గడుసు అమ్మాయి - చెన్నూరి సుదర్శన్ ,

gadusu ammaayi

ప్రతీరోజు సాయంత్రం గ్రంథాలయానికి వెళ్ళడం నాకలవాటు. వాకింగ్ చేసినట్లూ ఉంటుంది.. కాసేపు దిన పత్రికలన్నీ తిరగేసీనట్లుందని ఉంటుందని బయలు దేరుతాను. కాని వచ్చిన చిక్కంతా రోడ్డు దాటడమే... హైదరాబాదులో రోడ్డు దాటటమంటే మాటలు కావు.

అలనాటి ‘పాతాళ భైరవి’ సినిమాలో మాంత్రికుడు ఎస్వీ ఆర్, ‘సాహసివిరా.. వర పుత్రుడివిరా.. సాహసం సేయరా ఢింభకా.. రాజ కుమారి లభిస్తుంది’ అని ఆశ జూపిస్తూ.. ఎన్టీ ఆర్ ను కత్తుల ద్వారాన్ని దాటమన్నాడేమో..! గాని నేడైతే మన రోడ్లను దాటమనే వాడు.

ఈ షష్టి పూర్తి వయసులో గ్రంథాలయం మీది మక్కువ నన్ను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తుంది.

ఆ రోజు యథావిధిగా హైదర్ నగర్ బస్ స్టాప్ వద్ద రోడ్డు దాటుతున్నాను. నా వెనకాలే వచ్చిన టీనేజీ అమ్మాయి నన్ను దాటేసి.. ప్రక్క నుండి కారు దాన్ని ఓవర్టేక్ చేస్తూ వస్తున్న టూవీలర్ నూ గమనించినా.. వాళ్ళే ఆగుతారులే.. అనే నిర్లక్యపు ధోరణితో వెళ్తోంది. నేను ఆగి పోయాను. కారు, బండి మధ్యలో ఆమె నలిగి పోతుందేమోనని వణికి పోయాను. అమ్మాయి వీపుపై పుస్తకాల బస్తా కూడావుంది. అదృష్ట వశాత్తు త్రుటిలో ప్రమాదం తప్పింది.

“ఏంమ్మా.. అంత తొందరెందుకు? చూస్తూ.. చూస్తూ.. ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావ్..” అని కాస్తా మందలింపు ధోరణిలో అన్నాను.. నావయసు ప్రభావమది.

“మైండ్ యువర్ బ్యుజినెస్” అంటూ నావైపు తీక్షణంగా చూసి అంతే వేగంతో వెడలి పోయింది.

‘గడుసు అమ్మాయే..’ అనుకున్నాను. అమ్మాయి చూపులు నన్ను ‘ముసలోడా.. నువ్వూ నేనూ ఒకటేనా..!’ అన్నట్లుగా ఉన్నాయి. ‘ఇంతేలే ఈ కాలపు పిల్లలు.. అయినా అది ఆ అమ్మాయి తప్పు కాదు. పెద్దలతో గౌరవంగా మాట్లాడాలని చెప్పే వృద్ధులు వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చు. తల్లి దండ్రులకెక్కడిది సమయం.. పిల్లలకు మర్యాదలు నేర్పడానికి తీరికెక్కడిది..?’ అని మనసులో గొణుక్కుంటూ గ్రంథాలయం దారి పట్టాను.

ఒక గంట తరువాత గ్రంథాలయం నుండి బయలు దేరి దారిలో ఉన్న దేవాలయం వద్ద కాసేపు విశ్రమించి ఇంటి ముఖం పట్టాను. ఇది నా సంధ్యా సమయ నిత్య కృత్యం.

యాదృచ్చికంగా ఆ అమ్మాయి మళ్ళీ నా వెనకాలే వస్తోంది.. అది కాస్తా ఇరుకైన పూజా హాస్పిటల్ రోడ్డు.

ఎదురుగా వాటర్ ట్యాంకర్ బండి వేగంగా వస్తోంది. మూత సరిగ్గా లేక పోవడంతో ట్యాంకర్ లోని నీళ్ళు ఫౌంటెన్ లా విరజిమ్ముతూ ప్రక్కగా నడిచే వారిని పావనం చేస్తోంది. అది గమనించి నేను రోడ్డుకు ఇంకాస్తా పక్కకు తప్పుకున్నాను. అదే అదునుగా ఆ అమ్మాయి పరుగు రూపంలో నన్ను దాటేసి ముందుకు వెళ్ళింది. ఇంతలో ట్యాంకర్ ను ఓవర్ టెక్ చేసిన కారు సైడు మిర్రర్ అమ్మాయిని రాసుకుంటూ రన్ వే పై విమానంలా వెళ్ళిపోయింది.

అమ్మాయి భయంతో “అమ్మా ..!” అంటూ కేక పెట్టి నేలపై నా ముందు పడి పోయింది. పెద్దగా గాయ పడినట్లుగా లేదనుకొని ‘తిక్క కుదిరింది..’ అనుకున్నాను మనసులో..

గడుసు అమ్మాయికి కాలు బెణికినట్లుంది.. లేచి సరిగ్గా నిల్చోలేక పోతోంది. నా వంక దీనంగా చూసింది.

“మైండ్ యువర్ బ్యుజినెస్” అంటూ నేను వెటకరించి వెళ్ళి పోయాను.

సమయ పాలన ప్రభావమేమో..! పది రోజుల తరువాత గడుసు అమ్మాయి మళ్ళీ కనబడింది. నేను ఆమెను చూడనట్లే నటిస్తూ.. రోడ్డు దాటే ప్రణాళికలో ఉన్నాను. నా బట్ట తల.. సోడా బుడ్డి కళ్ళద్దాలను చూసి అమ్మాయి గుర్తు పట్టినట్లుంది.“హలో.. తాతయ్యా.. గుడ్ ఈవినింగ్..” అంటూ నా పక్కకు చేరింది.

“హలో మైండ్ యువర్ బ్యుజినెస్” అన్నాను ఠక్కున.. ఎవరైనా తనని అకారణంగా ఒక మాట అంటే దానినే పదే పదే వల్లె వేయటం వృద్ధాప్యంలో సహజం అనుకుంటాను.. నా నోటికి అలా వచ్చేసింది.. అనకపోవాల్సింది అనుకున్నాను.

అమ్మాయి కాస్తా నొచ్చుకున్నట్లు బుంగ మూతి పెట్టింది.

“సారీ తాతయ్యా.. నా పేరు పృశ్ని” అంది.

“పృశ్ని.. గుడ్ నేమ్.. దాని అర్థమేంటో తెలుసా?” తనను మంచి చేసుకోవాలనే ధోరణిలో అడిగాను.

“నో.. తెలీదు” అంటూ తన గులాబి పెదవులను విప్పింది.

“కిరణం .. ఎ రే ఆఫ్ లైట్. అది శ్రీకృష్ణ పరమాత్ముని తల్లి దేవకి మరో పేరు కూడా..” అంటూ పరమాత్ముడు అంటే తెలుసో తెలయదో అని “ది గాడ్ శ్రీకృష్ణ” అని రెండు చేతులతో నమస్కరిస్తూ అర్థమయ్యేలా చెప్పాను.

“ ఓ..! ఐసీ..!!” అంది. అమ్మాయి కళ్ళు మిల మిలా మెరిసాయి.

“అవునూ.. ఎలా ఉంది.. నీ కాలు నొప్పి? పూర్తిగా తగ్గిందా..” అంటూ వాకబు చేసాను.

“తాతయ్యా.. మీరా రోజు చాలా హెల్ప్ చేసారు. లేకుంటే ఇంత త్వరగా నడిచే దాన్ని కాను” అమ్మాయి మాటల్లో ఏంతో ఆర్ద్రత కనబడుతోంది.

“నేనేం చేసాను..?”

“నాకు బుద్ధి రావాలనే అలా వెక్కిరించి వెళ్ళారు. బట్.. యు ఆర్ వెరీ నోబెల్ మాన్. హెల్ప్ డ్ మీ ఎలాట్.. మీరు వెళ్లి ఒకతనికి డబ్బులిచ్చి నా వద్దకు పంపించారు. నేను చూసాను.. అతడు నన్ను పూజ హాస్పిటల్ కు తీసుకెళ్ళి పట్టీ కట్టించాడు. మందులిప్పించాడు. మా ఇంట్లో దిగ బెట్టాడు. మా నాన్న గారు డబ్బులిస్తుంటే తీసుకోలేదు.. మీరు తీసుకోవద్దన్నారట.. చాలా థాంక్స్ తాతయ్యా.. డాక్టర్ వన్ వీక్ రెస్టు తీసుకొమన్నారు.. ఈ రోజే స్కూల్ కు వెళ్లి వస్తున్నాను”

ఇదేమీ గొప్ప విషయం కానట్లుగా నేను రోడ్డు దాటుతుంటే.. నాచేయి పట్టుకుంది పృశ్ని. నాకు ఎనలేని ఆత్మీయతా భావం కలిగింది. రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన నా ముద్దుల మనవరాలు గుర్తుకు వచ్చి కంట తడి పెట్టించింది. నిత్యం వెళ్ళే స్కూల్ బస్సే ఆమె ప్రాణాలను కబళించింది. లిప్త కాలం అచేతనుడై పోయాను. గడుసు అమ్మాయి అనుకున్న పృశ్ని ఈ రోజు నన్ను రోడ్డు దాటించింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు