అమ్మ ఒడి - నూజిళ్ళ శ్రీనివాస్

amma vodi

అదే పనిగా ఫోన్ మ్రోగుతోంది. ఈ సమయంలో అంటే – శంకరం నుంచే అయ్యుంటుంది.... అనుకుంటూ తీశాను. నా ఊహ నిజమే....”జై శ్రీరాం” అంటూ పలకరింపు, ఆ వెంటనే “మాష్టారూ! మా గుడికి ఎప్పుడొస్తున్నారు?” అంటూ శంకరం నుంచి ఆహ్వానపూర్వకమైన ప్రశ్న. దాదాపు రెండు సంవత్సరాలుగా రొటీన్ గా అదే ప్రశ్న వేస్తున్నా, ఆ గొంతులో ఆప్యాయత, ఉత్సుకత, ఆహ్వానం అత్యున్నత స్థాయిలోనే ఉండడం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది.

“రేపు తప్పనిసరిగా వస్తాను- సాయంత్రం కళాశాల అయిపోయాక...” నా సమాధానం కూడా శంకరానికి రొటీన్ గానే అనిపించి ఉండచ్చు. కాని, ఈసారి నా మాటను నిలబెట్టుకోవాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను.

***

శంకరం మా కళాశాల పూర్వ విద్యార్ధి. తిరు నామం పెట్టుకొని, సంవత్సరంలో ఎక్కువభాగం దీక్షావస్త్రాలు ధరించి, ముఖంలో ఆధ్యాత్మిక తేజస్సు ఉట్టిపడే అపూర్వ విద్యార్ధి. కళాశాలలో చదివిన మూడు సంవత్సరాలు తెలుగు పద్య పఠనం లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి తెచ్చిపెట్టిన అద్భుతమైన కంఠం అతని సొంతం. ఎక్కువగా శెలవులలో ఉండే అతను అందుకు కారణం అడిగినప్పుడు – దేవాలయ దర్శనం కోసమో, చిన్నజీయరు గారి ఆశ్రమ సేవ అనో, గోసేవ కోసమనో చెబుతుండేవాడు. అయితే, తను చదువుతున్న గ్రూపు లో ప్రతి సంవత్సరం ఫస్టు ర్యాంకు తనదే ఉండేది. ఆశ్చర్యకరంగా – ఇంటరు తరువాత ఇంజనీరింగ్ లో సీటు వచ్చినా, సాహిత్యం మీద ఉన్న మక్కువతో బి.ఏ, తెలుగు సాహిత్యం చదివాడు.

విద్యార్ధులందరూ నాకు సమానమే అయినా, తన వ్యక్తిత్వంతో శంకరం నాకు అత్యంత ప్రీతి పాత్రుడయ్యాడు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే, అప్పుడప్పుడూ మాటల సందర్భంగా తను, తన అన్నయ్యతో కలిసి నిర్వహించే ఆధ్యాత్మక కార్యక్రమాల గురించి చెబుతుండేవాడు. నగరానికి దూరంగా ఉన్న ఒక వాడలో ...జీర్ణ స్థితికి చేరుకొన్న ఒక రామ కోవెలను చుట్టు పక్కల వారిని ఒప్పించి తీసుకొని, దానిని శుభ్రం చేయడమే కాక, నిత్య ధూప, దీప, నైవేద్యాలతో పూజాదికాలు నిర్వహిస్తున్నామని ...చుట్టు పక్కల ఉండే పిల్లలను చేర దీసి, వారికి చక్కని నైతిక, ఆధ్యాత్మిక విద్యనూ సాయంత్రం వేళ అందిస్తున్నామని చెప్పాడు. ఒక ఆవును, దూడను – సాకడం కోసం గుడికి దగ్గరలోనే ఒక చిన్న షెడ్డు వేసి, గోశాల లా నిర్వహిస్తున్నామని, వాటి గడ్డి, మేత కోసం ఎప్పుడైనా సొమ్ము అవసరమైతే అడుగుతుండేవాడు. అప్పటి నుంచి తమ దేవాలయం దర్శించమని ఆహ్వానిస్తున్నాడు.

‘అలాగే’ అని అనేటప్పుడు మనస్ఫూర్తిగానే అంగీకరించినా ... ఎందు వల్లనో ఆ భాగ్యం లభించ లేదు. అయినా, ప్రత్యేక పర్వ దినాల్లో సేవలు, కళ్యాణాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పి, తానే స్వయంగా ప్రసాదాలు తీసుకొని రావడమో, ఎవరి చేతనైనా పంపడమో చేసేవాడు... అలా సుమారు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట ఇకనైనా చెల్లించాలి అనుకున్నాను.

***

మరుసటి రోజు సాయంత్రం ఇచ్చిన మాట గుర్తుంచుకొని సకుటుంబంగా బయలు దేరా. ఊరి చివర మిట్ట మీద ఉన్న ఆ దేవాలయ దర్శనానికి. దారిలో నివేదనకు అరటి పళ్ళు తీసుకొని, దేవాలయం చిరునామా వెతుక్కొంటూ వెళ్లాం. మొత్తానికి అక్కడికి సులువు గానే చేరుకో గాలిగాం. చిన్న దేవాలయమైనా... కళగా, వైభోగంతో కనిపించింది. చక్కగా తిరు నామాలు పెట్టుకున్న చిన్న పిల్లలు, యువతీ యువకులు ఒక ఇరవై మంది వరకు కనిపించారు ఆ ప్రాంగణంలో. పిల్లలు ‘నరసింహ శతకం’ వల్లె వేస్తుంటే, యువతీ యువకులు విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తున్నారు. సాధారణంగా సాయంత్రం వేళ క్రికెట్టు ఆడుతూనో, టి.వి. లు సినిమాలు చూస్తూనో గడిపే నేటి యువతకు భిన్నంగా వారిని చూసి ఆనందం అనిపించింది. వివరాలు అడిగితే, దాదాపు అందరూ ఇంజనీరింగో, ఎం బి ఏ నో, డిగ్రీనో చదువుతున్న వాళ్ళే.

అక్కడి వాతావరణం చూసాక, ఇక్కడకు రావడానికి ఇన్ని రోజులు పట్టిందా? అన్న గిల్టీ ఫీలింగ్ మనసును పట్టి పీడిస్తోంది.... అదే విషయాన్ని శంకరంతో చెబితే, “అలా అనొద్దు మాష్టారూ... పూజ్యులు వచ్చినప్పుడే పవిత్ర దినం ..అని రామానుజా చార్యుల వారు చెప్పారు” అంటూ ఒక కథను వినిపించాడు. దానితో నా గిల్టీ నెస్ మరింత పెరిగింది. మేం అక్కడకు వెళ్ళేటప్పటికి సాయంత్రం సేవ చేసి, హారతి ఇస్తున్నారు. మా కళాశాలలో చదివే కొందరు విద్యార్ధినులు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యువతీ యువకులంతా కలిసి తిరుప్పావై లోని పాశురాలు, మంత్ర పుష్పం శ్రావ్యంగా చదివి కార్యక్రమం ముగించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఆ పూజా కార్యక్రమం చూసి తనువు, మనసు పులకరించాయి.

ప్రసాదాలు స్వీకరించాక శంకరం, తాము ఇంతవరకు నిర్వహించిన కార్యక్రమాలను గురించి, ఫోటోలు చూపిస్తూ వివరించడం మొదలు పెట్టాడు. తన అన్నయ్యతో కలిసి పదవ తరగతి చదివేటప్పుడే –‘అమ్మ ఒడి’ అనే సంస్థను ఏర్పాటు చేసాడట. “సనాతన ధర్మమే అమ్మ అని, ఆ అమ్మ ఒడి అందరికీ రక్ష అని, దాని నుంచి ఎవరూ దూరం కాకుండా కాపాడుకోవడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని” శంకరం చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. ఆ తరువాత, అతను చెబుతున్న విషయాలు వింటుంటే గొప్ప దేవాలయాలు, ధార్మిక సంస్థలు, దేవాదాయ, ధర్మాదాయ శాఖలు – వేల కోట్ల వనరులు ఉండి కూడా చేయలేని అద్భుతాలు ఈ యువకులు కేవలం సంకల్ప బలంతో, ఆధ్యాత్మిక శక్తితో ఎలా నిర్వహిస్తున్నారా? అని అనిపించింది.

నిరు పేదలు నివసించే కోలనీలో పాడు బడి, పూజాదికాల నిర్వహణకు దూరమై ఉన్న రామ కోవెలను కేంద్రంగా చేసుకొని, తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో అర్చన, సేవలు ప్రారంభించి, క్రమంగా పిల్లలను చేరదీసి, వారి తల్లి తండ్రులను ఒప్పించి, వారికి భక్తి శతకాలు, నీతి పద్యాలు, భజన పాటలు, కోలాటం మొదలైనవి నేర్పించి, నేడు సుమారు 60-70 మంది కోలాటం ఆడే యువతీ యువకులను తయారు చేసారు. గత 3, 4 సంవత్సరాలుగా జీయరు స్వామి వారి దగ్గర శిష్యరికం చేసి, సశాస్త్రీయంగా కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు, ఇతర క్రతువులు నిర్వహించటం చేస్తున్నారు. ఈ రామ కోవెల తో పాటు, మరో రెండు జీర్ణ దేవాలయాలను కూడా ఎంచుకొని, ఇదె విధంగా చేస్తున్నారు. ప్రధానంగా, సామాజికంగా అనాదరణకు గురై, దేవాలయ దర్శనాలకు కూడా నోచుకోక, సనాతన ధర్మానికి దూరం కావడానికి సిద్ధంగా ఉన్న ఉపేక్షిత వర్గాలనే లక్ష్యంగా చేసుకొని, కేవలం భక్తి కార్యక్రమాలే కాక, వారి పిల్లల లౌకిక విద్య, ఆరోగ్యం, ఇతర నిత్య జీవితావసరాలను తీర్చే విధంగా – అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ – ఒక ఆధ్యాత్మిక విప్లవాన్నే సృష్టిస్తున్నారు – ఈ అన్న దమ్ములు అనిపించింది.

కార్యక్రమాల ఆరంభం నుంచి, నాటి వరకు ఉన్న ఫోటో ఆల్బమ్స్, కర పత్రాలు చూస్తుంటే, ఇన్నాళ్ళు ఈ దేవాలయానికి ఎందుకు రాలేదా? అనిపించింది. పేరు మోసిన దేవాలయాలలోను కనిపించని స్వచ్చమైన భక్తి వాతావరణం, ప్రశాంతత, అక్కడ లబించాయి. ఆధ్యాత్మికత, భక్తి ముసుగులో మాయ గురువులు, దొంగ బాబాలు ఎక్కువై, ధర్మం మీదనే వ్యతిరేకత ప్రబలే పరిస్థితి కనబడుతున్న ప్రస్తుత కాలంలో – సనాతన ధర్మాన్నే ‘అమ్మ’ గా భావిస్తూ, సామాజికంగా వివక్షకు గురై, ఉపేక్షించ బడిన వర్గాలను ఎట్టి పరిస్థితుల లోను అమ్మ ఒడి నుండి దూరం కానీయ కూడదని కంకణం కట్టుకున్న శంకరానికి, అతని అన్నకు మనసు లోనే పాదాభివందనాలు అర్పించాను.

వేయి సంవత్సరాల క్రితమే దళితులకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, అందుకు అవసరమైతే- నరక ప్రవేశాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తానన్న శ్రీ రామానుజాచార్యుల వారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్న శంకరం లో నాకు ఆ రామానుజులే దర్శనమిచ్చారు... భవిష్యత్తులో మరిన్ని జీర్ణ దేవాలయాలలో ధూప, దీప, నైవేద్యాలు జరిపించాలని, గోశాలలు నిర్మించి, ముఖ్యంగా వట్టి పోయిన, వయసు మళ్ళిన గోమాతలకు ఆశ్రయం కల్పించాలని, ఉపేక్షిత వర్గాలకు సనాతన ధర్మ ప్రసాదం అందించాలని తపన పడుతూ అందుకు నిస్వార్ధంగా కృషి చేస్తున్న శంకరం సంకల్పం నెర వేరాలని కోరుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చాను. శంకరం నుంచి సెలవు తీసుకొంటూ, అంత వరకు అడగని ప్రశ్నను అడిగాను అతని కుటుంబం గురించి...చెరగని చిరునవ్వుతో జవాబిచ్చాడు – “నాన్న గారు లారీ డ్రైవర్, అమ్మ గృహిణి – వారి ద్వారానే ఈ భక్తి భావన పెంపొందింది. అన్నయ్య ఎం.టెక్. చేసి, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో పని చేస్తూ, ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు” అంటూ. ఇంతటి సంస్కారులను కన్న శంకరం తల్లి దండ్రులకు మనసు లోనే ప్రణామాలు అర్పిస్తూ శెలవు తీసుకున్నాను – ఒక అనిర్వచనీయ మైన అనుభూతితో.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు