“నీకసలు బుద్ధుందా? నిశ్చితార్థం అయి పోయి, ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని, ఇప్పుడు నాకీ పెళ్లోద్దంటావా?” చెల్లెలు వెన్నెలపై మండి పడుతున్నాడు శరత్. “నీకూ నచ్చాడన్నావు కదా, మరిప్పుడేమయిందో చెప్పు?” తండ్రి విశ్వనాథం ప్రశ్న. “అసలిదంతా మీరిచ్చిన అలుసు కాదూ, ఆడ పిల్లలకు స్వేచ్ఛ కావాలంటూ దాన్నిట్ల తయారు చేసింది మీరే.” తండ్రిపై విరుచుకు పడుతోంది తల్లి పద్మావతి. ఈ అరుపులు, కేకలతో హాల్లోకొచ్చి నిలబడింది విశ్వనాథం తల్లి చెన్నమ్మ. వాళ్ళ మాటల ద్వారా ఆమెకర్థమైన సారంశం: చందుతో మరో నాల్రోజుల్లో జరగాల్సిన పెళ్లిని మనవరాలు వెన్నెల వద్దంటోంది. “ఏమైనాదమ్మా, నువ్వే ఆ పిల్లోడు బాగా నచ్చినాడని వొప్పుకుంటివి గదా, ఇప్పుడేమైనాదని వద్దంటాండవు?” అనునయంగా అడిగిందామె మనవరాలిని. “ఏమో నాకీ పెళ్లి ఇష్టం లేదంతే.” అందరికీ ఒకే సారి సమాధానం చెప్పి విస విసా లోపలికి వెళ్ళి పోయింది వెన్నెల. “ఇప్పుడేం చేస్తారో చెయ్యండి. ఆడ పిల్లని అందరూ నెత్తికెక్కించుకున్నారు కదా!” కాలితో తలుపును ధడేల్మని తోసేసి వీధి లోకి పోయాడు శరత్. పద్మావతి వంటింట్లో దూరి తన కోపాన్నంతా పాత్రల మీద చూపుతోంది. ఏం చేయాలో తోచక కుర్చీలో కూలబడి పోయాడు విశ్వనాథం.
వెన్నెలను స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా తీర్చిదిద్దింది తనే. బి. టెక్. పూర్తి చేసాక బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగం వచ్చినా కాదని, ఎం.టెక్. చదివి అనంతపురం లోనే జె.ఎన్.టి.యు. లో టీచింగ్ అసిస్టెంట్ గా చేరింది. పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టగానే ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పింది. ఏ పట్టింపులూ లేని, కట్న కానుకల ప్రసక్తి లేని; ఇక్కడే పనిచేసే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని, మహా నగరాల్లో లేదా విదేశాల్లో డాలర్లనార్జించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వద్దని తేల్చి చెప్పింది. తన భావ జాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కూతురు అభిప్రాయాలకు గర్వ పడుతూ, తన పరిచయాల్లో బోధనా వృత్తి లోనో, బ్యాంకు లోనో, ఇతర స్థానిక ఉద్యోగాల్లో ఎవరైనా ఉన్నారేమోనని వాకబు చేయగా, పెద్ద కష్ట పడ కుండానే తెలిసిన మిత్రుల ద్వారా ఆంధ్రా బ్యాంకు లో పని చేస్తున్న చందు సంబంధం వచ్చింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి, చందుతో వ్యక్తి గతంగా మాట్లాడాక, తన అభిప్రాయాలకు తగిన వ్యక్తేనని ‘ఓకే’ చెప్పింది వెన్నెల. నెల రోజుల క్రితం నిరాడంబరంగా నిశ్చితార్థం జరిపి, ముహూర్తాలు పెట్టుకున్నారు. వెన్నెల, చందు అప్పుడప్పుడు ఇంట్లో, బయట కలసి మాట్లాడుతున్నా, ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది కదా అని ఎవరూ అభ్యంతర పెట్ట లేదు. “అలాంటిది ఇప్పుడు కొత్తగా అతని గురించి వెన్నెలకేం తెలిసిందని పెళ్లి వద్దంటున్నది?” విశ్వనాథం తల పట్టుక్కూర్చున్నాడు. చెన్నమ్మ మెల్లగా కొడుకు దగ్గరి కొచ్చి భుజం మీద చెయ్యేసింది. “నువ్వేమీ దిగులు పడాకు విశ్వా, పాపతో నేను మాట్లాడి, సంగతేందో కనుక్కుంటాలే.” విశ్వనాథం తలూపాడు మౌనంగా.
******************
ఆ రోజు రాత్రి భోజనాలు కానిచ్చారనిపించి, ఎవరి పడకలకు వారు చేరారు. పడుకున్నరనేగానీ ఎవరికీ నిద్ర పట్టడం లేదు. వెన్నెలకు చిన్నప్పటి నుండి నాయనమ్మతో కలసి పడుకోవడం అలవాటు. చెరో వైపు తిరిగి పడుకున్నారు. చెన్నమ్మ ఆలోచిస్తోంది. చిన్నప్పటి నుంచీ వెన్నెల మనస్తత్వం తనకు బాగా తెలుసు. స్వీయ క్రమశిక్షణతో పెరిగింది తను. ముక్కు సూటి మనిషి. తనకు నచ్చిన పని ఎవరు చెప్పినా ఆపదు, తనకు నచ్చక పోతే ఎవరు చేయమన్నా చేయదు. “మనవ రాలు ఈ పెళ్లి వద్దని అంటున్నాదంటే ఏదో పెద్ద కారణమే వుండి వుంటాది.” అనుకుని మెల్లగా వెన్నెల వైపు తిరిగి, ఆమె పై చెయ్యేసింది. “ఏమైనాదమ్మా ఎన్నెలా, నువ్వా పిల్లోనితో మాట్లాడి, నచ్చినాడని చెప్పినాకనే కదా మూర్తాలు పెట్టించిండేది. ఇప్పుడేంటికి చేసుకోనని అంటాండవు? పిల్లోడు మంచోడు గాదని ఎవరైనా చెప్పినారా, చెడ్డలవాట్లు ఏమన్నా వుండాయా?” వెన్నెల సమాధానం చెప్పలేదు. “నిన్నేమయినా దుబారుగా మాట్లాడినాడా? చెప్పు తల్లీ, వాల్లకేం చెప్పాల మీ నాయన?” సమాధానం చెప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది చెన్నమ్మ. చివరికి నోరు విప్పింది వెన్నెల. “అదీ... మరీ.....” నసుగుతూనే అసలు కారణం చెప్పింది నాయనమ్మతో. “ఓస్... ఈ మాత్రం దానికి పెండ్లి వద్దంటాండవా తిక్క దానా? నేను ఆ పిల్లోనితో మాట్లాడతాలే, అంతా సర్దుకుంటుంది.” అని మనవరాలిని సముదాయించింది. నిజానికి వెన్నెలకూ ఈ సంబంధం వదులు కోవడం ఇష్టం లేదు. కానీ తనకంటూ కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలూ, ఆలోచనలు, అలవాట్లు వున్నాయి. వాటికి భిన్నంగా తను నడచుకో లేదు. వెన్నెలకు చిన్న తనం నుంచీ జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి.
వెన్నెల పై తండ్రి ప్రభావం చాలా ఎక్కువ. ఆయన క్రమ శిక్షణతో పాటు ఉన్నత భావాలున్న వ్యక్తి. వేకువ జామున ఐదు గంటలకే నిద్ర లేచి, ఉదయపు నడకకు వెళ్ళడంతో దిన చర్య మొదలవుతుంది. ఆ తర్వాత వార్తా పత్రికలు చదవడం, పెరటి మొక్కల పని చూడటం, టిఫిను గట్రా ముగించి ఆఫీసు కెళ్ళడం – సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటి కొచ్చి ఏదో ఒక పుస్తకం చదవడం, దాన్ని గురించి చర్చించడం, రాత్రి తొమ్మిదిన్నర కంతా నిద్రకుపక్రమించడం ఆయన అలవాటు. అవే అలవాట్లు వెన్నెలకూ వచ్చాయి. ఆది వారాలూ, సెలవు రోజులూ కూడా చీకటి తోటే నిద్ర లేవడం వెన్నెలకు అలవాటు మాత్రమే కాదు, అత్యంత ఇష్టం కూడా. “ప్రభాత సమయంలో నిశబ్ద సంగీతాన్ని ఆస్వాదించాలి, పక్షుల కిల కిలా రావాలతో సూర్యుణ్ణి స్వాగతించాలి.” అంటుంది మెరిసే కళ్ళతో. “అవును మరి, నువ్వు స్వాగతం చెప్పక పోతే సూర్యుడు వెనక్కి పోతాడు గావాల!” వెక్కిరిస్తాడు శరత్. పరీక్షల రోజుల్లో రాత్రంతా చదివి, తెల్ల వారు జామున నిద్ర పోయి, ఏ తోమ్మిదికో నిద్ర లేస్తాడతను. మిగితా రోజుల్లో కూడా అర్ధ రాత్రి వరకూ సినిమాలు, షికార్లంటూ తిరిగి ఏ నడి రేయో ఇంటికి చేరడం వెన్నెలకు చిరాకు తెప్పించేది. పొద్దున పరీక్ష వుందన్నా సరే రాత్రి పది గంటలకే పడుకునేది తను. మళ్ళీ వేకువ జామున లేచి చదువుకునేది. “పరీక్షలంటే అస్సలు భయం లేదు దీనికి, పది కూడా కాకుండానే దుప్పటి ముసుగు పెడుతుంది!” విసుక్కుంటాడు శరత్. “నా మనవరాలు నీలాగా రాత్రంతా జాగారం చెయ్యక పోయినా ఫస్టు గా పాసయితుంది. ఒక్కసారి చదివినాదంటే ఇట్లే నేర్చుకుంటాది, ఆయ్, ఏమనుకుంటాండవో?” మురిపెంగా వెనకేసుకొస్తుంది చెన్నమ్మ మనవరాలిని. “ ఏ మాట కా మాటే చెప్పు కోవాలి. ఎప్పుడూ కష్టపడి చదివినట్లే కనిపించదు, దీనికిన్ని మార్కులు ఎట్లోస్తాయో?” ఆశ్చర్య పోతుంటాడు శరత్.
ఇంటర్ తర్వాత కాకినాడ జె.ఎన్.టి.యు. లో బి.టెక్. చేరిన వెన్నెలకు హాస్టల్లో రూమ్మేట్లతో మళ్ళీ సమస్య మొదలు. రాత్రంతా సెల్ ఫోన్లో చాటింగులూ, ల్యాప్టాప్ లో బ్రౌజింగులూ చేస్తూ లైట్లు వెలిగించి పెడితే నిద్ర పట్టక అవస్థ పడేది తను. తన అలవాటు ప్రకారం వేకువ ఝామున లేచి చదువు కోవాలని లైటు వేస్తే ఆపేయమని గొడవ చేసే వాళ్ళు. ఎలాగోలా బి.టెక్. పూర్తి చేసాక, ఈ సరి ఎం.టెక్. కోసం హైదరాబాదు జె.ఎన్.టి.యు. లో చేరాల్సి వచ్చింది. పోనీలే, ఇక్కడ అమ్మాయిలు కాస్త పెద్దవాళ్ళు, మెచ్యురిటీ వున్న వాళ్ళు, అర్థం చేసుకుంటారు.” అనుకుంది. కానీ ఆమె ఆశ అడియాసే అయింది. మహా నగరాల్లో నాగరికత వెర్రి తలలు వేసి, ఈ అమ్మాయిలు రాత్రిళ్ళు పార్టీలూ, పబ్బులంటూ తిరిగి క్యాలెండర్లో తేదీ మారాక హాస్టల్ కు చేరే వాళ్ళు. వెన్నెలకు భరించ లేనంత అసహనం. “వీళ్ళంతా నిశా చరులు. రాత్రిళ్ళు సంచారాలు చేసి, పగలు నిద్రావస్థలో జోగుతుంటారు. ఈ స్తబ్ద జీవులతో సమాజమే స్తబ్దంగా మారి పోతుందా?” ఇలా చిరాకు పడుతూనే చదువు పూర్తి చేసింది. తను సాఫ్ట్వేర్ ఉద్యోగం వద్దనుకోవడానికి ఇదీ ఓ కారణమే. అమెరికా కంపెనీల కోసం పని చేసే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనకు రాత్రయితే అక్కడ పగలు కాబట్టి, వాళ్ళ కోసం రాత్రిళ్ళు పని చేయడం తనకు తెలుసు. “ఆ సంపాదనా వద్దు, రాత్రిళ్ళు జాగారాలు చేసే ఆ ఉద్యోగాలూ వద్దు.” అనేది స్పష్టంగా. అందుకే అలాంటి ఆలోచన లేని చందును పెళ్లి చేసుకోవడానికి వొప్పుకుంది. కానీ రెండు రోజుల క్రితం వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ వల్ల వెన్నెల పునరాలోచనలో పడి నిర్ణయం మార్చుకుంది. “తన నిర్ణయం తప్పా?” ఆలోచిస్తూనే నిద్ర లోకి జారుకుంది.
మరు దినం ఉదయం వెన్నెల కాలేజీకి వెళ్ళగానే, చెన్నమ్మ కొడుకుతో చందు ఫోన్ నెంబర్ తీసుకొని, అతనితో మాట్లాడింది. “బాబూ, ఏమనుకోక పోతే ఒక సారి ఇంటి కొస్తావా, నీతో మాట్లాడాల.” చందు ఆశ్చర్య పోయాడు. “ఎప్పుడూ లేనిది ఈ పెద్దావిడ నాకు ఫోన్ చేసి రమ్మంటున్నదేమిటి? ఏం జరిగుంటుందబ్బా?” అని మనసులో అనుకుంటూనే, “సరేలే అవ్వా! మధ్యాహ్నం భోజనం సమయంలో వస్తాను.” అని ఫోన్ పెట్టేశాడు. అన్నట్లు గానే మధ్యాహ్నం వాళ్ళ ఇంటి కెళ్ళాడు. వాకిట్లోనే ఎదురైన చెన్నమ్మ “రా బాబూ, భోంచేసావా?” అంటూ లోపలి తీసుకెళ్ళి వెన్నెల చెప్పిన విషయం చెప్పింది మెల్లగా. చందూ మొదట ఆశ్చర్య పోయి ఆ తరువాత పెద్దగా నవ్వేశాడు. “ఓస్ ఇదా విషయం, మొన్నటి నుంచి వెన్నెల నాతో ముభావంగా వుంది. మీరేమీ భయ పడకండి, నేను వెన్నెలతో మాట్లాడు తాను.” అని అభయ మిచ్చి వెళ్లి పోయాడు.
*********************
మధ్యాహ్నం మూడు గంటలకు కాలేజీలో వున్న వెన్నెల సెల్ ఫోన్ మోగింది. చూస్తే చందు. “నేను మీతో మాట్లాడాలి. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేటపుడు సప్త గిరి సర్కిల్ దగ్గర బస్ దిగండి. నేనొచ్చి కలుస్తాను.” అంటూ వెన్నెలకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. వెన్నెల ఆలోచనలో పడింది. “నాయనమ్మ అప్పుడే అతనితో మాట్లాడినట్లుంది. తను అతణ్ణి హర్ట్ చేసిందా?” మొదటి సారిగా వెన్నెలకు గిల్టీగా అనిపించింది. పెళ్లి విషయంలో తను పునరాలోచనలో పడటానికి దారి తీసిన సందర్బం గుర్తొచ్చింది. బస్సెక్కి కూర్చోగానే మనసు నాలుగు రోజులు వెనక్కి వెళ్ళింది.
**************************
ఆ రోజు ఉదయం 7 గంటలకు వెన్నెల చందుకు ఫోన్ చేసింది. ఎన్ని సార్లు చేసినా అవతల్నుంచి స్పందన లేదు. “ఏమై వుంటుందా?” అని కాస్త కంగారు పడింది కూడా. ఆ తర్వాత కలిసిన చందు అసలు విషయం చెప్పాడు. “రాత్రి సెకండ్ షో సినిమా కెళ్లాను. ఈ మధ్య రోజూ సెకండ్ షో చూసి పడుకోవడం అలవాటయింది. రోజూ త్వర గానే లేచే వాణ్ని. ఈ రోజెందుకో లేవ లేక పోయాను.” సంజాయిషీ ఇచ్చుకున్నాడు. వెన్నెలకు మతి పోయింది. “రోజూ సెకండ్ షోనా?!” “అవును దాదాపు ఊళ్ళో వుండే కొత్త సినిమాలన్నీ చూసేసాను.” కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు చందు. వెన్నెల ఉసూరుమంది. ఇంటికి చేరిందే గానీ, బాగా డీలా పడి పోయింది. “త్వరగా నిద్ర పోవడం, త్వరగా నిద్ర లేవడం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.” అంటుంటారు నాన్న. ఇప్పుడు ఆహారం, అలవాట్లు, అభిరుచులు ఒకటేమిటి – అన్నీ మారి పోతున్నాయి. మనది అనుకున్న సంస్కృతి క్రమంగా అదృశ్యమై పోతున్నది. అర్ధ రాత్రి దాకా టీవీ చూస్తూనో, పార్టీలు, పని కోసం జాగారం చేయడం, పగలేమో స్తబ్ద జీవుల్లాగా నిద్రావస్థలో మునిగి పోవడం, ఈ నిశా చరులతో లోకమంతా నిశితో నిండి పోతుందా? “మళ్ళీ తనకు నిశాచర సహవాసం తప్పదా? అమ్మో... జీవితాంతం ఇలాగా......? ఎందుకు తప్పదు, ఏదయితే అది కానీ.” అని పెళ్లి చేసు కోనని కరా ఖండిగా చెప్పేసింది. దాంతో ఇంట్లో అగ్ని పర్వతం బద్దలైనట్లయింది.
***************************
“ఇక ఇప్పుడేం జరగనుందో?” అనుకుంటూ ఉండగానే బస్సు సప్త గిరి సర్కిల్ చేరింది. చందు బస్సు దగ్గరికి రావడంతో బస్సు దిగింది.
రండి, అలా శ్రీ సాగర్ లోకి వెళ్దామా?” అంటూనే దారి తీశాడు. నడవక తప్ప లేదు వెన్నెలకు. సెలవు రోజు కాక పోవడం వల్ల జనం పలుచ గానే వున్నారు. ఓ మూల టేబుల్ దగ్గర కూచున్నారిద్దరూ. ఐస్ క్రీం ఆర్డర్ చేసి సర్వర్ వెళ్ళగానే నేరుగా విషయం లోకి వచ్చేశాడు చందు. “మీకేమైనా అనుమానాలుంటే నేరుగా నన్నే అడగొచ్చు కదండీ. అయినా అన్ని విషయాల్లో అంత విశ్లేషించే వారు ఈ సమస్యను పరిష్కరించ లేక పోయారా?” సూటిగా ఆమెనే చూస్తూ అడిగాడు. “అది కాదండీ, మరీ నేను... నాకు....” వెన్నెల మాటలను మధ్య లోనే అడ్డుకున్నాడు చందు.
“అవును, మీకు నిశాచారులంటే గిట్టదు. నేను కూడా సెకండ్ షో సినిమాలు చూస్తున్నాను కాబట్టి, నిశాచర జీవినేనని భయ పడి, ఈ నిశా చరుడితో జీవితాంతం వేగ లేనని నాతో పెళ్లి వద్దన్నారు. అంతేనా?” చందు ముఖానే అడిగేసరికి వెన్నెల మౌనంగా తలొంచుకుంది. “నేను మీతో ఏం మాట్లాడానో ఒక సారి గుర్తు చేసుకోండి. ‘ఈ మధ్య సెకండ్ షోలు చూడటం అలవాటయింది’ అన్నాను, అంతే కదా! అంటే నాకు మొదటి నుంచి అలవాటు లేదనేగా? మీకు అసలు కారణం చెప్పనా? మా నాన్న టీచరు గా పని చేస్తూ మమ్మల్ని చదివించడానికే సరి పోయింది. ఇల్లు కట్టు కోవడానికి కుదర లేదు. పెద్ద ఇల్లు తీసుకోవడానికి బాడుగలు పెట్ట లేక చిన్న దాంట్లోనే సర్దు కోవాల్సి వస్తోంది. మా అన్నది కూడా అంతంత మాత్రం సంపాదనే. నాకు ఈ మధ్యనే కదా ఉద్యోగం వచ్చింది. మూన్నెళ్ళ క్రితమే మా చెల్లెలి పెళ్లయింది. వారం రోజుల్నుంచి వాళ్ళు మా ఇంట్లోనే వున్నారు. అసలే మూడు గదుల చిన్న ఇల్లు. ఓ గదిలో అన్నా వదిన వుంటారు.
వంట గదిలో అమ్మా నాన్నలు సర్డుకోవడానికే చాలదు. ఇక మిగిలిన గదిలో కొత్తగా పెళ్ళయిన మా చెల్లి వాళ్ళుంటారు. ఆరూ బయట పడుకుందామంటే చలి. ఏం చేయాలో తోచక సినిమాల కెళ్ళడం అలవాటు చేసుకున్నా. ఆ సినిమా హాల్లో కూడా సగం నిద్ర పోవడమే. అంతేకానీ నేనేం నిశా చరుణ్ణి కాదండీ బాబూ. మీ అంత కాకపోయినా, కాస్తో కూస్తో క్రమ శిక్షణ గల వాడినే.” సర్వర్ రాకతో చందు ఆగాడు. వెన్నల తన ఆలోచనలకు, ప్రవర్తనకు సిగ్గు పడింది. “నిజమే, తనే నేరుగా మాట్లాడి వుండాల్సింది. ఇంట్లో అందరినీ బాధ పెట్టేశాను.” స్వగతంలో అనుకుంది. “ఐస్ క్రీం తీసుకోండి మేడం!” చందు మాటలతో ఈ లోకంలో కొచ్చింది. “అయినా, ఇంత అందమైన వెన్నెలను ఎదురుగా పెట్టుకొని ఏ వెధవన్నా సెకండ్ షో లంటూ థియేటర్ల వెంబడి తిరుగుతాడా చెప్పండి?” వెన్నెలనే చూస్తూ చిలిపిగా అన్నాడు చందు. మబ్బు చాటు నుండి బయటి కొచ్చిన జాబిలి జాలు వార్చిన వెన్నెల్లా నిండుగా నవ్వింది వెన్నెల.