"వినాయక రావ్ కూతురు పెళ్ళి కుదిరిందిట ! ఐతే పాపం ముహూర్తం వేసవిలో మే నెల్లోనేట. అదీనీ వారి నగరంలో ఏసీ హాల్ లో పెళ్ళి చేయాలిట , కరెంటుపోతే --అదేదో ఏర్పాటు చేసి అన్నీ నడపాలిట, "అంటూ మార్చి ఎండన పడి ఊరి విశేషా లన్నీ సేకరించి వచ్చి, సమాచారం అందించాడు భార్య భానుకు బాపేశం , ఆమె అందించిన కొత్తకుండ లోని చల్లని నీరుత్రాగి.
" అయ్యో పాపం ఎలా చేస్తారండీ? కుదరక కుదరక ఈ వేసవిలోనే! , అదీనీ మే నెల్లో నే ముహూర్తం కుదరాలా పాపం హరి హరీ , నీళ్ళకు కరువు, కరెంటు కోత, ఒకటా రెండా వేసవి బాధలు -- " అంటూ నిట్టూర్చింది భాను ,పాపం ఆ వివాహం తానే పూనుకుని చేస్తున్నట్లు బాధ పడుతూ.
వీరిలా వినాయక రావు కూతురి పెళ్ళి గురించీ బాధ పడుతుండగా బలరామ్మూర్తి వచ్చాడు " ఏంటండోయ్ తీవ్రంగా ఆలోచిస్తున్నా రు ." అంటూ. ' బలరామ్మూర్తి భలే వాడు' అనుకుంటారంతా.అతగాడి బుర్రకూడా దివిటీలా వెలుగుతుంటుంది, ఆకాశ చువ్వలా దూ సుకు పోతుంటుంది. వేసవి వచ్చిందంటే గ్రామ వాసుల్ని పలకరించ నన్నట్లు అందర్నీ కలేసుకుని తిరుగుతూ ఎక్కడికక్కడ చల్ల పానీయాలూ, చల్లా త్రాగుతూ దాహం తీర్చుకుని వెళుతుంటాడు, కాలక్షేపానికి కాలక్షేపం ,ఎవరికి కావాల్సిన ఉపాయాలు వారికి చెప్పివెళు తుంటాడు., అందుకనే బలరామ్మూర్తి వస్తున్నాడంటే ఇబ్బందిలో ఉన్నవారంతా ఊపిరి తీసుకుంటారు. ఏదో ఒక ఉపా యం చెప్పక పోడని.
"వినాయక రావ్ కూతురి పెళ్ళండీ! ఎప్పుడని అడగరేం? ఈ వేసవిలోనే నండీ పాపం , ఎలా వేగుకొస్తాడో ఏమో ,అసలే అమాయ కుడు అన్నయ్యగారూ! అదీనీ వారి నగరంలోకోరిన ఏసీ హాల్లో చేయాలిట.!" అంటూ చల్లని చల్ల గ్లాసు అందించింది భాను. ఆచల్ల త్రాగ గానే బలరామ్మూర్తి మైండ్ లో బల్బ్ వెలిగింది . ఒక్క ఉదుటున కుర్చీలోంచీ ముందుకు వాలి, "అదే అక్కడే వచ్చిపడింది లాభ మంతా "అన్నాడు.
"లాభమేంటండీ చిక్కైతేనూ !" అంది భాను .
"చిక్కా పాడా, ఒక్క చిటికె లో తేల్చేస్తాను , రావయ్యా బాపేశం! నాతో పాటుగా మన వినాయక రావ్ ఇంటికి "అంటూ లేచి లాల్చీ దులుపుకున్నాడు బలరామ్మూర్తి . "ఇంతెం ఎండలో ఏం వెళతాం లేవోయ్ , పైగా ఇప్పుడే ఊరంతా తిరిగి వచ్చాను , మా ఆవిడకు తీపి కబురందించను." అంటూ నీరసించిన బాపేశాన్ని చేయి పట్టి లేపి , నీవు తిరగడం వేరు, నాతో తిరగడం వేరు. లేవయ్యా బాబూ విందు భోజనం తిని పిస్తానూ -- చెల్లాయ్ !మాకోసం ఎదురు చూడకు మేం భోజనం చేసి వస్తాం సరా!" అంటూ బాపేశాన్ని వెంటేసు కుని బయల్దేరాడు , తన చేతి లోని పెద్ద తెల్లగొడుగును తెరచి ఇద్దరికీ పట్టాడు బలరామ్మూర్తి .
ఇంటి ముందున్న పందిట్లో కూర్చుని భార్యతో చర్చిస్తున్న వినాయక రావు వీరిద్దరినీ చూసి " రండి రండి ! బలరామ్మూర్తి గారూ! సమయానికి పిల్చినట్లు వచ్చారు. చాలా సంతోషమూ, కాస్తంత విచారమూ, కలసి ఉన్న సమయంలో వచ్చారు. ఇహమీదే భారం " అంటూ వినాయక రావు సాదరంగా ఆహ్వానించాడు .
నవ్వుతూ "రావోయ్ బాపేశం ! ఇదో ఈ మహాను భావుడే నా చెవిన వేశాడు మీ కుమార్తె వివాహం కుదిరిందనీ, అదీ ఈ మే నెల్లోనే ననీ , పైగా వారి నగరంలో కోరిన ఏసీ హాల్లోననీ తెలిసింది. ఇహ రాక చస్తానా చెప్పండీ !" అంటూ చెక్క బల్లమీద సర్దుక్కూర్చు న్నాడు, బాపేశాన్ని లాగి కూర్చో బెట్టి.
" రండి అన్నయ్యగారూ " అంటూ బల్ల చూపి లోని కెళ్ళింది ఆ గృహలక్ష్మి. " ఇహ చెప్పండీ .."అంటూ లోనికి చూశాడు బలరా మ్మూర్తి . అర్ధం చేసుకున్న వినాయక రావు " ఇదో ఏమే ! కాసిన్ని కమ్మని చల్ల పట్టుకురా మా ముగ్గురికీనీ " అంటూ కేకేశాడు.
లోపలినుంచీ " ఆపనిమీదే ఉన్నా .." అని విని పించాక స్థిమిత పడి ,బలరామ్మూర్తి మొదలె ట్టాడు.
" చెప్పవయ్యా! వినాయకా ! నావల్ల కావల్సిన కార్య మేదైనా కానీ మొఖమాటం లేకుండా చెప్పెయ్ ! పెళ్ళివారిదే ఊరూ? కట్న కానుకలు మాట్లాడుకున్నారా! పెళ్ళి తేదీ ఏంటీ? పెళ్ళికి ఎందరు వస్తారు? ఎన్నిరోజుల ముందు వస్తారూ? ..." అంటూండగా , వినాయక రావ్ " బాబ్బాబూ కాస్త నిదానంగా ఒక్కోటీ చెప్తాను, మీ వల్ల కావాల్సిన కార్యాలు చాలా నే ఉన్నాయి. ముందు ఈ పూట మా ఇంట మా ఆతిధ్యం స్వీకరించి , నిదానంగా మేనెల్లో పెళ్ళికి ఎదురయ్యే మా ఇబ్బందులు అర్ధం చేసుకుని ఉపాయాలు చెప్పండి. ఒక్కోటి చర్చిస్తే గానీ మా మనస్సులు కుదుట బడవు." అంటూ అభ్యర్ధించగా , "ఈరోజు మనం లేచిన వేళ మంచిది, మనల్ని ఆదు కోను ఇరువురు నిస్వార్ధ బంధువులు వచ్చారు . త్వరగా వెళ్ళి వంటలు చూడూ.."అంటూ భార్యను తొందరచేశాడు.
ఆమెలోని కెళ్ళగానే పెళ్ళి గురించీ తాను అడిగిన ఒక్కోప్రశ్నా మళ్ళా రిపీట్ చేస్తూ ,సమస్యలు చ ర్చి స్తూ, తనకు తోచిన నివారణో పాయాలు వివరిస్తూ , ఉండగా భోజనాలకు పిలు పొచ్చింది.ముగ్గురూ లేచి కాళ్ళు కడుక్కుని భోజన శాలకెళ్ళి కూర్చున్నారు .
పెద్ద అరిటాకుల్లో నూనె వంకాయ కూరా , మామిడి కాయ పప్పూ , దోసావకాయా, అప్పడాలూ ,వడియాలూ, కొబ్బరి పెరుగు పచ్చ డీ , బీరకాయ బజ్జీ , వడ్డించి ఉండగా " ఇదేంటయ్యా వినాయక రావ్ ! పెళ్ళి పప్పన్నం ఇప్పుడే పెట్టి నట్ళున్నావ్! పెళ్ళికి ఇహ పిల వ్వా ఏంటీ! " అని హా స్య మాడి, ఒక్కో వంటకం తింటూ , వాటి రుచి పొగుడ్తూ, పాయసం తో పూర్తిచేసి , మీగడ పెరుగుతో పొట్ట నిండ గా లేవలేక వినాయక రావ్ చేయందించగా లేచి , హస్త ప్రక్షాళన చేసుకుని తిరిగీ బల్ల మీదకు చేరారు.
"కాస్తంత నడుం వాలుస్తారా అన్నయ్య గారూ !" అంటూ వచ్చిన గృహ మమ్మాయిని ," భలేదానివి చెల్లాయ్ ! వచ్చింది ఇబ్బందులు చర్చించి వివాహ వేడుక చక్కగా నిర్వహించను గానీ , భోంచేసి నడుం వాల్చనా? మీరూ కానివ్వండి,ఆలస్య మైతే ఆరోగ్యాలేం కానూ! అసలే ఆడ పెళ్ళివారు , భోజనం కానిచ్చి వస్తే చర్చ స్థాయికి వస్తుంది." అని ఆడవారిని పంపేసి , వారు భోజనాలు ముగించి వచ్చాక అందరితో కలిసి ,మిగతా విషయాలు చర్చించి, ఒక కొలిక్కి తెచ్చాడు.
"ఇహ నిశ్చింతగా ఉండండి!మీ అమ్మాయి పెళ్ళి సులువుగా మనఊర్లోనే జరిగి పోయినట్లే భావించండి. మేమిరువురం వెళ్ళి అన్నీ మాట్లాడివస్తాం కదా! విందు భోజనం లోకి చేయాల్సిన వంటల గురించీ కూడా మీకు పట్టీ వ్రాసి తెస్తాను , ముందుగా వారింట ఒక భోజనం చేస్తే కానీ దాన్ని నిర్ణయించ లేను.మన ఊరి విందు రుచి జన్మలో మర్చిపోకుండా చేద్దాం. నీవొస్తే ‘అతికితే గతక ‘దంటావ్ ,అందుకే మే మిరువురం,రేపే దశమి కనుక వెళ్ళి శుభవార్తతో వస్తాం. సరా !వెళ్ళిరామా! ఇక , పెళ్ళికూతురా ! అత్తారింటికి దారెటో , ఏమేమి తీసుకు వెళ్ళాలో , తేనె యాత్ర కెక్కడి కెళ్ళాలో తేల్చుకో ! వస్తాం మరి " అంటూ లేచాడు బలరామ్మూర్తి .
బాపేశమూ వెర్రి ముఖం వేసుకుని బలరామ్మూర్తి వెంట లేచాడు. ఆ మరునాడు బలరామ్మూర్తి వెంట వెళ్ళక తప్పలేదు బాపేశానికి .ఇరువురూ ఐదు మైళ్ళదూరం లోని నగరానికి బస్ లో వెళ్ళి , మగ పెళ్ళివారిల్లు సులువు గానే తెల్సుకుని లోని కెళ్ళారు. తా మెవరో చెప్పి పరిచయాలయ్యాక , ముందుగా వారిచ్చిన మంచి తీర్ధం సేవిస్తూ , " పల్లెకూ పట్టణానికీ ఉండే తేడా ఈ నీళ్ళను బట్టే తెలుస్తున్నదండీ!" అంటూ మొదటి బాణం సంధించాడు .
"అంటే మీ ఉద్దేశ్యం?" నవ్వుతూనే అన్నా కాస్తంత ఆసక్తి కనిపించింది పెళ్ళికొడుకు తండ్రైన నాగేశం ముఖంలో.
" అబ్బే పెద్దగా ఏం లేదండీ! మేము నేరుగా కమ్మని మంచినీటి బావి నీరు తోడి తెచ్చుకుని , కొత్త మట్టి బానల్లో పోసుకుని సహ జ మైన చల్లని నీరు త్రాగుతాం. మీపట్టణ వాసులు ప్లాస్టిక్ డబ్బాల్లో శుధ్ధి చేసో చేయకో నింపి అమ్మే నీరు ఫ్రిజ్ లలో పెట్టుకుని త్రాగు తారు. అంతే తేడా." అని అంటించాడు. ఇంతలో కరెంట్ కట్టై చెమట పోయసాగింది."మరేనండీ ! మాపల్లెల్లో చల్లని తాటాకు పందిళ్ళూ, చెట్లనుంచీ వచ్చే సహజమైన గాలీ , నగరాల్లోనో కరెంట్ లేక పోతే జీవితమే ఆగిపోయి నట్లుంటుంది. మా బాబాయ్య గారు ఉన్నారు లెండి పాపం, ఈ నగరంలోనే రామాలయం వీధిలో . ఎప్పుడూ అంటుంటాడు 'మీ పల్లె వాసుల జీవితం హాయిరా! ఎప్పుడూ సహజమైన గాలీ, నీరూ తిండి గింజలూ, పండ్లూ కూరా, నారా అన్నీ నేరుగా చేలనుంచీ తెచ్చుకు తింటుంటారు. మేమో కోసి వారమయ్యాక మర్కెట్ నుండీ తెచ్చుకుని మరో వారం పాటు వాడుకుని చెత్త తింటుంటాం, నగరాల్లో పెళ్ళి అంతా నాటకాల్లో జరిగి నట్లే ఉంటుంది. ఒక్కమారు మీ ఊర్లో ఏదైనా పెళ్ళి ఉంటే పిలవరా! ఆకమ్మని కొత్త తాటాకు చాపలూ, పచ్చి తాటాకు పంది ళ్ళూ, దంపుడు బియ్యప్పిండి నిప్పట్లూ, కొబ్బరి నీరూ, తాటిముంజలూ.. అరిటాకు భోజనాలూ, పెట్రోమాక్స్ లైట్లూ అబ్బో ఒకటేం టీ అన్నీ చూసి మనసారా ఆనందిస్తాన్రా ' అని .." అంటూ ఓరగా ఆయన కేసి చూశాడు.
"ఏంటీ ఇవన్నీ మీ పల్లెల్లో పెళ్ళికి మాకూ అందుతాయా! ఐతే మాకీ నగరంలో కాకుండా పల్లెలోనే పెళ్ళి చేయించమని చెప్పండి" అంటూ ఆశగా చూశాడు బలరామ్మూర్తి వైపు.
"చిన్నగా అడుగుతారా! పెళ్ళి కుమారుల తండ్రి గారు మీరిలా అడిగితే కాదనే ధైర్యం మాకెక్కడిదీ !తప్పక అలాగే మాపల్లెలోనే వివాహం జరిపిస్తాం. నేనిప్పుడు చెప్పినవి కొన్నే నండీ బాబూ! మాకు కరెంటు అవసరమే లేదు. పెళ్ళి చక్కగా , హాయిగా , ఏ ఇబ్బందీలేకుండా సజావుగా జరిపించే పూచీ నాదీ! పెద్దముండావాడ్ని నామాట నమ్మండి.కార్బైడ్ మందుతోకాక సహజంగా చెట్టు కే పండించిన మామిడి రసాలు , బంగినపళ్ళూ, కొబ్బరి మామిడీ ఒకటేంటండీ .. మీరు తిని చూడవలసిందే కానీ చెప్తే తీరేది కాదు. సరిసరి పెళ్ళి మాటల కొచ్చి ఏదేదో మాట్లాడు తున్నాను నా చాదస్తం మండా! మాపల్లెపేరు చెప్పగానే నామతి పోతుంటుంది కటిక సత్యాలవైపు ,ఇహ చెప్పండి బాబూ !మీకు కావల్సిన తీరులో పెళ్ళి ఏర్పాట్లు చేయిస్తాను.
ఇహ పట్టీ వ్రాసుకుందామాండీ! మేం మ ళ్ళా మా బాబయ్య ఇంటికి భోజనానికి వెళ్ళాలి.." అన్నాడు బలరామ్మూర్తి సందర్భోచితంగా సమయం చూసుకుంటూనూ. నాగేశం " భలేవారండీ !మధ్యవర్తులుగా వచ్చిన మీకు భోజనం పెట్టకుండా పంపుతామా! లోపల ఆఏర్పాట్లేవో అవుతున్న ట్లున్నా యి. ఉండండి ఇప్పుడే వస్తాను " అంటూ లోని కెళ్ళి చూసి వచ్చి "రండి వడ్డిస్తున్నారు . భోంచేస్తూ కొన్నీ , ఆ తర్వాత కొన్నీ మా ట్లాడు కుందాం." అంటూ వారిని భోజనానికి ఆహ్వానించాడు. వంకాయ కూర వడ్డించగానే తిరగేసీ మరగేసీ చూస్తూ "మరోలా అనుకోకండి కానీ నిన్నమా వినాయక రావింట్లో చెల్లెమ్మ నేరుగా తోటనుంచీ కోసుకొచ్చి నట్లుంది , గుత్తొంకాయ చేసిందీ ! ఏం రుచోనండీ బాబూ ! కాయ మీద కాయ లేపి ఆయాస పడ్డాను. తోట కాయల రుచండీ!" --- అనగానే, "మరైతే పెళ్ళికి ఒకటి గుత్తొకాయ కూర ఫిక్స్డ్ "అన్నాడు నాగేశం.
"చాలా సంతోషమండీ ! తోటనుంచీ కోయించి తెప్పిస్తాను."అని భరోసా ఇచ్చాడు బలరామ్మూర్తి . అలా వారిని మురిపిస్తూ , మరిపి స్తూ భోజనం పూర్తయ్యేలోగానే మెనూ తో పాటుగా పిండివంటలూ, టిఫిన్లూ అన్నీ వారిచేతనే చెప్పించేసి, భోజనం కాగానే వారిచేతే రెండు లిస్టూలు రాయించేసి " మరేమను కోకండి బాబూ ! మా వామనరావ్ నన్ను నమ్మాలంటే మీరు ఈరెండు పట్టీల మీదా కాస్తంత సంతకం గీకండి , మా వాడు సాక్షి సంతకం గీకుతాడు. లేపోతే వాడొక పట్టాన నమ్మడు , చాదస్తుడు, సాంప్రదాయ వాదీ నీ." అంటూ సంతకాలు కూడా చేయించేశాడు. కొత్త కోడలు తెచ్చే పిండి వంటల్లో కొన్ని తగ్గించి, మామిడి పండ్లూ, కొబ్బరికా య లూ, తాటిముంజలూ చేర్చాడు కూడాను. పెళ్ళిఏర్పాట్లు ఎలా చేయడమో సైతం వారిమనస్సులు మురిపించాక అదీనీ రాయిం చే సి సంతకాలు గెలికించేసి, ధన్యవాదాలు చెప్పించేసుకుని , అన్నింటీకీ ఒప్పించేసి లేచొచ్చేశాడు బలరామ్మూర్తి.
వివాహం రోజు రానే వచ్చింది. మగపెళ్ళి వారందరినీ రోడ్డుమీద బస్సు దిగంగానే ,తాటాకు చాపలు క్రింద కూర్చోనూ , పైన గూడు గా నూ ఏర్పరిచిన రెండెడ్ల బండ్లలో పిల్లలూ పెద్దలు సైతం మహదా నందపడుతూ నవ్వుకుంటూ , కేరింతలు కొడుతూ వచ్చి దిగారు. దారిలో మామిడి, కొబ్బరి, తాటి తోటలు చూస్తూ కేకలేస్తున్న పిల్లలను పెద్దలంతా చూస్తూ ఊర్కున్నారు. పిల్లలంతా వారి జన్మల్లో అదే మొదలు పల్లెలూ వాటి సొగసులూ చూడటం. విడిదిలో దిగ్గా నే పచ్చితాటాకు పందిళ్ళు చల్లగా ఆహ్వానించగా, కొబ్బరి మట్టలు కట్టిన గుంజలు, మామిడాకుల కమ్మని తోరణాల వాసనా పెళ్ళివారి మనస్సులను మెస్మరిజం చేశాయి. చుట్టూతా తడి చీరలు చుట్టి న కొత్త మట్టి బానల్లో నీరు కమ్మగా వారి పొట్టల్లో దిగు తుండగా అంతా తెగత్రాగసాగారు.
“ఆగండాగండి .నీళ్ళతోనే పొట్టలు నింపేసుకుంటే మా కొత్త బెల్లం పానకమూ, కొబ్బరి కాయ నీరూ, తాటిముంజలూ ఎవరు తినేట్లు ? " అంటూ వారిని ఊరించాడు బలరామ్మూర్తి. కొత్త తాటాకు చాపలు పరిచిన పందిట్లో స్వయంగా పిలిపించి దగ్గరుండి అల్లించిన తాటా కు విసిని కర్రలూ, గంపలూ , చాపలూ , లాంటి వాటివల్ల ఎంతోకాలం,గా పనిలేక వృత్తి వదలి కూలిపనుల్లో కెళు తున్న వా రంతా పందిళ్ళూ విసిని కర్రలూ నేసే వృత్తి పనివారూ, కులాలులూ చేతులెత్తి మొక్కారు. విసిని కర్రలన్నీ పెద్దపెద్ద మట్టి తొట్లలో నాన బెట్టి పిలల్లకూ పెద్దలకు తలోటీ ఇవ్వగానే వాటి అల్లికకు ఆనందిస్తూ , ఆకమ్మని వాసనను ఆహ్లాదిస్తూ అంతా ఎవరికి వారు విసురు కుంటూ కూర్చున్నారు. ఫ్యాన్లూ, ఏసీలు, కరెంటూ విషయమే మర్చిపోయారు. అడిగిన వారికీ అడగని వారికీ ప్రతి ఒక్క రికీ కొట్టి కొబ్బరి మట్టలతో పీకల్లా చుట్టిన స్ట్రాస్ వేసి అందిస్తుంటే తమ నగరంలో 30, 40 రు, ఈ మేనెల్లో ఇంకా ఎక్కువా పెట్టి కొని అపురూపంగా త్రాగే కొబ్బరి బోండాలు గుర్తొచ్చి మహా ఆర్తిగా త్రాగ సాగారు. అలా ఒకటేంటి అందరినీ మురిపించేసే ఏర్పాట్లు, మల్లెల మాలలూ, తినుబండారాలూ , కొబ్బరుండలూ, నిప్పట్లూ , అన్నీ అదిరిపోగా మహార్భాటంగా చేసిన ఏర్పాట్లు పెళ్ళివారిని ఎండల నుంచీ మరిపించాయి. రాత్రికి పెళ్లనగా ఏర్పాటు చేసిన పెట్రో మాక్స్ లైట్లు సినిమాల్లో తప్ప చూడని పిల్లాజల్లా చుట్టూ చేరి చూస్తుం డ గా చక్కగా వివాహ వేడుకలన్నీ జరిగిపోయాయి.తెల్లారు ఝాముకు అప్పగింతలు , చేసేస్తుంటే అప్పుడే పెళ్ళైపోయిం దాని మగ పెళ్ళి వారు ఆశ్చర్యంగా సాగగా ,ఆడపెళ్ళివారు వేసవి తాపం లో , అది తెలీకుండా బలరామ్మూర్తి చేసిన ఏర్పాట్లకు , పెళ్ళి నిర్వి ఘ్నంగా సాగినందుకు వినాయక రావు కుటుంబమంతా , బల రామ్మూర్తి కి ధన్యవాదాలర్పించారు. ఒక్క చుక్కనీరు వృధాకానీ కుండా , పదార్ధాలు వ్యర్ధం కానీ కుండా కరెంటు లేని-[ కోత ] గ్రామం లో పెళ్ళి మగ పెళ్ళివారిస్మృ తి లో నిల్చిపోయేలా , నగరంలో పెళ్ళి ఏర్పాట్లకి లక్షలు ఖర్చుకానీకుండా జరిపించినందుకు అంతా ఆనందించారు. బాపేశం మాత్రం అటునుంచీ నరుక్కొచ్చిన బలరామ్మూర్తి తెలివి తేటలకు అబ్బుర పడకుండా ఉండలేక పోయాడు.