నిధి చాలా సుఖమా - జీడిగుంట నరసింహ మూర్తి

nidhi chaalaa sukhamaa.

“ఈ ప్రపంచంలో లంచాలతో సాద్యం కాని పనంటూ ఏమీ ఉండదు. అయితే లంచాలు గ్రహించే వారు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి అసాధ్యమైన పనులను కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఎంత కూకటి వేళ్ళతో పెళ్ళగించి పారేయాలన్నా బొమ్మజెముడు చెట్టులా లోపలనుండి వేళ్ళూనుతో చుట్టుపక్కలకు వ్యాపిస్తూనే వుంటుంది. “ అంటూ లంచాల గురించి అనర్గళంగా చెప్తూ ఉంటాడు స్వామీరావు

ప్రపంచంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న కరప్షన్ గురించి అతను విచిత్రంగా భాష్యం చెప్తూ ఉంటాడు. లక్షలు , కోట్లు లంచం రూపంలో తెగమేసే వాళ్ళని పక్కన పెడితే లంచాన్ని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పు కోవచ్చుట. మొదటిది సాధారణ నగదు సేవలు. ఇది ఆషామాషా వ్యవహారం కాదు. రెండో కంటికి తెలియకుండా పనులు చక్క పెట్టుకోవడమో, లేదా పై వాళ్ళను కూడా భాగస్తులుగా చెయ్యడమో తెలిసివుండాలి. రెండవది వస్తు సేవలు. మన పేరుమీద మన వల్ల లాభించిన వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఏ టీవీనో, ఏసీనో కొనేసి ఆ బిల్లు మనకు ఇవ్వడం లేదా మనం కోరుకునే ఏ వస్తువునైనా వాళ్లకు కాని, మనకు కాని ప్రమాదం లేకుండా ఆఫర్ చెయ్యడం లాంటి దన్న మాట. మూడవది ఇతర సేవల కింద వస్తాయి. పుణ్య క్షేత్రాలకు వాహనాలు సమకూర్చడం, ఏదైనా స్టార్ హోటల్లులో రూములు బుక్ చేసి పెట్టడం లాంటివి ఈ కోవకిందే వస్తాయిట.

అవకాశాలు దొరికినంత మేరకు పాత ఉద్యోగంలో అన్ని వస్తువులు బాగానే అమర్చుకున్నాడు స్వామీ రావు. అదృష్ట వంతులను చెడగొట్ట లేరన్నట్టు ఈ మధ్యనే అతనికి ఒక పెద్ద కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పోస్టింగ్ వచ్చింది. చేరిన కొత్తలోనే తన లంచ శాస్త్ర ప్రావీణ్యాన్ని చూపిస్తే ప్రమాదమనీ, ముందుగా మున్ముందుగా అక్కడి వాతావరణాన్ని, మనుషులను నిశితంగా పరిశీలించాడు స్వామీరావు. అతని కన్నా ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు తనలాంటి ప్రబుద్ధులు అక్కడ చాలా మంది ఉన్నారు.

“చూడండి మిస్టర్ స్వామీ రావు గారూ ఇకనుండి మన ప్రోడక్ట్ థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చెయ్యాల్సి ఉంటుంది. మన వస్తువుల నాణ్యత ఏమిటో మనకు తెలియంది కాదు. బయట పార్టీల వాళ్ళొచ్చి తనిఖీలు ప్రారంబిస్తే ఒక్క కేజీ ప్రోడక్ట్ కూడా బయటకు పోదు. ఇలాంటి విపత్కర పరిస్తితిలో మీ తెలివి తేటలను, చాకచక్యాన్ని ఉపయోగించి వాళ్ళను నమ్మించి , బాగా తాగించి గెస్ట్ హౌస్ లో బాగా మేపి డబ్బుల కట్టలు ఆశ చూపించి, వాళ్ళ సంతకాలు తీసుకుని సరుకును బయటకు పంపటానికి మార్గాన్ని సుగమం చెయ్యండి ఈ విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు .

మళ్ళీ చెపుతున్నాను. వాళ్లకు బాగా తినిపించండి. మీకు కావాలిసినంత తినండి పని మాత్రం జరగాలి “ అంటూ ఆర్డర్ వేసాడు అతని పైన డైరెక్టర్ ఒకరోజు స్వామీ రావును తన ఛాంబర్ లోకి పిలిచి. అనుకున్నట్టే ఇన్స్పెక్టర్స్ వచ్చారు. వాళ్ళ కోసం కిలోల కొద్దీ నేతిలో వేయించిన జీడిపప్పు క్షణాల్లో ఖర్చైపోయింది. మామిడి పళ్ళ సీజన్లో వచ్చారో ఏమిటో ఒక్కొక్కళ్ళకు ఏబై పళ్లకు తగ్గకుండా విడివిడిగా బుట్టలు ప్యాక్ అయి పోయాయి. దాంతో పాటు కొత్త కరెన్సీ నోట్లు పంచబడ్డాయి. ప్రోడక్ట్ చూడకుండానే రాత్రికి రాత్రి సంతకాల కార్య క్రమం విజయవంతంగా ముగిసింది. వాళ్ళతో పాటు స్వామీ రావు కూడా సునాయాసంగా డబ్బులు చేసుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేమిటో గాని స్వామీ రావు ఏ కంపెనీ కెళ్ళినా అతని అదృష్టం గిర్రున తిరుగుతోంది.

ఈ లోపు కొత్తావకాయ సీజన్ వచ్చింది. స్వామీ రావు కెందుకో దానిమీద అంత పెట్టుబడి పెట్టటానికి మనసొప్పలేదు. అయినా అతనిలో లాభ పడ్డ వాళ్ళు ఊరుకుంటారా ? సామర్ల కోట నుండి ఐదు కిలోల పప్పు నూనె, గూడెం నుండి ఎర్రటి కారంతో పాటు మాంచి టెంక పట్టిన మామిడి కాయలు, ఇతర దినుసులు అతని వాకిట్లో తెచ్చి పడేసారు. అతను కోరుకునేది ఏమీ లేదు. నోటిలోంచి మాట రాకుండానే అతని ముఖ భావాలు పసిగట్టి ఆయా పనులు జరుపుకుంటూ పోయేవాళ్ళు అతని కస్టమర్లు. పులి మనిషి రక్తం మరిగితే ఎలా విచక్షణారహితంగా తిరగబడుతుందో

స్వామీరావు విషయంలోనూ అదే జరుగుతోంది.

స్వామీరావు తో బాగా లాభపడిన ఒక కస్టమర్ అతన్ని పర్సనల్ గా కలుసుకోవడానికి అనుమతి అడిగాడు. .“నేను చెప్పే అంత వరకు కొన్నాళ్ళు నన్ను డైరెక్ట్ గా కలవడానికి ప్రయత్నం చెయ్యకండి. నేనంటే గిట్టని వాళ్ళు నా మీద నిఘా పెట్టారు. ఇది మీకూ, నాకూ కూడా మంచిది కాదు “ అంటూ అతన్ని బలవంతంగా పంపించే ప్రయత్నం చేసాడు స్వామీరావు.

“మీరు అలా అనకండి సార్. నేనో పెద్ద టెండర్ వేసాను. ఎలాగైనా అది నాకు రావాలని ఆశిస్తున్నాను. నేనిప్పుడు కాని వెనకడుగు వేసానంటే నా జీవితంలో అంత పెద్ద ఆఫర్ వస్తుందన్న నమ్మకం లేదు.

మీరెలాగైనా నా పని చేసిపెట్టాలి. మీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. నాది భాద్యత. “ అంటూ ఆ సేట్ చాలా సేపటివరకు అక్కడనుండి కదలలేదు.

“ఏమిటి ఈ మధ్య కాళ్ళ దగ్గరకొచ్చిన అదృష్టాన్ని చెడగొట్టు కుంటున్నారుట ?. మీది రాజా లాంటి ఉద్యోగం అందరకి ఇటువంటి అవకాశాలు రావు. ఇప్పటికి ఐదారు కంపెనీలలో చేసారు. ఎక్కడైనా సమస్య వచ్చిందా ? ఎవరైనా పట్టుకున్నారా ? మీది పూర్తి ప్రైవేటు సంస్థ. పైన్నుండి వల వేసి పట్టుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇక్కడ ఎవరి బలం వాళ్ళు చూసుకుంటారు. అన్నట్టు ఆ సేట్ను నిర్దాక్షిణ్యంగా పంపించేసారుట? అతను మన ఇంటికి వచ్చి నా కాళ్ళా వేళ్ళా పడ్డంత పని చేసాడు. ఎలాగైనా అయ్యగారిని మీరే ఒప్పించి నా పని చక్కబెట్టాలి అంటూ కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మనకు ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పటికే వాళ్ళ చదువులకు తడిసి మోపెడంతయ్యింది. రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం.? అసలే మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. పెళ్లి లేకిగా చేసేస్తే బాగుండదు...... “ అంటూ ఆగింది స్వామీరావు భార్య ఒకరోజు..

“నీ ఉద్దేశ్యం సరైనదే” అన్నట్టుగా సన్నగా నవ్వాడు స్వామీ రావు. అతనిప్పుడు ఉచ్చ నీచాలు ఆలోచించే పరిస్తితిలో లేడు కాని ఈ వ్యవహారం ఇంటిదగ్గర కూడా నడవటం అతనికి కొంత ఇబ్బందిగా అనిపించింది.

“ఇంతకీ నువ్వు చెప్పోచ్చేదేమిటి ? సమయం సందర్బం చూడకుండా మన చేతిలో అవకాశం ఉందని ఎలా పడితే అలా అడ్డంగా సంపాదించేయ్యడ మేనా ? అసలు నీ ధైర్యానికి నాకాశ్చర్యంగా ఉంది. ఎవరైనా మొగుళ్ళను ఇలాంటి పనుల జోలికి పోవద్దని మొత్తుకుంటారు . విచిత్రంగా నువ్వు నా అభివృద్దిలో భాగం కూడా అయ్యావు “ అన్నాడతను నర్మగర్భంగా నవ్వుతూ.

“మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారేమో ? మీ వల్ల కోట్లు గడించే అవకాశం ఉన్న మీ సేట్ ను నేను ఊరికే వదలలేదు. నా మెళ్ళో కొత్తగా మెరిసిపోతున్న ఈ బంగారపు గొలుసు ఎలా వచ్చిందనుకున్నారు? “ అంటూ చావు కబురు చల్లగా చెప్పింది ఆమె.

కొద్దిసేపు పాటు స్తాణువై పోయాడు స్వామీరావు. ఇప్పుడు తను చిక్కుల్లో పడ్డటయ్యింది. అతని మనసులో ఎన్నో శంకలు తలెత్తాయి. అదే టెండర్ కోసం ప్రయత్నిస్తున్న ఇంకో పార్టీ కూడా తనని నానా రకాలుగా బలవంతం చేసాడు తనకు ఈ ఆర్డర్ వచ్చేటట్టు చూడమని. ఇప్పుడు పొరపాటున కూడా తను అతనికి ప్రత్యర్ధిగా ఉన్న పార్టీకి సహాయం చేసానని తెలిస్తే ఊరూ వాడా ప్రచారం చేసేస్తాడు. పైగా తను పెద్దమొత్తంలో డబ్బు ఆశించానని కూడా చెప్పే అవకాశం ఉంది. . ఒక రకంగా తన భార్య తొందరపాటు పని చేసిందా అనిపించింది. . ఇటువంటి వ్యవహారాలలో ఆవిడను కలిపించుకోనీయకుండా చేసి ఉంటే బాగుండేదేమో అనుకున్నాడు.” నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి” అన్నట్లు ఏ విషయం దాచుకోకుండా పెళ్ళాంతో ప్రతి విషయం చెప్పేయడం అతని నైజం..

మొత్తానికి స్వామీరావు భార్య అదృష్టమో, తన అదృష్టమో మూడో కంటి వాడికి తెలియకుండా పరిస్తితులు వాటంతట అవే చక్కబడి పోయాయి.

ఈ నేపధ్యంలోనే స్వామీరావు ఒక అందమైన ఇల్లు వాళ్ళ సొంత ఊళ్ళో సమకూర్చుకున్నాడు. ఇప్పుడతని ముందు ఉన్న ముఖ్యమైన కర్తవ్యం వెంటవెంటనే కాకపోయినా ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసెయ్యడం. ఒక శుభముహూర్తాన తన ఇద్దరి కూతుళ్ళ పెళ్లి చెయ్యబోతున్నాడన్న విషయం బయటకు పొక్కడంతో అతని కస్టమర్లు పోటీపడి స్వామీ రావు చేత ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం భాద్యతను నెత్తిమీద వేసుకున్నారు. ఆ పెళ్ళికి స్వామీరావు తన డిపార్టుమెంటులోని వాళ్ళనే కాకుండా చాలా మందిని పిలవలేదు. కారణం పెళ్ళిలో తన కస్టమర్ల సేవలు, వాళ్ళు పెట్టే ఖర్చు బయటపడి పోతుందని. అడ్డ దారుల్లో డబ్బు సంపాదించడం ఇంత సులువా అని చాలా మందికి అనుమానం రాక మానదు. తెలివితేటలతో ముందు జాగ్రత్తతో ప్రతి క్షణం, అనుక్షణం ముందూ వెనకా చూసుకుంటూ అందరిని బాలన్స్ చేసుకుంటూ అవతల వాళ్లకు కూడా తినిపిస్తూ పోతే ఏదైనా సాధ్యమే అని స్వామీరావును దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది అనుకుంటూ వుంటారు.

సడన్గా స్వామీరావు పనిచేస్తున్న మానేజ్మెంట్ మారింది. దాంతోపాటు కీలకమైన సీట్లలో కొత్త మేనేజ్మెంట్ వాళ్ళ వాళ్ళను అప్పాయింట్ చేసుకుంది. చిన్నా చితకా స్కాముల్లో ఉన్న వాళ్ళందరూ వేరే దారి దొరక్క అక్కడే కొనసాగుతూంటే వాళ్ళందరిలో అగ్రజుడైన స్వామీరావు మాత్రం తనలాంటి తిమింగలానికి ఏ క్షణాన్నయినా ప్రమాదం పొంచివుండే ప్రమాదం ఉందని ఒకరోజు హడావిడిగా మీటింగ్ పెట్టి తను తన కుటుంబంతో సహా తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోతున్నట్టు డిక్లేర్ చేసాడు.

ఒక రోజు స్వామీరావు ఆంతరంగిక మిత్రుడు గోపాలం నా దగ్గరికొచ్చి “భాస్కర్ ఈ విషయం విన్నావా మొన్నీమధ్య స్వామీరావు తీవ్రమైన గుండెనొప్పితో హాస్పిటల్ కెళ్ళే లోపలే చనిపోయాడుట. సమయానికి అమెరికాలో వున్న అతని ముగ్గురు కూతుళ్ళు దగ్గరగా కూడా లేరుట. దొంగ దారుల్లో డబ్బు సంపాదించడమే జీవిత పరమావధిగా బతికాడు. చివరకు ఏం సాధించాడు ? అతనికి తోడు అతని భార్య కూడా ముందుండి అతన్ని ప్రోత్సహించింది. మొదటినుండి అతను చేస్తున్న ప్రయత్నాలను నేను ఖండించే వాడిని. .. వింటే కదా ? మనిషనే వాడు ఎప్పటికైనా చనిపోవాల్సిందే. కాదనను. కాని బోల్డంత జీవితం ముందుంచుకుని బ్రతికినంత వరకు డబ్బే ప్రధానంగా పెట్టుకుని చివరకు అర్ధాంతరంగా అన్నీ వదిలి పెట్టి వెళ్లి పోయాడు. .." అంటూంటే అప్రయత్నంగా అతని కళ్ళు నీళ్ళు చిమ్మాయి.

స్వామీరావు వ్యక్తిగతంగా ఎటువంటివాడైనా కాని వ్యక్తిగా మా అందరితో చాలా చనువుగా , ఎప్పుడూ నవ్విస్తూ ఏ విషయంలోనూ దాపరికం లేకుండా సరదాగా మాట్లాడేవాడు.. అతను పోయాడన్న వార్త గోపాలం ద్వారా తెలుసుకున్నాక చెప్పొద్దూ నా మనసు వికలమై పోయింది. అతనికి మనసులోనే శ్రద్దాంజలి ఘటించుకున్నాను.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు