కథా చౌర్యం! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Kadhaa Chouryam!

"సార్ మీరు రచయితా?"

చెప్పొద్దూ నాకు మహదానందంగా అనిపించింది. నన్ను నన్నుగా కన్నా రచయితగా గుర్తిస్తే ఆ ఆనందం ముందు అన్నీ బలాదూరే!

"ఆఁ..అవును"

"సార్..మిమ్మల్ని చూస్తుంటే నాకు గొప్ప సంతోషమేస్తోంది. మీ కథలు నవల్లు తెగ చదువుతాను. అరెరె! ఏమి రాస్తారండి. మధ్యతరగతి వాళ్ళ రక్తం..కలలు..ఆశలు మీ కలంలో ఇంకుకు బదులు పోస్తారా ఏమిటి? మా జీవితాలకి జిరాక్స్ లా వుంటాయి. హేట్సాఫ్ సార్!"

ఎదురుగా నుంచుని దేవుడ్ని భక్తుడు పొగిడినట్టు పొగుడుతుంటే ఇబ్బందిగానూ వుంది. ఉబ్బి తబ్బిబ్బయ్యేంత సంతోషంగానూ వుంది.

"మిమ్మల్ని కలుద్దామని... మీ ఎడ్రెస్ కోసం చాలా ప్రయత్నించాను. కాని... ప్చ్... దొరకలేదు... కాని ఆ దేముడు వరమిచ్చినట్టు మీరే ఇక్కడ కనిపించడం ఓహ్!" ఇంకా అతనిలో నన్ను కలసిన ఆనందపు తాలూకు వైబ్రేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

"నేను..ఆ పక్క అపార్ట్ మెంట్ లోకి కొత్తగా వచ్చాను. నీకు సాహిత్యమంటే అంత ఇష్టమైనప్పుడు నువ్వూ రాయడానికి ప్రయత్నించలేదా?" బాగుండదని నేనూ ఓ ప్రశ్న అడిగాను.

"నా పేరు రఘు. ఇక్కడే నా ఫ్రెండ్ వుంటాడు సార్! వాడిని కలుద్దామని వచ్చాను. లక్కీగా మిమ్మల్ని కలిశాను. నాకూ రాద్దామనే వుండేది సార్. చాలా ప్రయత్నించి చాలా చాలా రాసాను... కాని తిరిగొచ్చేశాయి. రచయితలు కావడమంటే బ్రహ్మదేవుడు నుదుటిమీద రాయాలి కద సార్!" సాగర సంగమంలో కమల్ హసన్ లా కొద్దిగా బాధగా అన్నాడు.

"ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు! ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు." అన్నాను.

నాతోపాటు మా ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ కాఫీలయ్యాక... "చూడు రఘూ! నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నీలాంటి అభిమానులిచ్చే సలహాలు సూచనలవల్ల మా రచనల స్థాయి ఇంకా మెరుగవుతుంది. అలాగే నువ్వూ రాయడం నేర్చుకుందువుగాని." అన్నాను.

"మీరెంత మంచివారండి. రాతల్లో కనిపించే మంచితనమంతా మీదేనన్నమాట... చాలు సార్ నాకీ తృప్తి చాలు." అని వెళ్ళిపోయాడు.

***


ఆ తర్వాత మా మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది.

తనకెప్పుడు సమయం చిక్కినా నా ముందు వాలేవాడు. నేను రాసినవి చదివే మొదటి పాఠకుడయ్యాడు. అంతకు ముందు ఆ స్థానం మా ఆవిడది. తను మా స్నేహానికి కుళ్ళిపోతోంది. భార్యకన్న అభిమానే ముఖ్యమయ్యాడు నాకు. ఇంటికి సంబంధించిన పనులు కూడా చక చక చేసేవాడు. అంచేత రాన్రాను మా ఆవిడ మార్కులూ కొట్టేశాడు.

‘కథలకి సబ్జెక్ట్ ఎలా ఎంచుకోవాలి? తర్వాత పాఠకులకి ఆసక్తి కలిగించే విధంగా ఎలా అక్షరాల్లో పెట్టాలి’ అనేది నేర్పించేవాడిని. ఒక్కోసారి నా కథలు ఫెయిర్ చేయించేవాడిని.

***


ఒకరోజు సాయంత్రం రఘు పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ "సార్ అక్షర జ్యోతి పత్రిక వాళ్ళు దీపావళి కథల పోటీ పెట్టారు. మొదటి బహుమతి అక్షరాల పదివేల రూపాయలు. ఈ పత్రికలో రచన పడ్డమే ఓ అవార్డ్. అలాంటిది మొదటి బహుమతి పదివేలు సాధించడం. సార్ మీకెలాగన్నా ఆ బహుమతి రావాలి. రావాలేంటి నా ముఖం వచ్చి తీరుతుంది. అంతే!" అన్నాడు.

నేను కథలు చాలా రాశాను కాని కథల పోటీల్లో మాత్రం పాల్గోలేదు. దానికి పెద్ద కారణం లేదు. నాకెందుకో నచ్చదు. అదే విషయం రఘుతో చెప్పాను.

"లేదు సార్! ఈసారి మీరు కథ రాయాలి. పోటీలో పాల్గోవాలి. ఫస్ట్ ప్రైజ్ రావాలి." అన్నాడు దృడంగా.

అంతేకాదు కలిసినప్పుడల్లా అదే అడిగేవాడు. నాకోసం అతనంత తాపత్రయం పడడం నన్ను ఏదో ఉద్వేగానికి గురిచేస్తోంది. "పాపం రఘు కోరిక తీర్చండి. అయినా పాల్గొంటే మీకేగా పేరూ డబ్బొచ్చేది. రఘుకి ఏమొస్తుంది? మీ అభిమానిగా మానసిక తృప్తితప్ప." అని మా ఆవిడ కూడా వెంట తగిలింది.

ఇహ లాభంలేదని. మూడు నాలుగు రోజులు తీవ్రంగా ఆలోచించి ఒక చక్కటి సబ్జెక్ట్ సిద్ధం చేసుకున్నాను. రఘు ఆనందానికి అవధిలేదు. "సూపర్బ్ సార్! మంచి సబ్జెక్ట్! ఖచ్చితంగా మనకే వస్తుంది. త్వరగా రాయండి సార్!" అన్నాడు.

నేను వారం రోజులు శ్రద్ధగా కూర్చుని కథకి చక్కని అక్షర రూపం ఇచ్చాను.

"రేపు పంపించేద్దాం!" అన్నాను.

"ఇలా కాదు సార్! నా ఫ్రెండ్ కి ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఇది డి టి పి చేయించి. స్పైరల్ బైండింగ్ చేయించి నేనే పోస్ట్ చేస్తాను. మన ప్రయత్నం పత్రికల వారిని ఆకట్టుకోవాలి. అంత గొప్ప బహుమతికి ఈ మాత్రం శ్రమ అవసరమే కద సార్!" అన్నాడు.

నాకూ నిజమే అనిపించింది. పాపం రఘు ఎల్లప్పుడు నాతో లక్ష్మణుడిగా... ఆంజనేయుడిలా... ఇప్పుడిలా ఉడతా భక్తితో... వాడికిచ్చాను.

ఆ తర్వాత రెండురోజులకి వచ్చి డి టి పి అయిపోవచ్చిందని చెప్పాడు.

మరో రెండు రోజుల తర్వాత వచ్చి పోస్ట్ చేసేయడం కూడా అయిపోయిందని చెప్పి... "సార్ నేను అర్జెంట్ గా ఊరెళ్ళాలి మా అమ్మకి ఒంట్లో బాగుండలేదట" అన్నాడు దిగులుగా.

"అయ్యో అలాగా సరే జాగ్రత్తగా వెళ్ళిరా" అన్నాను.

***


రఘులేని లోటు మాకు స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఇదివరకులా రాయలేకపోతున్నాను. ఆఫీసుపనిమీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాను.

ఒకసారి నేను మా ఫ్రెండ్ రామారవు ఇంటికెళ్ళాను. అక్కడ టీపాయ్ మీద రెండువారాల క్రితం విడుదలైన అక్షర జ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక కనిపించింది. ‘అరే నేను కష్టపడి రాసిన కథ పంపించింది ఈ పత్రిక నిర్వహించిన కథల పోటీకే కద. అసలెలా మర్చిపోయాను?. పాపం రఘు నాకు బహుమతి రావాలని ఎంతో తాపత్రయ పడ్దాడు కూడా!’ అని పత్రికని చేతిలోకి తీసుకుని షాక్ కి గురయ్యాను. కథల పోటీలో ఫస్ట్ ప్రైజ్ నా కథకే వచ్చింది. కాని పేరు రఘూదుంది. పక్కనే నవ్వుతున్న ఫోటో. తనురాసిన మొదటి కథకే ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు ప్రస్తుతిస్తూ ఇంటర్వ్యూ.

"అచ్చు నువ్వు రాసినట్టే చాలా బాగా రాసాడురా ఆ కొత్త రచయిత." అన్నాడు రామారావు.

ప్రచురించిన కథలు కాపీకి గురవడం తెలుసు కానీ ఇదో కొత్త చేదు అనుభవం. అసలు విషయం ఎవరికీ చెప్పలేను. మోసపోయాను. రచయితగా దారుణంగా మోసపోయాను.

***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ