పంతులు కందకం - చెన్నూరి సుదర్శన్ ,

pantulu kandakam

అర్థ రాత్రి అలారం మ్రోగింది..

నా తల అదిరింది. అది నా చేతికందితే తీసి ఆమడ దూరం విసిరేయాలన్నంత కోపం వచ్చింది. చేతి కందుతుందేమో..! గాని లేచి అందుకునే ఓపికెక్కడిది?.. నాకు తెలుసు.. ఇప్పుడు సమయం రాత్రి ఒకటిన్నర. లేవాలి.. లేచి మంచినీళ్ళ బావిలో నుండి నీళ్ళు తోడాలి. నాకు ఎదలోనుండి ఏడుపు తన్నుకు వస్తోంది..

“ బాబూ రవీ.. లేవరా.. ” అంటూ అమ్మ నన్ను తట్టి లేపుతూ లైటు వేసినట్లుంది.. గదిలో కాంతికి నా కళ్ళు తెరిచి అసహనంతో మళ్ళీ మూసుకున్నాను.. కాళ్ళ పై వున్న దుప్పటిని మరింత పైకి లాక్కోబోయాను.

“నీ కాళ్ళు మొక్కుతా లేవరా.. బాబూ..” అంటూ అమ్మ చెయ్యి నా కాళ్ళకు తగిలింది. చట్టుక్కున లేచి కూర్చున్నాను.

“ఏంటమ్మ ..? అలా అంటావ్.. లేస్తున్న గదా..” అప్రయత్నంగా నా కళ్ళల్లో నీరు నిండు కున్నాయి.“ఆలస్యమైతే అందరితో మాటలు పడాల్సి వస్తుందనేరా నాబాధ. లే.. లేచి కళ్ళు కడుక్కో.. బావి దగ్గర బిందెలు పెట్టి వస్తా ..” అంటూ యిక నేను పూర్తిగా లేచినట్లేననే ధీమాతో వంటింట్లోకి దారి తీసింది. చిన్న చిన్న గిన్నెలు సర్డుతోంది.. అందులో కూడా నీళ్ళు నింపాలి..

నేను లేచి నా ప్రక్కనే టేబుల్ పై వున్న గ్లాసులోని నీళ్ళతో కళ్ళు అద్దుకున్నాను.

ఎదురుగా గోడకు వేల్లాడుతున్న కేలండర్ చూసాను. 1976 ఫిబ్రవరి 25వ, తారీకు. పరీక్షలకింకా పది రోజుల సమయమే వుంది.రాత్రి చదువుకుంటూ పడుకునే సరికి పదకొండయ్యింది. నేను అప్పుడు స్కూల్ ఫైనల్ ..

మార్చి నెల రాక ముందే మా మంచినీళ్ళ బావిలో నీళ్ళు అడుగంటాయి. వంతుల వారిగా బావిలో నుండి నీళ్ళు తోడుకుంటున్నాం. ఈ పద్ధతే ఒకందుకు మంచింది. లేకుంటే బావి దగ్గర భారి యుద్దాలను చూడాల్సి వచ్చేది.

మాది వీవర్స్ కాలనీ.. ములుగు. ఇది వరంగల్ జిల్లాలో చాలా వెనుక పడిన తాలూకా. అప్పుడు.. తాలూకాలు.. వాటి అధికార్లను తహసిల్దార్లు అనే వారు..

ములుగు గొప్పదనం..‘మనిషి ప్రాణం పోతోంది..’ అని అల్లల్లాడుతూ నీళ్ళు అడిగితే ముఖం తిప్పేసుకునే జనానికి నిలయం.
పోయిన సంవత్సరం ఒక దుర్ఘటన జరిగింది..

మా కాలనీలో వుండే కేశవులు సార్ ప్రక్క వూళ్ళో ఉపాధ్యాడు. అతడిని అంతా ‘పంతులు’.. అతడి భార్యను ‘పంతులమ్మ’ అంటూ పిలిచే వాళ్ళం. పంతులు సైకిలుపై బడికి వెళ్లి వస్తూంటాడు. అతడికి నలుగురమ్మాయిలు.

అ రోజు బడికి ‘లాస్ట్ వర్కింగ్ డే..’. మండి పోయే ఎండలో సైకిలుపై ప్రయాణించి వచ్చాడు. ఇంట్లో నీళ్ళు నిండుకున్నాయి. ప్రక్క యింట్లో నుండి గ్లాసు నీళ్ళు బదులు తెస్తానని వెళ్ళిన అతడి భార్య తిరిగి వచ్చే సరికి కేశవులు సారు తిరిగి రాని లోకానికి వెళ్లి పోయాడు.
ఆమె స్పృహ తప్పి పడి పోయింది.. పిల్లల పెడ బొబ్బలు..

అది వడ దెబ్బ కావచ్చేమో..! అనుకున్నారంతా.. ఏదైతేనేం..? వాళ్ళింట్లో చుక్క మంచి నీళ్ళు లేవన్నది నిజం.

‘బావి వద్ద లడాయి పెట్టుకొని బడాయికి పోయి పంతంతో పంతులమ్మ ఖాళీ బిందెలు పట్టుకుని వెళ్లింద’ని.. ఆడ వాళ్ళు మెటికలు విరుచుకున్నారు.

పంతులు మరణం మా కాలనీ కళ్ళు తెరిపించింది. అప్పటి నుండి వంతుల వారిగా బావిలో నుండి నీళ్ళు తోడుకోవాలనే పెద్దల తీర్మాణం మొదలయింది.

మా కాలనీలో నాలుగు వాడలు. వాడ కొక్క మంచి నీళ్ళ బావి. వాడుకోడానికి ఒక ఫర్లాంగు దూరంలో పెద్ద వ్యవసాయ బావి.. దాన్ని మేమంతా ఆది రెడ్డి బావి అనే వాళ్ళం. బావి మీద సగ భాగం చెక్కేసిన తాటి చెట్టు ఫలకం బావి తాలూకు ఆసామి ఆది రెడ్డి అమర్చాడు. దాని పై ఒక కాలు బావి అంచున మరో కాలు పెట్టి ఒడుపుగా వంగి నీళ్ళు తోడుకోవాలి. నాలుగు కుటుంబాలు ఐకమత్యంతో నల్గురు ఒక వరుసలో దూరం దూరంగా నిలబడి బిందెలతో నీళ్ళు అందించుకుంటూ వారి వారి ఇండ్లల్లో నీళ్ళు నింపుకుంటూ వుంటాం.

“ఏమైందిరా రవీ.. లేచి మళ్ళీ కూర్చుంటివి.. ’’ అని అమ్మ బతిమాలే ధోరణిలో అనే సరికి యీ లోకానికొచ్చాను.

అవును నిజమే సయమవుతోంది.. సరిగ్గా రెండు గంటలకు పక్కింటి వాళ్ళను లేపి బావి గిలకకు చేంతాడు కట్టు కొమ్మని బావి అప్పగించాలి. వాళ్ళూ రెండున్నర గంటల సేపు నీళ్ళూర బెట్టుకొని అర గంటలో తోడుకొని మరొకరికి బావి అప్పగించాలి.. సూర్యుడు పడమట ఉదయించినా సహిస్తారు గాని ఒక అర గంట ఆలస్యమైతే ఊరుకోరు.. రణ రంగానికి శంఖాలు ఊదుకోవటం ఖాయం.. గబా గబా.. బావి వైపు పరుగు తీసాను..

బావిలో నీరు తోడటం మొదలు పెట్టాను. మొదట మూడు బొక్కెనల నిండా నీళ్లు తేటగా వచ్చాయి. తరువాత... తరువాత.. మురికి నీళ్ళు.. కంచుట్లో కూర ఊర్చేసుకున్నట్లు బావి అడుగంతా ఊర్చేసి పక్కింటి వాళ్లకు సమయానికి బావి అందజేసి వచ్చి పడుకున్నాను.. పడుకున్నానే గాని నిద్ర రావటం లేదు. అమ్మ వచ్చి నా గదిలో లైటు తీసేసింది. నా మనసులో నీటి సమస్య ఆలోచనలు చీకట్లో వికట్టాట్టహాసం చేయ సాగాయి..

అ నీళ్ళు సరి పోవు.. మళ్ళీ తెల్లవారు ఝామునే లేచి దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలో వున్నా మరో బావి నుండి మంచి నీళ్ళు తేవాలి. అక్కడా క్యూ పద్ధతే.. ఎంత సమయంలో తిరిగి వస్తానో తెలియదు..

“కొన్ని ప్రాంతాలలో నీళ్ళు కొంటారట..” అంటే నవ్వినా పక్కింటి పెద్దవ్వ మాకెప్పుడైనా అవసరమై బిందెడు నీళ్ళు తెమ్మంటే ‘పావలా’ తీసుకునేది.. “యివి కొన్నట్టే గదా..” అంటే బొక్కి నోటితో నవ్వేది. నేనూ ఆమె నవ్వులో శృతి కలిపే వాణ్ణి..

***

పంతులమ్మ ప్రైవేటుగా పదవ తరగతి పాసైతే కనీసం రికార్డ్ అసిస్టెంట్ కారుణ్య నియామకంలో జాబ్ వస్తుందని అ సంవత్సరం ఫీజు కట్టించి అప్పుడప్పుడు ఆమె చదువులో సహకరిస్తున్నాను.

పంతులమ్మకు ఫ్యామిలీ పెన్షన్ స్యాంక్షనయింది. కొన్ని డబ్బులూ చేతికి వచ్చాయి. దానిపై కన్నేసాడు.. సదరు ఇంటి ఓనరు. ఆమె ఖాళీ చేస్తే ఎక్కువ కిరాయి వస్తుందని.. ఒక పథకం ప్రకారం రోజూ వచ్చి గొడవ చేయ సాగాడు. మా వాడ లోని జనం ఒక నాటక సన్నివేశం చూస్తున్నట్లు మురిసి పోసాగింది. పాపం పంతులమ్మ కన్నీరు పెట్టని రోజు లేదు.. ఒక రోజు నేను, మా అమ్మా నాన్న పంతులమ్మ సమస్యను పరిష్కరించాలని మాట్లాడుకుంటున్నాను. ఇంతలో పంతులమ్మ రావటం.. విషయం చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంది. నాన్న అభయమిచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను.. అది నేనూహించనిది..

పంతులమ్మ నన్ను ‘తమ్ముడూ..! అంటూ ఆప్యాయంగా పిలిచేది. బంధుత్వం లేకపోయినా అలా వరుసలు పెట్టి పిలుచుకోవటం మా కాలనీలో అందరికీ అలవాటు.

‘నాన్నా ..’ అంటూ ఆమె మొరపెట్టుకున్న వైనం నాన్న చలించి పోవటం చూసి .. అమ్మ అర్థం చేసుకుంది.

“మా ఇంటి ఆవరణలోనే పెరట్లో రెండు గదులతో ఒక గుడిసె వేయిస్తాం. ప్రస్తుతం అందులో వుందురు గాని.. కిరాయ బెడద తప్పుతుంది..” అంటూ మా అమ్మ ఓదార్చింది.

మున్ముందు పక్కా ఇంటి నిర్మాణానికి కూడా ఉపయోగ పడ్తుందని గట్టి పునాది అవసరమని అమ్మ పట్టు బట్టింది.

ముగ్గు పోసి పునాదులు తవ్వటం మొదలు పెట్టారు. ఒక అడుగు మట్టి తీసాక నేల తెగడం లేదని ఎడ్ల బండితో డ్రమ్ముల్లో నీళ్ళు తెప్పించి పునాదులు నింపారు. మరుసటి రోజు మళ్ళీ త్రవ్వడం..

“ఎందుకలా నీళ్ళతో నింపుతున్నారు?” అని అడిగాను.

“అలా నీళ్ళు నింపితే అవి ఇంకి నేల మెత్తపడుతుంది. తవ్వడం సులభ మవుతుంది..” అని చెప్పడం నాలో ఆలోచనలను రేపింది.
‘అలా అయితే బావి చుట్టూ కందకం తీసి వృధాగా పోయే నీరు అందులో ఇంకిస్తే.. అవి బావిలో ఊరే నీటికి మేలు చేస్తాయి కదా..’ అనుకున్నాను.

మా నాన్నతో ఇదే విషయం ప్రస్తావించాను..

“ఆలోచన బాగానే వుంది.. కాని డబ్బు సమస్య..” అన్నాడు నాన్న.

పునాదులు తీసే వారితో లెక్కలు వేయించాను. మా బావి నీరు వాడుకునే ఇంటింటికీ వెళ్లి విషయం విశదీకరించాను.

“ మనమంతా ఐకమత్యంగా శ్రమ దానం చేద్దాం” అంటూ యూత్ ను మోబిలైజ్ చేసాను... నేను ‘భారత్ యూత్ అసోసియేషన్’ అని స్థాపించి మా కాలనీ పిల్లలకు ఆటలు నేర్పిస్తున్న మూలాన నా మాటకు గౌరవమిచ్చారు.. నాకు మద్దతు తెలిపారు.. నాలో ఉత్సాహం ఉరకలు వేసింది.

ప్రణాళికలు సిద్ధం చేయ సాగాను. వర్షాకాలం లోపు నేను అనుకున్న పని సాధించాలి అనుకున్నాను. ఈ మధ్య నేను ములుగు నీటి పారుదల శాఖ ఇంజనీరును కలుసుకున్నాను. మొదట నా ఆలోచనలకు ఆశ్చర్య పోయాడు.. కాసేపు అలోచించాడు.. అభినందించాడు.
బావి చుట్టూ ఎంత దూరంలో కందకం ఎంత లోతుగా తీయాలో వివరించాడు.

“కందకాన్ని ఇసుక కంకరతో నింపితే నీటి వడబోత పధ్ధతిలా ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది” అని సలహాలు యిచ్చాడు.

“కంకర.. ఇసుకకయ్యే ఖర్చు నేను భరిస్తాను..” అంటూ పంతులమ్మ ముందుకు వచ్చింది. “పంతులు పేరు మీద చేసే సాయం అయన ఆత్మకు శాంతి కలుగుతుంది” వేడుకుంది పంతులమ్మ.

“తమ్ముడూ.. మీరు నాకు నిలువ నీడ కోసం స్థల మిచ్చి ఆశ్రయం కల్పించారు. దేవుని దయ వల్ల చెయ్యి తిప్పుకోగాలిగాను. ఉడతా భక్తిగా మా సారు పేరు మీద సాయం చేయనివ్వండి ‘’ అంటూ పదే పదే బతిమాలింది.

దాహం దాహమంటూ తపించి తనువు చాలించిన పంతులు పేరును మా పథకానికి ‘పంతులు కందకం’ అని పెట్టాను.

పనులు పథకం ప్రకారం దిగ్విజయంగా పూర్తయ్యాయి. బావి దగ్గర నీళ్ళు వృధా గాకుండా కందకంలోకి వెళ్ళడం మనసు హాయిగా వుంది.

***

హన్మకొండ కాలేజీలో జాయినయ్యాను..

నా మనసంతా మా కాలనీలోని బావి మీదే .. కలలు రాసాగాయి. వేసవి ఎప్పుడొస్తుందా.. మా పంతులు పథకం ఫలిస్తుండా..? మది నిండా ఇవే ఆలోచనలు.. అనుకున్న వేసవి కాలం రానే వచ్చింది.. మా బావిలో నీరు అడుగంటలేదు.. అక్షయ పాత్రలా తోడిన కొద్దీ నీళ్ళు.. నీళ్ళు.. నీళ్ళు..

పంతులు కందకం ఫలితమిచ్చింది.. కాలనీలో సంబరాలు..మా ఇల్లు జన సంద్రమయింది. వాడ వాడలా పంతులు కందకాలు వెలిసాయి.. దాదాపు ముప్పది సంవత్సరాలు గడిచాయి. మా ఊళ్ళో నీటికి కొరత రాలేదు.. నేటి ఇంకుడు గుంతలు చూస్తుంటే మా ‘పంతులు కందకం’ గుర్తుకు వస్తుంది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి