విఘ్నేశ్వరుడి విగ్రహానికి దండం పెట్టుకుని రాజయ్య గారు పడుకోవడానికి సిద్ధ పడుతోంటే రాము, ఇందిర తాత గారి దగ్గర చేరారు కథ చెప్పమని. సరే నేనొక చిన్న కథ చెబుతాను. మరి మీరు అది విన్నతరువాత నేను వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి అని ప్రారంభించారు. ఒక తాత గారు మనవడిని పక్కన కూర్చో పెట్టుకుని కారులో ఓ ఊరు వెడుతున్నారు. ఆయన ఎప్పుడూ కారుని ఏ రోడ్డు మీదయినా గవర్నమెంట్ నిర్ణయించిన వేగం కంటే ఎక్కువగా వెళ్ళరు. కారు స్టార్ట్ చేసే ముందే సీట్ బెల్ట్ పెట్టుకుని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అలా వెడుతోంటే దారిలో ఒక చోట పోలీసులు కొందరిని ఆపి పెనాల్టీలు వేస్తున్నారు. వీళ్ళని మాత్రం పోలీసులు ఆప లేదు.
వాళ్ళని ఎందుకు ఆపారు పోలీసులు ? అని మనవడు అడిగితే ఆయన చెప్పాడు. కొందరు సీటు బెల్ట్ పెట్టుకోక పోవచ్చు, కొందరు ఎక్కువ స్పీడులో వెడుతూ ఉండవచ్చు. అందు చేత వారిని ఆపి పెనాల్టీలు వేస్తున్నారు అన్నారు ఆ తాత గారు.
వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక కారు ఎదురుగా వస్తోంది. అందులో డ్రయివర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదు, కొంచెం ఎక్కువ స్పీడు లోనే వెడుతున్నాడు. ఈ కారు లో ఉన్న తాత గారు అతనికి చేతితో సంజ్ఞ చేసి ముందు పోలీసులు ఉన్నారని చెప్పారు. ఆ డ్రయివర్ వెంటనే సీటు బెల్ట్ పెట్టుకుని స్పీడ్ తగ్గించుకుని వెళ్లి పోయాడు.
వీళ్ళు వెళ్ళి పోయిన తరువాత మళ్ళీ ఇంకో తాత గారు అదే రూటు లో వీళ్ళ లాగే కారు లో వస్తూ వీళ్ళలాగే పోలీసుల్ని చూసి వాళ్ళని దాటి వెళ్ళాడు. ఆయన కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక కారు ఎదురుగా వస్తోంది. అందులో డ్రయివర్ కూడా సీటు బెల్ట్ పెట్టుకో లేదు, కొంచెం ఎక్కువ స్పీడుగానే వెడుతున్నాడు. అది చూసి కూడా ఈ తాత గారు ఎదురుగా వస్తున్న డ్రయివర్ కి కావాలనే పోలీసుల గురించి ఇందాకటి తాత గారిలా ఏమీ సంజ్ఞ చేయలేదు. దాని వల్ల ఎదురుగా వస్తున్న డ్రయివర్ ముందుకు కొంత దూరం వెళ్ళ గానే పోలీసులు పట్టుకుని పెనాల్టీలు వేసారు.
మరి ఇప్పుడు నేనో ప్రశ్న వేస్తాను మీరు జవాబు చెప్పాలి అన్నారు తాత గారు పిల్లలు ఇద్దరూ ఓఅలాగే అంటూ తలలు ఊపారు
ఇప్పుడు చెప్పండి. మొదటి కారులో తాత గారు మంచి పని చేసారా లేక తరువాత వచ్చిన తాత గారు మంచి పని చేసారా?
పిల్లలు ఇద్దరూ ముక్త కంఠం తో మొదటి కారు లో తాత గారే మంచి పని చేసారు. ఎందుకంటే ఆ డ్రయివర్ కి పెనాల్టీలు తప్పించారు కదా?ఓకే . ఇప్పుడు ఇది వినండి.
మొదటి కారులో పెనాల్టీలు తప్పించుకున్న డ్రయివర్, తన అలవాటు మార్చుకోకుండా, బెల్ట్ పెట్టుకోకుండా స్పీడ్ గా డ్రయివు చేస్తూనే ఉన్నాడు. ఒక మాటు ఏక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు పోకోట్టుకుని వీల్ చైర్ లో జీవితం గడపవలసి వచ్చి, అతని కుటుంబం వారంతా అనేక కష్టాలు పడవలసి వచ్చింది.
రెండో కారులో వెళ్ళిన డ్రయివర్ పెనాల్టి కట్టడం బాగా గుర్తుండి, అప్పటినుంచీ బెల్ట్ పెట్టుకోవడం, స్పీడు గా వెళ్లక పోవడం అలవర్చు కోవడం వాల్ల, పెద్ద ప్రమాదాలకి గురవలేదు. చిన్న చిన్నవి జరిగినా చిన్న గాయాలతో నే బయట పడ్డాడు.
మరి ఇప్పుడు చెప్పండి మొదటి తాత గారు మంచి పని చేసారా? లేక రెండో తాత గారా?
ఇద్దరు పిల్లలూ ముక్త కంఠంతో రెండో తాత గరే మంచి పని చేసారు అన్నారు.
అంచేత మనం తెలుసు కోవాల్సిం దేమిటి ? గవర్నమెంట్ పెనాల్టీలు వేసేది వాళ్ళ కి ఆదాయం కోసం కాదు, మనం జాగర్తలు పాటించి క్షేమంగా ఉండడానికి. తెలిసిందా ? అని తాతగారు చెప్పి వాళ్ళని పడుకోవడానికి పంపించేసారు