మంచి - చెడు - పార్నంది వేంకట రామ శర్మ,

manchi - chedu

"ఇంకో వారంలో పరీక్షలు అయిపోతాయి కదా! ఇంక మనం ఎవరి లైఫ్ వాళ్ళు వెతుక్కుంటూ విడిపోవాల్సిందే." అన్నాడు దిగులుగా ప్రదీప్. 'అరె! లైట్ రా భాయ్. ఎక్కడికిపోయినా ఇది మన హోం టౌనేగా? అయినా, ఫేస్ బుక్, వాట్సాప్ లు ఉండగా విడిపోయేదేముందిరా? రోజూ చాటింగేనాయె!" అన్నాడు తేలిగ్గా కుశాల్. "రైట్లీ సెడ్ రా కుశూ. అయినా వేర్ డూ వియ్ గో రా? " అన్నాడు ప్రదీప్ ని చూస్తూ విరాట్ . "యా! యా!!" అన్నాడు చెవికున్న హెడ్ ఫోన్లో పాటలు వింటూ, ఊగిపోతూ నరేన్, అసలతనికి ఆ పాటలహోరులో వీళ్ళ సంభాషణ ఏమైనా వినబడే అలా అన్నాడో, లేక వింటున్న పాటకి తన స్వరం జత కలిపేడో !

"నేనన్నది జాబ్ సెర్చ్ గురించిరా. అఫ్ కోర్స్, మీకా బాధల్లేవు. మీ ఫాదర్స్ లైన్స్ లోకి మీరు ఆటోమేటిగ్గా వెళ్ళి పోతారు. నేనే ఏదైనా జాబ్ ట్రైల్స్ వెంటనే మొదలెట్టాలి " అన్నాడు ప్రదీప్.

వాళ్ళు ఇంజనీరింగ్ IT ఫైనల్ పూర్తి చేయబోతున్నారు. నిజానికి వాళ్ళందరూ కేంపస్ సెలెక్షన్స్ లో ఓ IT కంపెనీ కి సెలెక్ట్ అయ్యారు. ఆ రకంగా చూస్తే ప్రదీప్ దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ ఆ కంపెనీ జాబ్ ఆఫర్ చేయడానికి ఇంకా ఓ ఆర్నెల్లు ఆగమంటోంది. ఈలోగా ఏదైనా జాబ్ లో చేరక పోతే, ఒక వేళ ఆ కంపేనీ కనక చేతులెత్తేస్తే, అప్పుడు ప్రారంభించే ప్రయత్నాలకి "ఎక్స్ పీరియన్స్"అన్న మాట అడ్డొస్తుంది. అప్పుడు ఏ జాబ్ కి వెళ్ళినా, ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నావేం? (ఎవడూ ఉద్యోగం ఇవ్వలేదా!? అన్నట్టు) అని ఓ ప్రశ్న ఎదురౌతుంది. అదీ ప్రదీప్ దిగులు.

అతని స్నేహితులు ముగ్గురూ బాగా సంపన్న కుటుంబస్తులు. కుశాల్ నాన్న సినీ నిర్మాత. బాగానే పేరు, డబ్బూ గడించాడు. కుశాల్ చదువు నామక: నే. ఈ చదువై పోయాక కొడుకుని హీరో గా పరిచయం చెయ్యాలనే తపనతో ఉన్నాడు. విరాట్ ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్ కి ఏకైక కొడుకు. తండ్రి వ్యాపారాలకి వారసుడు. ఇక నరేన్ కి ఏ లోటూ లేదు. అతడి నాన్న రాజకీయాల్లో ములిగి తేలుతున్నాడు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, క్రితం సారి ఓడి పోయి, ఈసారి కొడుకుని యువ నాయకుడి పేర రంగంలోకి దింపడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. వాళ్ళకి వేరేగా ఉద్యోగాలు చెయ్యాల్సిన అవసరం లేకపోయినా, సరదాకి కేంపస్ సెలెక్షన్స్ లో పాల్గొన్నారు.

ఇక ప్రదీప్ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడి కొడుకు. అతని నాన్న మెరిట్ పైన వచ్చిన చిన్న ప్రభుత్వోద్యోగంలో చేరినా, కష్టపడి ఉన్నతస్థాయి కొచ్చాడు. ఆయన నిజాయితీ అన్న చట్రంలో ఉండి, అవకాశాలొచ్చినా, పై సంపాదనలకి ఇష్ట పడ లేదు. తన కొడుకు కూడా తన లాగే మెరిట్ తో మంచి ఉద్యోగం సంపాదించుకుని పైకొస్తాడనే నమ్మకం తో ఉన్నాడు.

మిగిలిన ముగ్గురు స్నేహితులూ ఆస్థి, అంతస్తుల్లో ప్రదీప్ కన్నా బాగా పైనున్నా, వాళ్ళ స్నేహానికి అవి అడ్డు రాలేదు. స్నేహానికున్న గొప్ప తనమే అది. "అరే! జాబ్ కోసం ఆ దిగులేంట్రా? అంతగా అయితే మేం లేమా? నాతో సినీ ఫీల్డ్ కో, విరాట్ బిజినెస్ లో హెల్ప్ కో, లేక పోతే నరేన్ ఎమ్మెల్యే అయాక, వాడి పియే గానో సెటిల్ ఐ పోదువు గానిలే! రిలాక్స్ నౌ! లెట్స్ గో .." అంటూ ప్రదీప్ భుజంపై తట్టి లేచాడు కుశాల్. అంతా నవ్వుకుంటూ కదిలారు.

పరీక్షలైపోవడం, మంచి ఉత్తీర్ణతతో అంతా పాసవడం ఎవరి గోల్స్ కి వారు చేరే ప్రయత్నాలు మొదలెట్టడం జరిగి పోయాయి. ఒక రోజు తన స్నేహితుల గురించి చెబుతూ, తన తండ్రి నడిగాడు ప్రదీప్ సరదాగా, "అసలు నువ్వెందుకు రాజకీయాల్లోకో, సినీ రంగానికో వెళ్ళలేదు నాన్నా! అప్పుడించక్కా నేను కూడా నా ఫ్రెండ్స్ లాగా వారసత్వ ఉద్యోగం లో చేరి పోయుండే వాణ్ణిగా, ఇలా ఉద్యోగాల వేట లో పడకుండా" అని.

"మీ నాన్నేనా! ఇలా నీతీ నిజాయితీ అంటూ కూర్చునే వాడికి తగిన రంగాలేనా అవి? అయినా ఆ ముచ్చట కూడా తీరిందిలే. మా పెళ్ళైన కొత్తల్లో, వీళ్ళ కుటుంబానికి కాస్త మంచి పేరుందని, మీ నాన్నని మున్సిపల్ కార్పొరేటర్ గా నిలబెట్టారు. నాకు బాగా గుర్తు. సిన్సియారిటీ, పంక్చుయాలిటీ కి ప్రతీకగా గడియారం గుర్తు కూడా కేటాయించారు. ఉద్యోగానికి రాజీనామా కూడా చేసేసారు. కాని కొందరు "నీలాంటి నిజాయితీ పరుడికి ఇవి పనికి రావు, పైకి నీపట్ల అనుకూలం గా ఉన్నట్లున్నా, నువ్వు గెలిస్తే అడ్డగోలు పన్లు జరగనివ్వవు అని నిన్ను ఓడించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇప్పుడు మంచి ప్రభుత్వోద్యోగం చేసుకుంటున్నావు. ఆనక ఓడి పోయాక, పదవీ లేక, ప్రభుత్వోద్యోగమూ లేక నానా బాధలు పడతావ్ అని నచ్చచెప్పి, విత్ డ్రా చేయిం చేసారు. వాళ్ళెవరో గానీ, వాళ్ళ పుణ్యమాని, ఈ రోజు ఇలాగైనా ఉండ గలుగుతున్నాం. నీకుద్యోగం వచ్చి, నీ చెల్లెలి కి కూడా మంచి సంబంధం దొరికి పెళ్ళి చేసేస్తే మాకింకేం చింతా ఉండదురా." అంటూ భర్తనేమీ మాట్లాడనివ్వకుండానే తనే గతం, వర్తమానం, భవిష్యత్ చెప్పేసింది ప్రదీప్ తల్లి సుబ్బ లక్ష్మి.

ప్రదీప్ తండ్రి సుబ్రహ్మణ్యం "అవును. అలా ఒక రకంగా మంచే జరిగింది. అయినా మనలాంటి వాళ్ళకెందుకురా ఆ కోట్లకి పడగలెత్తిన జీవితాలు. అడ్డగోలు సంపాదనలు. ఒక వేళ సంపాదించినా, ఏదో రకంగా అవి మన్ని బాధిస్తాయి. చేసిన తప్పుకు వెంటనే శిక్ష పడక పోయినా, ఏ జన్మకా జన్మ లోనే, అదును చూసి నొక్కేస్తాడు ఆ దేవుడు. సంపాదించుకున్న దాని లోంచి ఉన్నంతలో సుఖంగా జీవించడం, పిల్లల క్షేమం, సంక్షేమం చూడ గలిగితే చాలు. సమాజ సేవ ప్రత్యక్షంగా చెయ్య లేక పోయినా, పరోక్షంగా మన వరకు నిజాయితీ గా ఉండి, చేతనైనంతలో ఇతరులకి సహయ పడ గలిగితే అదే సమాజ హితం. మనల్ని చూసి ఒక్కరైనా మన బాట లో ప్రయాణిస్తే చాలదా? అలాగ నువ్వు చేసిన మంచి పనికి ఫలితం వెంటనే ఇవ్వక పోయినా, దానికి కూడా తగిన సహాయం సమయం చూసి అందిస్తాడు ఆ దైవం. " అన్నాడు.

నువ్వు చెప్పేది వినడానికి బానే ఉంది కానీ, మరి నా స్నేహితులంతా కోట్లకి పడగలెత్తిన వారే. వాళ్ళ తండ్రులదంతా అవినీతి సంపాదనేనా? అలా అయితే నువ్వు చెప్పినట్టు వాళ్ళ అవినీతికి ఎక్కడా దేవుడు శిక్షించిన దాఖలాలు లేవే? వాళ్ళు నాకు ఇంటర్ నుండి ఫ్రెండ్స్. ఎప్పుడూ వాళ్ళ నాన్నల గురించి చెడుగా విన లేదు నేను. వాళ్ళు కష్టాలు పడినట్లు ఎప్పుడూ నా ఫ్రెండ్స్ చెప్పనే లేదు." అన్నాడు ప్రదీప్ తండ్రి చెప్పింది అంగీకరించీ, విభేదిస్తున్నట్లు.

కొడుకుతో ఇంత తీరు బడిగా ఎప్పుడూ మాట్లాడే అవకాశం దొరక లేదు సుబ్రహ్మణ్యంకి. ఎప్పుడూ తనకి ఉద్యోగ హడావుడి, కొడుక్కి చదువు హడావుడి మరి. అందుకని తను చెప్పిన దాన్ని ఇంకాస్త విపులీకరిస్తే తప్ప, ఉపయోగం లేదనుకుని, "ప్రత్యేకించి నలుగురు నోళ్ళల్లో పడేలా వాళ్ళకి కష్టాలు కలిగిండక పోవచ్చురా. వాళ్ళ స్థాయి కష్టాలు వాళ్ళకుంటాయి. వ్యాపారాల్లో నష్టాలు, ఏవో అనారోగ్యాలు, కలతలూ ఉండే ఉంటాయి. పిల్లలు, మీరు వివరంగా అవన్నీ చర్చించుకోరుగా! కుశాల్ వాళ్ళ నాన్న రెండేళ్ళ క్రితం తీసిన ఓ పెద్ద హీరో సిన్మా అట్టర్ ఫ్లాప్ అయి, ఆ టెన్షన్ కి ఆయనకి చిన్నగా గుండె పోటు వచ్చింది. నీకు గుర్తు లేదా. విరాట్ వాళ్ళ నాన్నపై ఇన్ కం టాక్స్ దాడులు ఆ మధ్య జరిగాయి. మరి మీ నరేన్ నాన్న మొన్న ఎలక్షన్లలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఓడి పోయాడు. ఇవన్నీ వాళ్ళ స్థాయికి కష్టాలే. కాక పోతే, ప్రత్యక్షం గానో, పరోక్షం గానో వాళ్ళు చేసిన మంచి పన్లు వాళ్ళని ఆ కష్టాలు తట్టుకుని, బయట పడేలా చేసుంటాయి."

"మరీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడికి చెప్పిన నీతి కధల్లా చెప్తున్నారు నాన్న గారు. అవినీతి వల్ల కష్టాలంటారు, మంచి పన్లు చేసి బయట పడి పోయారంటారు. అలా అయితే ప్రతీ వాడు కొంత అవినీతి పని చేసి, కొంత నీతి పని చేసేస్తే, పాపం పుణ్యం బేలన్స్ అయి పోయినట్లేనా!? లాజికల్ గా లేదు" అన్నాడు ప్రదీప్, బలమైన సాక్ష్యాధారాల్లేవని న్యాయమైన కేసుని కూడా కొట్టేసిన జడ్జీలా.

"ఇలాంటి వాటికి ఒక స్థిరమైన లాజిక్ అని ఉండదు ప్రదీప్. ఇదేదో ఒకట్రెండు మాటల్లో చెప్పి ముగించేదీ కాదు. ఇది భగవత్ సంకల్పం. ఒక పాపం, ఒక పుణ్యం చేసేసి, ఏ రోజుకా రోజు బేలన్స్ చేసేసు కోవడం కాదు. అలా అనుకున్నా, ఆ పాప పుణ్యాల అకౌంట్ అక్కడికక్కడే టాలీ అయి పోదు. పూర్వ యుగాల్లోలాగా, దేవుడు ప్రత్యక్షంగా ఎదుట నిల్చి శపించడమో, వరమివ్వడమో చెయ్యడు . దేని ఫలం, దేని సమయం దానిదే. చేసిన చెడుకి శిక్ష ఎలా ఉంటుందో, మంచికి తగిన ప్రతి ఫలం కూడా ఉంటుందని చెప్పడమే దాని అంతరార్ధం.

ఇప్పుడు మీ ఫ్రెండ్స్ నాన్నల సంగతే తీసుకుందాం. ఒక సిన్మా తీస్తే, దానికి ఎందరో టెక్నీషియన్లు, నటీ నటులు, ఇతరత్రా సిబ్బంది అవసరం. వాళ్ళలందరికీ ఆ సిన్మా ద్వారా ఉపాధి లభిస్తోంది. మీ కుశాల్ నాన్న లాంటి వాళ్ళు ఎందరో సినిమాల్లో పెట్టుబడి పెట్టి తాము లాభం పొందుతునే, ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు. మీ విరాట్ నాన్న వ్యాపారాల కార్యాలయాల్లో, ఫేక్టరీల్లో ఎంతో మంది ఉద్యోగాలు పొందారు. ఇవన్నీ ఇతరులకుపయోగ పడే మంచి పన్లేగా? మీ నరేన్ నాన్న రాజకీయాల్లో కొద్దో గొప్పో మంచి పనులు చేసి ఉండడం వల్లే, మూడు సార్లు ఎన్నికయ్యాడు. ఏవో, ఇతర పనుల ఫలితం వల్ల మొన్న ఓడిపోయుంటాడు. ఇలా తర్కిస్తూ పోతుంటే, అంతే ఉండదు. అయినా, నీలా పిన్న వయస్కుల్లో ఎవరికో తప్ప, భగవంతుడు, పాప పుణ్య ఫలాలు వంటి విషయాలపై ఆసక్తి ఉండదు. అంతెందుకూ, నీ వయసులో నేనూ అంతే. గుడికెళ్ళే వాణ్ణి కాదు, వెళ్ళినా మనస్ఫూర్తిగా దండం పెట్టే వాణ్ణి కాదు.

ఒక్కటి మాత్రం నిజం. నువ్వు దేవుణ్ణి నమ్మూ, నమ్మకపో! మంచిని నమ్ము. మంచి చెయ్యి. నీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. GOOD అన్న పదం లోనే GOD ఉన్నాడు. మన తల రాత లోని దుష్ఫలితాలు, దురదృష్ట సంఘటనలు తప్పక పోయినా, నీవు చేసే మంచి వలన, ఆయా ఘటనల తీవ్రత తగ్గుతుంది. కన్ను పోవాల్సిన చోట, కాలి దెబ్బతో పోతుంది. ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన వ్యక్తి తర్వాత తన తప్పు తెలుసుకుని, శిక్షా కాలంలో జైలులో సత్ప్రవర్తనతో మెలిగితే, అతని శిక్ష తగ్గించి విడుదల చేయ బడతాడు. అలాగన్న మాట. ఇంత వరకు నీకు తెలియ కుండానే, నీ మట్టుకు ఎక్కడొ హాస్టల్లో చదువుతూ చెడు స్నేహాలు, చెడు అలవాట్ల జోలికి పోలేదూ , ఇది కూడా మంచే కదా. దాని ఫలితమే, నువ్వు మంచి పెర్సెంటేజ్ తో ఇంజనీరింగ్ పూర్తి చేసావు, కేంపస్ సెలెక్షన్స్ లో ఓ కంపెనీకి సెలెక్ట్ అయ్యావు. చూస్తూండు! నెల తిరిగే సరికి నీకు జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది."

తండ్రి సుదీర్ఘంగా తన భావోద్వేగాల్ని వెలి బుచ్చే సరికి, ఇంకేం మాట్లాడాలో తెలీక మౌనం వహించాడు ప్రదీప్. పైగా, తన ఉద్యోగాని గురించి తండ్రి ఆశా భావం అతని కెంతో నచ్చింది. మనం ఆశావహంగా ఉంటే, జరిగే వన్నీ మంచి గానే ఉంటాయేమో!? అసలు ఆ రోజు తన ఫ్రెండ్సే అన్నారు, "అరే! జాబ్ కోసం ఆ దిగులేంట్రా? అంతగా అయితే మేం లేమా?" అని! ఏమో నాన్న మాట నిజమయేలా ఉందేమో? చూద్దాం అనుకున్నాడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి