రామాపురం ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నందు టిఫిన్ బాక్స్ పోయింది. మధ్యాహ్నం లంచ్ టైం లో ఆ విషయం నందుకి తెలిసింది.
నందు వెళ్లి ఆ విషయం క్లాసు టీచర్ సునందకి చెప్పాడు. ఆవిడ "జాగ్రత్తగా వెతికావా?"అడిగింది.
"వెతికాను టీచర్, అందర్నీ అడిగాను కూడా..కాని దొరకలేదు"బాధగా అన్నాడు.
ఆవిడ వెంటనే ప్రిన్సిపల్ దగ్గర కెళ్లి ఆ విషయం చెప్పింది.
ఆయన స్కూలు ముందున్న గ్రౌండ్ లో పిల్లల్నీ, మాష్టర్లనీ సమావేశ పరచి"తొమ్మిదో తరగతి చదువుతున్న నందు టిఫిన్ బాక్స్ పోయిందట. స్కూళ్లో ఇలాంటివి జరగడం నాకు నచ్చదు. ఎవరు తీశారో, ఇచ్చేయండి. తర్వాత ఎవరు తీశారో తెలిస్తే సీరియస్ గా పనిష్మేంట్ ఇస్తాను."అని ముగించాడు.
అందరు ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు.
దిగులుగా ఉన్న నందు దగ్గరకు వచ్చాడు ఏడవ తరగతి చదువుతున్న శరత్.
"పాపం..నీ టిఫిన్ బాక్స్ ఇంకా దొరకలేదా?..నీది దొరికే వరకు నేను తినకూడదనుకున్నాను. పద నీకు ఇప్పటికే ఆకలేస్తుండుంటుంది. ఇద్దరం నా టిఫిన్ బాక్స్ కలిసి తిందాం"అన్నాడు.
ఇద్దరూ కలిసి భోజనం చేశాక, అక్కడికి కొద్దిదూరంలో ఉండి వాళ్లనే గమనిస్తున్న మాధవరావు మాష్టరు వాళ్లిద్దరినీ ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకెళ్లి మళ్లీ గ్రౌండ్ లో పిల్లల్నీ, మాష్టర్లనీ సమావేశ పరచి "నందు టిఫిన్ బాక్స్ పోయిందని మనందరికి తెలుసు. అందరం ఆ బాక్స్ గురించే తప్ప, నందు ఆకలి గురించి ఆలోచించలేదు. ఒక్క శరత్ ఆ పని చేశాడు. తన టిఫిన్ ని పంచి ఇచ్చాడు. నందు ఆకలి తీర్చాడు. పసితనంలోనే మానవత్వ పరిమళాన్ని వెదజల్లుతున్న ఈ పిల్లాడు రేపు పెరిగి పెద్దై, తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి మంచి పేరు తెస్తాడు. శరత్ మన పాఠశాలలో చదువుతున్నందుకు మనందరం గర్వపడాలి"అని ముగించాడు.
మాష్టరు మాటల్తో స్ఫూర్తినొంది, మానసిక పరివర్తన కలిగి గట్టిగా చప్పట్లు కొట్టారు అందరూ.