లలాట లిఖితం - వుయ్యూరు రాజాచంద్ర

lalaata likhitam

పూర్వం వైశాలి నగరం లో సదాశివ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ దేశ రాజుగారు దానంగా ఇచ్చిన పొలంలో నే ఒక చివరగా పర్ణశాల నిర్మించుకుని తన భార్యతో అందులో నివసించేవాడు. ఒక రోజు తూరుపు తెల్లవారనుండగా ఉన్నట్లుండి మెలకువ వచ్చింది సదాశివ శర్మ కి. కళ్ళు తెరిచి చూసాడు. పర్ణశాల లో వెలుగుతున్న నూనె దీపం గుడ్డి వెలుగులో పరిశీలించి చూసాడు. తను ఉంటున్న పర్ణశాల పై కప్పు లో నుండి ఒక గడ్డి పోచ కిందికి పడి ఉన్నట్లుండి నల్ల తాచు పాము గా మారిపోయింది. ఆ పాము పాక్కుంటూ వచ్చి ఆదమరిచి నిద్రిస్తున్న సదాశివ శర్మ భార్య కాలు మీద కాటేసింది. క్షణాల్లో నురగలు కక్కుతూ శర్మ భార్య మరణించింది. కనుల ఎదుట జరిగిన దానిని చూసిన శర్మ కి దుఖం తో పాటూ ఎంతో ఆశ్చర్యం కలిగింది. తన భార్య ని కాటేసిన ఆ తాచు పాము మెల్లగా పాక్కుంటూ పర్ణశాల బయటకు వెళ్ళిపోయింది. శర్మ అలికిడి కాకుండా ఆ పామును వెంబడించ సాగాడు. పాము కొంచెం దూరం పయనించి దగ్గరలో ఉన్న రాజమార్గం చేరింది. రాజమార్గం మీద కొద్ది దూరం పయనించిన తర్వాత ఆ పాము ఉన్నట్లుండి ఒక ఆంబోతు గా మారి ఆ దారి వెంబడి వస్తున్న ఒక యువకుడిని కొమ్ములతో పొడిచి చంపేసింది. తర్వాత ఆ ఆంబోతు ఉన్నట్లుండి ఒక అందమైన పడుచు గా మారి నడవ సాగింది.

అదే సమయంలో ఆ బాట వెంబడే ఇద్దరు రాజు గారి కొలువులో పని చేస్తున్న సైనికులు శెలవుపై తమ స్వగ్రామానికి బయలు దేరి వస్తున్నారు. ఈ పడుచు వారికి ఎదురు వెళ్ళింది. ఆ పడుచుని చూడగానే సైనికులు ఆమెని అడ్డగించి తమలో ఒకరిని పెళ్లి చేసుకో మని బతిమాల సాగారు. ఆ పడుచు వారిని చూసి చిద్విలాసంగా నవ్వి మీరిద్దరూ కత్తి యుద్ధం చేయండి. గెలిచిన వారిని నేను వరించుతాను అని చెప్పింది. చూస్తుండగానే ఇద్దరు సైనికులు కత్తులు దూసి భయంకరంగా పోరాడ సాగారు. కొంచెం సేపట్లో తీవ్ర గాయాలతో ఇద్దరు నేలకు ఒరిగారు. ఆ పడుచు మెల్లగా ముందుకు నడవ సాగింది.

సదాశివశర్మ ఇక ఉండబట్టలేక ఆ యువతి ని సమీపించి నమస్కరించి -- తన ఇంటి లో పాము రూపం లో తన భార్య ని కాటు వేయటం నుంచి అప్పటి దాక జరిగిన అన్ని సంఘటనలను తను కళ్ళారా చూశానని చెప్పి "తమరు ఎవరు? ఈ వింత ఏమిటి ?" అని వినయంగా అడిగాడు. ఆ యువతి శర్మ ని పరికించి చూసి "నీకు కొద్దో గొప్పో తపశ్శక్తి ఉన్నందున నన్ను చూడ గలుగు తున్నావు. నేను యమ కింకరుడిని. యమ ధర్మ రాజు వారి అజ్ఞానుసారం ఆయువు తీరిన వారి ప్రాణాలు తీయటం నా విధి. నీవు చూసినదంతా నా విధి నిర్వహణ లో భాగమే. నన్ను అనుసరించే ప్రయత్నం మానుకొని ఇంటికి తిరిగి వెళ్ళు" అని పలికింది. శర్మ చేతులు జోడించి "ఓ మహానుభావా నా మీద దయ ఉంచి నేను ఎలా మరణిస్తానో చెప్పండి" అని అడిగాడు. యువతి రూపం లో ఉన్న యమకింకరుడు "ఇది దేవ రహస్యం నేను చెప్పకూడదు" అని సమాధానం ఇచ్చాడు. అయినా శర్మ పట్టు విడవక పరి పరి విధాలుగా ప్రార్ధించగా "నీకు జల గండం ఉన్నది. ఒక నదిలో మునిగి మరణిస్తావు. ఈ విషయం మరెవ్వరికి చెప్పరాదు" అని చెప్పి యమకింకరుడు అదృశ్యం అయ్యాడు.

ఆ తరువాత శర్మ తన ఇంటికి తిరిగి వచ్చి తన భార్య అంత్యక్రియలు పూర్తి చేసాడు. శర్మ కి యమ కింకరుడు చెప్పిన మాటలే మదిలో మెదల సాగాయి. తన కున్న కొద్దిపాటి వస్తువులనీ మూట కట్టుకొని ఎవరికీ చెప్పకుండా శర్మ వైశాలి నగరం విడిచి పశ్చిమ దిశగా బయలు దేరాడు. కొన్ని రోజుల పయనం తర్వాత మాళవ దేశం చేరాడు. మాళవ దేశం లో చాలా భాగం ఎడారి. ఎడారికి దగ్గరగా ఉన్న నర్మదాపురం చేరుకున్నాడు. అక్క డ శర్మ కు ఒక జమీందారు పరిచయం అయ్యాడు. జమీందారు శర్మ ని తన దివాణం లో ఉద్యోగం లో పెట్టుకున్నాడు. అలా కొంత కాలం గడిచింది. ఆ జమీందారు గారికి వివాహం అయి చాలా కాలం అయినా వారికి సంతానం లేదు. శర్మ ఆయన దివాణంలో చేరిన కొద్ది నెలల తరువాత జమీందారు గారి భార్య గర్భవతి అయి పండంటి బాలుడి కి జన్మనిచ్చింది. బాలుడు క్రమక్రమం గా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. శర్మ తమ దివాణంలో అడుగు పెట్టిన వేళా విశేషం వలన తమకు సంతానం కలిగిందని నమ్మిన జమీందారు తన కుమారుడి బాగోగులు చూసే బాధ్యత ని శర్మకి అప్పగించాడు. శర్మ జమీందారు గారి కుమారుడికి చదువు చెప్పే బాధ్యత స్వీకరించాడు.ఆ బాలుడు పన్నెండు సంవత్సరాల ప్రాయుడు అయ్యాడు. ఒక రోజు జమీందారు శర్మ ని పిలిచి తమ దేశానికి సరి హద్దు లో ఉన్న నర్మదా నదికి పుష్కరాలు జరుగు తున్నాయి కనుక తాము అందరమూ బంధు మిత్ర సమేతంగా పుష్కరాలకు పోతున్నాము మీరు కూడా మాతో రండి అని ఆహ్వానించాడు. శర్మ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. తాను అంత దూర ప్రయాణం చేయ లేనని తనని మన్నించమని జమీందారు కి సవినయంగా మనవి చేశాడు శర్మ. గురువుగారు రాక పొతే తాను కూడా పుష్కరాలకు రానని జమీందారు కొడుకు మొండికెత్తాడు. దీంతో జమీందారు శర్మని పిలిచి మీరు రాక పొతే నా కుమారుడు రాడు, మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు పుష్కరాలు రావు. మీరు రానందున మా కుమారుడు, వాడు లేకుండా మేమూ పుష్కరాలకు వెళ్ళ లేము. మాకు పుష్కర స్నాన పుణ్యం దక్కకుండా పోవటానికి మీరు కారకులు అవుతారు- మీరు రా వలసిందే అని జమీందారు గట్టిగా చెప్పటం తో దిక్కు తోచక శర్మ సరే అనవలసి వచ్చింది.

తప్పని సరి పరిస్తితులలో జమీందారు గారి వెంట వారి పరివారం తో శర్మ నర్మదా నది పుష్కరాలకు బయలు దేరాడు. కొన్ని రోజుల ప్రయాణం తరువాత నదీ తీర సమీపం చేరుకున్నారు. అక్కడ గుడారాలు వేసుకుని వంటా వార్పూ చేసుకున్నారు. మర్నాడు ఉదయం నదీ స్నానానికి బయలు దేరారు. శర్మ తాను రానని గుడారం లోనే ఉండి పోతాననీ చెప్పాడు. గురువు గారు రాక పొతే తాను కూడా నదీ స్నానానికి రానని జమీందారు కొడుకు పట్టు పట్టాడు. నదీ తీరం వరకూ వచ్చి స్నానం చేయక పొతే తమ యాత్ర నిష్ప్రయోజనం అవుతుంది గనుక తమ కుమారుడి వెంట నదీ స్నానానికి రావలసిందే నని జమీందారు ఆయన బంధువులూ ఒత్తిడి చేసారు. మీకు నీరు అంటే భయం ఐతే మా దివాణం లో గజ ఈత గాళ్ళు ఉన్నారు. వారు కూడా మనతో వచ్చారు. మీకు ఏ భయమూ లేదు రండి అనటంతో ఇక చేయ గలిగింది ఏమీ లేక శర్మ జమీందారు కొడుకు చేయి పుచ్చుకుని నది వడ్డుకు వెళ్ళాడు. జమీందారు కొడుకు, అతడి చేయి పట్టుకొని శర్మ నది లో దిగి కొన్ని అడుగులు వేసారు. అంతలో ఉన్నట్లుండి జమీందారు కొడుకు ఒక మొసలిగా మారి శర్మ కాలుని నోట కరుచుకుంది. శర్మని నీటి లోపలి తీసుకెళ్తూ మొసలి ఇలా అన్నది-----" ఓయీ పిచ్చి శర్మా - నీ మరణ రహస్యం చెప్పిన కారణాన యమధర్మరాజు కోపించి నీ ప్రాణాలు తీసి తెచ్చే బాధ్యత నాకు అప్పగించాడు. నీ ప్రాణాలు తీయటానికే ఈ జమీందారు ఇంట వారి కొడుకు గా పుట్టవలసి వచ్చింది. జల గండం నుండి తప్పించుకోవాలని ఈ ఎడారి దేశానికి పారి పోయి వచ్చినావు. లలాట లిఖితాన్ని తప్పించుకోవటం ఎవరి వల్లా కాదు" అంటూ నదిలోపలికి ప్రవేశించి సదాశివ శర్మ తో సహా మాయం అయి పోయింది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి