అమెరికా పిల్లలు - భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

amerikaa pillalu

ఈ మధ్యన మా ఇంటికి ఒక బంధువు వచ్చాడు. మాటల మధ్యలో `నేటి పిల్లలు - అమెరికా ఆశలు`అనే విషయాన్ని గురించి మాటలాడటం మొదలెట్టాడు. నేను మౌనంగా ఉండి వింటూ ఉండటంతో నాకా విషయంలో అనుభవ లేమిని గ్రహించినట్లుగా, ఆ విషయంలో నాకున్న అజ్ఞానాన్నితొలగించి, జ్ఞానోదయం కలిగించి తీరాలన్న పట్టుదల అతని మాటల్లో కనిపించింది.

అమెరికా వెళ్లి స్థిరపడటం అనేది నేటి పిల్లల అభివృద్ధికి చిహ్నమట. కొంత మంది తల్లి తండ్రులు ఆ అభివృద్ధిని చూసి సహించ లేక పోతున్నారట. అందుకే అమెరికా వెళ్లి స్థిర పడిన తమ పిల్లల్ని నిందిస్తున్నారట. అలాంటి తల్లి తండ్రులను క్షమించ కూడదట.

అలాంటి వాళ్ళు పక్షులను, జంతువులను చూసి నేర్చు కోవాలన్నాడు. అవేం చేస్తాయి? అని నా వైపు చూస్తూ అడిగాడు. నువ్వే చెప్పు అన్నట్లు అతని వైపు నేను చూసాను. ఇలా ఏదో చెపుతూ మధ్యలో నన్ను ప్రశ్నలు వేసే వాళ్ళంటే నాకు చాలా కోపం. కానీ అతను ఇంటికి వచ్చిన అతిధి అవటం వలన, ఏమీ అన లేక ఊరుకోవాల్సి వచ్చింది.

కొంత వరకే పిల్లల్ని చూస్తాయట. తర్వాత వాటి మానాన వాటిని బ్రతక మని వదిలేస్తాయట. మళ్ళీ ఆ పిల్లల వైపైనా చూడవట. మరో రకం పక్షులైతే ఈ విషయంలో ఇంకా ముందు ఉన్నాయని, అవి ఆకాశంలో ఉండగా గ్రుడ్లను పెట్టి, అలా వదిలేస్తాయని, అవి భూమి మీదకు పడే లోపుగా పగిలి, వాటి నుండి పిల్లలు బయటకు వచ్చి ఆ గాలి లోనే రెక్కలు మొలిచి, ఎగరటం నేర్చుకొని భూమి మీదకు చేరే సరికి ఎగరటం వాటికి వచ్చేస్తుందని అన్నాడు. ఆ తరువాత వాటికీ ఆ పిల్లలకు ఏ సంబంధమూ ఉండదట.

అది సృష్టి రహస్యం అట, ఒక్క మనకే ఇంకా అది అర్ధమవటం లేదట. ఇలా సాగింది అతని వాక్ప్రవాహం చాలా సేపు.

అతనికి ఇద్దరు పిల్లలు, వాళ్లింకా చిన్నవాళ్ళు. అందు వల్ల అతను ప్రస్తుతం కులాసా గానే కబుర్లు చెబుతున్నాడు. అతని అజ్ఞానానికి నాలో నేను జాలి పడటం తప్ప మరేమీ చేయ కూడదని నిర్ణయించుకొని, అతను చెప్పిన వాటన్నిటికి `ఊ` కొట్టి అతను వెళ్ళేవరకు ఓపిక పట్టేను.

అతను వెళ్ళేక లోపలకి వచ్చి “శాంతా! కాఫీ ఇస్తావా?” అని అడిగే సరికి నా భార్య శాంత “ఆయన ఏమంటున్నాడు?” అంటూ నన్ను అడిగింది. నేను జవాబు చెప్పే లోపల లోపలి వెళ్లి కాఫీ కప్పుతో వచ్చింది.

“పిల్లలు అమెరికా వెళ్ళి పోవటం గురించి మన దేశం లోని తల్లి తండ్రులు అపార్ధం చేసుకుంటున్నారని, అది తల్లి తండ్రుల స్వార్ధానికి నిదర్శనమని అంటున్నాడు.” అన్నాను.

“మరి మీ ఉద్దేశ్యం ఏమిటని చెప్పారు?”అంది వదిలి పెట్టకుండా.

“మన పిల్లలూ ఉన్నారుగా, రేపు వాళ్లకి కూడా అమెరికా వెళ్ళే అవకాశాలు వస్తాయి, మరి వాళ్ళు కూడా అలానే వెళ్ళి పోతే మీరేమంటారు?” అంది.

నా ఉద్దేశ్యం ఏమిటో ఆమెకు తెలియదని కాదు, ఐనా మళ్ళీ మళ్ళీ అలా అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటుంది. నేను నా సమాధానాన్ని ఎప్పుడూ ఒకేలా చెబుతూనే ఉంటాను.

ఈ లోపున పక్కింటావిడ నా భార్యతో కొంచం సేపు కబుర్లు చెప్పుకోవటాని కని రావటంతో, నేను నా గది లోకి వెళ్లి పోయాను. ఐనప్పటికీ వాళ్ళాడుకొనే మాటలు నాకు స్పష్టం గానే వినపడుతున్నాయి. తెలిసినవే ఐనా మళ్ళీ అలా వింటూ కూర్చున్నాను.

వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరూ అమెరికా లోనే స్థిర పడ్డారు. ఎప్పుడయినా వీలు పడినప్పుడు వచ్చి, వాళ్ళ అత్త గారి ఇంటిలో మూడొంతుల రోజులు గడిపి, వీళ్ళ దగ్గర ఒక వంతు రోజులు గడిపి వెళ్లి పోతుంటారు. అలా వాళ్ళు వచ్చి వెళ్ళిన ప్రతి సారీ ఆవిడ పాపం మా ఇంటికి వచ్చి నా భార్యతో తన బాధను చెప్పుకొంటూ ఉంటుంది.

“ఏమిటోనండీ, అప్పుడే పిల్లలు రావటం, వెళ్ళటం అంతా కలలోలా జరిగి పోయాయి. అంత వరకూ పిల్లల కోసం చూసిన ఎదురు చూపులు, వాళ్ళ రాక కోసం పడే ఆత్రుత మనసును స్థిరంగా ఉండ నివ్వవు. తీరా పిల్లలు వచ్చి వెళ్లే సరికి మనసు ఉస్సూరంటుంది. ఈ కొంతేనా వీళ్ళతో ఉండే అనుబంధం అని అన్పిస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారో అని ఎదురు చూపుల తోనే గడపాలి. జీవితంలో మూడొంతులు ఎదురు చూపుల తోనే గడిచి పోతోంది మాకు. ఇంత కంటే ఏమీ చేయ లేము కదా! ” ఆ మాటలు అంటున్నపుడు ఆవిడ కళ్ళలో నీళ్ళు నిండేయి.

“అమ్మా! అన్నం పెట్టావా? అనే పిలుపు లోని మాధుర్యాన్ని కోడళ్ళు వచ్చిన వెంటనే లాగేసుకుంటారు. అంత వరకూ తల్లి ఒడిలో తల పెట్టు కొని మరీ తన సమస్యలను, సంతోషాలను తల్లితో పంచుకొనే కొడుకు అక్కడ నుండి వాటిని తన భార్యతో పంచుకోవటం మొదలెడతాడు.”

“ఆ మార్పు కొడుకుపై ఏమీ ప్రభావం చూపదేమో కాని, ఆ తల్లి మనసుపై మాత్రం చాలా ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఆకొడుకు అది గ్రహించ లేడు. ఆ స్థితికి కారణం కోడలే కనుక, కోడలిని ఏమైనా అందామా అంటే ఆ అవకాశాన్ని ఇప్పటి కోడళ్ళు ఎక్కడ ఇస్తున్నారు? పెళ్ళైన మరుచటి రోజు నుండే మొగుణ్ణి కొంగు కేసి కట్టేసుకుంటున్నారు. “ఆవిడ మాటల్లో బాధ, ఉక్రోషం, పొంగి పొరలుతున్నాయి.
నా భార్య అలా వింటోంది మౌనంగా.

“ఇవన్నీ ఒక అమ్మగా కొడుకుల విషయంలో నా అనుభవాలు. అందరి విషయంలో ఇలాగే జరుగుతుందని నేను అనటం లేదు . కానీ, చాలా మంది విషయంలో మాత్రం ఇలాగే జరుగుతూ ఉంటుందని ఖచ్చితంగా చెప్ప గలను. పోనీ అతనితో చెప్పు కొని కొంచం ఓదార్పు పొందుదామంటే నాదీ, అతనిదీ ఒకే రకం బాధాయే! నా కంటే ఆయన మనసు సున్నితం. ఇంక ఆయనతో నేనేం చెప్పుకొనూ ? ఎలా ఓదార్పు పొంద గలను? మీరే చెప్పండి!” చెప్పటం ఆపి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంది. ఆవిడ కళ్ళ నుండి నీళ్ళు తిరుగుతుంటే చీర చెంగుతో
తుడుచు కొంటూ కొంచెం సేపు ఆగింది. ఆ మౌనం చాలా ఇబ్బంది కరంగా ఉంది.

ఆవిడ మాటలన్నీనాకు స్పష్టం గానే వినబడుతున్నాయి. నాకు కూడా చాలా బాధ అనిపించింది.

“చిన్నప్పుడు కొంగు పట్టుకొని వదలని కొడుకు ఇలా ఎలా అమ్మను విడిచి, అమ్మను మరచి, అమ్మకు వెరచి బ్రతక గలుస్తూన్నాడు? అమ్మ పై జాలి, కరుణ, ప్రేమ, దయ, ఏమీ లేకుండా ఎలా ఉండగలుస్తున్నాడు?” ఆవిడ ఈ మాటలు అని మళ్ళీ ఒక క్షణం ఆగింది.
అవే ప్రశ్నలు నన్ను నేనే వేసుకున్నాను. నాకు సమాధానం దొరక లేదు. కానీ నా ఆలోచనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

“నాకు తెలిసి తన దగ్గరే ఉండి పోమ్మని, ఏ అమ్మా, ఏ కొడుకునూ, ఎప్పుడూ అనదు. ఎవ్వరూ అలా కోరుకోరు. కానీ అసలు తన ధ్యాసే లేనట్లు, తన ఆలోచనే లేనట్లు ఆ కొడుకు ప్రవర్తిస్తూ ఉంటే, ఏ తల్లయిన ఎలా భరించ గలదు, ఎలా సహించగలదు? ఎలా జీవించ గలదు?” ఈ మాటలని మళ్ళీ ఆవిడ ఆగింది.

నా ఆలోచనలు కూడా అలా ఎడ తెరిపి లేకుండా అమ్మ మనసు పడే బాధ చుట్టూనే తిరుగు తున్నాయి. నా మనసును నేనే ప్రశ్నించుకోవటం మొదలెట్టాను.

“దీనికి పరిష్కార మార్గం ఏమీ లేదా? ప్రతి తల్లీ ఇలా ఎప్పటికీ బాధ పడవలసిందేనా?”

“అమ్మ కనుక ఇలా ఎవరి దగ్గరైనా బయట పడి తన బాధ చెప్పుకుంటుంది. మరి తండ్రి సంగతేమిటి? తను మాత్రం తన పిల్లలను ఎంతగా ప్రేమిస్తాడు! వాళ్ల కోసం ఎన్ని బాధలు పడతాడు! వాళ్ళ భావి కోసం ఎన్ని కలలు కంటాడు! మరి అలాంటప్పుడు అతని మనసెంత బాధకు లోనవుతూ ఉంటుంది? కానీ ఆ బాధను అతనెవరితో చెప్పుకో గలడు?”

“తల్లి తండ్రుల తమ వల్ల పడే ఈ బాధలను కొడుకులు ఎందుకు గ్రహించరు? కొంతైనా ఆత్మీయతను ఎందుకు ప్రదర్శించరు? రేపు వాళ్ళకు పిల్లలు పుట్టారా? ఆ పిల్లలూ ఇలాగే ప్రవర్తించరా? అప్పుడు వీళ్ళు కూడా తల్లి తండ్రుల లాగే బాధ పడాల్సి రాదా?”

“మరి ఈ ఆలోచన వాళ్ళకెందుడు రావటం లేదు?”

ఇలా ఆలోచిస్తూ ఉండగానే అనుకోకుండా నా కళ్ళ నుండికూడా కొన్ని నీటి చుక్కలు రాలి పడ్డాయి. ఈ సమస్యకు పరిష్కారమే లేదా అని అనుకుంటూ కళ్ళను తుడుచుకున్నాను.

“ఏం చేస్తున్నారు?”అంటూ వచ్చిన శాంతమాటతో ఈ లోకంలోకి వచ్చేను. ఆమె నావాలకం గ్రహించి ,” మీరేమి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి బాధ పడకండి, మన పిల్లలు మననోదిలి అలా వెళ్ళరు, సరేనా?” అంటూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. అది ఎందుకో నాకే తెలియ లేదు. కానీ, మీకేమైనా అర్ధం అయితే నాకు చెప్పండి.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి