లోకం తీరు - స్వప్న

lokam teeru

ఈ రోజు ఆదివారం. బయట వాతావరణం చాలా ఆహ్లాదం గా ఉంది. చల్లగాలితో కూడిన వర్షం పడుతుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం లో కూడా మనసెంతో దిగులుగా ఉంది. మామూలుగా అయితే, ఇలాంటి వెదర్ లో, కిటికీ లో నుంచి బయటకి చూస్తూ, ఎంత సేపైనా తెలీకుండా గడిపేయవచ్చు. కానీ ఆ రోజు అదే కిటికీ పక్కన కూర్చుని బయటకి చూస్తుంటే, మనసంతా చెప్పలేని దిగులు. దానికీ కారణం ఉంది. ఎదురింట్లో ఒక ముచ్చటైన కుటుంబం కాపురం ఉంటుంది.

ఆ అమ్మాయి పేరు శ్వేత. గృహిణి. ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు నవ్వుతూ ఎలా ఉన్నారు? ఊద్యోగం ఎలా ఉంది? తిన్నారా అని అభిమానంగా అడుగుతుంది. ఒకటి, రెండు సార్లు ఇంటికి పిలిచింది. నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నాకెందుకో, తనంటే తెలీని అభిమానం. బహుశా, నా పర్సనల్ విషయాలు ఎప్పుడూ అడగదని కాబోలు. వాళ్ళ అయన ఏదో కంపెనీ లో సేల్స్ మేనేజర్. వాళ్ళకి ఒక పాప. చాలా ముద్దు గా ఉంటుంది. ముచ్చటగా ఉండే కుటుంబం అది. మూడు నెలల క్రితం,

ఇలాంటి ఒక ఆదివారం రోజునే శ్వేత వాళ్ళ ఆయన యాక్సిడెంట్ లో పోయారు. అతి తక్కువ పరిచయం ఉన్న నా వల్లే కావటం లేదు ఆ విషయాన్ని జీర్ణించుకోవటం. శ్వేత పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో? ఊహించలేకుండా ఉన్నాను. ఒకసారి వెళ్ళి పలకరిద్దామన్నా నాకు ధైర్యం సరిపోవటం లేదు. చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ సొంత వాళ్ళని పలకరించి, సానుభూతి కబుర్లు చెప్పటం వల్ల భాద ఎక్కువ అవుతుంది కానీ, తగ్గుతుందా? ఇలాంటి ఫార్మాలిటీస్ ఎవరు పెట్టారో, ఎలాంటి ఉద్దేశ్యం తో పెట్టారో కాని, నాకైతే శ్వేత ని పలకరించాలంటే, చాలా భయం గా ఉంది. భగవంతుడు ఎందుకు మంచివాళ్ళని అలాంటి విషమ పరీక్షలకి గురి చేస్తాడో? ఏంటో..?

ఆ విషాదం జరిగి అప్పుడే మూడు నెలలు గడిచిపోయింది. ఎవరి రొటీన్ లో వాళ్ళు పడిపోయారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మా కిటికీలో నుంచి చూస్తుంటే, శ్వేత వాళ్ళ గుమ్మం కనిపిస్తుంది. తలుపు దగ్గరగా వేసి ఉంది. ఇంట్లో బంధువులు ఎవరూ ఉన్నట్టు లేరు. తనని అలాంటి పరిస్తితుల్లో వదిలి అప్పుడే అందరూ వెళ్ళి పోయరా? ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది కదా! ఎవర్ని తప్పు పట్టగలం? ఆ ఇంటికేసి చూస్తుంటే చాలా అన్యమనస్కంగా ఉంది.

శ్వేత ఆలోచనల్లో ఉన్న నేను ఎవరో తలుపు కొట్టిన శబ్ధం రావడం తో ఈ లోకం లోకి వచ్చాను. లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే, కిందింటి కా మాక్షమ్మ గారు. నేను ఆ ఇంట్లో కి అద్దెకి వచ్చి అయిదు నెలలు అవుతుంది. నేను వచ్చే రెండు నెలల ముందు వాళ్ళు కింద పోర్షన్ లోకి దిగారట. ఆవిడ కట్టు, బొట్టు చూడటానికి మహాలక్ష్మి లాగా ఉంటుంది. కానీ ఆవిడ మనసు మాత్రం అంత గొప్పది కాదు అని పరిచయమైన కొత్తలోనే అర్దమైంది.

ప్రతి ఆదివారం వచ్చి కొంచెం సేపు కూర్చుని, నా స్వవిషయాల గురుంచి ఆరా తీయటం ఆవిడకి సరదా. అలా అడగటం లో, ఆవిడకి నా మీద అభిమానం ఉన్నట్టు ఎప్పుడూ కనిపించదు. ఆ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్న నాలో ఏదన్నా లోపాలు వెతికి పట్టుకోవాలన్న ఆరాటం తప్ప. ఈ రోజు మాత్రం ఆవిడ శ్వేత గురుంచి చెప్పటానికి వచ్చిందని కొంచెం సేపటికే అర్ధమైంది. శ్వేత కి మావగారు లేరట. అత్తగారు మాత్రం ఉన్నారట. ఆవిడే పెద్ద కొడుకు మీద ఆధారపడింది కాబట్టి, ఇక వీళ్ళ భాధ్యత కూడా తీసుకోటానికి అత్తింటి తరుపున ఎవరూ లేరు. తల్లితండ్రులు లేని శ్వేతకి, ఉన్న ఒక అన్నయ్య కూడా భార్య నోటికి జడిసి, చెల్లిని పుట్టింటికి తీసుకెళ్ళాలనే ఆలోచనకి దూరం గానే ఉన్నాడట. ఇది ఆవిడ శ్వేత గురించి సేకరించిన సమాచారం.

మళ్ళీ ఆదివారం నన్ను పలకరించటానికి వచ్చిన కామక్షమ్మ గారు ఈ సారి శ్వేత గురించి ఇంకో విషయం చెప్పింది. భర్త చనిపోయాక, శ్వేత చెడు తిరుగుళ్ళు మొదలెట్టిందని, అలా సంపాదించిన డబ్బుతోనే, ఇల్లు నడుపుతుంది అని దాని సారాంశం. ఆవిడ విషయం తెలిసిన నేను ఇది విని పెద్దగా ఆశ్చర్యపోలేదు కానీ, ఈ సారి మాత్రం విని ప్రశాంతంగా ఉండలేకపోయాను.

కామాక్షమ్మ గారూ! పనీ, పాట లేనివాళ్ళు ఇలాంటివి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. మీలాంటి మంచివారు, తెలివైన వారు కూడా ఇలాంటి వాటిని నమ్మటమే కాకుండా ఇంకొకరికి చెప్పటం నాకు భాదగా ఉందండి. ఇన్ని రోజులనుంచీ చూస్తున్నాం కదా! శ్వేత ఎలాంటిదో మనకి తెలీదా? ఇలాంటివన్నీ చెప్పిన వాళ్ళని అప్పుడే చెప్పు తీసుకుని కొట్టాలండి. ఎందుకంటే, ఇలాంటివాళ్ళు మనగురించి కూడా వేరేవాళ్ళకి ఇలాంటివే చెప్తారు. ఇంకా నా దగ్గర శ్వేత గురుంచి చెడుగా మాట్లాడితే ఆ కొట్టే చెప్పు నాది, కొట్టించుకునే చెంప నీదే అవుతుంది అన్నంత ఆవేశంగా మాట్లాడాను. ఈ మాట ఆవిడ మీద మంచి ప్రభావాన్నే చూపించి ఉండాలి మరి. అలా జరిగితే ఇంకొకరికి ఈ వార్త ఈవిడ ద్వారా వ్యాపించకుండా ఆపిన దాన్ని అవుతాను. కానీ ఎప్పటి నుంచో, ఇలాంటి పుకార్ల గురుంచి మాట్లాడుకుని టైంపాస్ చెసే వాళ్ళు మారతారని నేను అనుకోను.

ఏది ఏమైనా, ఈ రోజు శ్వేత దగ్గరికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను. భోజనం చేసాక, పాపకి చాకలెట్ బాక్స్ తీసుకుని వెళ్ళాను. నన్ను చూడగానే నవ్వుతూ లోపలకి పిలిచింది. కానీ, ఇంతకుముందులా ఆ నవ్వులో జీవం లేదు. జరిగిపోయిన విషయం గురుంచి మాట్లాడి తనని బాదపెట్టే ఉద్దేశం నాకు లేదు. అందుకే నేను అక్కడకి వెళ్ళిన విషయం గురించే మాట్లాడాను. శ్వేత గారూ! భగవంతుణ్ణి నమ్మే నేను ఎలాంటి కష్టం వచ్చినా, ఇష్టం గానే భరించాలి అంటాను. ఎందుకంటే, అది ఎంత పెద్ద కష్టమైనా, దేవుడు ప్రేమగా ఇచ్చిందే కదా! మీరు డిగ్రీ చదివారు అని నాకు తెలిసింది. మీకు ఉద్యోగ అవసరం ఉంది అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, మీ ఆర్ధిక పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా తెలీదు. మీకు ఆ అవసరమే కనుక ఉంటే, నేను చేసే ఆఫీస్ లో ఒక ఉద్యోగం ఇప్పించగలదీ స్నేహితురాలు. ఒక వారం క్రితం, నేను పనిచేసే డిపార్ట్ మెంట్ లోనే ఒక పోస్టింగ్ పడింది. ఆ కేండిడేట్ ని నేనే సెలెక్ట్ చెయ్యాలి. జీతం కూడా బాగానే ఉంటుంది.

ఆ మాట చెప్పగానే, శ్వేత నా చేతులు గట్టిగా పట్టుకుంది. తన కళ్ళ నిండా నీళ్ళు. కృతజ్ఞత చెప్పటానికి మాటలే అవసరం లేదు అని ఆ క్షణం అర్దమైంది నాకు. తను నోటితో చెప్పలేకపోయిన విషయం. నా చేతులు పట్టుకున్న ఆ స్పర్శ చెప్తుంది.

ఈ మాట చెప్పి, అక్కడ టేబుల్ మీద ఒక పది వేల రూపాయలు ఉంచాను. శ్వేత ఆశ్చర్యంగా చూసింది. మీరు రేపే జాబ్ లో జాయిన్ అయినా, వచ్చే నెల వరకూ మీ ఖర్చులకి ఇది ఉంచండి. మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవి తిరిగి ఇవ్వొచ్చు అని చెప్పి ఇంటికి వచ్చేసాను.
ఆ తర్వాత రోజే శ్వేతకి ఇంటర్వూ అవ్వటం, అప్పాయింట్మెంట్ ఆర్డర్ రావటం, వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వటం చకచకా జరిగిపొయాయి. రోజూ నాలుగింటికి స్కూల్ నుంచి వచ్చాక పాప ఒక రెండు గంటలు ఆ వీధి చివరన ఉన్న ప్లే స్కూల్లో ఉండే ఏర్పాటు చేసాం. శ్వేత ఆఫీస్ నుంచి వస్తూ పాపని ఇంటికి తీసుకొస్తుంది. శ్వేత ఉద్యోగంలో జాయిన్ అయ్యి, ఒక నెల గడిచిపోయింది. ఈ నెల రోజుల్లో, మా మధ్య మీరు నుంచి నువ్వు అని పిలుచుకునేంత చనువు ఏర్పడింది.

ఒక రోజు మేమంతా ఆఫీసు లో లంచ్ అవర్ లో లంచ్ చేస్తూ ఉండగా, ఒక కొలీగ్ వచ్చి పెళ్ళి కుదిరిందని, స్వీట్స్ పంచిపెడుతున్నాడు. ఆ స్వీట్ తీసుకుని, అతనిని కంగ్రాచ్యులేట్ చేసిన శ్వేత సడెన్ గా నా వంక చూసి, నువ్వెప్పుడు పెడతావ్ పప్పన్నం అని అడిగింది. క్షణం లో వెయ్యోవంతు నా మొహం లో మారిన భావాలు చూసి నిశ్శబ్ధంగా ఉండిపోయింది. మళ్ళీ దానిగురుంచి నన్ను రెట్టించి ఆరా తియ్యలేదు. ఆ గుణమే నాకు శ్వేత లో నచ్చుతుంది.

ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నేనెవరికీ చెప్పటానికి ఇష్టపడని నా కథని నాకెందుకో శ్వేత కి చెప్పాలనిపించింది. శ్వేతా! నా పెళ్ళి ఎప్పుడు అని మధ్యాహ్నం అడిగావ్ కదా! “నా పెళ్ళి ఇదివరకే అయ్యింది.” నా మాటలకి ఆశ్చర్యంగా, నమ్మలేనట్టు నా వంక చూసింది శ్వేత. నిజమే శ్వేతా! ఆరు నెలల క్రితం నా పెళ్ళి జరిగింది. ఇంట్లో చూసిన సంబంధమే. మా సంబంధం అన్ని విదాలా నచ్చిందన్నారు. కట్నకానుకుల విషయం పట్టింపు లేదన్నారు. మేము ఇద్దరం ఆడపిల్లలమే. నాకు ఒక చెల్లి ఉంది. ఎలాగూ ఆడపిల్లలమే కాబట్టి, ఉన్నది ఏదైనా, ఎప్పటికైనా, చెరో సగం వస్తుంది కాబట్టి, కట్నకానుకుల దగ్గర గట్టిగా లేరు అనుకున్నాం. పెళ్ళికొడుకు ముభావంగా ఉండటం చూసి అందరూ నెమ్మదస్తుడు అనుకున్నారు. నేను చాలా తొందరగా కొంగుకు ముడేసుకోవచ్చు అని అందరూ ఆట పట్టించారు. ఏ ఇబ్బందీ లేకుండా పెళ్ళి జరిగిపోయింది.

ప్రతి మనిషీ ఎన్నో కలలు కంటాడు. అందుకు నేనేమీ అతీతురాలిని కాదుగా? అందరాడపిల్లల్లాగానే నేను కూడా, జీవితం మీద ఆశలు అంటారో, కోరికలు అంటారో, ఏం పేరు పెట్టాలో తెలీదు కాని, ఇది అని చెప్పలేని ఒక ఫీలింగ్ తో పెళ్ళి చేసుకున్నాను. ఆ రోజు మా మొదటి రాత్రి. అతని మొహంలోకి చూడగానే అర్దమైంది. అతను సంతోషంగా లేడు అని. చాలా అసహనంగా అటూ, ఇటూ తిరుగుతున్నాడు. నాకు పలకరించాలంటే మనసు రావటం లేదు. అక్కడ ఏదో అసహజంగా ఉంది. పది నిమిషాలు నుంచున్నాకా, నేను మంచం మీద కూర్చున్నాను. నేనే ఏమన్నా మాట్లాడతానని ఆశించాడేమో తెలీదు. కొంచెంసేపటికి నా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. నాకు ఈ పెళ్ళి అన్నా, నువ్వన్నా ఇష్టం లేదు. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళి చేసారు. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. నేను నీతో కాపురం చెయ్యలేను. నేను ప్రేమించిన అమ్మాయినే మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను. నాకు విడాకులు కావాలి అని పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసాడు.

నాకు కొంచెంసేపు ఏమీ అర్దం కాలేదు. అర్దం అయ్యాకా, కళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ళకింద భూమి చీలిపోయినట్టుంది. కానీ నేను కూర్చునే ఉన్నాను. భూమిలో కూరుకుపోలేదు. నాకు ఏం చెప్పటానికీ మాట రాలేదు. చెంప పగలగొట్టాలనిపించింది. కానీ చేయి లేవలెదు. ఈ మాట ఒక్క రోజు ముందన్నా, వాళ్ళ అమ్మా, నాన్నలకి గట్టిగా చెప్పలేకపోయిన వాడి అసమర్ధతకి బలి అయ్యింది నా జీవితం.

నా పెళ్ళి గురించి వెటకారంగా మాట్లాడుకోటానికి ఊరిలో నలుగురికీ ఒక అవకాశం దొరికింది. మా ఇంట్లో వాళ్ళకి పరువు పోయింది అనే భాద మిగిలింది. బంధువులకి నాది దురదృష్ట జాతకం అనే నమ్మకం కలిగింది. నాకు మాత్రం, నా జీవితం ఒక పుస్తకంలా మారి నా చెతిలోకి వస్తే, అందులో నుంచి ఈ రెండు రోజుల పెజీలనీ చింపెయ్యాలనిపించింది. ప్రేమించిన విషయం అమ్మ, నాన్నలకి గట్టిగా చెప్పి ఒప్పించకుండా, నా జీవితం తో ఆడుకున్న ఆ వెదవ మీద చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది.

నాకు ఇలా జరిగింది అని ప్రపంచం స్థంబించిపోలేదు. ఎదుటివాళ్ళ కష్టాలు చూసి ఆనందించే ప్రపంచానికి నాదొక టైం పాస్ కథ. అందుకే నేను దాన్ని చిన్న సమస్య లాగానే తీసుకున్నాను. నిజానికి ఎంతోమందికి వచ్చే సమస్యలతో పోల్చితే నాది చిన్న సమస్యే. కనీసం నాకు ఉద్యోగం ఉంది. నా బ్రతుకు నేను బ్రతకగలను.

ఆ సమస్య ని పెద్దమనుషుల్లోకి తీసుకొచ్చి, పెద్దది చేసి, ఇద్దరి ప్రేమికులని విడగొట్టటం నాకు ఇష్టం లేదు. దానివల్ల ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి. అందుకే విడాకులకి అప్లై చేసాం. పెళ్ళి కోసం కొన్న పిన్నీసు ఖర్చు కూడా వడ్డీతో సహా వాళ్ళదగ్గరనుంచి వసూలు చేస్తున్నాను. అంతకంటే, కసి తీర్చుకునే మార్గం నాకు దొరకలేదు.

“ఇంక నువ్వు పెళ్ళి చేసుకోవా”? అంతా విని శ్వేత అడిగిన ప్రశ్న. నేనెందుకు చేసుకోకుండా ఉండాలి? నా ఎదురు ప్రశ్న. ఖచ్చితంగా చేసుకుంటాను శ్వేత. ఇంక నా జీవితం లో ఏం మిగల్లేదని, అంతా ఆ పెళ్ళితోనే అయిపోయిందని అనుకోను. అదొక పీడకల అనుకుంటాను. కానీ, మనసులో ఆ సంఘటన ఇంకా పచ్చిగానే ఉంది. ఆ గాయం మానాకా, తప్పకుండా చేసుకుంటాను.ఈ లోపు విడాకులు కూడా రావాలిగా!

శ్వేతా! నా బుర్ర చాలా వేడిగా ఉంది. నీ చేతి స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అడిగాను. నేను ఎంత కాఫీ ప్రియురాలినో తెలిసిన శ్వేత నవ్వింది. దారిలో పాపని ప్లే స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వెళ్ళాం. శ్వేత ఇచ్చిన కాఫీ తాగి ఇంటికి బయలుదేరాను నేను.

నేను బయటకి రావటం కిటికీలో నుంచి కామాక్షమ్మ గారు చూస్తూనే ఉంది. శ్వేత ఇంటికి నా రాకపోకలు ఎక్కువయ్యాయని ఆమె గమనిస్తూనే ఉంది. ఆవిడని చూసి పలకరింపుగా నవ్వాను. చూసీ, చూడనట్టు అవిడ మొహం తిప్పేసుకుంది. నేను, శ్వేత అంత చనువుగా ఉండటం బహుశా ఆవిడకి అంత నచ్చలేదనుకుంటాను. రేపటి నుంచీ, ఇద్దరం కలిసి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాం అని చెప్తుందేమో మరి అందరికీ.

మన కష్టాలు చెప్తే విని ఆనందించటానికి, నీ చెల్లిలాంటి దాన్ని, అక్కలాంటి దాన్ని అని వరసలు కలిపే ఈ జనాలు, కష్టం లో ఉన్నాను సాయం చెయ్యమంటే మాత్రం కనీసం మనిషిలా స్పందించరు సరికదా! కష్టాల్లో ఉన్నవాళ్ళు అందులోనుంచి బయటకి వచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటే కూడా చూసి ఓర్చుకోలేరు. ఇదే లోకం పోకడ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు