పురంధరుడు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

purandharudu

రాత్రి భోజనాలవేళ.

"అమ్మాయ్..పార్వతీ..మన అగ్రహారంలో ఉండే నోరివారి సంబంధం గురించి ఇవాళ ఉదయం విష్ణుశర్మ ప్రస్తావించాడు. ఇప్పటిదాకా సంబధం విషయంగా చర్చకు రాలేదుగాని, వాళ్ల గురించి మనకు తెలిసిందే. ఛాందసులు..నిత్యాగ్నిహోత్రులు..నిప్పులు కడిగే వంశం. వాళ్లు నిన్ను చాలాసార్లు చూశారట. తమింటి కోడలిగా చేసుకోవాలని ముచ్చట పడుతున్నారని విష్ణుశర్మ గారే చెప్పారు. నీ ఇద్దరు అక్కయ్యల్లో పెద్దామెని ఇంజనీర్ కి, రెండో ఆమెని డాక్టరుకి ఇచ్చి చేశానన్నది తెలిసిందే! నువ్వూ వాళ్లలా సుఖ పడేలా చక్కటి సంబంధం చూసి చేద్దామనుకున్నాను,

కాని వాళ్లిద్దరికి పెళ్లిల్లు చేసేసరికి ఆస్తి హారతికర్పూరమైపోయింది. జవసత్వాలు కూడా ఉడిగిపోతున్నాయి. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఒకరకంగా నా మొరాలకించిన భగవంతుడు చూపించిన సంబంధమే ఇది. నిత్య దేవతార్చనల్లో మునిగితేలే ఆ ఇంట్లో నువ్వు మడి ఆచారాలతో నలిగిపోతావని నాకు తెలుసు. అంతేకాదు రేపు పెళ్లంటూ అయితే సినిమాలు షికార్లులాంటి సరదాలకు నిన్ను తిప్పే ఆసక్తి అతనికి ఉంటుందో ఉండదో, ఒకవేళ ఉన్నా ఆ ఉమ్మడికుటుంబంలో అలా చేయలేకపోనూ వచ్చు. ఇవన్నీ నీకెందుకు చెబుతున్నానంటే ఈ ఆలోచనలన్నీ నా మనసులో తర్కించుకున్నాకే నీతో ప్రస్తావిస్తున్నాను. నువ్వు ఇవాళ రాత్రంతా ప్రశాంతంగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా! నువ్వు అవునన్నా, కాదన్నా నాకు సమ్మతమే! బలవంతపెట్టను. మంచి సంబంధం కోసం మరింత కాలం ఆగుదాము. నాకు మీ ముగ్గురూ సమానమే..ప్రాణమే! కాకపోతే ఆ ఇద్దరికీ పెళ్లిల్లు చేయడంవల్లనూ, ఇంట్లో అనూహ్యమైన కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవడం వల్లనూ ఆర్ధికంగా నేను కొంత కుంగిపోయిన మాట వాస్తవం. అందుకే ఇంత మీమాంస. ఆడపిల్లలు ఇట్టే ఎదిగిపోతారు..నా అసమర్ధత ఎక్కడ నిన్ను కన్యగా మిగిల్చేస్తుందో అని బెంగ. అయితే నా స్థితి గతులు నీకు ఎరుకపరచాలని ఈ పరిస్థితులన్నీ ఏకరువు పెడుతున్నాను తప్ప పెళ్లి విషయంలో నిన్ను రాజీపడమనడం లేదు. నీకు నచ్చితేనే పెళ్లి" అని కూతురి వంక చూస్తూ చెప్పి భోజనం చేయడంలో నిమగ్నమయ్యారు వేదాచలంగారు.


పార్వతి ఆలోచనలో పడింది. ‘నిజమే! పాపం నాన్న అక్కలిద్దరి పెళ్లిల్లు చేశాక ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఆయన మానసిక బాధ తను చూస్తూనే ఉంది. నాన్న చెప్పిన అబ్బాయి పురంధరుడు అందగాడు. బాగానే చదువుకున్నాడటగాని ఉద్యోగం రాకపోయేసరికి ఇహ సమయం వృధాచేయకుండా తండ్రి పౌరోహిత్యానికి వారసుడయ్యాట. శ్రీ వేణుగోపాలస్వామి గుడిలో పూజలు అర్చనలు, ఇళ్లకు వెళ్లి పిల్లల బారసాలలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెళ్లిల్లూ చేయిస్తాడట. ఏ కార్యక్రమం చేసినా ఒద్దికగా చేయడమేకాకుండా అందులోని పరమార్థాన్ని విడమరచి చెప్పి సంతుష్టి పరుస్తాడట. ఈ విషయం ఆనోటా ఆనోటా తను వింది. అందుకే అతను కార్యక్రమాల నిర్వహణకు ఒక పట్టాన దొరకడు. అందువల్ల చాలా ముందుగానే అతన్ని కుదుర్చుకుని మిగతాపనులు చేసుకుంటారట ఊరివాళ్లు. ఇది ఒక పార్శ్వం. మరోపార్శ్వంలో అందరూ తెల్లారకుండానే లేవాలి. ఎలాంటి వాతావరణం ఉన్నా చన్నీళ్ల స్నానాలు చేసి మడికట్టుకోవాలి, పూజలు, పునస్కారాలు, జపాలు, హోమలు..ఓహ్ అదో ప్రపంచం. అక్కలేమో బారెడు పొద్దెక్కాక కానీ లేవరు. ఇంట్లో పని మనుషులు. సాయంకాలం పూట సరదాగా సినిమాలు హికార్లు. పురంధరుణ్ని కట్టుకుంటే గానుగెద్దు జీవితం అయిపోతుంది. కాని తండ్రికోసం ‘ఊ’ అనాలి తప్పదు. బాధను మనసులోనే అదిమిపట్టాలి. అంతే! రాతనెవరు తప్పించగలరు?’ భోజనం ముగించి పక్కమీదకు చేరినా ఆలోచనలు ఆమెను సతాయిస్తూనే ఉన్నాయి.

మరుసటిరోజు-
"నాన్నగారూ! నాకీ సంబంధం ఇష్టమే! పెద్దక్క పెళ్లి చేసుకుని హైద్రాబాదు వెళ్లిపోయింది. చిన్నక్క పెళ్లయ్యాక వైజాగ్ వెళ్లిపోయింది. ఇహ భవిష్యత్తులో అమ్మలేని మిమ్మల్ని చూసుకునేది ఎవరు? ఉన్నఊళ్లో సంబంధమైతే ఎంచక్కా మీకు దగ్గరగా ఉండొచ్చు. అంతేకాదు నోరివారి మంచితనం గురించి అందరకూ తెలుసు. వాళ్లింటికి కోడలిగా వెళ్లడమంటే ఒకరకంగా అదృష్టమే!"అంది.

ప్రశాంతమైన ఆమె మోమును చూసి అది ఆమె మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమేనని గ్రహించి సంతోషించారు వేదాచలంగారు. పెళ్లిచూపులు, నిశ్చయతాంబూలాలు నిర్విఘ్నంగా జరిగిపోయాయి.

ఐదురోజుల పెళ్లి కనులపండువగా జరిగింది. తాళి కట్టేప్పుడు తన మెడమీద పురంధరుడు కావాలని గిలిగింతలు పెట్టడం, బిందెల్లోంచి ఉంగరాలు తీసేప్పుడు తన వేళ్లతో ఆమె చేతిపై గిలిగింతల వీణ వాయించడం, పూబంతాట ఆడేప్పుడు ఎక్కడ ఆ బంతి తగిలి తన శ్రీమతి లేత శరీరం కమిలిపోతుందో అన్నట్టు సుకుమారంగా, అలవోకగా బంతెయ్యడం..భర్తలోని సరసుడు తనపట్ల చూపించిన ఆరాధనీయతకి ఆమె వశమైపోయింది.

మొదటిరాత్రి.

శోభనంగది పూలతో, పళ్లతో అదంగా ముస్తాబుచేసి ఉంది. ఆ గదికి ఓ వైపు విశాలమైన కిటికి తెరిచిఉంది. కిటికీకి ఆ వైపు రకరకాల పూలమొక్కలు మొత్తంగా విరిసిన పూలతో ఆహ్లాదం కలిగిస్తున్నాయి. వాటి సువాసనలు ఆ ఇద్దరి మనసుల్లో మధురభావనలు రే॑కెత్తిస్తున్నాయి. ఆకాశంలో పరిపూర్ణాకృతినొందిన చంద్రుడు చల్లని వెన్నెలను కిటికీలోంచి ఆ గదిలోకి గుమ్మరిస్తూ వాలకు సహకరించే ప్రయత్నం చేస్తున్నాడు.

"పార్వతీ, చిన్నప్పట్నుంచీ నువ్వంటే నాకు ప్రాణం. నిన్నెంతగా ఆరాధించానో చెప్పలేను. అమ్మవారి నిత్యపూజలో నేను కోరుకునే ఒకే ఒక్క కోరిక ఏవిటో తెలుశా? నిన్ను నా దాన్ని చేయమని. ఎప్పుడైతే మీ ఇద్దరు అక్కల్నీ ఇంజనీరు, డాక్టర్కీ ఇచ్చాడో ఇహ నా కోరికకు నీళ్లొదిలేసుకున్నాను. మానసికంగా మదనపడిపోయాను. కానీ తర్వాత పాపం ఆయన ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని ఏదో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారనీ తెలిసింది. మళ్లీ నా ఆశకు రెక్కలు మొలిచాయి. ఇహ ఆలస్యం చేయకుండా మా వాళ్లతో విషయం విష్ణుశర్మ గారికి చెప్పించాను. అంతకష్టపడితే కానీ ఇంత అద్భుతాన్ని సొంతం చేసుకోలేకపోయాను"అన్నాడు చిన్నగా నిట్టూరుస్తూ.

"మరి నేనంటే అంతిష్టం ఉన్నప్పుడు రుక్మిణీదేవిని మీ కృష్ణుడు తీసుకుపోయినట్టు లేపుకుపోవచ్చుకదా, ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోడం దేనికి?" అంది కళ్ళు పెద్దవి చేసి.

"నిజమే, కాని నేను నమ్మిన దేవుడు ఎప్పటికైనా పరిస్థితులను నాకు అనుకూలంగా మారుస్తాడని నా నమ్మకం. అలాగే మార్చాడు. పెద్దల అనుమతితో, ఊరందరి మధ్య నిన్ను నా మనసులో శాశ్వతంగా నిలుపుకున్నాను.

అవునా, కాదా?" చిలిపిగా నవ్వుతూ అని-

"తలలో పిలకుందని, మనసులో ఆచారవ్యవహారాలున్నాయని నన్ను తక్కువగా అంచనా వేయకు. నేను పూజించే శ్రీకృష్ణుడి రాసలీలలు నా మనసులో నిత్యం మధురభావనలు రేకెత్తిస్తుంటాయి. అలా అని నేను కృష్ణుణ్నిగాను ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడి అంశను. ఎదురుగా నోరూరించే మృష్టాన్నాన్ని పెట్టుకుని లొట్టలేస్తూ కూర్చునట్టు ఉంది ఇప్పటి నా పరిస్థితి..కోడికూసే లోపు బ్రహ్మచర్యానికి పూలపాతరెయ్యాలి" అని ఆమె దగ్గరగా వచ్చి ప్రణయ షోడశోపచారాలు చేసి, పూలతో అథాంగపూజ, పళ్లతో నైవేదం, వెచ్చని ఆవిరితో హారతిపట్టి ఆమెని సంతుష్టిపరిచాడు. అరమూసిన కళ్లతో, ఓపలేని ప్రణయావేశంతో అతణ్ని కరుణించి విసురుగా, దూకుడుగా వచ్చి గాఢంగా కౌగలించుకుంది. అంతే రెండు వ్యతిరేక ద్రువాలు కలిశాయి. యజ్ఞగుండం శరీరమే, ఆజ్యమూ శరీరమే..యజ్ఞఫలాన్ని సొంతంచేసుకున్నదీ వాళ్లిద్దరే!

కోడికూసే వేళకు అలసిన శరీరాలతో ఆదమరచిన నిద్రలో ఉన్నారు. మధ్యలో మత్తులో మెలకువ వచ్చిన పార్వతి ’భగవంతుడా మన్మధుని నా భర్తగా ప్రసాదించినందుకు కృతజ్ఞతలు’ అనుకుంది.

కొన్నాళ్లకు తన ఇద్దరి అక్కయ్యలకన్నా ఎక్కువ సుఖపడుతున్నది పార్వతే అని గ్రహించారు వేదాచలంగారు. సిటీలో ఉండే ఇద్దరి పిల్లల జీవితాలు ఒత్తిడిమయాలు. అంతా కాలుష్యం. ఏనెల కానెల డబ్బుకోసం చూసుకోవడమే..మధురానుభూతుల్లేని మర జీవితాలు. ఇక్కడ పల్లెటూళ్లో అందరూ అయినవాళ్లే! పురంధరుడి ఆదాయం నిత్యకల్యాణం! బట్టలు పెట్టే వారుంటారు, పసుపు, కుంకుమలు, నిండు మనసుతో భారీ సంభావనలిచ్చేవారుంటారు. అబ్బాయి అమ్మయిని సినిమాలకు, షికార్లకు బైకుమీద పట్నానికి తీసుకెడుతున్నాడు. ఇంట్లో వాళ్లకి కూడా పార్వతి అంటే ప్రాణం. కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకుంటున్నారు. ఇంట్లో పాడీ పంట. పార్వతి సాక్షాత్తు పార్వతీదేవే! ఉత్తరీయంతో ఆనందబాష్పాలని తుడుచుకున్నారు. చేతులెత్తి దేవుడికి దణ్నం పెట్టారు.

***

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి