కడుపుతీపి - పి.బి.రాజు

kaduputeepi

యధావిధిగా నేను;రాంబాబు వాకింగ్ కి బయలుదేరాం.

తెలతెల వారుతోంది. చల్లని గాలి హాయిగా ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేత కిరణాలు నులివెచ్చగా ఉన్నాయి.

పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అలా రామాలయం చేరుకున్నాం. అక్కడ జనాలు గుమిగూడి ఉన్నారు. పోలీస్ హడావుడి వుంది. ఏమయిందోనని దగ్గరికి వెళ్ళాం.

తెల్లవారి ఝామున ఎవరో రామాలయం దగ్గరి పొదల్లో ఒక శిశువుని వదిలేసి పోయారట. గుక్కపట్టి ఏడుస్తుంటే అటు వెళ్తున్న వారు చూసి పోలీసులకు ఫోన్ చేశారట. ఇంతలో మహిళా సంఘాలు; జనం గుమికూడిపోయారు.

"ఎవరు బిడ్డో ...ఏమో..." కొంతమంది బుగ్గన వేలేసుకుంటున్నారు.

"అయ్యో పాపం... గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే ఎలా?" మరికొంతమంది జాలి పడుతున్నారు.

"పాలయినా పట్టండి...లేదా చక్కెర నీళ్ళయినా..." ఒక పెద్దావిడ అరుస్తోంది.

ఇంతలో గ్లాసులో ఎవరో ఏదో తెచ్చి ఇచ్చారు. ఆ పెద్దావిడ గ్లాసులో వేలు ముంచి; బిడ్డ నోట్లో పెట్టింది. అలా నాలుగయిదు సార్లు చేసే సరికి బిడ్డ ఏడుపు ఆపింది.

"అయ్యో పాపం ...ఎవరి కన్నబిడ్డో"

"ఇంకా కళ్ళు కూడా తెరవలేని పసిగుడ్డు ...వారికి మనసెలా వచ్చిందో..."

"ఇంకా నయం ఏ కుక్కో చూడలేదు.అదృష్టం బాగుండీ..."

"బిడ్డ ఎంత ముద్దుస్తున్నాడో..."

"పండంటి మగబిడ్డ ...ఇలా పారేయడానికి చేతులెలా వచ్చాయో.."

"ఎవరో చేసిన పాపాన్ని ఇలా వదిలించుకున్నారు."

"బిడ్డని అనాధను చేశారు"

"ఇలాంటి వారిని ఏం చేసినా పాపం లేదు."

"కొవ్వెక్కి కడుపు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా వదిలించుకొంది మహాతల్లి ఎవరో.."

"పాపం ఆడపిల్లేం చేస్తుంది. ఎవడి మాయమాటలకి బలయిపోయిందో? ఈ రోజుల్లో మగపిల్లలు వీధి రౌడీల్లాగా కత్తులతో; యాసిడ్ బాటిల్లతో

"ప్రేమిస్తావా? చస్తావా?" అని బెదిరిస్తుంటే..." రాగం తీసింది ఓ పెద్దావిడ.

"అవునవును. బలాత్కారాలు; మానభంగాలు ఎన్ని చూడ్డం లేదూ?"

"అయినా ఈ కాలం పిల్లలు మరీ పరితెగించిపోతున్నారు. హైస్కూల్లోనే ప్రేమలూ...కడుపులూనూ"

"దానికు తోడు సినిమాలు, టీ వీ లు; సెల్ పోన్లు; ఇంటర్నెట్లు... పిల్లలు చెడిపోక ఏమవుతారు?"

"ఎవర్నని ఏం లాభం? కలికాలం. కాలం చెడిపోయింది. మా కాలంలో ఇలా లేదమ్మా?”

ఎవరి అభిప్రాయాలు, సందేహాలు; సలహాలు యధేచ్చగా సాగాయి. ఆడవాళ్ళ సానుభూతి పవనాలు వీచాయి.

ఇంతలో ఒక అనాధ ఆశ్రమం నుంచి ఒకామె కార్లో దిగింది. వెనువెంటనే టీ వీ బృందం; పత్రికా విలేఖర్లూ విచ్చేశారు. ఆమె ఆ పసికందును చేతుల్లోకి తీసుకుంది. తలపై మృదువుగా నిమిరింది.నుదుటిపై సున్నితంగా ముద్దుపెట్టుకుంది. ఆ తర్వాత ఒళ్ళో పడుకోపెట్టుకుని కెమెరా వైపు ముఖం తిప్పి తమ అనాధ ఆశ్రమం స్థాపన ఆశయాల్ని; చేస్తున్న సేవా కార్యక్రమాల్ని అరగంట ఏకరువుపెట్టింది.

"ఈ బిడ్డ సం రక్షణా బాధ్యతల్ని మా ఆశ్రమం తీసుకుంటుంది" అని సగర్వంగా అందరి చప్పట్ల మధ్య భరోసా ఇచ్చింది. కెమెరాలు క్లిక్కుమన్నాయి. టీ వీ ల్లో లైవ్ ప్రసారాలయ్యాయి. మరో అరగంటలో అందరూ వెళ్ళిపోయారు.

"రాన్రాను మానవ విలువలు పడిపోతున్నాయి. కన్నపేగులిప్పుడు పాషాణాలయిపోతున్నాయి." రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
మళ్ళీ నడక ప్రారంభించాం. ఒక పావు గంట నడిచామో లేదో మరో దృశ్యం మా కంటపడింది.

ఒక కుక్క రోడ్లో వెళ్తున ప్రతి కారు వెంట అరుస్తూ పరుగెడుతోంది. మళ్ళి వెనక్కి వచ్చి మరో కారు వెంట పరుగెడుతోంది. అలా రోడ్ పై వెళ్తున్న ఏ కారునీ వదలడం లేదు. కనిపించిన ప్రతి కారునీ కొంత దూరం వెంటపడి తరుముతోంది. ఆ దృశ్యం నాకెందుకో వింతగా అనిపించింది. మరే వాహనాన్ని ఏమీ అనడం లేదు. కార్లని మాత్రం వెంటాడుతోంది. అయిదు నిమిషాలు నిలబడి అలాగే చూస్తుండిపోయాం.

ఇంతలో అక్కడున్న ఒకతను విషయం చెప్పాడు. విని ఆశ్చర్యపోవడం మావంతయింది. సృష్టిలో ఇలాంటివి కూడా వుంటాయా? కళ్ళ ముందు కనబడుతుంటే నమ్మకపోవడమేంటి?

దాని పిల్లను గంట క్రితమే ఓ కారోడు గుద్దేసి వెళ్ళిపోయాడట. పాపం...కుక్కపిల్ల చచ్చిపోయింది. అప్పట్నుంచి ప్రతి కారునీ ఇలా వెంటాడుతోందట.

కారుని వెంటాడడం; అంతలోనే చచ్చిన కుక్కపిల్లని వాసను చూడడం; దాని చుట్టూ తిరగడం ...ఇంతలో మరో కారు వస్తే వెంటపడడం; మళ్ళీ వెనక్కి వచ్చి కుక్కపిల్లను పక్కకి లాగడం; దాని చుట్టూ తిరుగుతూ రోదించడం ...మరో కారు వస్తే రొప్పుతూ పరుగెత్తడం ...హృదయవిదారకమైన అరుపులు… మూగజీవి వేదన ...బిడ్డను పోగొట్టుకున్న ఓ మూగజీవి ఆవేదన ...మౌన రోదన మా హృదయాని కలచివేసింది.

నోరులేని జీవి కుక్క. తనపిల్లను ఎవడో చంపేశాడని కసిగా ప్రతి కారునీ వెంటాడుతోంది. శక్తికి మించి పరుగెడుతోంది.
కారు కాబట్టి సరిపోయిందికానీ... ఆక్షణంలో దాని నోటికి ఎవరు దొరికినా ముక్కలు ముక్కలు చేసి తన పగను తీర్చుకొనేది. అంత కసి...అంత కక్ష..అంత పగ దాని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. పాపం మూగ జీవి. అంతకన్నా ఇంకేం చేయగలదు. అయినా పట్టుదల వీడడంలేదు. ప్రతి కారునీ వెంటాడి వేటాడుతోంది.

అన్నీ వుండీ నోరులేని పసికందును ముళ్ళ పొదల్లో పడేసింది ఒక మానవతల్లి. తన బిడ్డను చంపిన హంతకుని కోసం ప్రతి కారు వెంటా పరుగులు తీస్తోంది అవిశ్రాంతంగా - మూగగా రొప్పుతూ; రోదిస్తూ; అరుస్తూ ఒక కుక్కతల్లి. కుక్కకున్న కడుపుతీపి మనుషుల్లో కరువయిందని విచారిస్తూ వెనుదిరిగాం. *

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి