శ్రావణ పూర్ణిమ - కురవ శ్రీనివాసులు

sravana poornima

"ఏవండి రమణ వచ్చాడు...."

"ఏవిటట..."

"మీ అమ్మగారికి బాగోలేదట...."

"మళ్ళీ డబ్బుకోసం వచ్చాడా....?... వీడికిదే పని... ఏదో ఒక సాకు చెప్పేసి డబ్బుకావాలంటాడు..."

""

"ఇంతకీ ఈసారి ఏ రోగమని చెబుతున్నాడు...?"

"పక్షవాతం...."

"ఆ... సో ఈ సారి పెద్ద మొత్తం కోసమే వచ్చినట్లున్నాడు... ఈ సాకుతో ఇక్కడికి తీసుకొస్తానంటాడేమో... ఎంతోకొంత ఇచ్చేసి పంపించేసెయ్"

"అది కాదండి... మనల్నోసారి ఊరికి రమ్మంటున్నాడు..."

"అదెలా....? చూస్తూనేవున్నావుగా... నాకు తీరికెక్కడుంది... నువ్వెళ్ళినా నీవెంట అమ్మను పంపేయాలని ప్లాన్ చేస్తాడు... నాకంతా తెలుసు... నువ్వేం మాట్లాడకు... ఓ వెయ్యో రెండు వేలో ఇచ్చిపంపించు... లేకపోతే ఆ రాజేష్ గాడి దగ్గరకెళ్ళమను...."

"సరిగ్గా మాట్లాడలేక పోతోందిట... మంచి ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్లు చెప్పారంటున్నాడు...."

"వాడి వెధవ్వేషాలన్నీ నాకు బాగా తెలుసు... వాణ్ణిలా రమ్మను.... " రమణయ్య గదిలోకొచ్చాడు...

"ఏరా మళ్ళి ఏదో కొత్తపాట మొదలెట్టావట... ఎంత కావాలేమిటి..?"

"నాకలాంటి కక్కుర్తి లేదని నీ కెన్నోసార్లు చెప్పాను..."

"లేకపోతే నెలకోసారి ఈ అడుక్కోవడాలేమిటి...?" నాకు చిరాగ్గావుంది...

"అడుక్కోవడమేమిటి... కొడుకులుగా మీకూ భాద్యత లేదా....?"

"ఆహా.... ఒక్క పైసా ఇవ్వకుండా మొత్తం ఎనిమిదెకరాల పంటనంతా నువ్వక్కడివే మేస్తున్నావుగా , ఏళ్ళతరబడి.... ఇంకేంకావాలి..."

"మాటలు చెప్పడం కాదు... అక్కడికొచ్చి పండించండి తెలుస్తుంది...! అంత చేసినా మిగిలేది ఎంత..?"

"అబ్బో... అక్కడికి నువ్వేదో నీ కష్టమంతా మాకోసం ధారపోస్తున్నానంటవా...?" నాకు మండిపోతోంది...

"కాకపోతే... అమ్మ భారాన్ని నాఒక్కడిమీదొదిలేసి మీరీ సిటీలో సుఖంగా సంసారాలు చేస్తున్నారుగా.. మరి నాకూ పెళ్ళి, పిల్లలు లాంటి ఆశలుండవా ఏంటి ..?"

"అదీ విషయం.. ఇన్ని రోజులూ వండిపెట్టడానికి అమ్మ కావలసొచ్చింది... పెళ్ళి చేసుకుంటె మీ సుఖాలకడ్డమవుతుందని వదిలించుకోవాలని చూస్తున్నావంతేనా....?" నా కోపం కట్టలు తెంచుకుంటోంది...

"మీరేమైనా అనుకోండి.. అమ్మ భాద్యత నా ఒక్కడిదే కాదు... పైగా సిటీలో మంచి డాక్తరుకు చూపిస్తేగాని అమెకు నయం కాదని చెబుతున్నారు.... రెండ్రోజుల్లో అమ్మను ఇక్కడ తెచ్చి వదిలేస్తాను... మీ ఇష్టం... అన్నట్లు ఇంకో నెలరోజుల్లో నా పెళ్ళి... మన భూషణం మామయ్య గారి అమ్మాయిని చేసుకోబోతున్నాను... వీలైతే రండి... " మరో మాటకు తావివ్వకుండా తిరిగి వెళ్ళిపోయాడు....

నాకు గుండెదడ మొదలయ్యింది... వాడు మొరటోడు... అన్నంత పని చేస్తాడేమో.... ఎలా.... ?

***********

"శాంత వాడలాచేశాడంటే మనం పెద్ద చిక్కుల్లో పడతాం.... నువ్వోపంజేయ్... కొంత డబ్బు తీసుకొని మనఊరెళ్ళు... ఎలగైనా అమ్మను ఇక్కడకు తీసుకు రాకుండా మేనేజ్ చేయ్..."

"అయ్యో ... కనీసం ఈ పరిస్తితుల్లోనైనా అత్తయ్యను మనదగ్గరుంచుకోవడం న్యాయమండి... ఆలోచించండి..."

"నీకూ నోరు లేస్తోందే... మీ ఆడవాళ్ళకేం తెలుస్తాయి మా కష్టాలు... డబ్బు దండగవ్వడమే కాదు... ఆమెతో మహా చికాకు... అతి మూత్రవ్యాధి వల్ల ఎక్కడ బడితే అక్కడ ... చీ చీ... ఇప్పుడు పక్షవాతం కూడా తోడయ్యిందంటున్నాడు... ఇంటికి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిపోతూంటారు... అసహ్యంగావుంటుంది... "

"అదంతా నేను చూసుకుంటాను... ఎవరి కంటా పడవివ్వను... " శాంత నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తోంది..

"అతిగా మాట్లాడకు... చెప్పింది చెయ్... అంతే... అయినా ఇంకెన్నిరోజులు బ్రతుకుతుందామె... మహాఅంటె రెండు మూడేళ్ళు... ఈ వయసులో ఎంత ఖర్చుజేసినా ప్రయోజనమేమి వుండదు.... డబ్బు పోగొట్టుకోవడం తప్ప"

శాంత బదులేమి చెప్పకుండా గది నుండి బయటికెళ్ళిపోయింది...

ఈ ఆడాళ్ళంతా ఇంతే... ఏదీ అర్థం చేసుకోలేరు... మెదడు శూన్యం... వీళ్ల ఉనికే భూమికి భారమనిపిస్తుంది ఒక్కోసారి... నా టైమంతా వృధాచేశారు... రేపు ఆఫీసులో జరగబోయె బిజినెస్ మీటింగు తాలూకు అజెండా ప్రిపేర్ జేయాలి... ఫైళ్ళని ముందేసుకొని పని ప్రారంభించాను... రాత్రి పన్నెండు వరకు ఆ పనితోనే సరిపోయింది... మెల్లగా నడుం వాల్చాను... ఆలోచనలు చుట్టుముట్టసాగాయి...

అమ్మ భారమంతా నామీదనే వేయాలని చూస్తున్నారు... పెద్దవాణ్ణవ్వడమే నేను చేసిన పాపమా... నా తరువాతి వాడు రాజేష్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగానే సంపాదించాడు... ఈ సిటి లోనే వుంటున్నాడు... పైగా రాజకీయాల్లో కూడా ప్రవేషించాడు... మంచి ఆదాయం... పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు... ఆడంబరాలు... అమ్మ విషయం వస్తేమాత్రం నాటకీయంగా తప్పుకుంటాడు... రాజకీయాల్లో ఆరితేరాడుమరి...

చదువులో ఇద్దరు తమ్ముళ్ళు దద్దమ్మలే... చిన్నప్పటి నుండి నేను అన్నింట్లోను ఫస్టే... మంచి మార్కులతో మేనేజ్మెంట్ కోర్సు పూర్తిజేసి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను... పెళ్ళి మాత్రం నాన్న బలవంతం వల్ల పెద్దగా ఆస్తులేమి లేని దూరపు బంధువు శాంతదేవి ని చేసుకోవాల్సి వచ్చింది... తరువాత వున్న కొద్దిపాటి మామగారి పొలాన్ని తెలివిగా నాసొంతం చేసుకోగలిగాను...

అంచెలంచెలుగా ఎదుగుతూ పేద్ద కంపినీకి జి ఎం నయ్యాను.. నాలుగు రాళ్లు వెనకేసుకున్నాను... మొదటిసంతానం శ్రావణి... కలిసిరాని పుట్టుక... అరకొర మార్కులతో డిగిరీ పూర్తిచేసింది... ఇంకా చదువుకొని డబ్బు తగలెయ్యాలని చూసింది.. ఈ లోపు కాణి కట్నం అడగని ఓ చౌకబారు సంబంధం దొరికేప్పటికి పెళ్ళిచేసేశాను...నాలాంటి వాడి సంబంధం దొరకడమే అదృష్టంగా భావించారు మరి...

కాని ఏం లాభం, రెండుసవత్సరాలు తిరక్కముందే ఆక్సిడెంట్లో భర్తను పోగొట్టుకుంది... ఓ ఆడ బిడ్డను చంకనేసుకొని పుట్టిల్లు చేరింది... అంతా నా ఖర్మ... పెళ్ళిచేసేవరకు పోషించడమే వేష్టనుకుంటే జీవితాంతం నా మెడకు చుట్టుకుంది... రెండవ సంతానం రమేష్... డిటో నా పోలికలే... మొహమే కాదు తెలివితేటల్లో కూడా... యుఎసెలో ఎంబియె చేశాడు... కోటీష్వరుడి కూతుర్ను చేసుకొని యుఎస్లోనే సెటిల్ అయ్యాడు... వెరీ బ్రిలియంట్... వాణ్ణి తలుచుకున్నప్పుడంతా నాకు గర్వంగా వుంటుంది... వారనికొక్కసారైనా ఫోన్ చేస్తూంటాడు... నేనంటే చాలా ప్రేమ... నా రిటైర్మెంట్ తరువాత నేనూ వాడి దగ్గరికే వెళ్ళి పోవాలన్నది ప్లాన్... ఏమవుతుందో చూడాలి... నిద్ర ముంచుకొస్తోంది మెల్లగా కళ్ళు మూతపడ్డాయి...

*********

ఈ మధ్య ఊపిరి సలపని పని... తొందర్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశముంది ఆదాయం తోపాటు పని ఒత్తిడి పెరిగుతోంది... అతిగా అలిసిపోవడం వల్లనేమో, శరీరం మొరాయిస్తోంది... ఆకలి మందగిస్తోంది... చాలాసార్లు యూరినేషన్లో కూడా ప్రాబ్లం అనిపిస్తోంది... హాస్పిటల్ వెళ్ళాలన్నా సమయం దొరకడం లేదు... దీనికి తోడు ఇంటి సమస్యలు తోడైనప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇంట్లో నన్నెవరు అర్థం చేసుకోరెందుకో...

ఇలా రోజుకు ఇరబైనాలుగ్గంటలు సరిపోవన్నట్లు పనిలో మునిగిపోయిన పరిస్థితుల్లో అమ్మ కన్ను మూసినట్లు కబురొచ్చింది... ఎక్కడికీ కదల్లేని పరిస్థితి... ఎవరేమనుకుంటే నాకేంటి... అనుకునే వాళ్ళేమైన నా కష్టాలు ఆరుస్తారా తీరుస్తారా... శాంతను పంపించి ఫార్మాలిటీస్ పూర్తిచేయించాను... మరో పదిహేనువేలు బొక్క నాకు... ఏం చేస్తాం ఆడిపోసుకునే వాళ్ళకోసమైనా ఖర్చుపెట్టక తప్పదు కదా.... ఏ మైతేనేం అక్కడితో అప్పుడప్పుడు డబ్బుకోసం నావెంటపడే రమణ బాధ ఇక్కడితో ముగిసిపోతుంది... హమ్మయ్య ఒక సమస్య తీరింది...

కొద్ది కాలానికి అనుకున్నట్లు గానే అసిస్టంట్ వైస్ ప్రెసిడెంట్నయ్యాను...కంపెనీలోనే కాకుండా సంఘంలో కూడా గౌరవం పెరిగింది... రెండేళ్ళు అట్టే గడిచిపోయాయి... బిజీ బిజీ... నేను కూడా ఉన్నత శ్రేణుల్లో వున్న వ్యక్తుల్లో ఒకణ్ణయ్యాను... పరిపూర్ణమయిన జీవితం.. ఒక తెలివైన మనిషి సరైన ప్రణాళికతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న క్షణమది... నా తమ్ముడు రాజేష్ కూడా ఎమ్మెల్యే అయ్యాడు.. ఒక మారుమూల పల్లెటూళ్ళో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన మమ్మల్ని చూసి మానాన్న పైలోకంలో గర్వపడుతూండాలి...

ఇల్లొచ్చేసరికి ఆలోచనలనుండి బయటపడి కారు దిగాను ... ఈ మధ్యనే కొన్న కొత్త బంగళాలోకి అడుగుపెట్టాను... నా కూతురు శ్రావణి ఎదురొచ్చింది నవ్వుతూ... తనంటే నాకు పడదు... నా జీవితంలో చిన్న ఓటమికి గుర్తు ఆమె.. చూసి చూడనట్లే లోపలికెళ్ళిపోయాను....

"శాంతా నేనింట్లో కొచ్చేప్పుడు గాని , బయటికెళ్ళేప్పుడు గాని నా కెదురుపడవద్దని శ్రావణికి చెప్పమని ఎన్నిసార్లు చెప్పాను... ఈ ఇంట్లో నామాట ఎవ్వరు వినిపించుకోరేంటి...?" ఫ్రష్ట్రేషన్ లో వచ్చిన కోపంతో నా గొంతు వణుకుతోంది...

"పొరపాటయ్యిందండి... ఇంకోసారి జరగదు... మీరావేషం తెచ్చుకోకండి... అసలే మీ ఆరోగ్యం బాగోలేదు..."

"ఆ జ్ఞానం ముందుండాలి... " కోపాన్నణుచుకునే ప్రయత్నం ఫలించడం లేదు... విసుగ్గా గదిలోకెళ్ళిపోయాను..

ఆ రోజు రాత్రికి నా ఆరోగ్యం ఇబ్బంది పెట్టింది.. వొమిటింగ్స్ ... నీరసం... గత రెండురోజులుగా యూర్నేషన్లో బాగా తేడాగా అనిపించింది... నిద్ర లేమివల్ల వేడి చేసుంటుందనుకున్నాను... కాని ఈ రోజు ఏదో విపరీతమైన బ్యాక్ పైన్ తో బాటు ఆకలి లేకకోవడం... శరీరంలో ఏదో పెద్ద మార్పే జరిగిందనిపిస్తోంది... కంగారుపడ్డ శాంత నన్ను బలవంతంగా ఆ రాత్రే హాస్పిటల్ కు తీసుకెళ్ళింది...
అదే మంచిదయ్యింది టైంలీ ఆక్షన్ చాలా రిలీఫిచ్చింది..

********

మరుసటి రోజు అన్ని పరీక్షలు జరిపిన తరువాత తెలిసింది అసలు సమస్య...

"యూరేమియా" డాక్టర్ సీరియస్ గా నా మొహంలోకి చూస్తూ చెప్పిన మాట అది...

ఎప్పుడో కథల్లో చదివిన, కాళ్ళ క్రింద నేల ఒక్కసారిగా కదలడమన్న మాట అనుభవంలోకొచ్చేసరికి వున్నట్టుండి కాళ్ళు చేతులు చల్ల బడ్డట్లనిపించిది...

"ఇన్ని రోజులేం చేశారు... సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్... నాట్ టు వర్రి ... ఈ కాలంలో క్యాన్సర్ నుండే బయటపడగలుగున్నారు... ఇట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ.. " డాక్టర్ త్రివేది గొంతులోని ప్రొఫెషనల్ కాంఫిడెన్స్ కూడా నాకు ఊరట కలిగించలేకపోయింది... శాంత నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తోంది.

"ఆ దరిద్రం మొహం ఇంట్లో తిరుగుతూ కనిపిస్తూంటె ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే వున్నాను..." శ్రావణి ఉనికిని తట్టుకోలేని నా మనసు మండిపోతోంది. శాంత బాగా బాధ పడుతున్నట్లనిపించింది. నేనలా శ్రావణిని అన్నందుకా లేక నా అనారోగ్యం గురించా అన్న విషయం అర్థం కాలేదు...

నా జీవితంలో తిరోగమనం మొదలయ్యిందనిపించింది... అందుకున్న విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే ఏమిటీ పరిణామం... రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోంది.. కిడ్నీస్ పూర్తిగా పాడయ్యాయి.. పరిస్థితి డయాలిసిస్ వరకు వచ్చింది.. ఇమ్మీడిఏట్ గా కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం ... సరైన డొనార్ దొరకాలి... లేదంటే...? ఊహించుకోవడానికి కష్టంగా వుంది... వద్దన్నా వినకుండా యుఎస్ లో వున్న మా అబ్బాయి రమేష్ కు విషయం తెలియ జేసింది శాంత. వాడెంత బాధ పడుతున్నాడో ఏమొ. పని ఒత్తిడి గురుంచి నాకు బాగా తెలుసు. ఇబ్బంది పడి వచ్చే ప్రయత్నం చేయొద్దని చెప్పాను. నాకు జీర్ణం కాని విషయమేమిటంటే నావాళ్ళనుకున్నవాళ్ళందరూ మొదట్లో ఒకసారి ఫార్మల్ గా పలకరించడానికొచ్చారే గాని తరువాత తిరిగి చూసినవాళ్ళు లేరు.. కొంతమందైతే అసలు ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు... ఎంతో మందికి ప్రమోషన్లిపించాను. పైకి తీసుకొచ్చాను.. అఫ్కోర్స్ అందులో కొంత నా స్వార్థం కూడా వుండి వుండవచ్చు... గ్రూపిజం తప్పదు మరి. మనుష్యులను చదవడంలో ఫైలయ్యానా. నేనిక తిరిగిరానని ఫిక్సయిపోయింట్లున్నారు. దొంగ వెదవలు. అవకాషమొస్తే అందరిని కాల్చేయాలన్నంత కోపమొచ్చింది...

ఈ సమయంలో నా భార్య శాంత చేసిన సేవలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి... ఒక మనిషిని ఇంకో మనిషి ఇంతగా ప్రేమించే అవకాశం వుందా....! తన కిడ్ని నాకు డొనేట్ చేయడానికి సిద్దమయ్యింది.. కాని తన అనారోగ్య కారణాల వల్ల డాక్టర్లు నిరాకరించారు.

కొద్దిరోజుల నిరీక్షణ తరువాత కిడ్ని డొనార్ దొరికారని తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఆపరేషన్ జరిగింది. సక్సస్ ఫుల్ గా ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగిపోయింది. మెల్లగా ఆరోగ్యం కుదుటపడసాగింది. నెల రోజుల్లో పూర్థిగా కోలుకున్నాను.. నాకు కిడ్ని డొనేట్ చేసిన వ్యక్తిని చూడాలనుంది. అదేవిషయం శాంతను అడిగాను. శాంత కంట్లో నీళ్ళు తరగడం చూసి విచిత్రంగా అనిపించింది. బహుశా నా ఆరోగ్యం కుదుటపడిన సందర్భంగా వచ్చిన ఆనంద భాష్పాలేమొ అనుకున్నాను..

"చెప్పు శాంత ఎవరా పర్సన్" నాకు తెలుసుకోవాలన్న అత్రుత పెరుగుతోంది.

శాంత మౌనంగా వుంది.

"ఏమైంది శాంత ... మాట్లాడవేంటి..." శాంత మౌనం విచిత్రంగా అనిపిస్తోంది.

ఈ లోపల డాక్టర్ త్రివేది గారొచ్చారు ...

"వాసుదేవ్ గారు ఎలావున్నారు...?"

"ఫైన్ సర్ థాంక్యు... సర్ ఐ వాంట్ టు నొ ది కిడ్ని డొనార్స్ నేం. ఎందుకు అందరూ దాస్తున్నారు... ఎనీ ట్రాజిక్ రీజన్ దేర్...? ప్లీజ్ టెల్మి..."


డాక్టర్ గారు ఏమి చెప్పాలన్నట్లు శాంత వైపు చూడ్డం నాకాశ్చర్యమనిపించిది. శాంత డొనేట్ చేసిందా...? అవకాశమేలేదు. మరి. ఎవరో నాకు తెలిసిన వాళ్ళే అయివుండాలి...
డాక్టర్ గారు బదులిచ్చేలోపు ఓ నర్సు వచ్చి డాక్టర్ గారికోసం ఎవరో వచ్చారరని చెప్పింది.
"ఓకె మిష్టర్ వాసుదెవ్... షి విల్ టెల్ యు.... టేక్ కేర్..." అంటూ డాక్టర్ గారు వెళ్ళిపోయారు...

ప్రష్నార్థకంగా శాంత వైపు చూశాను...

"మీరు కోప్పడనంటె చెబుతాను... వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది..." శాంత గొంతులో భయం చూస్తూంటె నాకు మొదటి సారిగా నామీద నాకెందుకో ఓ రకమైనా చీదరింపుగా అనిపించింది... నేనింత భయపెట్టానా ఈమెను..

"శాంత అదేంలేదు, చెప్పు .. నీవేంచేసినా మన మేలుకోసమే అయ్యుంటుందని నాకు తెలుసు... నిస్సంకోచంగా చెప్పు.."

"శ్రావణి ... అవును శ్రావణి డొనేట్ చేసింది కిడ్ని... తనంటె మీకు కోపం... ముందే చెబితే మీరొప్పుకోరేమోనని చెప్పలేదు... ఆపఆపరేషన్ కు ముందు చెప్పొద్దని డాక్టర్ను రెక్వెస్ట్ చేసుకున్నాము" శాంత గొంతులోని వణుకు నన్ను వణికిస్తోంది...

శ్రావణి నాకు కిడ్ని ఇచ్చిందా ...? నన్ను బ్రతికించిందా... ? నేనసహ్యించుకునే మనిషి నా ప్రాణం కాపాడిందా....? నా కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేక పోతున్నాను...

"ఏవండి... బాధపడకండి... కావాలని చెయ్యలేదండి వేరే దారి లేకపోయింది... మీకు చెప్పకూడదనే అనుకున్నాము... మీరే బలవంతం చేశారు...." శ్రావణి కిడ్ని నా బోడీలో పెట్టినందుకు నేను బాధ పడుతున్నాని శాంత భావిస్తోందని అర్థమయ్యింది...

సిగ్గుతో పాతాళంలోకి జారిపోతున్న భావన... జీవితంలో ఏమి కోల్పోయానో అర్థమవుతూంటే గట్టిగా ఏడవాలనిపించింది...

ఆడవాళ్ళను చిన్నచూపు చూశాను. కన్న తల్లిని కడసారి చూసే ప్రయత్నం కూడా చేయలేదు... సహధర్మచారిణిని బానిసలా చూశాను ... లక్ష్మి దేవిలాంటి కూతురు జీవితాన్ని, నా స్వార్థ చింతనతో, ఇష్టం లేని పెళ్ళిని జేసి , నాశనం చేశాను... మూర్ఖత్వాన్నే తెలివిగా భావించాను.. ఆడదాని అసలు రూపం కళ్ళముందు సాక్సాత్కరిస్తోంది.. తల్లిగా నలిగింది... భార్యగా భరించింది... కూతురుగా కట్టుబాట్లకు లొంగి కాలం వెళ్ళబుచ్చుతోంది... ఈ జనారణ్యంలో రోజూ నరరూప రాక్షసుల దాడికి బలైపోయే నిర్భయలెంతమందో..

"శాంత ... శ్రావణెక్కడ...?"

"పక్క గదిలో వుంది..."

ఇంతలో డాక్టర్ త్రివేది గారు మళ్ళీ గదిలోకొచ్చారు... ఈ సారి అతని పక్కన మరొకతనున్నారు...

"వాసుదెవ్ రావ్ ఇతన్ని గుర్తుపట్టారా... పాతికేళ్ళ క్రితం ఈ హోస్పిటల్లోనే వుండేవారు... డాక్టర్ క్రిష్నా రావ్..."

"హెలొ మిస్టర్ వాసుదెవ్, గ్లాడ్ టు సీయు అగైన్ ... గుర్తుందా మీ మొదటి సంతానం అమ్మాయని తెలిసి అబార్షన్ చేయమని వచ్చారు... అప్పటికే చాలా ఆలస్యమైంది తల్లి ప్రాణానికి ప్రమాదమున్నందువల్ల అబార్షన్ చేయడానికి నిరాకరించామని గొడవ పడ్డారు కూడా... గుర్తొచ్చిందా.... ఆ అమ్మాయె మీకిప్పుడు కిడ్ని ఇచ్చి మిమంల్ని సేవ్ చేసిందని తెలిసింది... యూ ఆర్ సో లక్కి టు హావ్ ఎ చైల్డ్ లైక్ హర్ ... " డాక్టర్ క్రిష్నా రావ్ కరచాలనం చేస్తూ అన్నారు...

"ఇంత జరిగినా మీ ఒక్కగానొక్క కొడుకు చూట్టానికైనా రాలేదు... మీరొద్దనుకున్న కూతురే మీకు ప్రాణ దానాం చేసింది..." డాక్టర్ త్రివేది మాటలు ఈటెల్లా నాగుండెల్ని పొడిచేస్తున్నట్లుగా వున్నాయి... సిగ్గుతో తలవంచుకోవడం తప్ప ఏమి మాట్లాడలేకపోయాను...

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు