అమ్మ - పోడూరి వేంకట రమణ శర్మ

amma

విఘ్నేశ్వరుడి విగ్రహం కేసి చూస్తూ విజయ గణపతి మంత్రం జపిస్తున్న రవి ఫోన్ మ్రోగినా పట్టించుకోలేదు. జపం పూర్తీ అవగానే కాలర్ ఐడి చూస్తే తండ్రి రాజారామ్ దగ్గరినుం చని చూసి వెంట్టనే తండ్రికి కాల్ చేసాడు. సాధారణం గా ఇంత ప్రొద్దున్నే ఎప్పుడూ తండ్రి ఫోన్ చేయడు. తండ్రి వెంటనే ఎత్తాడు. రవీ! అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఐసియు లో ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయి. రాజి కి కూడా చెప్పాను . అదికూడా వస్తోంది. 24 గంటలు వరకు చెప్పలే మంటున్నారు. ఓ మాటు స్పృహ వస్తే మిమ్మల్ని ఇద్దరినీ అడిగింది అని చెప్పి మిగతా వివరాలు క్లుప్తం గా చెప్పి ఫోను పెట్టేసాడు ఆయన.

పెల్లుబుకుతున్న దుఖాన్ని అదుపు లోపెట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు రవి. నెల రోజుల క్రితమే తల్లి తండ్రుల వద్ద గడిపి అతను, చెల్లెలు రాజి యుఎస్ తిరిగి వచ్చారు. అప్పటికి తల్లి కి ఏమీ అనారోగ్యం లేదు. పైగా తల్లికీ తండ్రికీ చెకప్పులు దగ్గరుండి తనే చేయించాడు. కాస్తా కూస్తో తండ్రికి చిన్న చిన్న ప్రొబ్లెమ్స్ ఉన్నాయి కాని తల్లికి అనారోగ్యాలు తక్కువె.

గబ గబా పెట్టి సర్దు కుంటూం టే మళ్ళీ ఫోన్ మ్రోగింది. అక్క రాజి బోస్టన్ నుంచి తండ్రి ఫోన్ సంగతి చెప్పి రవికి కూడా టికెట్ తను బుక్ చేసి మెయిల్ పెట్టానని. సింగపూర్ లో కలుద్దామని పెట్టేసింది తను టికెట్ గురించి ఆలోచించే లేదు. బావ కృష్ణ బుక్ చేసుంటాడు. రాజి గొంతుక చూస్తె టికెట్ బుక్ చేసే పరిస్థితి లో ఉన్నట్టు లేదు;

పెళ్లి కుదిరితే ఒడుగు ముహుర్తాలు సుళు వుగా కుదరవని అతని తల్లి గొడవ పడలేక రాజారామ్ గారు ఒడుగు ముహూర్తం పెట్టిస్తే రాజీ తను ఈ మధ్యనే వెళ్లి వచ్చారు.

*** ***

సింగపూర్ మీదుగా బెంగలూరు చేరుకొని అతను, అతని అక్క రాజి అక్కడినుంచి కారు లో తాడిపత్రి చేరుకునే సరికి, తల్లిని డాక్టర్ల సలహా అనుసరించి బెంగుళూరు షిఫ్ట్ చేసే ప్రయత్నం లో ఉన్నారు . అతని తండ్రి, మావయ్యలు.

తాడిపత్రి లోనే ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోం లో తల్లి ని చూసి ఇద్దరూ బాధ పడ్డారు. వాళ్ళు అక్కడికి వచ్చిన నాలుగు గంటలకి ఆవిడ ఒక మాటు కళ్ళు తెరిచి వాళ్ళిద్దరిని గుర్తు పట్టినందుకు తండ్రి తో సహా అందరూ సంతోషించారు. కాని ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. బెంగుళూరు కు మార్చడానికి ప్రయత్నాలు జరుగుతుండగానే ఆవిడ తుది శ్వాస విడిచింది.

*****

బంధువులందరి మధ్య తల్లి చనిపోయిన బాధ కొంచెం నివురు గాప్పినా, రవికి దుఖం లోలోపోల రగులు తూనే ఉంది. పెళ్ళికి అవసరపడుతుంది అనుకున్న ఉపనయనం తల్లికి అంత్యక్రియలు చేయడానికి ఉపయోగ పడిందని, కొడుకు చేతిలో ఆవిడకి క్రియలు జరగడం విధి నిర్ణయం అని అందరూ సర్ది చెప్పుకున్నారు.

రవి చిన్నతనం నుంచీ తన తండ్రి, తన తాతగారిదీ, బామ్మ దీ సమ్వత్సర తిధులు చాల శ్రద్ధ గా పె డుతూండడం చూసిన వాడే. ఆ పదిరోజులూ చాలా శ్రద్ధ గా అన్ని కార్యక్రమాలు చేసాడు చివరగా పది పదకొండు దినాలు అయిన తరువాత ఆవేళ మొదటి శ్రాద్ధ కర్మ జరుగుతోంది

అగ్నిహోత్రం కార్యక్రమం అయిన తరువాత ఇద్దరు బ్రాహ్మణుల కు భోజన విస్తళ్ళు వేసి వడ్డనలు చేసారు. అందులో ఒకటి పిత్రుదేవతలకి, మరొకటి దైవ మూర్తులకి. పురోహితుడు రవి ని పితృ దేవతల విస్తరి దగ్గర నుంచుని భోక్తకి ఔపోసన ఇమ్మని, ఆతరువాత ఇలా అన్నాడు

బాబూ అమ్మగారి భోజనం అయినతరువాత చిన్న కార్యక్రమం ఉంటుంది. ఆతరువాత మీరు భోజనం చేసేయొచ్చు"
ఆన్నాడు. ఆ మాటలు వినగానే రవి ఒక్క మారు షాక్ తిన్నట్టు అయి కూర్చుండి ఫోయాడు. ప్రొద్దుట నుంచీ ఉపవాసం వల్ల నీరసం వచ్చిందేమో అనుకున్నారు అక్కడ వాళ్ళు.

అలా అయినం దుకు కారణం అతనికొక్కడికే తెలుసు. అది ఎవరితో నూ చెప్పుకునేది కాదు. ముఖ్యంగా ఈ మధ్యనే తల్లి అన్న కొన్ని మాటలు అతని గుండెల్ని పిన్దేసాయి.

ఆ మాటలు చెప్పేముందు అతనికి తల్లి తోటి అనుబంధం వివరిస్తేకాని అవదేమో ప్రత్యేకమయిన కారణాలు లేకపోయినా చిన్నప్పటి నుంచీ రవికి తల్లి తోటీ, రాజీ కి తండ్రి తోటి అనుబంధం ఎక్కువ. ఎక్కడికయినా రెండురోజులువెళ్ళవలసి వచ్చినా తను తల్లి తోటే ఉండేవాడు. రాజి ఎన్నాళ్ళయినా తండ్రితోటే ఉండేది. అతనికి జ్ఞానం వచ్చినప్పటి నుంచీ తల్లి తనని ఎన్నివిధాల కనిపెట్టుకుని ఉండేదో తలుచు కుంటే ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. తన అవసరాలని చెప్పకుండానే గ్రహించి తండ్రి తో చెప్పి అమర్చెది. కొంచెం ఎదిగిన తరువాత కూడా, దూరంగా ఉన్నమంచి స్కూల్ కంటే దగ్గరలో ఉన్న స్కూల్లోనే వెయించెది. మధ్యాన్నం లంచ్ వేడి గా తెచ్చి స్వయం గా తినిపించెది.

అతను మనుషుల్నీ, ప్రకృతినీ గమనించి నప్పుడల్లా ఏంతో ఆశ్చర్యం కలిగించే విషయం పిల్లల పట్ల తల్లి చూపే ప్రేమ. అది భగవంతుని సృష్టి లో చాలా అద్భుత మయిన విషయ మనిపిస్తుంది. ఎందుకంటే అది మనుషు లకే పరిమితం కాదు. కోతులు కొమ్మలమీద ఎగిరేముందు చిన్న పిల్లలని పొట్టకు అదు ముకుని ఎగరడం, పిల్లులు పిల్లని పలుచోట్ల దాచడం, ఏనుగులు గుంపుగా వెళుతున్నప్పుడు చిన్న పిల్ల ఏనుగు ల రక్షణ చూసుకోవడం వంటివి చూసినప్పుడు, అతను మొత్తం సృష్టి లోనే మాతృత్వానికి ఎవరికీ తెలియని ప్రత్యేకత ఉందేమో అనిపించేది .

అతని దృష్టి లో సృష్టి లో అత్యంత దుఃఖ కరమయిన సంఘటన ఓక తల్లి గర్భ శోకం. మాతృత్వం భగవత్ తత్వానికి అతి దగ్గర అని అతని అభిప్రాయం
పెద్ద చదువుల రీత్యా తను ఊరు వదిలినప్పుడు తప్ప, ఊళ్ళో ఉన్న న్నాళ్ళు, ఎంత లేటయినా తల్లి తన కంటే ముందు భోజనం చేయడం అతనికి గుర్తు లేదు.

యుఎస్ వెళ్లేముందు ఆ మధ్యన కొన్నినెలలు ఇంటివద్దే ఉండి ఓ పెద్ద కంపెనీ కి కన్సల్టెంట్ గా చెసాడు. అతను పనిలోపడి ఒక్కొక్కప్పుడు భోజనానికి లేచేవాడు కాదు.ఎంత లేటయినా అతను బ్జోజనం చేసిన తరువాతే ఆవిడ చేసేది

ఆ రోజు మామూలుగానే చాలా లేటైంది. భోజనం దగ్గర కూర్చుని ఆవిడని అడిగాడు. " అమ్మా నాకంటే ముందుగా నువ్వు ఎప్పుడూ తినవా? అని

"నీకంటే ముందుగా నేను తినాలి అంటే కదా చూద్దాం" అని నవ్వి ఊరుకుంది. దానిలో అంతరార్ధం ఈరోజుదాకా అతనికి తెలియలేదు

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు