టైలర్ మధు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

tailor madhu

పని మన పొట్టకూటికోసం చేసుకుంటాం. కానీ అది అవతల వాళ్లకు తృప్తి, సంతోషాన్నీ కూడా ఇచ్చేదయితే, ఆ అనుభూతే వేరు...అలా పనిలో తన నిపుణతను రంగరించి రాజమండ్రీలో టైలర్‍గా మంచి పేరు తెచ్చుకున్నాడు మధు.

చాలాకాలం క్రితం విడుదలై సంచలనం సృష్టించిన లేడీస్ టైలర్ సినిమాలో రాజేంద్రప్రసాద్‍లా కర్లీ హెయిర్తో, అందమైన మోముకు అమరిన చక్కటి కళ్లజోడుతో, చూడగానే ఇట్టే ఆకర్షించే॑ చక్కటి రూపంతో తలెత్తి చూస్తే గోదారి, చుట్టూ చెట్లూ, పూలమొక్కలూ ఆహ్లాదంగా కన్పిస్తూండే ఆ అద్దింటి అరుగుమీద కూర్చుని తన కుట్టుపని తను శ్రద్ధగా చేసుకుంటుంటాడు. తనకంత డిమాండ్ ఉన్నా నిండుకుండ తొణకదన్నట్టు నిదానంగా తన పని చేసుకుపోతాడు. అతను లేడీస్ అండ్ జంట్స్ టైలర్, అతని చేత బట్టలు కుట్టించుకోవాలని రాజమండ్రీలో అందరూ క్యూ కడతారు. మధు చేతిపని ఖ్యాతి పక్కూళ్లకూ పాకింది. పనిలో పడ్డాడంటే ఇహ ఈ లోకం తెలియదు. డబ్బు బాగానే సంపాదించినా గోదారి కనిపించే ఆ ఎత్తరుగుల ఇల్లు మారడు..సెంటర్‍కు షాపు మార్చడు.

తపస్సులో ఉన్న విశ్వామిత్రుడికైనా, పనిలోపడిన కార్మికుడికైనా రిమ్మ తెగులు పుట్టించి తాదాత్మ్యతను తప్పించే అప్సరస ఆవిర్బవించడం సృష్టి సహజం.

*****

రమణి!

స్వర్గంలోని స్త్రీల అందం ఊ హించడమే కాని ఎవరూ చూసి ఎరగరు. ప్రబంధాల్లో కవులు అప్సరసల అంగాంగాల పొందికను వర్ణించి కొంతవరకు తాము తృప్తిపడి చదువరులనూ మత్తెక్కించారు. సినిమాల్లో దర్శకులు అతిలోక సుందరిలను పరిచయం చేసి వాల్ల అంగాలని పూలతో, పళ్లతో సరసాలాడించి ప్రేక్షకుల చేత లొట్టలేయించారు. కానీ సృష్టికర్త సకలవర్ణ పూలు, సమస్త సువాసనలు, ఇంద్రధనుస్సు, మెరుపుతీగ ఓపిగ్గా తగుపాళ్లలో కలగలిపి స్వర్గానికి పరిచయం చేయబోయి పొరబాట్న భూలోకంలో ఓ తల్లి ఉదరంలో పిండంగా జారవిడిచి తర్వాత తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడినట్టుగా ఉంటుంది రమణి అందం.

ఆమె అందాన్ని సెల్ ఫోన్లలో బంధించుకుని..మన మొహానికి ఈ జన్మకు ఈమెతో ఎలాగూ కుదిరేట్టులేదు..కనీసం టెక్నాలజీతోనన్నా అందాన్ని కాప్చర్ చేసుకుని, జీవితాంతం అప్పుడప్పుడు చూసుకుని తృప్తి పడదాం అనుకుంటారు.

చిన్నప్పట్నుంచీ బయటకెళితే చుట్టూ మగ ఈగలే!

ఊహ తెలిసిన తర్వాత తన అందం విలువ చక్కగా అవగతం చేసుకుంది రమణి. మగాడిదలను ఆమడదూరం ఉంచడమెలాగో తెలుసుకుని భద్రంగా తన ఒంపు సొంపుల్ని కాపాడుకుంటూ, ఏపుగా పెరగసాగింది. తల్లిదండ్రులు డబ్బున్నవాళ్లు. అంచేత విదేశాల్లో చదువుకుని వచ్చింది. ధిల్లీలో ఉద్యోగం చేస్తోంది. రాజమండ్రీలోని అమ్మమ్మ ఇంటికి వెళదామని తల్లి ఎంత పోరినా పల్లెటూళ్లంటే ఇష్టపడని రమణి ‘ససెమిరా’ అని ఎప్పుడూ వెళ్లలేదు. ఈసారి అమ్మమ్మ పరిస్థితి బాగాలేకపోవడం, ఆవిడ రమణిని చూస్తానని పట్టుపట్టడంతో, తల్లి ‘నువ్వు రాకపోతే నామీద ఒట్టే’ అని పంతం పట్టి రమణిని ఒప్పించింది.

*****

రమణి రాజమండ్రీ చేరింది.

ఆ అందానికి కొబ్బరి చెట్లూ, పక్షులు, గోదారి నివ్వెరబోయాయి. జనాలు నోరు తెరిచారు. ఆడాళ్లు ‘తమ భర్తలు తాళ్లు తెంచుకుని రోడ్డు పట్టకుండా ఏం చేయాలా?’ అని బుర్రలకు పదును పెట్టారు. కన్నెపిల్లలు కుళ్లిపోయారు.

మొదటి రెండు రోజులు అమ్మమ్మ గారం, బంధువుల పలకరింపులతో సరిపోయింది. మూడోరోజు ఇహ ఆ ఇంట్లో బంధించినట్టుగా ఉండలేకపోయింది.

అది గ్రహించింది మామయ్యకూతురు గాయత్రి.

"రమణీ! నీకు ఇక్కడ బోర్ కొడుతోంది కదూ..మన పొలానికి వెళితే అక్కడ పచ్చని చేలు, పని చేసే వాళ్ల హడావిడీ, సరసాలు, చెట్లూ చేమలు, పక్షులు, జంతు జాలం నీకు భళేగా ఉంటుంది. వెళదామా?"అంది.

రమణి ఆనందంగా తలూపింది. మరికొంతమంది అమ్మాయిలు కలిసారు. ఆ విషయం పెద్దవాళ్లకు తెలిసి చక్కటి ఎడ్లబండి ఏర్పాటు చేసారు. అందరూ బయల్దేరారు.

*****

కనుచూపుమేరా కనిపించే తమ పొలాన్ని కళ్లింతలు చేసుకుని చూసింది. పొలం గట్లమ్మట లేగదూడలా పరుగులెత్తింది. చెట్లకి కాచిన కాయల్ని చేత్తో దొరకబుచ్చుకుని తినేసి రుచిని మనస్ఫూర్తిగా ఆస్వాదించింది. ఇన్నాళ్లూ ఊరికి రాకుండా ఏం కోల్పోయిందో అర్థం చేసుకుని బాధపడింది. అందరూ పొలం బావి దగ్గరకు చేరి ముచ్చట్లాడు కుంటున్నారు.

కాసేపు అవీ, ఇవీ మాట్లాడుకున్నాక "పోయిన్సారి కుదర్లేదు గానీ, ఈసారి పెదమామయ్యచేత చెప్పించుకుని మధు చేత పరికిణీ, రవిక కుట్టించుకుంటేనేగాని ఈ ఊరు వదిలి భీమవరం వెళ్లను ఆఁ" అంది మాధవి, రమణి చిన్న పిన్ని కూతురు.

"సర్లే నేను నిన్నే నా రవిక కుట్టే విషయం మట్లాడమని పెద్దమామయ్యకి చెప్పేసాను" అంది రమణి రెండో పిన్ని కూతురు మధులిక.

"నా జాకెట్ గుడ్డ ఇప్పటికే అతని దగ్గర ఉంది..తొందరపెట్టి కుట్టించుకుని వెళ్లాలి" అంది సులోచన, బాబాయ్ ఒక్కగానొక్క కూతురు.

"జాకెట్ కుట్టించుకోవడానికి ఇంత హంగామానా..మా దగ్గరైతే ఎక్కడబడితే అక్కడ ఇవ్వొచ్చు. ఒక్క రోజులో కుట్టిచ్చేస్తారు"అంది రమణి.

"అబ్బా, అలాంటి టైలర్లూ ఇక్కడా బొచ్చెడు మంది ఉన్నారు. కానీ మధు చేత్తో కుడితే ఆ కిక్కే వేరు" తన్మయత్వంతో అంది వెంకులు, గాయత్రి స్నేహితురాలు.

"అవును, చక్కగా ఒంటిని పట్టినట్టుగా, అలా అని బిగుతుగా కాకుండా, ఎక్కడా హెచ్చు తగ్గులు లేకుండా చక్కటి డిజైన్ తో మధు కుట్టిన జాకెట్టు కట్టుకుని సినిమాకెళ్ళామా, నా సామిరంగా సినిమా వదిలి అందరూ మన్నే చూడరూ.."

"నిజంగా అంత గొప్పగా ఉంటుందా అతని పనితనం.."అంది రమణి.

"ఒక్క పనితనమేంటి? గొప్ప అందగాడు. కానీ అందగత్తెలను చూసినా ఉలకడు..పలకడు..ఒఠ్థి పని రాక్షసుడు"

"అయితే పదండి..నాకూ అతణ్నీ, అతని పనితనాన్నీ చూడాలనుంది" అంది రమణి.

"ఇవాళొద్దు..రేపెళదాం..ఇప్పటికే ఆలస్యమైంది..ఇంట్లో ఆందోళనపడతారు"అంది సువర్చల రమణి పిన్ని కూతురు.

"అయితే..ఇవాళ నేనూ పరికిణీ, రవికకు కావల్సిన గుడ్డలు కొనుక్కుంటాను. రేపతని దగ్గరకు వెళదాం"

"సరే..బండతనికి పెద్ద బజారులో బండి ఆపమని చెప్పాలి"అంది గాయత్రి .

*****

జట్కాబండీ మీద వచ్చిన కన్నెపిల్లలందరూ బిల బిల మంటూ మధు ఇంటిముందు సీతాకోక చిలుకల్లా వాలారు. ‘ఏదో షాపులాగా ఉంటుందనుకుంది కాని ఇది ఇల్లే!’ అనుకుంది లోపలికెళుతూ రమణి. లోపలికెళ్లాక బుద్ధిగా బట్టలు కుట్టుకుంటున్న మధు కనిపించాడు. ఇన్నాళ్లూ తన అందం మగాళ్ల మతులు పోగొట్టడం తెలుసు..కానీ మొట్టమొదటిసారి ఆ మన్మధరూపానికి ఫిదా అయిపోయింది తన మనసు.

"మధూ..ఈమె రమణి..ధిల్లీలో ఉంటుంది. మేమెప్పుడూ నీచేత కుట్టించుకుంటాం గాని తను ఇప్పుడే రావడం. నీ గురించి గొప్పగా చెప్పాంలే! అంచేత నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టి మా రమణికి పరికిణీ, రవిక ‘ఓహో’ అనిపించేలా కుట్టాలి."అంది వాగుడుకాయ వరలక్ష్మి. అంతమంది వచ్చినా తనపని తను చేసుకుపోతున్న మధు అప్పుడు తలెత్తాడు. రమణి అందం అరక్షణం అతణ్ని ఉలిక్కిపడేలా చేసింది.

అసంకల్పితంగా ఆమె చేతుల్లోని బట్టలు అందుకుంటూ.."చాలా బట్టలున్నాయి..కానీ అమ్మాయిగారికి ముందే కుట్టే ప్రయత్నం చేస్తా..ఆది తెచ్చారా?"అన్నాడు.

"బాబూ..ఆమె ఇంతవరకు పరికిణీ ఓణీ వేసుకోలేదు..ఓన్లీ డ్రస్సులే..నువ్వే కొలతలు తీసుకోవాలి"అంది.

"అలా తీసుకోవడం బావుండదని, సభ్యత కాదని మానేశానండీ.."అన్నాడు.

"తీసుకోవోయ్ ఫరవాలేదు..నువ్వు ప్రవరాఖ్యుడవని మాకు తెలుసులే"

‘నిన్నటిదాకా అది నిజమే..కాని ఇప్పుడే మనసులో ఏదో తీయని అలజడి’ మన్సులో అనుకున్నాడు.

"ఎవరినన్నా తోడు తీసుకుని లోపలికి రండి.."

"నువ్వేదో గొప్ప టైలర్ వని మావాళ్లు ఊదరగొట్టారు. కొలతలు తీసుకుని మా సిటీల్లో కూడా కుడతారు. నువ్వు నీ కంటితో కొలతలు తీసుకుని అద్బుతంగా కుట్టాలి. అవి అద్బుతంగా ఉంటే నీకు మంచి నజరానా ఇస్తా"అంది.

"ఓసోస్ మాలాగా అనుకున్నావా రమణి అంటే..దేశాలు తిరిగొచ్చింది. ధిల్లీలో ఉంటోంది..చాలా తెలివైంది..మగ పురుగుని దగ్గరకు రానీయదు..ఆఁ"అంది వాగుడుకాయ్ వరలక్ష్మి.

మధు చిన్నగా నవ్వి"అలాగే..నాకూ ఇలాంటి ఛాలెంజ్ లంటే మహాఇష్టం..రొటీన్‍పనితో బోర్ కొడుతోంది. మీరలా నుంచోండి అమ్మయ్‍గారూ..మీరు చెప్పినట్టుగానే నా కళ్లటేపుతో మీ ఒంటి కొలతలుతీసుకుని..చక్కగా కుట్టే ప్రయత్నం చేస్తాను"అన్నాడు.
ఆమె కొద్ది దూరంలో నుంచుంది. అతను రవికకోసం ఆమె మెడ, గుండ్రని భుజాలు, వక్షోజాలు, నడుము..వెనుకకెళ్లి వీపు భాగం, ఆతర్వాత పరికిణీ కోసం నడుము కిందిభాగం, పొత్తికడుపు, కటిభాగం, పిరుదులు ఏకాగ్రతతో కళ్లతో శరీరపు ఒక్కో పిక్సెల్ స్కాన్ చేస్తూ మనసులో కొలతలు నమోదు చేసుకుంటున్నాడు. అతను కొలతలు తీసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచీ అతనికి దూరంగా ఉన్నా ఏదో పరవశం, వివశత్వం కలిగింది రమణికి. లోపల రక్తానికి బదులు మధువేదో ప్రవహిస్తున్న మధురానుభూతి. శరీరం నుంచి వెచ్చని ఆవిర్లు వెలువడుతున్నాయి. మరో క్షణంలో ‘కొలతలు తీసుకోవడం అయిపోయాయి అమ్మాయిగారు..’అని మధు అనకపోయుంటే..ఆమె ఉవ్వెత్తున ఎగిసే జలతరంగంలా అతనిమీద పడిపోయేదే!

"వారం రోజుల్లో ఇచ్చేస్తానండీ"

"మామూలుగా అందరికీ ఇచ్చినట్టు కుట్టిస్తే ఎలా? నా పరికిణీ, జాకెట్టుకు ప్రత్యేకత ఉండాలి. అది నాకు మాత్రమే సొంతమయి ఉండాలి. చెప్పాగా అలా చేస్తే నీకు మంచి నజరానా ఇస్తానని" అంది.

"తప్పకుండా"నవ్వాడు.

*****

ఆరోజే మధు పరికిణీ, రవిక ఇచ్చే రోజు!

రమణి చేసిన ఛాలేంజ్‍కు తగ్గట్టుగా మధు జాకెట్టు, పరికిణీ కుట్టి ఆమెను సంతృప్తి పరచగలడా? అందరికీ ఆసక్తిగా ఉంది.
అందరూ పొద్దున్నే వాళ్లింటికి వచ్చేసారు. రమణీ అప్పటికే తలంటుకుని జుత్తు ఆరబెట్టుకుంటోంది. తెల్లటి డ్రస్‍లో మంచులో తడిసి మురిసిపోతున్న తెల్లగులాబిలా ఉంది.

"ఏమ్మా..వెళదామా..మా బట్టలు అతని దగ్గర ఏళ్ల తరబడి అలానే ఉన్నాయి..నువ్వు అతనికి ఛాలేంజ్ విసిరి రెండురోజుల్లో కుట్టించేసుకుంటున్నావు. పట్నం తెలివితేటలు!"అక్కసుతో అంది వరలక్ష్మి.

"అవునే మనం నిజంగా వెర్రి.."మాట పూర్తయ్యేంతలో మధులిక నోరుమూసేసింది సులోచన. రమణి నవ్వి బయల్దేరింది. వాళ్లు వెళ్లేసరికి బయట ఎవరివో బట్టలు కుడుతున్నాడు.

"చూశావా..చూశావా..నీ బట్టలు కుట్టలేదు..అయినా రెండు రోజుల్లో అంత గోప్ప జాకెట్టూ, పరికిణీ ఎవరూ కుట్టలేరు..నీ ఛాలేంజ్ మధు లైట్‍గా తీసుకున్నాడు"అంది వరలక్ష్మి.

అదేం పట్టించుకోకుండా "అమ్మాయిగారూ వచ్చారా? కుట్టినవి లోపలున్నాయి, పట్టుకొస్తానుండండి" అని లోపలికెళ్లాడు. మధుని చూడంగానే, ‘ఆ కళ్లతో తన శరీరపు అణువణువునీ స్కాన్ చేశాడే’ అన్న భావన కలిగి సిగ్గులమొగ్గవుతోంది. రెండు నిముషాల్లో కవరుతో బయటకు వచ్చాడు. కవరులోంచి పరికిణీ, రవిక బయటకు తీశాడు. అందరూ నిశ్చేష్టులైపోయారు. దేవతలకోసం దుస్తులు ఎవరు తయారు చేస్తారో కాని, ఆయన చేతిలోంచి అవి పొరబాట్న భూలోకంలో పడ్డట్టు అందమైన చెమ్కీలద్దిన లతలతో, పూలతో ధగ ధగ మెరిసిపోతున్నాయి. రమణితో సహా అందరూ వాటిని అటూ ఇటూ తిరగేసి అలా చాలా సేపు చూస్తూనే ఉన్నారు. "అమ్మాయిగారూ, మీరు చూసింది సగమే! అలా వాటిని తీసుకుని ఎండలోకి వెళ్లండి.."అన్నాడు.

అందరూ అలాగే చేసారు. ఆ బట్టల్లోంచి మొగలిపూల సువాసన రాసాగింది. వాళ్లు ఆశ్చర్యచకితులై కాసేపు ఆ సువాసన ఆఘ్రాణించిలోపలికి వచ్చారు.."ఇప్పుడు లోపలికి చీకట్లోకి వెళ్లండి"అన్నాడు.

ఆమె, ఆమెతో పాటు అందరూ లోపలికి వెళ్లారు. మళ్లీ ద్విగుణీకృత ఆశ్చర్యం. మల్లెపూల సువాసన ఆ దుస్తుల్లోంచి వస్తోంది. వాళ్లు బిల బిల మంటూ బయటకొచ్చేసారు.

"బట్టలకి సువాసనలు ఎలా సాధ్యం" అడిగారు ఉత్సుకతతో.

"అది మాత్రం అడక్కండి. రంగులు మారే చీరలు సాధ్యమైనప్పుడు సువాసన బట్టలు ఎందుకు సాధ్యం కావండీ. మన రాజమండ్రీ ఖ్యాతి మన అమ్మాయిగారు వెళ్లే ప్రతిరాష్ట్రంలో, దేశంలో తెలియాలని చాలా కష్టపడి, బట్టలకు సువాసన సాధ్యమేనన్న వివరాలు సేకరించి ఇలా అపూర్వంగా సృష్టించాను"అన్నాడు.

"నీ పనితనం నాకు బాగా నచ్చిందోయ్..కానీ యాభై మార్కులే పడ్డాయ్.." మధుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.

"..అదే..నేను ఇప్పుడు వీటిని కట్టుకు చూస్తాను. దూరం నుంచి కళ్లతో కొలతలు తీసుకుని కుట్టావు కదా..సరిపోతాయో? లేదో? ఏవన్నా హెచ్చు తగ్గులు ఉంటాయేమోనని అనుమానం" అని అందర్నీ అక్కడే ఉండమని బట్టలు కట్టుకోడానికి లోపలికెళ్లింది.
ఆమె శరీరానికి అద్భుతంగా అమరాయవి. ఆమె కొద్ది సేపు ఆశ్చర్యానందాలకు లోనయింది. మనసులో అతని పనితనాన్ని వేనవేలసార్లు మెచ్చుకుంది.

"మధు ఇక్కడ ఇలా కుట్టావేమిటి? నువ్వొక్కడివే లోపలికి రా..చూపిస్తా..మీరందరూ అక్కడే ఉండండే"అని గట్టిగా అరిచింది.

‘మనసులో నమోదయి ఉన్న కొలతలకు..కుట్టిన బట్టలకు తేడా ఎక్కడన్నా ఉందేమో’ అని ఆలోచిస్తూ లోపలికెళ్లాడు.
లోపలికెళ్లంగానే అమాంతం రమణి అతణ్ని సుడిగాలిలా చుట్టుకుని గాఢమైన ముద్దుని బహూకరించింది.

"నీ పనితనం అద్భుతమోయ్..అందుకే ఈ అపూర్వ నజరాన. ఈ బట్టల్ని జీవితకాలం ఓ అపూర్వ వస్తువులా భద్రంగా దాచుకుంటా, వీటిని అప్పుడప్పుడూ కట్టుకోడానికైనా నేను నా కొలతలు మారకుండా చూసుకోవాలి. కన్నెవయసుతో మిస మిసలాడుతూ, స్వతహాగా అందగత్తెనై అందరి చూపుల్నుంచి, చేతలనుంచి కాపాడుకొస్తున్న ఈ అందంతో నీకు దగ్గరై ఓ మధురమైన చుంబనమిచ్చాను. నీ అద్వితీయ కుట్టుపనికి, నా అసమాన పురస్కారం సరిపోయిందనే అనుకుంటున్నాను."అని నవ్వుతూ బయటకెళ్లిపోయింది.

ఆ తర్వాత చిరునవ్వుతో మధు బయటకొచ్చాడు.

వాళ్లిద్దరినీ తెల్లబోయి చూస్తూ ‘ లోపల ఏం జరిగి ఉంటుందో’ ఎవరికి వారు ఈర్ష్యా అసూయలతో ఊ హించుకుంటున్నారు ఆ అమ్మాయిలు.
"పదండే"అని రాజసంగా బయటకు నడిచింది రమణి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు