దురద - కె. విజయప్రసాద్

durada telugu story

సుధాకర్ కొంచెం ఆలశ్యంగా ఇల్లు చేరాడు. అతని కోసం ఎదురు చూస్తున్న అతని శ్రీమతి సత్య ఎదురొచ్చి చెప్పింది.

"ఏవండోయ్ బుజ్జిగాడు కాలు గోకిన వాడు గోకినట్లే వున్నాడు - పాదం గీక్కున్నవాడు గీక్కున్నట్లే ఉన్నాడు."

"బుజ్జిగాడికి హొమ్ వర్క్ యివ్వలేదా?" కౌంటర్ వేశాడు.

"ఇచ్చారు గాని - వాడి మనసంతా కాలుమీద, గోకుడు మీద ఉంది." సత్య.

స్నానం చేసి కొంచెం రిలాక్స్ అయి బుజ్జిగాడిని దగ్గరికి తీసుకున్నాడు - వాడికి ఐదు పూర్తి కాలేదు. యల్.కె.జీ. యు.కె.జీలు ముగించుకుని ఒకటో క్లాసులోకి వచ్చి పడ్డాడు. బుజ్జిగాడికి పేరు ఉంది - శీను.

సుధాకర్ అంతకు ముందు అనంతపురంలో అఘోరించేవాడు. అయిదేళ్ళు అయిపోయిందని బలవంతాన అతన్ని ఈ ఊరికి బదిలీ చేసారు. ఉద్యోగికి దూరం లేదని - ఉండకూడదని తెల్సుకుని పెట్టే బేడా - భార్య - పిల్లాడితో కల్సి ఈ ఊళ్ళో కాపురం పెట్టాడు. అది మండలం హెడ్ క్వార్టర్స్ అయినా పెద్దగా వసతులు లేని ఊరు. ఆధునికతను అరువు తెచ్చుకోవాలని - ఎరువులు మింగి ఒక్కసారి పైకి లేవాలని చూస్తున్న ఊరు.

ఆ ఊళ్ళో కాపురం వెలుగ బెట్టి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. కొత్త వాతావరణం - కొత్త ఊరు - కొత్త గోల! అసలే రాయలసీమ ఫ్యాక్షన్లకు పేరు పడింది. సినిమాల పుణ్యం వలన ప్రపంచం మొత్తానికి తెల్సింది. అందుకని బిక్కు బిక్కుమంటూ బ్రతుకు ఈడుస్తూ ముక్కు మూసుకుని తన డ్యూటీ తను చేసుకుని వీలైనంత పెందరాలే - యిల్లు చేరుకుంటాడు బ్యాంకు నుండి.

శీనును ఆడించాడు. కథలు వినిపించాడు. - పాటలు పాడించాడు. కాని వాడి ఒక చెయ్యి ఎప్పుడు కాలు మీదో - పాదం మీదో గీరుతూనే ఉంది.

మందలించాడు. చెయ్యి పట్టుకుని ఆపాడు - వాడు ఏడ్పు మొదలెడతాడు.

"ఏవండీ! వాడికి ఎందుకు దురద వచ్చింది?" సత్య ప్రశ్న.

"రోజూ స్నానం చేయించడం లేదా?" సుధాకర్ అనుమానం కలిగింది.

"రోజూ రెండు పూటలా లాల పోసుకుంటాడు - ఏరా శీను లాలా -" అంటూ పాడింది.

శీనుగాడు తలూపాడు - ఇంకొంచెం గీక్కున్నాడు.

"ఒరే బాబు! ఎందుకు గీకుతావు - కాస్త ఆపు!" గద్దించాడు సుధాకర్.

"ఊ!" అని వాడు బిక్కుమొహం పెట్టి దూరంగా పోయాడు.

"కాలికి కొబ్బరి నూనె రాయకపోయావా?" అడిగాడు.

"అయింది - అదీ అయింది - నాకు చేతనైన గృహ వైద్యాలు చేసాను - ఫలితం కనపడలేదు. ఏమండీ వీడికేమన్నా గజ్జి తామర లాంటి అంటువ్యాధులు వస్తున్నాయంటారా?" భయంగా అడిగింది.

"ఛీ! ఛీ! అలా ఎందుకనుకుంటావు?"

"నాకేదో భయంగా ఉంది - ఈ గీకుడుతో ఒళ్లంతా పుళ్ళు పడిపోతున్నది."

"ప్రికిల్ పౌడర్ వెయ్యి - రేపటికి తగ్గకపోతే డాక్టరు దగ్గరికి తీసుకెళతాను" హామీ యిచ్చాడు.

"కాని ఈ పిచ్చి ఊళ్ళో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందిటగా! వీడ్ని పట్నం తీసుకుపోలేమా!" సందేహించింది సత్య.

"ఇంత చిన్నదానికి అంతదూరం ఎందుకులే. ఈ మధ్యే ఈ ఊళ్ళో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించారట - దానిలో చూపించుకుంటే యిట్టే తగ్గిపోతుంది -" చెప్పాడు.

ముస్లిం పండుగ ఉన్న కారణాన మరునాడు బ్యాంకుకు హాలీడే! బుజ్జిగాడు గోకుడు ఏమాత్రం తగ్గలేదు. అదేదో సీరియసు గేములాగా ప్రాక్టీసు చేస్తున్నాడు. సత్య కన్నీళ్ళ పర్యంతమై వారిస్తున్నది - వాడు వినడం లేదు.

పది గంటలకు శీనుని తీసుకుని - సత్యతో కల్సి ఆ కొత్త ఆసుపత్రికి తీసుకొచ్చాడు....

ఎంక్వయిరీలు వగైరాలు అయింతర్వాత డాక్టర్ పిచ్చేశ్వర్రావు యమ్ డీ ఎక్సెట్రా ఎక్సెట్రా ముందుకు వచ్చారు.

డాక్టర్ పిచ్చేశ్వర్రావు బాబును బల్లమీద పడుకోబెట్టాడు. గుండ్రంగా అతని చుట్టూ తిరిగాడు - స్టెత్ తో అతని ఊపిరితిత్తులు - గుండెకాయ పరీక్షించాడు. ఏమీ అర్ధంగాక కాలిమీద కూడా సుత్తితో కొట్టాడు - స్టెత్ తో కాలును పరీక్షించాడు. దాంతో శీను ఆరునొక్కరాగం అందుకున్నాడు.

డాక్టర్ పిచ్చేశ్వర్రావు కూడా శీను కంటే గట్టిగా ఏడ్పు నటించాడు. దాంతో వాడు భయపడిపోయి ఏడ్పు ఆపి విచిత్రంగా చూడసాగాడు.

"బాబూ - నేను అడిగే ప్రశ్నలకు బాగా ఆలోచించి జవాబు చెప్పు!" పిచ్చేశ్వర్రావు సీరియసుగా బాబును అడిగాడు పరిశీలిస్తూ.

"నీకు దురద ఎక్కడుంది?"

"కాలిమీద -"

"గుడ్! ఇంటలిజెంట్ బాయ్ వి! ఎందుకు గోకుతావు?"

"దురద వేస్తున్నది కాబట్టి!"

"ఎందుకేస్తున్నది -"

"గోకుతాను కాబట్టి -"

"గుడ్! గుడ్! గోకడం ఆపి చూడు - ఏమవుతుంది?"

"దురద పుడుతుంది - గోకంది ఊపిరాడదు" శీను చెప్పాడు.

"యూసీ! సంథింగ్ సీరియస్సు! మీ పేరేమన్నారు?" అడిగాడు డాక్టరు.

"నా పేరు సుధాకర్ అండి - ఈమె నా భార్య సత్య అండి -" చెప్పాడు.

"చూడండి సుధాకర్ గారు - ఎంత డీప్ గా పరీక్షించినా అస్సలు పాయింటు నాకు తట్టడం లేదు - మన పెద్దలేమన్నారు?" అడిగాడు అతని కళ్ళల్లోకి చూస్తూ.

"నాతో ఏమీ అనలేదు సార్!" సుధాకర్ భయపడి చెప్పాడు.

"పెద్ద పామునైనా చిన్న కర్రతో కొట్టమన్నారు -" డాక్టర్ పిచ్చేశ్వర్రావు చెప్పాడు -"అందుకని -"

ఈ లోగా సత్య అందుకుంది "కాదు సార్! చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు -"

"వెర్రీ షార్పు - చూడు బాబు - నీ పెళ్ళాం వెరీ షార్పు - నోబుల్ ఫ్రైజు యివ్వవచ్చు - అందుకని మనం యిప్పుడు ఏం చెయ్యాలి?" అడిగాడు.

"నోబుల్ ప్రైజు కోసం అప్లికేషన్ పెట్టుకోవాలా సార్!' ఆశ్చర్యంగా అడిగాడు.

"నో - నో - ఇప్పుడు కావాల్సింది శీనుకు వైద్యం!" సత్య గుర్తు చేసింది.

"కదూ - అందుకని కొన్ని టెస్టులు రాసిస్తాను అవి చేసి రిపోర్టులు పట్టుకురండి -" అన్నాడు డాక్టరు.

"రాయండి సార్! మీ అంతటి వారు చెబితే తప్పుతుందా?" సుధాకర్.

"గుడ్! గుడ్!" అంటూ ఓ తెల్లపేపరు తీసుకుని ఓ పెద్ద లిస్టు రాశాడు డాక్టర్ పిచ్చేశ్వర్రావు.

అది చూసి సుధాకర్ కళ్ళు తిరిగాయి -"సార్! ఇదేంటి సార్ - ఈ లిస్టు మావాడికంటే పొడుగ్గా ఉంది!" అడిగాడు దీనంగా.

"సీ మిష్టర్! డాక్టర్ వి నువ్వా - నేనా?" కోపంగా అడిగాడు డాక్టర్.

"తమరే సార్ - అందులో అనుమానం లేదు -" బిత్తరపోయాడు.

"దెన్ - వెంటనే పోయి చేయించుకురా!" ఆజ్ఞాపించాడు.

"సార్ - దీంలో ఏంటి సార్ బ్లడ్ టెస్టులతో పాటు, సిటీస్కాన్ కూడా రాశారు. సిటీస్కాన్ అంటే బ్రైన్ స్కాన్ కదుసార్! కాని దుర్దకు బ్రైన్ స్కాన్ అవసరమా సార్!" సత్య అడిగింది ధైర్యం చేసి.

డాక్టర్ పిచ్చేశ్వర్రావు అలవోకగా నవ్వాడు.

"గుడ్! యు ఆర్ ఏ జీనియస్ నో డౌట్! తలనెప్పికి మాత్ర మనం ఎక్కడ వేసుకుంటాం?" సత్యను చూస్తూ అడిగాడు.

"ఇంట్లో!" అన్నాడు సుధాకర్ - డాక్టర్ అతని వంక కోపంగా చూశాడు.

"నోట్లో సార్!" సత్య అరిచింది.

"గుడ్! తలనెప్పి వస్తే - మాత్రను తలకు వెయ్యం - నోట్లో వేస్తాం - అలాగే కాలికి దురద వస్తే మాత్రను ఎక్కడ వేస్తాం - కాల్లోనా?"

"కాదు సార్! నోట్లోనే!" చెప్పాడు సుధాకర్.

"కదూ! దురద ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది?" డాక్టర్.

"దురద పుట్టినప్పుడు తెలుస్తుంది!" సుధాకర్.

"అదే - అదెలా తెలుస్తుంది - దేని ద్వారా తెలుస్తుంది?" డాక్టర్.

"నోటి ద్వారా చెబితే తెలుస్తుంది సార్!" సుధాకర్.

"నోరుకు ఎలా తెలుస్తుంది?" మళ్ళీ అడిగాడు.

సుధాకర్ నిస్సహాయంగా చూసాడు పిచ్చేశ్వర్రావు డాక్టర్ వంక.

"అదే సార్! మెదడు చెబుతుంది నోటికి - అప్పుడు నోరు మనకి చెబుతుంది -" సత్య చెప్పింది.

"గుడ్! యు ఆర్ ఏ జీనియస్సు నో డౌట్ - కాకపోతే యితనితో చేరి చెడిపోయావు - నీ బుర్ర తినేస్తున్నాడు ఇతగాడు." నిట్టూర్చాడు.

"అయితే ఇప్పుడేం చెయ్యమంటారు సార్!" సుధాకర్ అసహనంగా అడిగాడు సత్య దగ్గర తనను చిన్న బుచ్చడం నచ్చక.

"సో! దురద ఉంది అని చెప్పేది మెదడు. అది సక్రమంగా పనిచేస్తున్నదా లేదా తెల్సుకోవాలి! నిజంగా దురద ఉంటే దురద ఉందని చెబుతున్నదా లేదా ఫాల్సు అలారం పంపిస్తున్నదాని తెల్సుకుని అప్పుడు ట్రీట్ మెంటు మొదలెట్టాలి!" పిచ్చేశ్వర్రావు చెప్పాడు తాపీగా.

"సార్! అప్పటిదాకా కనీసం ఆయింట్ మెంటు కాని - ట్యాబ్లెట్స్ కాని యివ్వరా సార్!" సుధాకర్ అడిగాడు.

"అరే! నేను డాక్టర్నా నువ్వు డాక్టర్వా! వీడేం అల్లాటప్పా ఆర్ యంపీ డాక్టరులాగా కనిపిస్తున్నాడా - పేషంటు రాగానే మూడు రకాల సూదులు గుచ్చడానికి. చూడు మిష్టర్ నేను యండీ, యఫ్ఫార్ సియస్సును - ఫారిన్ రిటర్న్ డ్! ముందు బ్లడ్డు టెస్టులు పూర్తికావాలి - యూరినరి రిపోర్టు కావాలి - తర్వాత కల్చరు రిపోర్టు రావాలి - లంగ్సు యక్సురే కావాలి! బ్రైన్ పిక్చర్ రావాలి! ఇవన్నీ అయింతర్వాత స్పెషలిస్టులు వాళ్ళ ఒపీనియన్స్ యివ్వాలి. అవన్నీ బేసు చేసుకుని నేను ట్రీట్ మెంటు మొదలెడతాను. ఆషామాషీగా మందులివ్వడానికి నేను మెదడు లేని డాక్టరులాగా కనిపిస్తున్నానా?" అంటూ వికటంగా నవ్వాడు డాక్టర్ పిచ్చేశ్వర్రావు.

ఈసారి ఆ నవ్వుకు శీను ఏడ్పు లంకించుకున్నాడు.

"ఈ టెస్టులు ఎక్కడ చేస్తారు సార్?" సుధాకర్ అడిగాడు.

"ఈ కాలిడార్ చివరకు పోతే వాళ్ళే వరుసగా చేసుకుంటూ పోతారు"

"సరే సార్ వస్తాం -" అంటూ లేచాడు.

"నా ఫీజు - వంద రూపాయలు - అక్కడ పెట్టు" డాక్టర్ చెప్పాడు.

సుధాకర్ ఆశ్చర్యపోయాడు "ఇంకా ట్రీట్ మెంటు మొదలు కాలేదు కదు సార్! టెస్టులు పూర్తయింతర్వాత - యిస్తా!"

"అప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం - ఇప్పుడు టెస్టు చేశాను గదా - కష్టపడి టెస్టులు రాసాను గదా - అందుకు ఫీజు -" చెప్పాడు.

చేసేది లేక ఓ వంద తీసి యిచ్చి గోవిందా అనుకుంటూ టెస్టుల వైపు కదిలాడు.

ఎంతైనా అత్యాధునికమైన ఆసుపత్రి కదా! ఏ మాత్రం కష్టం కలగకుండా నర్సమ్మలే చకచక అన్ని టెస్టులు చేయించేశారు - ఓ మూడు గంటల్లో బయటకు పంపారు.

శీను దురద తగ్గకపోతే పెరట్లో వున్న కలబంద చెట్టు ఆకులు కోసి రసం పిండింది. అతడు ప్రశాంతంగా నిద్రపోయాడు.

కాని సుధాకర్ పడుకోలేకపోయాడు - టెస్టులకే ఆరువేలైంది. రీ ఇంబర్సుమెంటు స్కీంలో ఈ దురదకు ఉందో లేదో అని అతనికి దురద పట్టుకుంది. మెడీ క్లెయిముకు పంపిస్తే వాళ్ళు ఎంత రీయింబర్సు చేస్తారో - ఎంత తన జేబుకు బొక్కపడుతుందో తెలీక బెంబేలు పడ్డాడు.

మూడు రోజుల తర్వాత డాక్టర్ పిచ్చేశ్వర్రావును కలిసాడు.

"ఆ! దురద తగ్గిపోయిందా బాబు!" అడిగాడు డాక్టర్.

"మీరు మందులు యివ్వందే!" సత్య ఆశ్చర్యంగా అడిగింది.

"గుడ్ క్వశ్చన్! నో డౌట్ యు ఆర్ ఏ జీనియస్సు - అయినా జవాబు చెప్పడం నా బాధ్యత - డాక్టరు పేషంటుకు మందులు యిచ్చినా యివ్వకపోయినా కొన్ని రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి - ఎందుకంటే బాడీలో రెసిస్టన్స్ పవరు పెరిగి దానికి తగ్గ రసాయనిక చర్యలు కలిగి జబ్బు తగ్గిపోతుంది. ఉదాహరణకు జలుబుకు మందులిస్తే ఒక్క వారంలో తగ్గుతుంది. మందులివ్వకపోతే ఏడు రోజుల్లో నయమవుతుంది - అందుకనే అడిగా బాబుకు దురద తగ్గిందాని -"

"ఈ మాట ముందు చెప్పిఉంటే అన్ని టెస్టులు చేయించుకునే వాళ్ళం కాదు కదు సార్!" సుధాకర్ అన్నాడు నీళ్ళు నములుతూ.

"యు ఆర్ రాంగ్! మానవ ప్రయత్నం ముఖ్యమని ఆ శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడా లేదా? యాక్సిడెంట్ లో చనిపోయాడని తెల్సినా - ఉగ్రవాదులు కాల్చి చంపారని తెల్సినా పోస్టు మార్టం చేస్తారు - ఎందుకు మిలియన్ డాలర్ క్వశ్చన్ సంధించాడు డాక్టర్ పిచ్చేశ్వర్రావు సుధాకర్ కు.

సుధాకర్ పరపర బుర్ర గోక్కున్నాడు.

సత్య ఠపీమని చెప్పింది. "ఎవళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి కాబట్టి".

"గుడ్! యు ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్ - ఇంతకీ మీ బుజ్జిగాడి దురద ఎలా ఉంది?" మళ్ళీ అడిగాడు పిచ్చేశ్వర్రావు.

"కొంచెం పైకి పాకింది సార్!" చెప్పాడు సుధాకర్!

"ప్రోగ్రెస్! గుడ్ ప్రోగ్రెస్!" అరిచాడు పిచ్చేశ్వర్రావు.

"అదేంటి సార్! మేము భయపడుతుంటే మీరలా అంటారు?" సత్య అడిగింది ధైర్యం చేసి.

"గుడ్ క్వశ్చన్! యు ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్! తగ్గుతున్న రోగానికి - పెరుగుతున్న రోగానికి మంచి వైద్యం అందించవచ్చు - కాని ఒక్కలా నిలబడ్డ రోగాన్ని ట్రీట్ చేయడం కష్టం!" డాక్టర్ పిచ్చేశ్వర్రావు ఉవాచ.

"ఇప్పుడన్నా మందులు రాస్తారా సార్!" సుధాకర్ అడిగాడు.

"అందుకే గదయ్యా నే కూర్చుంది... మీతో మాట్లాడుతున్నా నా లెఫ్టు బ్రైన్ మందుల గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నది - ఉదాహరణకి ఏ అనే మందు రాస్తే ఏం రియాక్షన్ వస్తుంది - దానికి విరుగుడుగా యింకే మందు రాయాలి - దానివలన కూడా ఇంకో రియాక్షన్ వస్తే దాన్ని అరికట్టడానికి యింకే మందు రాయాలి అని!" కోపంగా చెప్పాడు డాక్టర్.

"నా కర్థం కాలేదు సార్!" సుధాకర్ దీనంగా మొహం పెట్టాడు.

"గుడ్! నీ కర్థం కాదు - బాబుకు ఒక యాంటీ బయాటిక్ రాసాననుకోండి - దానివలన డయేరియా - అంటే - విరోచనాలు రావచ్చు - ఆ విరోచనాలను అరికట్టడానికి ట్యాబ్లెట్లు రాస్తే దానివలన వాడికి చచ్చే నీరసం రావచ్చు - నీరసం తగ్గడానికి సెలైన్ కాని - గ్లూకోజు గాని ఎక్కిస్తే దానివలన చలి జ్వరం రావచ్చు. దాన్ని పోగొట్టడానికి యింజెక్షన్ చేస్తే - ఇంజెక్షన్ ఇచ్చిన చోట పుండు పడి గోకవచ్చు - మళ్ళీ దానికి యింకో మందు - యిలా చైన్ రియాక్షన్ ఉంటుంది - అది ఆలోచిస్తున్నా!" చేతులతో టేబులును బాదుతూ చెప్పాడు డాక్టర్.

"మీరు నిజంగా జీనియస్సు సార్! మీలాంటి డాక్టర్ ఈ ఊళ్ళో ఉండటం ఈ ఊరి ప్రజల అదృష్టం సార్!" సత్య పొగిడింది.

"మరి డాక్టర్ పిచ్చేశ్వర్రావు అంటే ఆర్.యమ్.పీ కాదు గదా మూడు సూదులు గుచ్చడానికి - బాబూ! నీకు కాలు ఎందుకు గోకాలనిపిస్తున్నది?" మళ్ళీ మొదటి కొచ్చాడు డాక్టరు.

"దురదపుడుతున్నదంకుల్! అందుకని!" శీను చెప్పాడు.

"దురద ఎందుకు పుడుతున్నది?" డాక్టర్ అడిగాడు.

"అది తెల్సుకుందామనే కదు సార్ మీ దగ్గరికి వచ్చింది?!" ఈసారి శీను తల్లి సత్య జవాబు చెప్పింది.

డాక్టర్ పిచ్చేశ్వర్రావు కొన్ని సెకనులు ఆమె వంక సీరియస్సుగా చూసి నవ్వేశాడు. "గుడ్! యు ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్! కాని నాకు మటుకు ఏం తెల్సమ్మా మీకు చెప్పడానికి! ఈ బ్లడ్ రిపోర్టులు - ఈ యక్స్ రేలు - ఈ స్కానింగు ఏవీ పూర్తిగా నిర్ధారించలేక పోతున్నాయి. అందుకే పేషెంటన్నా ఏమన్నా చెబుతాడేమోనని ఆశపడ్డా!" చెప్పాడు.

"పోనీలేండి సార్! మాకు చెప్పకపోయినా ఫర్వాలేదు - తగ్గేదానికి మందులు రాసివ్వండి." సత్య అడిగింది - రాజీపడిపోతూ.

డాక్టర్ మోహంలో సంతృప్తి కనిపించింది "గుడ్! యూ ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్! చూడు బాబు -" అంటూ శేనును పిల్చాడు.

వాడు చూడకుండా స్టెత్ తో ఆడుకుంటున్నాడు. స్టెత్ ను కాలిమీద పెట్టుకుని - పరీక్షిస్తున్నాడు. సుత్తితో కొడుతున్నాడు డాక్టరులాగా...

"మాకు చెప్పండి సార్ - నే చూస్తున్నా!" సుధాకర్ నోరు తెరిచాడు.

"మూడు రకాల మాత్రలు రాస్తున్నాను - మూడు పూటలా వెయ్యమని" డాక్టర్ చెప్పాడు.

"అరే! చిన్న దురదకు మూడు రకాల మాత్రలు - మూడు పూటలా!" సుధాకర్.

"సీ మిష్టర్ సుధాకర్! నేను ఆర్ యమ్ పీ డాక్టర్ని కాదు - మూడు సూదులు గుచ్చడానికి - ఐ యామ్ యమ్ డీ; ఎఫ్.ఆర్.సి.యస్. - ఫారిన్ రిటర్డు - అందుకని మినిమమ్ లో రాస్తున్నాను - ఆయింట్ మెంటు ఉదయం రాత్రి కూడా రాయండి... కాని మాత్రలు మటుకు మర్చిపోకుండా నేనిచ్చిన టైముకే వేయండి... ఉదయం ఆరు - మధ్యాహ్నం రెండు - రాత్రి పది - తేడా రాకూడదు - ఓ వారం వాడి ప్రోగ్రెస్ చెప్పండి - రియాక్షన్ ఉంటే వెంటనే రండి!" డాక్టర్ చెప్పాడు.

"సార్ వాడు నిద్ర లేచేటప్పటికే ఏడవుతుంది సార్ - రాత్రి పదికంటే ముందే నిద్ర పోతాడు సార్! రెండుకు మధ్యాహ్నం స్కూలులో ఉంటాడు సార్!" సుధాకర్ లబలబలాడుతూ
చెప్పాడు.

"సి మిష్టర్! డాక్టర్ నేనా - నువ్వా? పదేళ్ళపైన కోర్సు చేసింది నువ్వా నేనా? ఫారిన్ పోయింది నువ్వా నేనా?" గాండ్రించాడు డాక్టరు.

"నిజమే కదు సార్! మీరే! నేను ఒట్టి బ్యాంకు ఆఫీసర్ని!" ఒప్పుకున్నాడు.

"వేర్ దేరీజ్ ఏ విల్ దేరీజ్ ఎ వే!" డాక్టర్ చెప్పాడు.

"మనసుంటే మార్గముంటుంది." సత్య అనువదించింది సింపుల్ గా.

"గుడ్! యూ ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్! అవునమ్మా నీకు ఈయన ఎలా దొరికాడమ్మా!" కుతూహలంగా అడిగాడు డాక్టర్ పిచ్చేశ్వర్రావు.

"దొరకలేదు సార్! మానాన్నగారు కష్టపడి కొనుక్కొచ్చారు - అదంతా పెద్ద హిస్టరీ! ఆ మిష్టరీ చెప్పాలంటే టైము పడుతుంది - ముందు బుజ్జిగాడి భారతం అయిపోతే!" సత్య
నిట్టూర్చింది.

సుధాకర్ కోపంగా చూశాడు ఆమె వంక. బుజ్జిగాడు ఆడుకోవడం మానేసి ముగ్గురిని చూశాడు.

"ఓకే! ముందు బాబుగాడి దురద తగ్గాలి! ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించి... ఇన్ని యంత్రాలతో టెస్టులు చేయించి తగ్గించలేక పోతే నాకే కాదు ఈ దేశానికే అవమానం! ఎంత అవమానం! మానం పోయే అవమానం! మన దేశానికే దురద పట్టినట్టు లెక్క! ఏం దురద పుట్టి నేనింత పెద్ద డాక్టరై హాస్పిటల్ కట్టించాను? అందుకే - ప్రపంచం బాధ శ్రీశ్రీది - కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది! అందుకని ఇంకో రెండు మందులు కూడా రాస్తాను -" అంటూ ప్రిస్కిప్షన్ బరబర రాసిచ్చాడు... సుధాకర్ ఆ చీటి అందుకుని నమస్కరించి వెళ్ళబోయాడు. యింకాసేపుంటే మందుల లిస్టు పెంచుతాడేమోనని భయపడి.

"నా ఫీజు రెండొందలు మాత్రమే!" చెప్పాడు పిచ్చేశ్వర్రావు.

"అదేంటి సార్ - లాస్టు టైము వంద యిచ్చాం గదా!" సుధాకర్.

"అది టెస్టు రాసినందుకు! ఇది మందులు రాసినందుకు -"చెప్పాడు.

సత్య వేడి చూపులతో సుధాకర్ జేబులోంచి రెండునోట్లు తీసి టేబుల్ పైన పెట్టాడు పిచ్చేశ్వర్రావు వాటిని డ్రాయరులో నొక్కేసాడు.

"యూసీ మిష్టర్! మందులు కొని నాకు తెచ్చి చూపించండి!" చెప్పాడు.

"ఏం సార్ చూపించిన దానికి - చూసిన దానికి మళ్ళీ బిల్లు చెల్లించాలా!" కంగారుగా అన్నాడు సుధాకర్ భయపడి.

"అబ్బ కాదండి! ఆ షాపు వాడు మీ అమాయకత్వం చూసి ఎక్కడ మోసం చేస్తాడోనని డాక్టరు గారి భయం! ఆ కంపెనీ మందు లేదు ఈ కంపెనీ మందు చీపు అంటూ ఇంకో నాసిరకం మందు అంటగడతారేమోనని డాక్టరు గారు చూపించమన్నారు. దానికి ఫీజు తీసుకోరు ఎలాగూ షాపు వాడు కమీషను యిస్తాడు." సత్య కోపంగా చెప్పింది.

డాక్టర్ పిచ్చేశ్వర్రావు మెచ్చుకోలుగా నవ్వాడు "గుడ్! యూ ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్! నీ బుజ్జిగాడు కూడా నాలాగా జీనియస్ కావాలి!" అంటూ ఆశీర్వదించాడు డాక్టర్ పిచ్చేశ్వర్రావు. మందులకు కొన్ని వందలు అయ్యాయి.

ఇంకా ఆరాత్రి నుండి డాక్టర్ గారి ప్రిస్కిప్షన్ ప్రకారం మందులు వేయడం ప్రారంభించింది సత్య. బుజ్జిగాడి నిద్ర జాస్తి అయింది. అయినా నిద్రలో కూడా గోకుతూనే ఉన్నాడు. రెండు రోజులు బడికి సెలవులు రావడం మూలంగా సజావుగా మందులు వేయగలిగింది - రెండు రోజులు పైన.

మూడో రోజు బడికి పంపింది.

మధ్యాహ్నం గుర్తుకొచ్చింది రెండున్నరకు రెండు గంటలకు వేయాల్సిన మాత్రలు వేయలేదని - బుజ్జిగాడు ఎంచగ్గా బడిలో ఉన్నాడని. కోర్సు సరిగ్గా వెయ్యకపోతే మందులు పని చెయ్యకపోతే మళ్ళీ డాక్టరుకు మొహం ఎలా చూపించాలో అర్ధం కాలేదు ఆమెకు.

ఆలోచనలో పడిపోయింది. దీర్ఘాలోచన చేస్తున్నది.

ఈ మధ్య బుజ్జిగాడు వీలు చిక్కినప్పుడల్లా తల్లిని చూస్తూ అంటున్నాడు "గుడ్! యూ ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్!" అంటూ పైగా ఏం దొరికితే దాంతో స్టెత్ లాగా అందరికీ టెస్టులు చేస్తున్నాడు. ఈ ట్రీట్ మెంటు అయ్యేదాకా సెలవు పెట్టిద్దామనుకుంది. కాని ఆ స్కూలు మేనేజిమెంటు మహాస్ట్రిక్టు! ఒక్కరోజు సెలవు కలెక్టరు కన్నా ఈజీగా దొరుకుతుందేమోగాని - ఆ స్కూలు పిల్లలకు దొరకదు! యక్ష ప్రశ్నలు - చివాట్లు - పెనాల్టీలు! ఎంత చిన్న క్లాసయినా ఒక్కరోజు పాఠాలు కూడా వాళ్ళ భావి జీవితంలో గొప్ప ప్రభావం చూపిస్తాయని నమ్ముతారు ఆ స్కూలు యజమానులు.

అందుకే ఇంక చేసేదేమీ లేక మాత్రలు పట్టుకుని స్కూలుకు బయలుదేరింది సత్య.

ఆయా కాళ్ళా వెళ్ళా పడి బడి లోపలి రాగలిగింది. కాని టీచరు పాఠం చెబుతున్నది... బెల్లు కొట్టే దాకా బయట నిలబడమని ఆయా సెలవిచ్చింది...

దూరంగా ఉండి ఆ టీచరును - ఆ క్లాసు పిల్లలను చూడసాగింది సత్య. ఓ నలభై మంది బుజ్జి బుజ్జి పిల్లలు బుజ్జి బుజ్జి బెంచీలమీద కూర్చున్నారు వివిధ రకాలుగా.

టీచరు చిన్న చిన్న గేయాలు - పాటలు నేర్పిస్తున్నది - కాని మధ్య మధ్యలో కాలు బరబరా గోక్కుంటున్నది - చీర పైకెత్తి పాదాన్ని కూడా అందిన చోటల్లా గోకుతున్నది... ఏదో ఆనందం అనుభవిస్తున్నట్లు గోక్కుంటున్నది.

కాసేపటికి బెల్లు మోగి టీచరు బయటకొచ్చింది...

కొందరు పిల్లలు కూడా గోక్కుంటున్నారు ఆమె లాగా -

సత్య బుజ్జిగాడిని బయటకు పిలిపించి మాత్రలు మింగించింది. అప్పుడు ఆమె మనసు స్థిమిత పడింది, తను డ్యూటీలో ఫెయిలు కాలేదని.

కోర్సు అయింతర్వాత డాక్టర్ పిచ్చేశ్వర్రావు దగ్గరికి వచ్చారు ముగ్గురు.

"బాగా ఆలోచించి జవాబు చెప్పు - దురద తగ్గిందా బాబూ!" అడిగాడు.

"వాడి మొహం వాడేం చెబుతాడు సార్ - ఎప్పుడూ నిద్ర పోతుంటాడు" సుధాకర్ చెప్పాడు. ఈసడించుకుంటూ

"హొమ్ వర్క్ బాగా చేస్తున్నాడా?" డాక్టర్ పిచ్చేశ్వర్రావు అడిగాడు.

"ఆ గోక్కుంటూ - గీరుకుంటూ బాగానే చేస్తున్నాడు నిద్ర వచ్చేదాకా!" చెప్పాడు సుధాకర్!" కాని బాగా డల్ అయిపోయాడు సార్ మావాడు."

"మరి మాత్రలు మార్చి రాసిమ్మంటారా! మళ్ళీ టెస్టులు చేయించాలా! ఆర్ యంపీ డాక్టరులా సూది మందులు యివ్వాలా!" డాక్టర్.

"ఏమీ వద్దు సార్! మా పిల్లాడ్ని ఆ స్కూలు మాన్పించేస్తాను." సత్య చెప్పింది - డాక్టర్ గారి వంక సూటిగా చూస్తూ.

"గుడ్! గుడ్! యూ ఆర్ ఏ జీనియస్సు - నో డౌట్! మందులతో రోగం తగ్గకపోతే వాతావరణం - పరిసరాలు మార్చమన్నారు -" అభినందించాడు.

"అలాగే డాక్టర్ ని కూడా సార్ - కాని ఈ ఊళ్ళో యింకెవరూ లేరు సార్! అందుకని ఈ పని చెయ్యలేం కాబట్టి - మేమే మానుకుంటాం!"

సత్య చెప్పింది ఖరాఖండితంగా - డాక్టర్ వంక చూస్తూ.

డాక్టర్ బిత్తరపోయాడు - ఆ తర్వాత నవ్వాడు పెద్దగా "గుడ్ జోక్! ఎవరి కర్మకు ఎవరు కర్తలమ్మా! మన గీత ప్రకారం మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాల మూలంగా ఈ జన్మలో రోగాలు వస్తాయి - పాపం దానికి డాక్టర్లు ఏం చేస్తారు కనుక! ఏదో మీరు వారికి అంతకు ముందు జన్మలో రుణపడి ఉంటారు కాబట్టి ట్రీట్ మెంటుకు వస్తారు - కనుక బుజ్జిగాడ్కి ట్రీట్ మెంటు యిద్దాం - కాకపోతే టెస్టులు వద్దు - అయినా నాకో సందేహం! మీ వాడ్ని స్కూలు మారుద్దామని ఎందుకు అనుకున్నావమ్మా!" సత్యను అడిగాడు పిచ్చేశ్వర్రావు గుచ్చి గుచ్చి చూస్తూ.

"చిన్న పిల్లలు పెద్దలను అనుకరిస్తారు మీరు పరిచయం అయింతర్వాత వాడు మిమ్మల్ని మా యింట్లో అనుకరిస్తున్నాడు - అలాగే వాళ్ళ టీచరుకు దురద ఉండి - గోక్కుంటూ ఉంటే అనుకరిస్తున్నాడు" చెప్పింది సత్య.

"నో డౌట్! యు ఆర్ ఏ జీనియస్!" సత్యను అభినందించాడు డాక్టర్ పిచ్చేశ్వర్రావు ఏడుపు మొహం పెట్టి.

అక్కడనించి బయలుదేరి ఓ మూడుచోట్ల షాపింగు చేసుకుని ఎండనబడి యింటికి వచ్చారు. ఎండలు మండిపోతున్నాయి.

బాతురూముకు పోయి వచ్చాడో లేదో సుధాకర్ కళ్ళు తిరిగి మంచం మీద అడ్డంగా పడిపోయాడు. ఆ సంగతి శీను సత్యకు చేరవేశాడు. ఆమె కంగారు పడుతూ వచ్చి అతన్ని తట్టి లేపడానికి ప్రయత్నించింది. ఒళ్ళు కాలిపోతున్నది. నీళ్ళు చల్లింది మొహంమీద. మూలిగాడు కాని కళ్ళు తెరవలేదు.

గత అనుభవం గుర్తుకొచ్చి పిచ్చేశ్వర్రావు దగ్గరికి పోకుండా దగ్గరగా వున్న ఆర్.యం.పి డాక్టరు దగ్గరకు వెళ్లి అతన్ని పట్టుకొచ్చింది. రాజు రాగానే మూడు యింజెక్షన్లు చేశాడు సుధాకర్ కు. వెంటనే అతను లేచి కూర్చున్నాడు "నాకేమైంది? ఇతను ఎవరు?" అంటూ.

సత్య జరిగింది చెప్పింది. పనిలో పనిగా అంతకు ముందు బుజ్జిగాడికి జిలపుడితే డాక్టర్ పిచ్చేశ్వర్రావు దగ్గరికి పోయి ఎంత కష్టపడింది వివరించింది రాజుకు.

ఆర్.యం.పి డాక్టర్ రాజు పడిపడి నవ్వాడు.

"మీకు ఈ సంగతి తెలియదా? బిల్డింగుల మీద బిల్డింగులు కట్టించి డాక్టర్ పిచ్చేశ్వర్రావు అప్పుల పాలైపోయాడు. వడ్డీలమీద వడ్డీలు కట్టలేక అతని బుర్ర తిరిగిపోయింది. ఈ మధ్య హైద్రాబాద్ లో డాక్టర్ పిచ్చేశ్వర్రావు పిచ్చి డాక్టర్ల దగ్గర పిచ్చి వైద్యం కూడా చేయించుకున్నాడు. అందుకని తెల్సినవాళ్ళెవరూ అతని దగ్గరకెళ్ళరు. మీరు ఈ ఊరికి కొత్తగదా - పాపం - అందుకని -" మళ్ళీ నవ్వాడు రాజు.

"అదా అస్సలు సంగతి ఈ డాక్టరుకు డబ్బు పిచ్చి పట్టిందన్నమాట! పాపం! అంత చదువుకుని - అన్ని దేశాలు పోయొచ్చి డబ్బు పిచ్చిలో మతిపోగొట్టుకున్నాడన్నమాట!" సుధాకర్ సానుభూతి చూపాడు.

"కాని కొంతమంది డాక్టర్లు ఎంత చదువుకున్నా - ఓ లెవల్ కెళ్ళిన తరువాత కూడ డబ్బు పిచ్చి నించి బయటపడలేకపోతున్నారు - ఇతనికన్నా ట్రీట్ మెంటు ఉంది - వాళ్ళ డబ్బు దురదకు ట్రీట్ మెంటు లేదు". అంటూ ముక్తాయించాడు ఆర్.యం.పి డాక్టర్ రాజు.

శేనుకు అర్ధమైనట్లు నవ్వాడు పకపక.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ