ఈ ప్రశ్నకు బదులేది - - పి.బి.రాజు

eeprasnaku baduledi

విషయం విన్న రామచంద్ర కుప్పకూలిపోయాడు. సహోద్యోగులు సపర్యలు చేశాక మెల్లగా కళ్ళుతెరిచాడు. పదవ తరగతికి పాఠం చెపుతుండగా పోన్ వచ్చింది.
"మీ అమ్మాయి శ్వేత ఆత్మహత్య చేసుకుంది..." మాట పూర్తి కానే లేదు.
"నో..."విరుచుక పడి పోయాడు. ఒక్క సారిగా విభ్రాంతికి లోనైనాడు.
వార్త దావానలంగా వూరంతా ప్రాకి పోయింది.
వెంటనే పట్నానికి బయలు దేరాడు రామచంద్ర కొలీగ్స్ తో.
"బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తీసుకెళ్ళారు" అన్నారు కాలేజ్ యాజమాన్యం.
అక్కడ్నించి హాస్పిటల్ కి పరుగు.
"ఒక్క సారి చూడనివ్వండి నా పాపను..." బ్రతిమలాడాడు.
"నో. ఇప్పుడు కుదరదు. పోస్ట్ మార్టం అయ్యాక తీసుకెళ్ళండి." హాస్పిటల్ సిబ్బంది కేకలేశారు.
"రాత్రి పోన్లో మాట్లాడింది. మామూలు గానే మాట్లాడింది. తనకేదైనా ప్రాబ్లెం ఉంటే నాతో చెప్పేది. నా దగ్గర ఏదీ దాచదు. రాత్రి బాగున్న పాపకేమయింది.." పిచ్చిగా రోదించాడు రామచంద్ర.
“ తల్లిలేని పిల్లని అపురూపంగా పెంచుకున్నాను. ఏమయింది...ఇంతలో ఏమయింది. చూశారా సార్! నా పాప ఆత్మహత్య చేసుకుందట!...అంత పిరికిదా నా పాప!...నో ….నా శ్వేత అంత పిరికిది కాదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కానే కాదు.” కొలీగ్స్ ఎంత ఓదార్చినా రామ చంద్ర దుఃఖం ఆగ లేదు.
శ్వేత అందమైన అమ్మాయి. భవిష్యత్ పై ఎన్నో కలలు కన్నది. ఏదో సాధించాలని తపన పడేది. ఉన్నత శిఖరాలధిరోహించి సమాజ సేవ చేయాలని; ఎన్నో...ఎన్నెన్నో కలలు ఆ కళ్ళల్లో ...కానీ ఇప్పుడు ఆ కళ్ళు శాశ్వతంగా మూత పడి పోయాయి. ఒక లేత గులాబి అర్థాంతరంగా రాలి పోయింది.
శ్వేత ప్రెండ్స్ వచ్చారు. "ఇది ఆత్మ హత్య కాదు. హత్యే." అన్నారు.
" తన బిడ్డను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఎందుకొచ్చింది?" రామచంద్ర మౌనంగా రోదించాడు.
ఇంతలో మహిళా సంఘాలొచ్చాయి. ప్రజా సంఘాలొచ్చాయి. విద్యార్థి సంఘాలొచ్చాయి.
"శ్వేతది ఆత్మ హత్య కాదు...హత్యే. నిందితుల్ని శిక్షించాలి. కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి"
అరుపులు......కేకలు…...స్లోగన్స్ మిన్నుముట్టాయి.
పోలీస్ లొచ్చారు. "అందర్నీ వెళ్ళిపొమ్మ”ని వార్నింగిచ్చారు.
అయినా విద్యార్థులు ఆపలేదు. హాస్పిటల్ ముందు ఉధృత పెరిగి పోయింది. విద్యార్థులు కదం తొక్కారు. నినాదాలతో మిన్నుముట్టింది. క్షణాల్లో పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. ఏం జరుగుతుందో తెలిసే లోపలే అన్నీ జరిగి పోయాయి. రాళ్ళు రువ్వడాలు; లాఠి చార్జీలు; ఫైరింగ్...ఇద్దరి పిల్లల ప్రాణాలు గాలిలో కలిసి పోవడం..144 సెక్షన్ విధించడం... ఎక్కడి కక్కడ అరెస్టులు.
రామచంద్రానికి ఏమీ అర్థం కావడం లేదు. అసలేమి జరిగిందో; ఏమి జరుగుతుందో అర్థం కాక తల పట్టుకున్నాడు.
సాయంత్రానికి డెడ్ బాడీ ఇచ్చారు. శవాన్ని చూసి బావురుమన్నాడు రామచంద్ర. నిన్న నవ్వుతూ మాట్లాడిన తన శ్వేత ఇపుడు విగత జీవిగా తిరిగొచ్చింది. జరగాల్సింది కొలీగ్స్ దగ్గరుండి జరిపించారు. అంతా యాంత్రికంగా చేశాడు. మరో వారం రోజులు పట్టణం అట్టుడికి పోయింది. బంధ్ పాటించారు. రాష్ట్రమంతా కాలేజ్ లు మూత పడ్డాయి. "శ్వేతకు న్యాయం జరగాలి. నిందితుల్ని శిక్షించాలి." నినాదాలు మిన్నుముట్టాయి. విధ్యార్థులు; మహిళా సంఘాలు కదం త్రొక్కాయి." ఆడ వారికి రక్షణ లేకుండా పోయింది." ప్రతి పక్షాలు నినదించాయి. రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. రెండు బస్సులు దగ్ధమయ్యాయి. విద్యార్థులు; పోలీస్ లు పరస్పరం రాళ్ళు రువ్వుకున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. కొంత మంది హాస్పిటల్ పాలయ్యారు. అన్ని టీ. వీ. లు లైవ్ కవరేజ్ చేశాయి. బంద్ విజయ వంతం అన్నాయి కొన్ని. బంద్ ఫ్లాప్ అన్నాయి మరి కొన్ని. ప్రభుత్వం ఆఘ మేఘాల మీద ఎంక్వైరీ కమీషన్ వేసింది. " చట్టం తన పని తను చేసుకుపోతుంది. దోషులు ఎవరైనా; ఎంతటి వారినైనా శిక్షిస్తాం. వదిలి పెట్టే ప్రసక్తే లేదు." ప్రభుత్వం ప్రకటించింది.
పది రోజులు అట్టుడికిన రాష్ట్రం క్రమంగా సాధారణ స్థితికొచ్చింది. విద్యార్థులు చల్ల బడ్డారు. పోలీస్ లు స్థిమిత పడ్డారు. ప్రతి పక్షాలు శాంతించాయి. పరిస్థితులు చక్క పడ్డాయి. తను షాక్ నుంచి తేరుకోక ముందే తన ప్రమేయమే లేకుండా; తనకు తెలియకుండానే ఎన్నో జరిగి పోయాయి.
చట్టం తన పని తను చేసుకు పోతూనే ఉంది. రోజులు గడిచి పోతున్నాయి. కానీ శ్వేత కేస్ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఒక శుభోదయాన 'శ్వేతది ఆత్మ హత్యే' అని తేల్చేసి ఫైల్ క్లోజ్ చేసేశారు పోలీస్ లు; చాలా ప్రశ్నలకు సమాధానాలు రాకుండానే.
'రాత్రి ఒంటి గంటకు బాత్రూం కి వెళ్ళిన దీప్తి మొదట చూసిందట. వెంటనే వార్డెన్ కి ఇంఫార్మ్ చేసిందట." - ఇదీ కాలేజ్ యాజమాన్యం కధనం.
ఇటీవల జరిగిన సెమిస్టర్లో అనుకున్నంత మార్కులు రాలేదని బాధ పడిందని- ఆత్మహత్యకు అదే కారణం కావచ్చని కాలేజ్ వారి వాదన.
"ఇది ఆత్మ హత్య కాదని; ముమ్మాటికి హత్యే నని- దీని వెనక ఎవరిదో పెద్దల హస్తం ఉందని- దాన్ని వెలికి తీయాలని”- మహిళా సంఘాల వాదన.
పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చేశారని; డాక్టర్ అమ్ముడు పోయాడని - తెర వెనుక ఏదో జరిగిందని -విద్యార్థుల వాదన.
ఇందులో ఎవరిది తప్పో; ఎవరిది ఒప్పో తన కనవసరం.
తనకు కావలసింది నిజం. అసలు ఆ కాళ రాత్రి ఏం జరిగింది? తన బిడ్డ చావు మిస్టరీ ఏంటి? రాత్రి ఒంటి గంటకు చనిపోతే; ఉదయం ఏడు గంటలకు పోలీస్ రిపొర్టిచ్చారు. వెంటనే ఎందుకివ్వలేదు? పోలీస్ లు హడావుడిగా హాస్పిటల్ కెందుకు తరలించారు? పోస్ట్ మార్టం కు ఎందుకంత తొందర పడ్డారు? తండ్రికి పద కొండుకు ఇంఫార్మ్ చేశారు? వెంటనే ఎందుకు చెయ్యలేదు? తండ్రినెందుకు బాడీని చూడనివ్వలేదు? ఎక్ష్ గ్రేషియా ఇచ్చి దులుపేసుకోవాలని ఆత్ర పడుతున్నారు? వెనుక ఎవరి హస్తం ఉంది? ఎన్నో అనుమానాలు? మరెన్నో సందేహాలు? దేనికీ సమాధానాలు లేవు. తనకు న్యాయం చేయమని ...ఎందర్నో కలిశాడు. ఎన్నో మెట్లెక్కాడు. మహిళా సంఘాలు; విద్యార్థి సంఘాలు రోడ్లెక్కాయి. ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించారు.
అయినా తేల్చ వలసిన వారు తేల్చేశారు; అది ఆత్మ హత్యే నని. అన్ని ఫైల్స్ మూసేశారు. అన్ని ద్వారాలు మూసుకు పోయాయి. టిచరయి ఉండీ; తన పాపకు న్యాయం చేయలేకపోయాడు రామచంద్ర. తన పిచ్చి గానీ...చని పోయాక న్యాయమేంటి? గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ కన్నీళ్ళకు ఓదార్పు లేదు. ఆ బడబాగ్ని ఆరేది కాదు.
**********************************
రెండేళ్ళు గడిచాయి. గీత టెంత్ లో స్టేట్ ఫస్టొచ్చింది. పేపర్లలో; టీ .వీ .లలో గీత పేరు మారు మ్రోగుతోంది. రాష్ట్ర నలు మూలల నుంచి అబినంధనల వర్షం కురుస్తోంది. రామచంద్ర ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. తన కల సాకారమయింది. తన పాఠశాల పేరు ఆ లిస్ట్ లో రావాలని కలలు కన్నాడు. ఇపుడు డబుల్ ఢమాకా! స్టేట్ ఫస్ట్ తన పాఠశాలదే కాదు. తన కూతురిది కూడా. కూతురి ద్వారా పాఠశాల పేరు కూడా మారు మ్రోగుతోంది. తట్టుకోలేని ఆనందం ... ఇప్పుడు తన భార్య.. పెద్ద కూతురు శ్వేత ఉండి ఉంటే ... ఎంత బావుండేదో?
“గీతను మా కాలేజ్ లో చేర్పించండి. అన్నీ ఉచితంగా ఇస్తాం. మా కాలేజ్ లో చేర్పించండి.” “ మా కాలేజ్ లో ... మా కాలేజ్ లో ….” ఆఫర్లే...ఆఫర్లు. పోన్ల మీద పోన్లు. రాష్ట్రం లోని టాప్ విద్యా సంస్థలన్నీ పోటీ ల మీద పోటీలు.
స్టేట్ టాపర్ని తమ తమ కాలేజ్ లలో చేర్చుకోవాలని స్టేట్ టాప్ కాలేజ్ లన్నీ తెగ తాపత్రయ పడ్డాయి.
అందరికీ రామచంద్ర సమాధానం ఒక్కటే. గతం తాలూకు గాయం ఇంకా ఆర లేదు. అది ఆరేదీ కాదు.
గత ప్రశ్నలకే అతనికి సమాధానాలు ఇంకా దొరక లేదు. ఉత్పన్నమయ్యే మరి కొన్ని ప్రశ్నలకి సమాధానాలకి ఎదురు చూసే ధైర్యం తన గుండెకి లేదు.
"చదువు లేక పోయినా ఫర్వాలేదు... నా పాప కళ్ళ ముందు బ్రతికుంటే చాలు." దృఢంగా అన్నాడు రామచంద్ర .
"అదేంటీ? స్టేట్ టాప్ ర్యాంకర్ని చదివించరా? ..." విస్తు పోయారు కాలేజ్ వారు.
"ఒక సారి మోసపోయి పెద్దమ్మాయిని పోగొట్టుకున్నాను. చదువులో ర్యాంక్ రాకపోయినా ఫర్వా లేదు . నా పాప కళ్ళ ముందు బ్రతికుంటే చాలు.” గుండె లోని ఆవేదన కరిగి కన్నీళ్ళయ్యాయి.
ప్రశాంతంగా చదువుకునే వాతావరణం ఏ కాలేజ్ లోనా ఉందా? ర్యాంక్ రాక పోయినా ఫర్వాలేదు. . ఏ కాలేజ్ అయినా నా పాప ప్రాణాలకి హామీ ఇవ్వగలదా?" ప్రశ్నించాడు రామచంద్ర.
ఒక తండ్రి ఆవేదన అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ భవిష్యత్ మాటేమిటి? ఈ ప్రశ్నకు బదులేదీ? *

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు