సపుత్రస్య..గతిర్నాస్తి - సుంకర వి. హనుమంతరావు

saputrasya gatirnasthi

ఏయ్ బాబూ! మీ అమ్మ చేసిన ఘనకార్యం చూశావా ? .. బాబీ మెట్లమీద జారి పడి తల పగలగొట్టు కున్నాడు.మీ అమ్మ పౌడర్ రాసి పడుకోబెట్టింది.నువ్వు రిఫ్రెషైతే క్లినిక్కు తీసుకెళ్దాం.

బి బ్ సి లెవెల్లో ఎఫ్ ఐ ఆర్ చదివేసింది..రమ వైఫాఫ్ రాంబాబు..భర్త యింకా పూర్తిగా యింట్లో కాలు పెట్టక ముందే.

“ తల పగిలిందా.”? ఆతృతగా అడిగాడు..రాంబాబు..ఆందోళనతో..

మంచంమీద ఆదమరచి నిద్ర పోతున్న రెండున్నరేళ్ల బాబీని పరీక్షగా చూస్తూ.

“ఐమీన్ పగలడం అంటే..బ్రేకయ్యిందని కాదు..బాగా గీసుకు పోయింది.”

ఎఫ్ ఐ ఆర్ కు చిన్న ఎమండ్ మెంట్ యిచ్చింది.

“ అమ్ముందిగా ..అలా ఎలా జరిగింది..?”

అమ్మా ! అరవ ..బోయి..ఉయ్యాల్లో హాయిగా నిద్రపోతున్నకొడుకెక్కడ లేస్తాడోన్న భయంతో ఆగి పోయాడు.

“ఇంకెక్కడుంది ఆ మహాతల్లి..నేను రాగానే..బాబీగాడి కథ చెప్పి బలాదూరు పోయింది.” కసిగా అక్కసు కక్కేసింది.

“అమ్మలా చేయదే.”.సఱిగినట్టు గొఱిగాడు..రాంబాబు.

“ఆహా ..మీ అమ్మనేదో పూర్తిగా చదివేసినట్లు ..సెలవిస్తున్నారు..నేను నోరిప్పితే తెలుస్తుంది..ఎప్పుడు చూసినా .. బాబీ గురించి పట్టించుకుంటే ఒట్టు.లక్ష సార్లు మొత్తుకున్నా..వింటేగా. అయినా మనమేమైనా రాళ్లెత్తమన్నామా..కట్టెలు కొట్టమన్నామా..మీ అమ్మను వెలగ బెట్టమంది ఇంటి పని వంటపనేగా..ఇంత వయసొచ్చింది..ఏం లాభం..?”

ఇంటికీ వంటకూ బాబీ గాడి ఆయాఖర్చులకు పాతికవేల పైమాటేన్న చేదు నిజాన్ని మనసులోనే కుక్కేసుకుంటూ..అతి తేలిగ్గా తీసిపారేసింది..అత్తగార్ని..ఆంధ్రమహిళాసభ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అరుణామేడంని.

“రమా! దిసీజ్ నాట్ ద ఫస్ట్ టైం..మీ అత్తాకోడళ్ల మధ్య నేను నలిగి పోతున్నాను..”

“నేనూ అదే మొత్తుకుంటున్నాను..మీ అమ్మని హోంలో..బాబీని కేర్ సెంటర్ లో..పడేద్దామని ఆర్నెల్ల నుండి తల బద్దలు కొట్టుకుంటున్నాను..అమ్మంటే వణుకు.. పెళ్లాం మాటంటే..అలుసు..ఇవ్వాళ మీరు నోరు తెరవకపోతే..మీకూ నాకూ రాం..రాం..రేపే బాబేతో బండెక్కేస్తా ..ఇప్పుడే మా అమ్మతో చెప్పేస్తా..మళ్లీ చస్తే ఈ గడప తొక్కను..”

లంకంత ఇల్లది. క్రింద మూడు బెడ్ రూంలు హాలు..పైనా అంతే..కార్పొరేట్ కంపెనీకి ఓ పోర్షన్ అద్దేకిస్తే యాభై వేలు రెంటు యిప్పిస్తానన్న బ్రోకర్ కు యిచ్చిన మాట ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న నిర్ణయంతో మంకు పట్టు పట్టేసింది రమ. .

ఆర్నెల్ల..తన పోరుకో తుది రూపమివ్వాలన్న..ధృఢ నిశ్చయంతో.

“రాత్రి అమ్మతో నేను మాట్లాడుతా..నువ్వేమీ తొందర పడకు.. “

తన రూంలోకి వెళ్లి పోయాడు..రాంబాబు..తన చేతగాని తనానికి చరమ గీతం పాడాలన్న ఆలోచనతో.

భర్త వాలకాన్ని గమనిస్తున్న రమ తన పధకం పారబోతోందన్న ఊహ కే వూగిపోయింది. ఆమె పెదాల మీదో వంకర నవ్వు..తొంగి చూసింది .

*****

పది దాటిపోతుండగా వచ్చింది..అరుణామేడం..ముఖంలో అలసట విచారం..నిద్రపోకుండా హాల్లో కూర్చున్న రాంబాబు రమలను విస్మయంగా చూస్తూ..చిన్నగా నవ్వుకుంది.

“బాబూ! బాబీ ఎపిసోడ్ ఆల్రెడీ నీ భార్యామణి తన ఓన్ వెర్షన్ లో నెరేట్ చేసే వుంటుంది. నా డాక్టర్ ఫ్రెండ్ అప్పుడే వచ్చి చూసి చిన్నగా గీసుకు పోయిందని ఆయింట్ మెంట్ రాసింది. గుడ్ నైట్ బోతాఫ్ యు..రేపు ఎర్లీగా వెళ్లాలి..వీలైతే మళ్లీ నైటు కలుద్దాం..”

మరో మాట లేకుండా తన గది లోకెళ్లి తలుపు వేసుకుంది.

అమ్మ ధోరణి అర్దం కాని రాంబాబు నోరు తెరిచేస్తే..మోచేత్తో డొక్కలో పొడిచి .. విస విసా గది లోకెళ్లి పోయింది..రమ..పట్ట రాని కోపంతో.

******

నిద్ర లేచి హాల్లో కొచ్చిన రమా రాంబాబులు డైనింగ్ టేబుల్ మీద ఫ్యాన్ గాలికి రెప రెప లాడుతున్న పేపర్ వెయట్ క్రిందున్న కాగితాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇద్దరూ ఆత్రంగా చదవడం మొదలు పెట్టారు.

“ ఒరే చవట బాబూ!..రాత్రి మీ యిద్దరినీ..అలా చూసినప్పుడు ఈ మధ్య టీవీ లో వస్తున్న” చవట మొగుడు..చాడీల పెళ్లాం “ గుర్తొచ్చి పడీ పడి నవ్వాలనిపించింది. చెత్త విషయాలలో నన్ను కన్విన్స్ చేసే ముందు..చిన్నప్పటి నుంచి నువ్వు చూపే హావ భావాలు..బాడీ లేంగ్వేజ్..ఫ్లాషై ఆర్నెల్ల నుండి నీ పెళ్లాం నా బుర్ర లోకి ఎక్కిస్తున్న హోం గురించి .. తాడో పేడో తేల్చేసి నేను “చవట మొగుడ్ని” కాదు అని అనిపించు కోడానికిని రెడీ అయిపోయినట్లనిపించింది. యామై కరెక్ట్”..?

తన మనసును తనే చదువుకున్నట్లున్న ఆ వాక్యాల్ని చూస్తూనే తన చెప్పుతో తనే కొట్టుకున్న ఫీలింగుతో సిగ్గుతో పెళ్లాన్ని చూశాడు.

“ చిన్న వయసులోనే భర్తను కోల్పోయి..పునర్వివాహం కోసం అమ్మా నాన్నలెంత పోరాడినా..నా బిడ్డల భవిష్యత్తే నా భవిష్యత్తనుకొని ..మనసును బండ రాయిలా మార్చుకుని ..జీవన పోరాటం చేశాను. నీ అన్న లవ్ మేరేజని రాష్ట్రం గాని రాష్ట్రానికి దారి చూసుకున్నాడు . మిగిలింది నువ్వు. నువ్వు నీ దారేదో చూసుకోకుండా పెళ్లాం దారిలో పడి అమ్మకో అనాధాశ్రయానికి దారి చూపించాలనుకున్నావ్. భేష్.

నిన్న సాయంత్రం నాతో బాటు పని చేసిన ఆయా భర్త యాక్సిడెంటులో చని పోయారని తెలిసి వెళ్లాను. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. నిస్సహాయంగా నిలబడి సాయం కోసం పిల్లల భవిష్యత్తు కోసం అందరినీ అర్ధించింది . ఒకప్పటి నా పరిస్థితి నాకు గుర్తొచ్చింది. మీనాన్న యిచ్చిన ఆస్థి..అమ్మా నాన్నల అండ నన్ను బ్రతికించింది. ఆయా భర్త తాగుబోతు..చవట..ముగ్గురు ఎదిగొచ్చిన ఆడ పిల్లలతో నిస్సహాయరాలుగా నిల బడి వుంది.

నీ సోదరుడెప్పుడో అమ్మనీ ..అమ్మ ప్రేమనీ వద్దనుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఆ దారిలో నే వున్నావు. భార్య రానంత వరకే అమ్మా నాన్నలు అండా దండ..ఆ తర్వాత గుది బండలే..నాలో ఎదిగి..నా రక్త మాంసాలు పంచుకొని..నా ఒడిలో పెరిగిన నీకే నేను అక్కర లేనప్పుడు..నువ్వు మాత్రం నా కెందుకు.. నన్ను అభిమానించే నా విద్యార్ధులందరూ నా బిడ్డలే . ప్రపంచం లోని గానుగెద్దులన్నీ చక్రం లాంటి గీత చుట్టూ తిరుగుతూ చివరకు తన గమ్యం కబేళాకేనని తెలుసు కోలేక అదే మాయలో తాను తన యజమాని సేవలో తరిస్తున్నానని బతికేస్తుంటుంది. అలాగే పిచ్చి తల్లులు .. తండ్రులు కూడా. కంటికి రెప్పలా కాపాడిన తల్లి తండ్రుల్ని కడుపున పుట్టిన పుత్రులు చివరకు చేర్చేది అనాధాశ్రమాల వంటి హోమ్ లకే నన్ననిజాన్ని గ్రహించ లేక బాంధవ్యాల భ్రమల్లో జీవితాలను త్యాగం చేసుకుంటున్నారు. కళ్లను కప్పేసిన మమకారమనే పొరల్లో నేనూ అలానే బ్రతికాను. వయసును గుర్తు చేసి నీ చాడీల పెళ్లాం..హోమ్ లో చేర్చాలన్న నీ తపన..నా కళ్లు తెరిపించాయి. తెంచుకోవాలనుకుంటున్నావ్..హాయిగా తెంచుకో. నేను పంచుకోవా లను కుంట న్నాను..పంచుకుంటాను..పెంచుకుంటాను..ఆయా పిల్లల్ని. “ఆయా.”. పిల్లలతో నాతోనే ..ఈ ఇంట్లోనే .”.నా ఇంట్లోనే “వుంటుంది. నాకు గతుల మీద..పున్నామ నరకాల మీద..తల కొరువుల మీద నమ్మకాలు లేవు. బ్రతికున్నప్పుడే నరకాలు చూపిస్తున్న..పుత్రులు పున్నామన రకాలు దాటిస్తారన్నది ట్రాష్. భ్రమ.

మీరిద్దరూ సంపాదన పరులు. మనీ మేక్స్ మెనీ థింగ్స్..నేను వారం రోజుల వరకు రాను. కోర్టు సమక్షంలో చట్ట పరంగా అమ్మాయిల దత్తత వ్యవహారాలు చూసుకొని వస్తాను. మీ అన్న అడుగుజాడల్లో అత్తారింటి దారే వెదుక్కుంటావో.. అద్దింటి దారే కనుక్కుంటావో ..నీ యిష్టం. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. మరీ రేపే ఇల్లు ఖాళీ చేయించాలను కొనేంత కఠినాత్ము రాలిని కాదు. ఎంత చవటవైనా నేను కన్న బిడ్డవే కదా.. వారం రోజులు గడువిస్తున్నాను. ఇంటి కీస్ మన లొకాలిటిలో వున్న ఒక నాటి నా విద్యార్ధి నేటి యస్ పీ..అనురాధ కివ్వు. మార్నింగే ఫోన్ లో..మన “కహానీ” చెప్పాను. మిమ్మల్ని హోముకు పంపిస్తానన్నట్లు..చిన్న కంప్లెయంటివ్వండి..రాజమండ్రి హోముకు పంపిస్తానంది. అత్యాశ కదా మీది..ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్..మీకు ఓకే ఐతే నాకూ ఓకే.. కానీ నాది కన్న కడుపు. మీలాంటి చీమూ నెత్తురూ లేని బతుక్కాదు. ఇక ముందు జీవితంలో మీ ముఖాలు చూపించి నేనూ సమాజం అసహ్యించుకునేలా చేయకండి.

గుడ్ బై. “ వికటించిన తన పాడు వ్యూహం తనకే వెన్నుపోటు పొడిచిన ఫీలింగ్ నిస్తే..

రేపటి నుండి ఇంటి అద్దెతో బాటు ఇతర ఖర్చులు యాభై వేల పై మాటే” అమ్మో వామ్మో” అనుకుంటూ..కళ్లు తేలేసింది..రమ..ఉరఫ్ రమాదేవి.


అమ్మకు చేయాలనుకున్న తన ద్రోహం తన జీవితానికే యమ పాశంలా చుట్టు కుందనే కఠోర సత్యం అర్దమై పాతాళం లోకి కూరుకు పోయినట్లు కూలి పోయాడు.. రాంబాబు ఉరఫ్ చవట బాబు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు