కిటికీ చిగురించింది - సువర్చల

kitikeechigurinchindee

ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటితో నాకనుబంధం ఉంది. నాలోని ప్రతి రెమ్మా ఆ ఇంటి పెరట్లో పురుడుపోసుకున్నదే. ఇంటి పెరటినే కాదు ఆ ఇంటివారి మనసులనిండా ఆక్రమించుకున్నాను నేను. అందుకు నాకు గర్వం కూడా. కానీ నేనా గర్వాన్నీ ఆ ఇంటి సభ్యుల, బంధువుల అభిమానాన్ని మరింతగా చూరగొనేందుకే వాడుకున్నాను కానీ, నా స్వార్ధం కోసం కానేకాదు. అంతలా అభిమానం పొందాలనుకోవటం స్వార్ధం కిందకే వస్తుందని మీరంటే నేను స్వార్ధపరురాలినని ఒప్పుకొంటా.

అనుబంధాలను నిలుపుకోవాలనుకుంటే ఈ స్వార్ధం ఉండితీరాల్సిందే! ఈ ఇంటి పెద్దాయన, చిన్నవాడుగా ఉన్నప్పుడు నాటాడు నన్ను. తోడుగా ఆయన భార్య కూడా ఉంది. చిరునవ్వు చెరగని ఇల్లాలు, ఆత్మవిశ్వాసం చెదరని ఇంటాయన..ఆ ముఖాలు నాకిప్పటికీ గుర్తే! అవే నేను మరింత ఆరోగ్యంగా ఎదిగేలా చేశాయి.” మా మామిడి మొక్క” అని ఇంటికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు వాళ్లు ప్రేమగా చూపిస్తుంటే, ఆ ఇంటి సభ్యురాల్ని పరిచయం చేస్తున్నంత ఆనందం నాకు. పండుగ వచ్చిందంటే ఆ ఇంటి గుమ్మానికి తోరణమయ్యేదాన్ని. తెల్లని ముగ్గుతో కళకళలాడే ఆ ముంగిటి గడపకు పచ్చని కిరీటాన్ని నేను. అయిదేళ్లలో .. ముందుగా అమ్మలు, ఆ తర్వాత కన్నడు ఆ ఇంట్లో సందడిని పెంచారు. ఇంత పెద్ద పెరటిలో మూలగా ఉన్న ఆ చిన్ని పెంకుటిల్లు వీరిద్దరి బోసినవ్వులు, దోబూచులు, ఆటపాటలతో శోభాయమానంగా ఉండేది. ఈ ఇల్లాలు పాడే జోలపాట ఇంటి గోడలు కూడా ఆస్వాదించేవి.

ఇక నాబోటి భావుక మొక్కలకు ఆ పాట సరికొత్త జీవనామృతాన్నే ప్రసాదించినట్లు ఉండేది కదా! పిల్లలిద్దరూ నా తోబుట్టువులు అన్న భావం నాకు. ముగ్గురం ఆ ఇంటి పెరటిలో ఆడుకున్నాం. . కన్నడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆ కొంటెదనానికి సరి అన్నట్లు నా రెమ్మలు తలలూపేవి. వాడు ఆడిన కోతికొమ్మచ్చులు? నేనే కదా ఆ ఆటకు భాగస్వామిని!? ఇక అమ్మలు ప్రశాంతమైన మోముతో ఎప్పుడూ కనిపించేది. తనెటు తిరిగితే నేను నా కొమ్మల రెక్కలతో వీవెన వీచేదాన్ని. తమ్ముడి సాయంతో అమ్మలు నా కొమ్మపైకెక్కి కూర్చున్నప్పుడు అక్క ఒడిలో బుద్ధిగా కూర్చున్న చిన్ని పాపాయే అనిపించేది. వాళ్లూ ఆడుతూ, పాడుతూ, చదువుతూ పెద్దయ్యారు. నేనూ ఆడాను, పాడాను.

వాళ్లిద్దరూ నా నీడన కూర్చొని వల్లె వేసిన పాఠాలన్నింటినీ నేనూ నేర్చుకున్నాను. అమ్మలు, కన్నడు పెద్దయ్యారు. నిండుగా, హుందాగా కనిపిస్తున్నారు.. నేనూ కుంకుమ ధరించిన నా లేతగుబురుల చివరలలో పూయటం ఆరంభించాను. ఇంట్లో నిత్యము వసంతమే ఐనప్పుడు ఇక వసంత ఋతువుని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ, ఋతుధర్మాన్ని వీడకూడదు కదా! అందుకే కోయిల కుంజితాలకు నెలవయ్యా.

పూలను పిందె లుగా గా పెంచి ఉగాది పచ్చడిలో భాగమయ్యా. మండు వేసవిలో ఊరటనయ్యా. ఇంటివారికీ, ఇంటికి వచ్చేపోయేవారికీ ఇరుగుపొరుగుకీ తియ్యని ఆహారమయ్యా. అమ్మలుకి పెళ్లి నిశ్చయమైంది. నా చెట్టు మొదళ్లలో ఎప్పుడూ వేసుంచే నవారు మంచం మీద దిండు ఆసరాగా కూర్చొని ఎన్ని కథలో చదువుకున్న అమ్మాయి ఇప్పుడు ఆ పుస్తకాల మధ్య కాబోయే వరుడి ఫొటోని దాచుకొంది. సరికొత్త జీవనానంద పల్లవులు తొడుగుతున్న ఆమె మనసు మధురోహలలో తేలాడుతూ, ఏకాంతంలో కూడా వరుడి ఫొటోని చూడటానికి బిడియపడుతూ..ఏమని చెప్పను!? ఈ ఇంట పుట్టిన నా జన్మ ధన్యం! అవును..తొలకరించే ప్రేమని మూర్తీభవించుకొనే వారిని చూడటం ఎవరికైనా అపురూపమే కదా! ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. అమ్మలు భర్త కళ్లు, అమ్మలుని చూస్తున్నప్పుడ ల్లా వెలుగుతున్నాయి. అంతకన్న ఏం కావాలి!? అతను హాయిగా ఆరగించిన తీయ మామిడిపండ్ల నై నా వాత్సల్యాన్ని అతనిపై చూపించా. రెండేళ్లకి అమ్మలు అమ్మ అయింది. పుట్టిన పాపకు నా కొమ్మ ఉయ్యాల వేసింది. లాలి ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల అంటూ అమ్మలు పాడే అమ్మపాట కి నాలోని మాతృత్వం పెల్లుబికేది. పిల్లలను పండ్లతో పోలుస్తారు కదా! ఇన్ని ఆనందమైన క్షణాలు ఇన్నేళ్లయినాయని నాకు గుర్తుకువచ్చిన క్షణం, నా మనసు గుబులైంది.

నా చెట్టునీడ మధ్యన ఎండపొడ కూడా ఉంటుందని అర్ధమైన క్షణం వచ్చింది, నాకు ప్రాణం పోసిన ఇల్లాలు, ఇంటాయన అమ్మలు పెళ్లికి, కన్నడు పై చదువుకి అయిన అప్పుని తలచుకోవటం విన్నాక! అందరూ పచ్చగా ఉండాలన్న భావంతోనే కదా నేను పచ్చగా ఉండేది!? కానీ ఇప్పుడేమీ సాయంచేయలేని నిస్సహాయురాల్ని! వాళ్లిద్దరూ అతికష్టమ్మీద తీసుకున్న నిర్ణయం నన్ను విభ్రాంతికి గురిచేసింది. ఇంటిని
అమ్మేశారు. వదలలేక వదలలేక వెళ్లారు. వెళుతూ వెళుతూ నన్ను స్పృశించారు. ఇంటిలోని వస్తువులే నయం. వారివెంట వెళ్లే భాగ్యానికి నోచుకున్నాయి. మనసంటూ లేనివాటికి అంతటి భాగ్యమా అని నా మనసు నిట్టూర్చింది. ఆ ఇంటిని కొన్న మనిషి మారిన తరము వాడు. బండబారిన మనసువాడు. పెద్దబంగ్లా కట్టాలని నిర్దాక్షిణ్యంగా నన్ను కొట్టించాడు. ఈ చేస్టతో నిశ్చేస్టనయ్యా. నేనంటూ లేనిదానినయ్యా. అయినా నా మనసంతా ఇక్కడే తిరుగుతూ ఉంది. వదిలివెళ్లమని నా అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉన్నా ఏదో బలీయమైన శక్తి నన్నాపుతూ ఉంది . నన్ను కొట్టేసి పెద్ద బంగ్లా కట్టారు. ఆ బంగ్లా అంతా మూసిఉన్న తలుపులకు, కిటికీలకు నెలవైంది. మూసుంచిన హృదయాలకు కొలువైంది. మునుపటి నవ్వులకోసం, అప్పటి కబుర్లకోసం తహతహలాడిన నాకు నిరాశనే మిగిలింది.

వేదాంతభూమి అంశను నేను. అతీతంగా ఉండాల్సిన సమయాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ! అందుకే అదృశ్యరూపములోనున్న ఓ తపోవనిలా మారిపోయా. కొన్నాళ్లకి..ఒకరోజు ఉదయాన్నే బంగ్లావారబ్బాయి, కోడలు వచ్చారు. నేను నిరాసక్తంగానే ఉండిపోయా. ఒకరోజు బంగ్లా కట్టినాయన కారులో హడావుడిగా వెళ్లబోతూ ఎవరితోనో చెప్తున్నాడు. కొడుకు కోడలు విదేశాల్లో చదువు ముగించుకొని వస్తున్నారని, ఇకముందు ఇక్కడే బిజినెస్ చేయాలనుకుంటున్నారనీ. బహుశ అందుకే వచ్చారు కాబోలు. వాళ్లొచ్చిన మరుసటిరోజు ఉదయమే ఒక విచిత్రం జరింది. ఆ మూల కిటికీ తలుపు తెరుచుకొంది. విస్మయంతో చూస్తుండిపోయాను నేను. కొద్దిసేపటికి ఆ కిటికీలోనుంచి కలకలమని నవ్వులు వినిపించాయి.

మరికొద్ది సేపటికి ఒకరినొకరు ఆనుకొని కిటికీ దగ్గర చేరి బయటి ప్రపంచాన్ని చూస్తూ కనిపించారు. నాలో ఆశ ప్రాణంపోసుకుంది. రోజూ వారిద్దరి సరాగాలు, అలుకలు, ఆహ్లాదపు సంభాషణలు, చిరుకోపాలు నాలో కొత్త ఊపిరిని ఊదాయి. ఋతువు మారింది. జల్లులకాలం మళ్లీ మొదలైంది. ఆ మూల గది కిటికీ దగ్గర చేతులు చాచి వానజల్లుల్ని ఒడిసిపట్టుకునే రెండు అనురాగ దాంపత్యపు చేతులు నన్ను తపస్సు నుండి పూర్తిగా మేల్కొలిపాయి. మరికొన్నాళ్లకి .ఆ ఇంట పాపాయి కేరింత వినబడింది. దాంతోబాటు ఉండుండి లాలిపాట వినిపించింది. మరో అమ్మలు ఇక ఆ ఇంట సందడి చేయబోతుందన్నమాట. నేను మళ్లీ జీవం పోసుకున్నాను. చిత్రంగా ఆ మూలనున్న ఆ గది కిటికీ చిగురించింది. అప్పుడర్ధమైంది నాకు.. ఇల్లంతా టేకు కలపనే తలుపులకు, కిటికీలకు వేయించాడు తరము, మనసు మారిన యజమాని. ఆ క్రమంలో మూలనున్న ఈ పడకగది కిటికీకి కలప తక్కువ పడింది.

అప్పుడు వండ్రంగి, యజమానిని ఒప్పించి అక్కడే పడిఉన్న నా చెట్టు కలపతో ఆ కిటికీ తయారుచేశాడు. ఇంటివెనుక పైభాగం, పైగా ఓ మూలకి ఉన్న ఆ గది కిటికీ ఎవరికీ కనిపించదులే అని సరిపెట్టుకున్నాడాయన. అదే ఓ నవశకానికి నాంది అవుతుందని కలనైనా ఊహించి ఉండడాయన. ఆ కిటికీ చట్రానికి నా తాలూకు ఓ వేరు ఉండిపోయిందేమో! అదే ఇప్పుడు చిగురించిందన్నమాట. అదే ఇన్నాళ్లూ ఏదో పాశమై నన్ను ఎక్కడికీ కదలనీకుండా చేసింది. అవును..మూలాలు ఎక్కడికీ పోవు. అంతర్లీనగా ఉండిపోయి ఎప్పుడో ఒకప్పుడు బయటపడితీర్తాయి. మరికొన్ని రోజులకి నేనా ప్రాంగణంలో కొత్త రెమ్మలతో కళకళలాడుతూ ఆనందంగా తలలూపుతూ అందరినీ పలకరిస్తున్నా. అవును..నాకోసం ఆ కొద్దిపాటి ప్రాంగణంలోనే టైల్స్ ని తీసేసి నాకక్కడ స్థిర స్థానాన్ని కల్పించి పునర్జన్మ నిచ్చారు ఆ చిన్నదంపతులు! వాళ్లు నన్ను పలకరించినప్పుడు “మీరు లేనిది నేను లేను” అన్నాను. అలా ఎన్నటికీ కాదు. “నీవులేనిదే మేమెవ్వరమూ లేము” అన్నారు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి