చూస్తుంటే ఆ వాసుదేవ్ గాడు అడ్రస్ లేడు" కోపంతో అన్నాడు రాజేష్... "ప్రముఖ సామాజికవేత్త ఏకాంబరం దుర్మరణం సికింద్రాబాద్ లోని పురాతన హొటల్ లో ఛాయ్ కోసం వెళ్ళి దుర్మరణం చెందాడు" అని టీవిల్లో స్క్రోలింగ్ లు వస్తున్నాయి.

ఎక్కిన మందు దిగినట్టయింది. "రేయ్ ఆ వాసుదేవ్ గాడికి ఫోన్ చేసి ఆ లక్ష అడ్వాన్సు వెనక్కి ఇచ్చెయ్యమను. దేవుడే ఆ ఏకాంబరాన్ని చంపేశాడు." పెద్దగా అరిచాడు ఆనందంతో రాజేష్...
"చంపింది దేవుడు కాదు. వాసుదేవ్. ఇదిగో ఫోన్ వాసుదేవ్ లైన్లో వున్నాడు. ఇంకో లక్ష రడీ చేసుకోమంటున్నాడు" చెప్పాడు.

"బ్రదర్... ఇదే నా స్టయిల్ చాలా నేచురల్ గా వుంటుంది. ఆ ఏకాంబరంతో ఫ్రెండ్షిప్ చేసా... చాయ్ తాగడానికి రోజు ఆహొటల్ కి వెళ్ళేవాడిని వర్షాలు బాగా పడుతుండడంతో నా పని ఈజీ అయ్యింది. నా అంచనా ప్రకారం ఇంకో అయిదు నిమిషాల్లో ఆ హొటల్ కూలి పోద్దని నాకు తెలుసు. చాయ్ ఆర్డరిచ్చి బయటకు వచ్చాను... నెక్ట్స్ ఏం జరిగిందో టీవిల్లో చూసే వుంటారు. పేమెంట్ చెయ్యండి. వుంటాను బై" అంటూ ఫోను పెట్టేశాడు వాసుదేవ్...

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు